కష్టార్జితం

మీటింగు అయ్యాక నా క్యూబికిల్‌లోకి రాగానే మోగింది ఫోను. అలవాటుగా కాలర్‌ ఐడి చూశాను. ఇంటినించీ వచ్చింది ఫోను.
“హలో”
“నేనండీ” అంది నా భార్య వరలక్ష్మి.
“చెప్పండీ” అన్నాను సరదాగా.
“అది కాదండీ! మీరు పిల్లాడికి పొద్దున్న ఏమన్నా డబ్బిచ్చారా?” అడిగింది కొంచెం ఆత్రంగా.
పర్సు చూసుకున్నాను. రెండు వారాల నించీ వున్న ఇరవై డాలర్ల నోటూ భద్రంగా వుంది.
“లేదే! వాడు అడగను కూడా లేదు. ఏమైంది?”
“వాడి పేంటు జేబు లోని పర్సులో పదిహేను డాలర్లు వున్నాయి. నేను కూడా ఇవ్వలేదు వాడికి. అవి వాడికి ఎక్కడనించీ వచ్చాయో తెలియదు” అంది వరలక్ష్మి దిగులుగా.
“నువ్వు వాడి పర్సెందుకు తీశావూ?” అడిగాను అర్థం కాక.
“వాడు విప్పిన బట్టలు వాషింగు మెషిన్‌లో వేద్దామని తీసి, జేబులు వెదికాను ఏమన్నా మర్చిపోయాడేమోనని. వున్న పర్సుని తీస్తూవుంటే అందులోంచీ ఒక కార్డు బయట పడింది. అది తీసి లోపల పెడుతుంటే డబ్బు కనబడింది” చెప్పింది తన తప్పేమీ లేనట్టు.
“దానికెందుకు దిగులు? నువ్వప్పుడప్పుడు లంచ్‌కని డబ్బిస్తావుగా కేఫిటేరియాలో కొనుక్కోమని! అలా  మిగుల్చుకున్నవి అన్నయాయేమో కొన్నాళ్ళకి” తేలికగా చెప్పాను.
“కాదండీ! నేనెప్పుడూ వాడికి విడి డాలర్ల నోట్లు ఇస్తాను. వాడి దగ్గర ఇప్పుడు ఒక కొత్త పది డాలర్ల నోటూ, ఒక కొత్త ఐదు డాలర్ల నోటూ వున్నాయి. మీరంటున్నట్టుగా అనిపించడం లేదు నాకు” అంది మరింత దిగులుగా.
నాక్కూడా కొంచెం దిగులేసింది.
“వాడేం చేస్తున్నాడు ఇప్పుడ్త్లిమో?” అడిగాను మామూలుగా వుండటానికి ప్రయత్నిస్తూ.
“బాత్‌రూమ్‌లో వున్నాడు. బయటకి రాగానే అడుగుతాను” అంది గట్టిగా.
“వద్దు, వద్దు. వాడినేమీ అడగొద్దు. నేనింటికి బయలుదేరి వస్తున్నాను. నేను మాట్లాడతాను వాడితో వివరంగా. నువ్వేమీ వర్రీ కాకు” అని చెప్పి ఫోను పెట్టేశాను.
ఆఫీసు నించీ జిమ్‌కి వెళదామన్న ఆలోచనకి స్వస్తి చెప్పి ఇంటికి బయలుదేరాను. “సందు దొరికితే చాలు జిమ్‌ ఎగ్గొట్టేస్తావు” అని మనసు ఆక్షేపణ చేసింది. నాకు నేనే సమర్థించి చెప్పుకున్నాను.
కారు డ్రైవ్‌ చేస్తున్నానన్న మాటే గానీ, మనసంతా పిల్లాడి మీదే వుంది.
