రచయితలు – ఎడిటర్లు

సంపాదకుడంటే నా
కింపారెడు భక్తి కలదు ఎంచేతనగా
సంపూర్ణమనుజుడాతడు
చింపాన్జీకన్న నయము సిరిసిరిమువ్వా      (శ్రీశ్రీ)

మహాకవి ఏకళలో ఉన్నాడో, ప్రత్యేకంగా ఏ ‘సంపాదకుడి’ ని దృష్టిలో పెట్టుకుని ఈ పైకందం రాసాడో తెలియదు. ఒకవేళ సరదాకే రాసినా అందులో కించిత్ సత్యం లేకపోలేదు. అలాగే, కడివెడు నష్టం కూడా. చెప్పొద్దూ, పెన్ను పట్టుకోడం చేతనైన వెంటనే నాలాటి వాళ్ళంతా ఇది చదివి రెండు భ్రమల్లో పడిపోయాం, ఒకటి మా గురించి, ఒకటి సంపాదకుల గురించీ.

ఎడిటర్ అన్న ఆంగ్లపదానికి తెలుగులో సంపాదకుడనే మాట వాడటం ఎట్లా ఎప్పుడు మొదలయ్యిందో తెలియదు. సంపాదకుడనే మాటకి అర్థం లేదు; సంపాదకులు ఏమిటి సంపాదిస్తున్నారు కనుక, వాళ్ళ జీతాలు తప్ప. (ఈ పత్రికయితే అదీలేదు). అయితే, సంపాదకుడనే మాట ఎడిటర్ అనే మాటకి అనువాదంగా, ఒకేఒక్క పర్యాయపదంగా మనకి అలవాటయిపోయింది. విలేకరి అన్న మాట అలవాటయినట్టు. వాడుకలో ప్రసిద్ధికెక్కిన పదాలు ఇప్పుడు కాదనడం వికృతం. తెలుగులో ఉన్న ఈ పదానికి ప్రస్తుతం విలువ కూడా లేదనే చెప్పాలి.

నిజం చెప్పాలంటే పాశ్చాత్యదేశాల్లో ఎడిటర్ అంటే పరిష్కర్త. (ఈ సంపాదకీయంలో మా పత్రికకి సంబంధించినంతమటుకూ, సంపాదకుడంటే పరిష్కర్త అన్న అర్థం లోనే వాడుతున్నాను, comme il faut! అలా వాడని చోట్లు పాఠకులకి తేలికగానే తెలుస్తాయి) ముఖ్యంగా పుస్తక ప్రచురణలకి, సారస్వత పత్రికలకి, ప్రొఫెషనల్‌ జర్నళ్ళకి, సాంఘిక, రాజకీయ సమస్యలు చర్చించే క్వాసై – సైన్స్ పత్రికలకీ సంబంధించినంతవరకూ ఎడిటర్ అంటే పరిష్కర్తే. ఒక రచనని మెరుగుపరచడానికి సర్వశక్తులా ప్రయాసపడే వ్యక్తి పరిష్కర్త, ఎడిటర్. అంతేకాని, ప్రూఫులు దిద్దటం, పేరగ్రాఫుల మధ్య చుక్కలు, ముగ్గులు, నక్షత్రాలూ పెట్టడం మాత్రమే ఎడిటర్ పని కాదు. ఎడిటర్లు రచయితలతో కలిసి పని చేస్తారు. వీరిద్దరి మధ్యా ఉండే సంబంధం కాకతాళీయం కాదు. చాలా హుందాగా, సహనంతో ఇద్దరూ కలిసి పనిచెయ్యవచ్చు. ఒక్కొక్కసారి వాదోపవాదాలతో, ఘర్షణలతో నిండివుండవచ్చు. ఎడిటర్లు చేసిన మార్పులు, చేర్పులూ రచయితలకి నచ్చకపోవచ్చు. ఆ రచన కథో, కవితో, నవలో అయితే రచయితకీ, ఎడిటర్ కీ మధ్య తారాస్థాయిలో తర్జనభర్జనలు ఉండే అవకాశం కూడాఎక్కువే. మనం గమనించని నిజం ఒకటుంది. అది రచయితలుగా మన తప్పులు మనకు కనబడవు అనేది– ఇది మన చేతిరాత మనకెప్పుడూ అర్ధమైనట్లే అందరికీ అవుతుందనుకోడం లాంటిది. సంపాదకుడి పని ఆ రాతను వీలైనంత మటుకూ అందరికీ అర్ధమయేట్లు చేయడం. ఇరుపక్షాలకీ, ఒకరి మీద ఒకరికి నమ్మకం, గౌరవం ఉంటేనే ఇది సాధ్యం.

