తొలి వలపు

నువ్వొచ్చే దాకా ఆకాశంలో
విహరించేవాడిని
నువ్వొచ్చి భూమ్మీదకు తీసుకొచ్చావు

ఆకాశం లో మేఘం లా విహరించే నేను
చల్లని నీ చూపు తాకి వర్షమై కురిసాను

చిత్రం! నువ్వు కొంచెం కూడా తడవలేదు
నీ మనసుకి అడ్డంగా
సాంప్రదాయపు గొడుగు

ఆ గొడుగుకి చిల్లుందో లేదో
తెలుసుకొనే లోపే నువ్వెళ్ళిపోయావు..

నా ఆశలతో పాటు నేనూ ఆవిరై
మళ్ళీ మేఘంగా మారిపోయాను

ఇంకెవరి చూపైనా  మళ్ళీ నన్ను
వర్షం గా మారుస్తుందేమోనని
ఆశ గా చూస్తున్నాను

హైకూల “వర్షం”

వర్షం చెట్లకు తలంటు పోసినట్టుంది
గాలికి తమ కురుల్ని ఆరబెట్టుకుంటున్నాయి
చుట్టూ ఉన్న వారిపై నీటి తుంపరలు

వర్షపు చుక్క ఆల్చిప్పలో పడితేనే
ముత్యం అవుతుందనుకునేవాడిని
చెట్ల ఆకులపై నిలచిన నీటి ముత్యాల్ని చూసే వరకు

వర్షం లో భూదేవి కూడా స్నానం చేసింది
పూల సబ్బు పూసుకున్నందుకేమో వాడనందుకేమో
ఒళ్ళంతా సువాసనలు

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. \"ఏటి ఒడ్డున\" కవితా సంపుటి (2006), \"ఆత్మనొక దివ్వెగా\" నవల (2019), \"సెలయేటి సవ్వడి\" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు. ...