పదహారేళ్ళ మా పిల్లాడు ఒక కేథలిక్‌ హైస్కూల్లో పదకొండవ తరగతి చదువుతున్నాడు. వాడి చిన్నప్పటి నించీ వాడిని పెంచడంలో ఎక్కడ తప్పులు చేస్తానో అని నన్ను నేను చెక్‌ చేసుకుంటూనే వస్తున్నాను. నాకిష్టం లేకపోయినా అమెరికన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌లో చేరనిచ్చాను. వాడికోసమని అర్థం కాకపోయినా వాడి ప్రతీ మాచ్‌కీ వెళ్ళాను. నెగ్గినప్పుడల్లా వాడితో పాటూ నేనూ సంతోషించాను. ఓడినప్పుడల్లా వాడితో పాటూ నేనూ విచారిమ్చాను. ఐదవ తరగతి నించీ వాడిని ప్రైవేటు స్కూళ్ళో చేర్పించాను ఖర్చు ఎక్కువైనా. వాడికి కావలసినవన్నీ కొంటూనే వున్నాను. వాడికి స్నేహితుడిలా కూడా ప్రవర్తించేవాడిని. ఫ్రీగా ఆర్య్గూ చేయనిచ్చేవాడిని. బేంక్‌ బేలన్సులూ, నా జీతం అన్నీ తెలుసు వాడికి. చిన్నపిల్లాడిలా ట్రీట్‌ చెయ్యకుండా అన్ని విషయాలూ చెప్తూవుండేవాడిని. అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చేవాడిని ఏం కొనుక్కోడానికన్నా. నాకిష్టం అయిన కర్నాటక సంగీతం క్లాసులు మానేసి, వాడి కిష్టమయిన కరాటే క్లాసులకి వెళతానంటే అలాగే ఒప్పుకున్నాను. పక్కా శాఖాహారినయినప్పటికీ, స్కూళ్ళో మాంసం తినడం నేర్చుకుని ఆ రుచుల కోసం అడుగుతూ వుంటే, వాడి కోసమ్‌ నేర్చుకుని ఇంట్లో మాంసం వండేవాడిని.
పిల్లాడి మీద పెత్తనం చూపించకుండా, సున్నితంగా ప్రేమతో పెంచుకుంటూ వచ్చాను. వాడు కూడా స్కూళ్ళో చక్కగానే చదువుతూ వుండేవాడు. ఒక్కసారి కూడా ఏ గొడవా తీసుకురాలేదు ఇంటికి. పదవతరగతి చివర సమ్మర్‌ ఇంటర్న్‌గా రెండు నెలలు పని చేసి సంపాదించిన డబ్బంతా వాడి పేర్న వున్న ఎకౌంట్‌లో వేస్తే చక్కగా ఒప్పుకున్నాడు. చెడు తిరుగుళ్ళూ తిరిగేవాడు కాదు. కాఫీ, టీలు తాగడు. నాలాగే కోక్‌ కూడా తాగడు. అందరి పిల్లలలాగే పదహారేళ్ళకే డ్రైవింగు లైసెన్సు తెచ్చుకుని నాకున్న బాధ్యతలను తగ్గిమ్చాడు.
అన్నీ చక్కగా జరుగుతున్నాయనుకుంటే ఇదేమిటీ అని నా మనసు చాలా వ్యాకులపడింది.
మళ్ళీ అదే మనసు, “ఎందుకు అనవసరంగా వర్రీ అవుతావు? పిల్లాడితో మాట్లాడితే తెలుస్తుందిగా! ఇన్నాళ్ళూ చక్కగా వున్న పిల్లాడు సడన్‌గా ఎలా చెడిపోతాడూ?” అని మందలించింది.
“ఏమో! చక్కగా వున్నాడనీ, చక్కగా పెంచాననీ నువ్వనుకుంటున్నావు. ఈ వయసులో పిల్లలు చెడ్డలవాట్లు నేర్చుకోవడం ఎంతసేపు? అందులో డ్రగ్సూ, సెక్సూ సమస్యల గురించీ రేడియోల్లోనూ, టీవీల్లోనూ వింటూనే వున్నావుగా. ప్రతీ పేరెంటూ కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లి లాగానే అనుకుంటారు. అయినా పిల్లలు చెడిపోతూనే వున్నారు” అని భయపెట్టింది అదే మనసు.
