తంజావూరు చరిత్ర
త్యాగరాజు అచ్చమైన తెలుగువాడు. ఆయన సంగీత కృతి రచనలన్నీ తెలుగులోనే ఉన్నాయి. సంస్కృతం చదివినా, ఆయన మాతృ భాష మాత్రం తెలుగే. ఎక్కడో తెలుగు రాజ్యాలకి దూరంగా ఉన్న తంజావూరు రాజ్యంలో, కావేరీ నదీతీరానున్న తిరువైయ్యార్ లాంటి చిన్న ఊళ్ళో తెలుగు సౌరభాలు ఎలా పూసాయి? చుట్టూ తమిళ రాజ్యాలూ, ముస్లిం రాజ్యాలూ, ఫ్రెంచి, డచ్చి, ఆంగ్లేయుల రాజకీయ ప్రాబల్యాలూ అధికంగా ఉన్న తంజావూరులో ఓ తెలుగు వ్యక్తి ప్రభావం అంత గొప్పగా ఎలా ఉందీ? కారణాలు ఏవిటీ? ఈ వివరాలు తెలియాలంటే ముందుగా తంజావూరు రాజ్య చరిత్ర తెలుసుకోవాలి.
ఆంధ్ర రాజ్యమైన విజయనగర సామ్రాజ్యం 1565 లో ముక్కలయ్యింది. అంతకుముందు దక్షిణాన్నున్న చాలా రాజ్యాలు ముస్లిం రాజుల చేతులనుండి తప్పి విజయనగర రాజుల పాలన కిందకొచ్చాయి. దానికి ముందు ముస్లింలు చోళ రాజ్యలపై దండెత్తి వాటిని ఆక్రమించుకున్నారు. అవి తిరిగి హిందూ రాజుల ఆధీనమయ్యాయి. వాటిలో తంజావూరు, మదురై రాజ్యాలకి తెలుగు వారైన నాయక రాజులు సైన్యాధిపతులుగా ఉండేవారు. ఎప్పుడైతే విజయనగరం విరిగిపోయిందో అప్పుడే వీళ్ళు స్వతంత్ర ప్రతిపత్తి కల రాజులుగా ప్రకటించుకున్నారు. ఆ విధంగా మధురై, తంజావూరు నాయక రాజుల పాలన కిందకొచ్చాయి.
తమిళం ప్రాథమిక జన జీవన భాషగా ఉన్నా, వీళ్ళు మాత్రం తెలుగు సంస్కృతి నే పోషించారు. తెలుగు భాషకి పట్టం కట్టారు. దాంతో ఈ రాజ్యాలకి తెలుగు నాట ఉన్న కవుల, కళాకారుల వలస మొదలయ్యింది.
తంజావూరిని అచ్యుతప్ప నాయకుడు 1565 నుండి 1614 వరకూ పాలించాడు. అతని తరువాత అతని కొడుకు, రఘునాధ నాయకుడుకి రాజ్యాధికారం వచ్చింది. ఇతను సాహితీ పిపాసీ, సంగీత ప్రియుడూ! ఇతని కాలంలో సంగీత సాహిత్యాలు ఓ వెలుగు వెలిగాయి. ముస్లిములతోనూ, ఫ్రెంచి వాళ్ళతోనూ, పొరుగున్న మధురై నాయక రాజులతోనూ తరచు యుద్ధాలు చేసినా, సంస్కృతీ, కళల్ని మాత్రం విడిచిపెట్టలేదు. నాటకాలూ, యక్షగానాలూ ఒకటేమిటి అని కళలూ విలసిల్లాయి. మామూలుగానే మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే మధుర నాయకులకీ, తంజావూరు నాయకులకీ 1673 లో అతి పెద్ద యుద్ధం జరిగింది. తంజావూరు తెలుగు నాయకులు ఓడిపోయారు. రాజ వంశీకులందరూ మరణించారు.
మధుర నాయకుల సమీప బంధువైన అళిగిరి తంజావూరు రాజయ్యాడు.
