(తమ్మినేని యదుకుల భూషణ్ కవితాసంకలనం “చెల్లెలి గీతాలు” పై సమీక్ష)
ఈ కవితలు చదివే ముందు ఒకసారి, వర్తమానాన్ని వదిలి బాల్యంలోకి తిరిగి పయనించేందుకు సిద్ధం కండి.
కవిత్వ నిర్వచనాలు, వాదాలు, వర్గీకరణలను పక్కకు నెట్టి ఒక సార్వజనీన అనుభూతిని తిరిగి పొందేందుకు తయారుగా ఉండండి. ఇక పుస్తకం లోకి…
అమాయకత్వం, ఆరిందాతనం కలబోసిన ఒక అన్నయ్య మనసును గొప్పగా ఆవిష్కరిస్తాడీ కవి. కుక్కపిల్ల అనే కవితలో,
“పెద్దాళ్ళకు కుక్కపిల్లలు ఇష్టం కావని నీకు తెలియదా?”
అనే ఒక్క ప్రశ్న చాలు పిల్లల మనసును
ఈ కవి ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడో తెల్సుకోవడానికి.
“నీ చెల్లెల్ని కనుక” అనే కవితలో చెల్లెలి మీద ఎన్ని కంప్లైంట్లో చూడండి.
“అస్సలు…నీవు నా పలక ఎందుకు తీసుకోవాలి?
తోకలా ఎందుకు నా వెంట పడతావ్
నా హుండీలో పావలాలన్నీ ఎందుకు తీసుకున్నావ్ ”
ఇవే కాదు.. ఆ వయసుకు అర్థం కాని ఒక గొప్ప అనుబంధాన్ని కూడా చాడీ గా మారుస్తాడు.
“నాకు జ్వరమొచ్చి…పడుకుంటే నీవెందుకు భోంచేయవ్”
అలా అని చెల్లెలు లేకపోతే తనెంతగా చెల్లెల్ని మిస్ అయ్యాడో
“నీవెందుకు నా మీద అలుగుతావ్ ” అనే కవితలో చూడండి.
“ఏడవకు…ఈ సారి నీవెక్కడున్నా
పిలుచుకెళతాను.
ఏడవద్దూ..నీవేడిస్తే
నాక్కూడా ఏడుపొస్తుంది.”
క్షణమొక రీతిగా మారే చెల్లెలి ప్రేమనీ, కోపాన్ని అర్థం చేసుకోలేక ప్రశ్నిస్తాడు “నీవెవరి జట్టు”లో. కానీ తనూ అదే అనుభూతికి లోనవుతున్నట్టు (పైరెండు కవితల్లో చూపినట్టు) అర్థం చేసుకోలేకపోతాడు.ఈ అన్నయ్యకు ఆరిందాతనం కూడా ఎక్కువే. ఆలయంలో గబ్బిలాల గురించి, పూలేసే కొంగల గురించి, గుడ్లు పొదిగే కాకుల గురించి ఇతని సమాధానాలు చూడండి.
ఒక అన్నయ్య మోనోలాగ్‌లో ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టిస్తాడీ కవి. హుండీలో పావలాలు, వేపచెట్టెక్కి కింద పడటాలు, ఆలయంలో గబ్బిలాలు, గలగలలు చేసే రావిచెట్టు, పూలేసే కొంగలు, చెక్కగేటు తీసుకుని వెళ్ళే పొట్టిజళ్ళ పిల్ల,ఇలాంటి కొన్ని పదచిత్రాలు మనం మరచిపోతున్న మన బాల్యాన్ని మళ్ళీ తెచ్చి మన కళ్ళ ముందు నిలబెడుతాయి.
తెలుగు కథలో అప్పటి వరకూ ఉన్న శైలికి, వస్తుస్వీకరణకు భిన్నంగా నామిని “పచ్చనాకు సాక్షిగా” రాసారు. చెల్లెలి గీతాలు చదువుతుంటే తెలుగు కవిత్వంలో భూషణ్ అదేపనిని చేస్తున్నారనిపిస్తుంది.
(చెల్లెలి గీతాలు ప్రతులకు thammineni@lycos.com ని సంప్రదించండి, ఇండియాలో ప్రతులు అన్ని మేజర్ పబ్లిషింగ్ హౌస్‌లలోను దొరుకుతాయి)