తల ఒక్కసారి విదిలించాను. అసలు బుద్ది లేనిది నాకని నేనే తేల్చేసుకున్నాను.
ఇంటికి వెళ్ళేసరికి పిల్లాడు హాల్లో కూర్చుని చదువుకుంటున్నాడు. స్నానం చేసి, వెళ్ళి వాడి దగ్గరే కూర్చున్నాను ఏదో పుస్తకం పట్టుకుని.
“ఎలా వుంది స్కూలు ఇవాళ?” మామూలుగా అడిగాను.
“బాగానే వుంది డాడీ! మేథ్‌ టీచర్‌ లీవ్‌లో వున్నారు. అందుకని సబ్‌స్టిట్యూట్‌ వచ్చారు ఇవ్వాళ. కాబట్టి మేథ్‌ టెస్టు పేపరు తిరిగి ఇవ్వలేదు. ఇంగ్లీషు టీచర్‌ ఎస్సేలు ఇంకా కరెక్టు చెయ్యలేదు. బయాలజీ క్విజ్‌ బాగానే చేశాను” అన్నీ వివరంగా చెప్పాడు.
ఎలా అడగాలో తెలియడం లేదు నాకు. వాడంతట వాడే చెబితే బాగుణ్ణని నా అభిప్రాయం.
“ఇంకేమీ జరగలేదా ఇవాళ?” మళ్ళీ అడిగాను.
“అబ్బ! లేదు డాడీ! కాసేపు వూరుకో! నన్ను హోమ్‌వర్కు చేసుకోనీ!” కాస్త విసుక్కున్నాడు చనువుగా.
“సరే! సరే!” అని వూరుకున్నాను కాసేపు.
“నీకేమయినా డబ్బు కావలిస్తే నా పర్సులోంచి తీసుకో. లేకపోతే అమ్మతో చెప్పి అమ్మ బేగ్‌లోంచి తీసుకో. జస్ట్‌ చెప్పి తీసుకో” అన్నాను కాజువల్‌గా.
“అబ్బే! అక్కరలేదు. నా దగ్గర పదిహేను డాలర్లు వున్నాయి. నేను కష్టపడి సంపాదించాను ఇవాళ” అన్నాడు నవ్వుతూ.
నా మనసు ఎంతో తేలిక పడింది. మా మాటలు వింటున్న వరలక్ష్మి మొహం కూడా వికసించింది.
“నువ్వు కష్టపడి సంపాదించడం ఏమిట్రా?” అడిగాను ఎంతో ఆనందంగా.
“మరేమనుకున్నావు? చెప్తాను విను” అంటూ చెప్పసాగాడు.
*     *    *   *    *   *   *
ఈ రోజు స్కూళ్ళో థర్డ్‌ పీరియడ్‌ ఆఫ్‌పీరియడ్‌ నాకు. ఆ టైంలో లైబ్రరీకి వెళ్ళాను బయాలజీ క్విజ్‌కి ప్రిపేర్‌ అవుదామని. అక్కడ కెవిన్‌ జాలిగా మొహం పెట్టుకుని కూర్చున్నాడు. కెవిన్‌ మాథ్‌, స్పానిష్‌, ఇంగ్లీషు సబ్జెక్టులకి నా క్లాసుల్లోనే వుంటాడు. బిలో యేవరేజ్‌ స్టూడెంట్‌. కానీ మంచి ఫ్రెండు.
“వాట్‌ డూడ్‌? ఏమయింది?” కూల్‌గా అడిగాను.
“నో మేన్‌, నో! ఈ స్పానిష్‌ ఎస్సే రాయడం నావల్ల కావటం లేదు. ఈ రోజే లాస్ట్‌డేట్‌ సబ్మిట్‌ చెయ్యడానికి. హెల్ప్‌ మీ మేన్‌!” అర్థించాడు నన్ను.
కాస్త జాలేసింది నాకు. ఇంతలో బయాలజీ క్విజ్‌ గుర్తొచ్చింది.