ఒకటి రెండు ఉదాహరణలు చెపుతాను. ఒకసారి ఒక క్వాసై – సైన్స్ పత్రికకి సైన్స్ రాజకీయాలపై ఒక చిన్నవ్యాసం పంపించాను. విశేషం ఏమిటంటే, ఈ పత్రికలో ప్రచురణకి వచ్చిన చాలా వ్యాసాలు నేను సమీక్షించి విమర్శించడం కూడా జరిగింది. (అంత మాత్రం చేత ఆ పత్రిక నాకేమీ ప్రత్యేకత చూపించవలసిన అవసరం లేదు.) ఆ పత్రిక ముఖ్యసంపాదకుడు నా వ్యాసంలో కొన్నిభాగాలని కత్తిరించుతున్నానని, నాకేమైనా అభ్యంతరమా, అనీ అడిగాడు. అతను చాలామంచి పరిష్కర్తే. అయినా, ఆయన గారు కత్తిరించి, సవరించిన భాగాలు నాకు ‘నచ్చలేదు’. నిజం చెప్పద్దూ, అప్పట్లో నా వ్యక్తిత్వం (అహంకారం అనడం సబబేమో) ఏదో దెబ్బ తిన్నట్లనిపించింది. నిజంగా ఆ సవరింపుల వల్ల నా వ్యాసానికీ, నా ఉద్దేశానికీ మేలు జరిగిందేమో అని ఆలోచించనీయకుండా నా ‘వ్యక్తిత్వం’ అడ్డు పడింది. ఫలితం మీకు అర్ధమయే వుంటుంది. నష్టం ఎవరికో ఊహించే వుంటారు.

ఈ దేశంలో దినపత్రికలకి వచ్చే వ్యాఖ్యలని, సంపాదకీయాలపై, అతిథి సంపాదకీయాలపై వచ్చే ఉత్తర ప్రత్యుత్తరాలని కుదించడమే కాకుండా, సవరించడం సంప్రదాయం. కొంచెం పెద్ద సవరణలు చేయబోయే ముందు రచయితకి చెప్పడం, అనుమతి తీసుకోవడం కూడా ఇక్కడి సంప్రదాయమే. ఇది చక్కని సంప్రదాయమనే అనుకుంటున్నాను. ఇది కూడా స్వానుభవంతో చెప్పుతున్నదే.

ప్రముఖ చెకొస్లొవేకియన్ రచయిత మిలన్‌ కుందేరా (Milan Kundera) తన రచనలో తాను పెట్టిన అన్ని సెమి-కోలన్‌లనీ ఫుల్‌స్టాప్‌లుగా మార్చివెయ్యడం గమనించి, ఆ ప్రచురణకర్తని వదిలి మరో ప్రచురణకర్త దగ్గిరకి పోయాడట. కుందేరా ఉద్దేశంలో ఈ రకమైన సవరణలు stylistic transgressions మాత్రమే. రచయిత శైలిని పూర్తిగా మార్చిపారెయ్యడం, అందులోనూ కాల్పనిక సాహిత్యంలో, ముఖ్యంగా కవితల్లో చెయ్యకూడని పని అని ఒప్పుకోక తప్పదు. ఐతే, మన దేశంలో లాగా కాకండా, ఎవరు కవీ ఎవరు కాదో ఈ దేశాల్లో సాటి కవులు — అంటే, ‘పీర్లు’ (peers) — నిర్ణయిస్తారు. మన కవిత్వాన్ని చదివి మెరుగు పర్చగల సమీక్షకులూ, సంపాదకులున్నారని ఒప్పుకొని వాళ్ళ మాట వినాలంటే, అదే ‘వ్యక్తిత్వం’, అడ్డం వస్తుంది.