రాఘవ నాయకుడి వంశం మొత్తం పోయినా, అతని మనవడు చెంగమలదాసనే నాలుగేళ్ళ పిల్లాడు బ్రతికి బట్టకట్టాడు. వాణ్ణి ఓ దాసి రక్షించి రహస్యంగా నాగపట్ట ణం చేర్చింది. ఈ పిల్లాణ్ణి ఎలగైనా రాజ సింహాసనం ఎక్కించాలని, రాయసం వెంకన్న అనే ఉద్యోగి శత విధాలా ప్రయత్నించాడు. బీజాపూరు రాజైన ఆదిల్షాని శరణు వేడి, ఎలాగైనా ఈ తెలుగు బిడ్డని తంజావూరు గద్దెక్కించమని కోరాడు. ఆదిల్షా ఈ పనిని శాహాజీ అనే ఓ వజీరు కప్పగించాడు. ఈ శాహాజీ ఎవరో కాదు, ఛత్రపతి శివాజీ తండ్రే! శివాజీకీ ఏకోజీ అనే సవతి తమ్ముడున్నాడు. శాహాజీ ఈ పనిని ఏకోజీకి పురమాయించాడు. ఏకోజీ అళిగిరిని ఓడించి, చెంగమలదాసుని రాజు చేసాడు. అనూహ్య రాజకీయ పరిణామాలనంతరం, మరాఠీ వాడైన ఏకోజీ తంజావూరు గద్దెక్కి, తమిళనాట తెలుగు రాజ్యానికి రాజయ్యాడు.
ఈ విధంగా తంజావూరు మరాఠీ రాజుల పాలన కిందకొచ్చింది. పేరుకి మరాఠీ వాడయినా, ఏకోజీ సాంస్కృతిక జీవనాన్ని మార్చడానికి ప్రయత్నించలేదు. పూర్వపు రాజుల్లా తెలుగు సాహిత్యాన్నీ, సంగీతాన్ని ఎక్కువగానే పోషించాడు. ఏకోజీ తరువాత అతని పెద్ద కొడుకు రెండవ శాహాజీ గద్దెక్కాడు. తండ్రిలాగే ఇతనూ కళల్నీ, సాహిత్యాన్నీ పోషించాడు. చనిపోయే వరకూ శాహాజీ సాంస్కృతిక రక్షణ, సాహిత్య పోషణ వదల్లేదు. ఇతని కాలంలో లెక్కలేనంత తెలుగు సాహిత్యం వచ్చింది. రెండవ శాహాజీ తరువాత తుక్కోజీ, అతని తరువాత అతని కొడుకు ప్రతాప్ సింగ్ పాలించారు. ఇతని తరువాత తుల్జాజీ II తంజావూరిని దాదాపు రెండు దశాబ్దాలు పాలించాడు. తుల్జాజీ అప్రయోజకత్వం వల్ల, మైసూరు రాజు హైదరాలీ చేతిలో పావయ్యాడు. 1749 నాటికే వ్యాపారం పేరుతో వచ్చిన బ్రిటీషు వాళ్ళు, ఎలా తంజావూరుని కబళించాలా అని శత విధాలా ప్రయత్నించారు. అంతకు ముందొక సారి ప్రతాప్ సింగ్ పై పొరుగునున్న పుదుకొట్టయి రాజు దేవకొట్టయిని యుద్ధానికి ఉసిగొల్పినా, ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ తరువాత మొగల్ నవాబులతోటీ, ఆర్కాట్ రాజులతోటీ చేతులు కలిపి మెల్ల మెల్లగా తంజావూరు పై పట్టు సాధించారు. 1780 నుండి 1800 కాలంలో తంజావూరిపై బ్రిటీషు వారి ఆధిపత్యం పెరిగింది. తుల్జాజీ-II కొడుకు శరభోజి-II, బ్రిటీషు వారి చెప్పు చేతల్లో నడుస్తూ తంజావూరికి నామ మాత్రపు రాజులా మిగిలాడు. ఆ తరువాత హైదరాలీ కొడుకు, టిప్పు సుల్తాన్, బ్రిటీష్ వాళ్ళ చేతిలో ఓడి పోడంతో తంజావూరు చుట్టుపక్కల రాజ్యాలన్నీ పోయి, ఇంగ్లీషు దొరల పాలన మొదలయ్యింది.
ఈ శరభోజి-II కాలంలోనే త్యాగరాజు తిరువైయ్యార్లో ఉన్నాడు. బ్రిటీషు వాళ్ళ ఆక్రమణ ముందూ, వెనుకా ప్రతీ సంఘటనకీ చారిత్రిక ఆధారాలున్నాయి. ప్రతీదీ లిఖిత పూర్వకంగా నమోదు చేయ బడింది. కాకపోతే, అందులో త్యాగరాజు పేరు మాత్రం “దక్షిణాదినున్న సంగీత వాగ్గేయకార సాధువుగా” ఒక్కసారి ప్రస్తావించ బడిందంతే!