“లాస్ట్‌ టెస్ట్‌లో తక్కువ మార్కులు వస్తే డాడీ సంతోషించలేదు. విని వూరుకున్నాడు. మంచి మార్కులు వచ్చినప్పుడు డాడీ మొహం మీద కనిపించే ఆనందం చూడటం నాకెంతో ఇష్టం. ఈ క్విజ్‌ బాగా రాసి నా గ్రేడుని కవర్‌ చేసుకోవాలి” అని నాలో నేనే అనుకున్నాను.
“సారీ డూడ్‌! బయో క్విజ్‌కి ప్రిపేర్‌ అవ్వాలి నేను. ఇంకొక్కసారి అన్నీ చూసుకోవాలి” అన్నాను.
“ప్లీజ్‌ మేన్‌! ఈ ఎస్సే సరిగా రాయకపోతే నా గ్రేడ్‌ పడిపోవడం ఖాయం. అప్పుడు సమ్మర్‌ స్కూల్‌కి ఎటెండ్‌ అవవాలిసివస్తుంది. హెల్ప్‌ మీ డూడ్‌, హెల్ప్‌ మీ! ఐ విల్‌ పే యూ! సర్టన్‌లీ ఐ విల్‌ పే యూ” అన్నాడు కెవిన్‌ మరింత అర్థిస్తూ.
“వాట్‌?” అడిగాను కాస్త అర్థం కాక.
“జస్ట్‌ ఒక ఇరవై నిముషాలు హెల్ప్‌ చెయ్యి. మిగిలిన టైం నువ్వు బయో క్విజ్‌కి ప్రిపేర్‌ అవచ్చు. మా పేరెంట్స్‌ నాకు ఇచ్చిన పాకెట్‌ మనీ వుంది. నీకు నేను డబ్బు పే చేస్తాను. ఫిఫ్టీన్‌ డాలర్లు ఇస్తాను. హెల్ప్‌ మీ మేన్‌!” వివరించాడు.
ఇరవైనిముషాలకి ఫిఫ్టీన్‌ డాలర్లు. చాలా ఇష్టం కలిగింది నాకు.
నెక్స్ట్‌ ఇరవై నిముషాలూ కూర్చుని కెవిన్‌ రాసింది కరెక్టు చేశాను. కొత్త వాక్యాలు వాడి చేత రాయించాను. వాడికి తెలియని విషయాలు కొన్ని చెప్పాను. మొత్తానికి వాడి స్పానిష్‌ వ్యాసం ఒక కొలిక్కి వచ్చింది. ఒక ఐదు నిముషాలు ఎక్కువే అయింది అది పూర్తయ్యేసరికి. ఇంకో పదిహేను నిముషాలు వుంది నా ప్రిపరేషన్‌కి.
“థాంక్స్‌ మేన్‌, థాంక్స్‌!” అంటూ ఒక కొత్త పది డాలర్ల నోటూ, ఒక కొత్త ఐదు డాలర్ల నోటూ ఇచ్చాడు నవ్వుతూ.
“లేటర్‌ డూడ్‌” అంటూ ఆ డబ్బుని నా పర్స్‌లో పెట్టుకుని వేరే టేబిల్‌ దగ్గరకి వెళ్ళిపోయాను క్విజ్‌ ప్రిపరేషన్‌కి.
్‌     ్‌    ్‌   ్‌    ్‌   ్‌  ్‌
“ఇదీ జరిగింది” అని చెప్పి నవ్వుతూ నావేపు చూశాడు పిల్లాడు.
నాకేమనాలో తోచలేదు వెంటనే.
“ఇది నా కష్టార్జితం డాడీ!” అన్నాడూ మళ్ళీ నవ్వుతూ.
వాడికి చిన్నప్పటినించీ కష్టార్జితం గురించి కథలు చెప్పేవాడిని.
“కెవిన్‌ నీకు డబ్బిచ్చినట్టు వాడి పేరెంట్సుకి తెలుసా?” అడిగాను కాజువల్‌గా.