అయితే ఒక విషయం గుర్తు ఉంచుకోవాలి. ఎప్పుడూ రచయితదే పై చేయి! ఒక పరిష్కర్త గనక ఒక రచయితకి నప్పని కత్తిరింపులు, సవరణలు చేస్తే, ఆ రచయితకి ఎనలేని స్వాతంత్ర్యం ఉన్నది. రచయిత ఆ సవరణలు ఒప్పుకోవలసిన అవసరం లేదు. ఒకవేళ ‘సంపాదకులు’ ఎవరైనా మొండిపట్టు పడితే, ఆపత్రికని వదిలి మరో పత్రికకి పంపవచ్చు. జేమ్స్ జాయిస్ (James Joyce), ఫ్లాబే (Flaubert) ల రచనలు మొదటి పది పదిహేనుసార్లు చాలా పత్రికలు తిరస్కరించాయి. మహాకవి శ్రీశ్రీ కవితని ఒక సారస్వత పత్రిక ఆరోజుల్లో తిరుగుటపాలో పంపింది. ఇక్కడ నష్టపడ్డది ఎవరు? మీ ఊహకే ఒదిలి పెడతాను, ఠక్కున సమాధానం చెప్పుకున్నా, లోతుగా ఆలోచించి జవాబిచ్చుకున్నా.

నాకు తెలిసినంతవరకూ మన దేశంలో రచనలని పరిష్కరించి ప్రచురించడం అనే సంప్రదాయం కొద్దో గొప్పో ప్రొఫెషనల్ జర్నళ్ళకి ఉన్నది. కానీ, తదితర పత్రికలకి, ముఖ్యంగా సారస్వత, సాంఘిక, రాజకీయ పత్రికలకి సంబంధించినంతవరకూ లేదనే చెప్పవచ్చు. ఇంగ్లీషు పత్రికలతో సహా! పైపెచ్చు, స్థలాభావం పేరుతో ‘ఉపసంపాదకులు’ వ్యాసాలని ఇష్టమైనట్టు కత్తిరించిపారేసి అచ్చేసిన వైనాలు ఎన్నో నా అనుభవంలో ఉన్నాయి. ముఖ్యసంపాదకుడితో (అంటే పెద్ద జీతం సంపాదించే వాడితో) “అదేమిటండీ? అర్థరహితంగా వ్యాసాన్ని కుదించేసారు?” అని ప్రశ్నించడానికి అవకాశాలు కూడా తక్కువే. ఒకవేళ ఆ అవకాశం ఉన్నా, అక్కడినుంచి వచ్చే కుంటి సమాధానం మీరే ఊహించుకోవచ్చు. పోతే, రచయిత ఏమిటి చెయ్యగలడు? ఆ పత్రికకి రచనలు పంపించడం మానుకోవడమే రచయితకి శరణ్యం అనుకుంటాను. ఇవీ స్వానుభంతో అంటున్న మాటలే.