“నో వే! వాడూ చెప్పివుండడు” అన్నాడు పిల్లాడు.
“అంటే కెవిన్‌ తన పేరెంట్సుకి తెలియకుండా, స్పానిష్‌ ఎస్సేకి నీ దగ్గర ట్యూషన్‌ తీసుకుని, తన పాకెట్‌ మనీని నీకు నువ్వు చెప్పిన ట్యూషన్‌కి ప్రతిఫలంగా ఇచ్చాడు, అవునా?” అడిగాను వీలయినంత మామూలుగా.
నా పాయింట్‌ అర్థం అయింది వాడికి.
“నువ్వా డబ్బు తిరిగి ఇచ్చెయ్యాలి వాడికి. లేదా వాడి పేరెంట్సు నీకు నువ్వా డబ్బు వాడికిచ్చిన ట్యూషన్‌కి ప్రతిఫలంగా తీసుకోవచ్చని అని అయినా చెప్పాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయడమే రైటైన పద్ధతి” వివరిమ్చాను శాంతంగా.
“పేరెంట్సుతో మాట్టాడ్డం అనే విషయం కుదరదు గానీ, రేపు కెవిన్‌కి డబ్బు తిరిగి ఇచ్చేస్తాను” ఒప్పుకున్నాడు పిల్లాడు.
ఏదో ఆలోచిస్తూ బుర్ర వూపాను.
“ఏమిటి డాడీ ఆలోచిస్తున్నావు?” అడిగాడు.
“నీకో కథ చెబుతాను వింటావా?” అడిగాను.
“ఓ, ష్యూర్‌!” అని వుత్సాహంగా అని, “ఆ కథ రూపంలో మళ్ళీ నాకేమన్నా లెక్చరిస్తావా?” అని కాస్త అనుమానంగా అడిగాడు.
నవ్వాను వాడడిగిన తీరుకి.
“లేదురా! నా జీవితానుభవాన్ని నీకు కథలా చెబుదామనుకుంటున్నాను” అన్నాను నవ్వుతూనే.
వాడూ వుత్సాహంగా చూస్తూ తలాడిమ్చాడు.
చెప్పడం మొదలు పెట్టాను.
*     *    *   *    *   *   *
అవి నేను రెండో తరగతి చదివే రోజులు. కాకినాడలో వున్న ప్రగోడా స్కూలు మా స్కూలు. ఒకటి నించీ, ఐదు వరకూ వున్నాయి క్లాసులు.
రెండో క్లాసులో పేపర్లూ, పెన్సిళ్ళూ లేవు. అన్నీ పలక మీదే. పరీక్ష కూడా పలక మీదే బలపంతో రాసి టీచరుకి చూపించాలి. నేను రాసింది మర్చిపోయి నన్ను ఫెయిల్‌ చేస్తారేమోననే భయంతో ఒకటికి రెండు సార్లు మీదకు ఎగబడి పలక చూపించేవాడిని టీచరుకి.
ఆ పలక పరీక్షలు నిర్వహించి, పిల్లలు పలకల మీద రాసినవి చూసి, సరిగా రాయని కొంత మంది పిల్లలని ఫెయిల్‌ చేసి అదే క్లాసులో వుంచేసేవారు.
యేడాది చివర పరీక్షలొచ్చాయి. ఆ రోజు మధ్యాహ్నం మా రెండో క్లాసుకి పలక పరీక్ష.
అదే స్కూళ్ళో ఐదవ తరగతి చదువుతున్న అక్క వుంది నాకు. ఆ అక్కకో ఫ్రెండూ, ఆ ఫ్రెండుకో తమ్ముడూ. వాడు కూడా నా క్లాసులోనే వుంటాడు. వాడికి ఎప్పుడూ తప్పులు వస్తూ వుండేవి పలక పరీక్షలో.
ఆ రోజు పొద్దున్న మా అక్క ఫ్రెండు నా దగ్గరకి వచ్చింది.
“ఇవాళ నువ్వు మా తమ్ముడికి నీ పలక మీద రాసింది చూపించి వాడిని రాసుకోనిస్తే, బడయ్యాక నీకేమన్నా కొనిపెడతాను” అంది ఆశపెడుతూ.
సరేనని సంతోషంగా ఒప్పుకున్నాను.
ఆ రోజు పలక పరీక్షలో నేను రాసింది వాడికి చూపించాను. వాడు అది చూసి వాడి పలక మీద కాపీ చేశాడు.
టీచరు ఆ రోజు వాడి పలక చూసినప్పుడు వాడినేమీ అనలేదు.
బడయ్యాక మా అక్క ఫ్రెండు నాకు మూడు పైసలు పెట్టి ఒక చిన్న మామిడికాయ కొని పెట్టింది. సంతోషంగా తింటూ ఇంటికెళ్ళాను.
అప్పటి నించీ అన్ని క్లాసుల్లోనూ అడపా తడపా తోటి పిల్లలకి సాయం చేయడం, ప్రతిఫలంగా వాళ్ళిచ్చినవి తీసుకోవడం అలవాటయిపోయింది.
ఏడోక్లాసులో మా క్లాస్‌మేట్‌కి నోట్సు ఇచ్చి, పరీక్షలో చూపిస్తే వార పత్రికల మధ్య పేజీల్లో వున్న సినిమా తారల రంగు రంగుల బొమ్మలు ఇచ్చాడు. వాటిని క్లాసు పుస్తకాలకి అట్టలుగా వేసుకున్నాను. కొన్నిసార్లు టికెట్‌కి సినిమాకి తీసికెళ్ళాడు.
పదవక్లాసుకు వచ్చేటప్పటికి మా నాన్న చేస్తున్న చిన్న హోటల్‌ వ్యాపారం దివాళా తీసింది. ఎన్నో అప్పులు మాత్రం మిగిలాయి. నాన్నకి వేరే పని చేయడం చేతకాక ఇంట్లోనే వుండటం మొదలుపెట్టారు. పెద్దక్క వేరే వూళ్ళో ఒక్కతే వుంటూ, చిన్న వుద్యోగం చేస్తూ నెల, నెలా ఇంటికి డబ్బు పంపుతూ వుంటుంది. ఆ డబ్బు ఏ మూలకీ సరిపోయేది కాదు. ఇంట్లో వున్న సామాన్లకి అప్పుడప్పుడు కాళ్ళు వస్తూ వుంటాయి.
పదవక్లాసు చదివుతున్నది పిఠాపురం రాజా గవర్నమెంటు హైస్కూల్లో. నెల నెలా జీతాలు లేవు గానీ, యేడాది మొదటలో పది రూపాయలో, ఎంతో స్పెషల్‌ ఫీజుగా కట్టాలి. కట్టే స్తోమతు లేక కట్టలేదు. తరుచుగా టీచరు నన్ను క్లాసులో లేపి ఫీజు కట్టలేదని తిట్టేవారు. నోరు మూసుకుని తిట్లు తినేవాడిని. గవర్నమెంటు స్కూలు కాబట్టి పేరు తీసెయ్యడానికి వీలు లేదని అనేవారు. దిన దిన గండంగా వుండసాగింది బతుకు.
యేడాది చివర్లో హాల్‌ టికెట్‌ ఇవ్వరని భయపెట్టక ఇంట్లో బాగా యేడిస్తే, అమ్మ ఇంకో బిందెకి కాళ్ళిచ్చి స్కూలు స్పెషల్‌ ఫీజు కట్టింది.
పదవ తరగతికి పబ్లిక్‌ పరీక్షలు వారం రోజుల్లో వున్నాయి. ఒక సైన్సు మేష్టారి పుణ్యమా అని అప్లై చేసిన పేద విద్యార్థుల స్కాలర్‌షిప్పు ఇరవై రూపాయలు వచ్చింది. అందులో తన భక్షీసుగా ఆ గుమాస్తా ఒక రూపాయి తీసేసుకున్నాడు. నేను నోరెత్తలేదు ధైర్యం లేక. ఏదో డిపాజిట్టు రిఫండ్‌ అనో, వేరే పేరుతోనో ఇంకో పదిహేను రూపాయలు కూడా ఇచ్చారు స్కూల్లో.