ఈమాట అమెరికా నుంచి ప్రచురించబడుతున్న తెలుగు ఈ-పత్రిక. ఈమాటకి పదేళ్ళు నిండాయి. ప్రారంభం నుంచీ ఈమాటకి వచ్చిన రచనలని ప్రచురణకి ముందు సమీక్షించడం, రచయితతో కలిసి పనిచేసి పరిష్కరించడం ఆనవాయితీ. మా ఎడిటర్లకి సమర్థత లేని విషయాలపై రచనలు ప్రచురణకివస్తే, సాధ్యమైనంతలో సమర్థవంతులైన సమీక్షకులకి పంపి వాళ్ళ సవరణలు రచయితలకి తెలియపరచడం మా సంప్రదాయం. తెలుగునాడులో పేరుమోసిన కొందరు ‘ప్రముఖ’ రచయితలకి ఈ సంప్రదాయం నచ్చలేదు. వాళ్ళు మమ్మల్ని నానామాటలూ అన్నారు. ఒకరైతే, ప్రత్యేకంగా నాకు టపా పంపించారు: “నీకు తెలుగు రాదు, ఇంగ్లీషు అసలే రాదు. నువ్వు ఉత్త మొద్దబ్బాయివి” అని అర్థం వచ్చేట్టు. మరొకరైతే “నా అంత గొప్ప రచయిత రచనని సమీక్షించి సవరించే సామర్థ్యం మీలో ఎవరి కున్నది?” అని తూలనాడారు. బహుశా ఈ సందర్భంలో నష్టపోయింది మేము, మాపాఠకులూ నేమో (సాహితీ విలువలు తారుమారౌతున్న ఈ కాలంలో, లాభ నష్టాలు అంత త్వరగా గుర్తించలేం కదా). ఏమాటకి ఆమాటే చెప్పుకోవాలి, ఈ సంప్రదాయం వలన మాకు లాభం కూడా వచ్చింది. అంతర్జాతీయంగా పేరున్న రచయితలు కొద్దిమంది వారి రచనలకి మా ఎడిటర్లు చేసిన సవరణలకి హర్షం వెలిబుచ్చారు.

అయితే, అప్పుడప్పుడు ఎడిటర్లుగా మేము మేర మీరామనే అభిప్రాయం రచయితలకి కలిగి ఉండవచ్చు. క్షంతవ్యులం. కానీ, మిమ్మల్ని నిష్కర్షగా ఒక్క మాట అడుగుతాను. ఈమాట నాణ్యత గురించి మీరేమనుకుంటున్నారు? ఈమాట నాణ్యత కేవలం మా సంపాదకులు పేజీలకు రంగులేయటమూ, పేరాల మధ్య చుక్కలు పెడితేనే వచ్చిందా? రచయితలతో ఓపిగ్గా కలిసి పనిచేసి మెరుగైన సాహిత్యాన్ని అందివ్వాలనే తపన వల్ల వచ్చిందా? కొత్త ఎప్పుడూ వింత గానే ఉంటుంది. మీకు, మాకు కూడాను. కొత్తని సహృదయంతో ఆహ్వానించడానికి పది వసంతాలు చాలకపోవచ్చు. మరికొంత కాలం పట్టవచ్చు. అంతవరకూ మేమూ ఓపిక పడతాం. రచయితలని మాతో సహకరించమని మనసారా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మరొక్కసారి మా చిత్తశుద్ధిని గమనించి, మేం తప్పులు చేస్తే దిద్ది మరీ మాకు చేయూత నిస్తున్న మా రచయితలందరికీ నా మనఃపూర్వక కృతజ్ఞతలు.

మళ్ళీ ఈసారి ఆఖరిమాటగా – ఎప్పుడూ రచయితదే పైచేయి. ప్రజాస్వామ్య దేశాలలో రచయితకున్న స్వాతంత్ర్యం పరిష్కర్తలతో సహా ఎవరూ తస్కరించలేరు. రచయితకున్న స్వాతంత్ర్యం గురించి ఇప్పుడు చెప్పుకున్నాం. ఎడిటర్ల కున్న సాధకబాధకాల గురించి, పత్రికలపరంగా– ఈ-పత్రికలతో సహా– ప్రచురణకర్తలకి, రచయితలకీ న్యాయబద్ధంగా, నైతికంగా ఉన్నహక్కుల గురించి మరోసారి మాట్లాడుకుందాం.

నూతన సంవత్సర శుభాకాంక్షలతో,
వేలూరి వేంకటేశ్వర రావు.

(కొసమెరుపు: నా సంపాదకీయాలు కూడానూ అన్ని రచనల్లాగే మా సంపాదకుల చేతుల్లో పడి నలిగిన తర్వాతే బైటికొస్తాయి. ఇది నా రాతలు నచ్చిన వాళ్ళతో నే పంచుకోవాలనుకున్న నిజం. “నేరుగా అచ్చేస్తే ఇంకా బావుండేవేమో” అని మీరంటే, వినడానికి బావున్నా అది నిజం మాత్రం కాదు!)