మొత్తం ముప్ఫై నాలుగు రూపాయలూ తీసుకెళ్ళి మా అమ్మ చేతిలో పెట్టాను.
“నీకు పరీక్షలన్ని రోజులూ బియ్యం కొని అన్నం పెడతాను ఈ డబ్బుతో” అంది అమ్మ.
అనడం అయితే అంది గానీ, పరీక్షలు రెండు, మూడు రోజులున్నాయనగా ఆ డబ్బు కాస్తా అయిపోయింది. ఆకలి కడుపుతో చదువుకోలేకపోయాను. రెండు, మూడు గుప్పెళ్ళన్నం ఏ మూలకీ సరిపోయేది కాదు. చదువుతున్నది బుర్రలో వుండేది కాదు సరిగా.
సరిగ్గా పరీక్ష ఒక రోజుందనగా వచ్చింది ఒక బిజినెస్‌ డీల్‌ నాకు.
నా క్లాస్‌మేటు ఒకడున్నాడు. వాడు బిలో యేవరేజ్‌ కేండిడేట్‌. పదవతరగతి పబ్లిక్‌ పరీక్ష ఫేలయితే చర్మం వలిచేస్తానన్నాడు వాళ్ళ నాన్న. వాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళే. దాంతో వాడు ఎప్పుడూ బలాదూర్‌గా తిరుగుతూ, సినిమాలు చూస్తూ గడిపేసేవాడు. క్లాసు పరీక్షల్లో చూపించినందుకు నన్ను కూడా సినిమాలకి తీసికెళుతూ వుండేవాడు.
వాడికి వాళ్ళ నాన్న భయం వుంది నిజంగా కొడతాడని.
వాడి హాల్‌ టికెట్‌ నెంబరు నా నెంబరు కన్నా ఒక నెంబరు ఎక్కువ. దాని వల్ల సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ని బట్టి ఒకే బెంచీలో ఇంకో చివరో, వెనక బెంచీలో నా వెనకో కూర్చునే అవకాశం వుంది వాడికి పరీక్షా హాల్లో.
“పరీక్ష ఫేలయితే చర్మం వలిచేస్తానన్నాడురా మా నాన్న. నువ్వు పరీక్షల్లో చూపించి నన్ను గట్టెక్కించాలి” అన్నాడు ఎప్పటిలాగానే.
“ఇంకా నయం! అవి స్కూలు పరీక్షలు. ఇది పబ్లిక్‌ పరీక్ష. మనకి సెంటర్‌గా గాంధీ నగరంలో వున్న స్కూలు ఇచ్చారు. నాకు భయం బాబూ! కుదరదు.” నిక్కచ్చిగా చెప్పాను.
“అలా అంటే ఎలాగరా?” బతిమాలసాగాడు.
“నువ్వెన్నన్నా చెప్పు. నా వల్ల కాదు బాబూ! అదీగాక మనిద్దరం ఒకే రూమ్‌లో పడతామన్న గారంటీ ఏమిటి? సీటింగ్‌ అరేంజిమెంటు తెలియదుగా మనకి” లా పాయింటు తీశాను.
“ఆ వెంకన్న బాబు దయ వల్ల నేను నీ వెనకే పడతాను సీటింగ్‌ అరేమ్జ్‌మెంటులో. నాకు చూపించరా బాబూ!” నమ్మకంగా అన్నాడు.
కుదరదంటే కుదరదన్నాను భయంతో.
“పరీక్షకో రెండు రూపాయలిస్తాను నీకు” అని ఆశ పెట్టాడు.
నా కళ్ళు పెద్దవయ్యాయి నమ్మకం లేక.
“నిజంగా. సరస్వత్తోడు. పరీక్ష అయిపోగానే ఆ రోజు రెండు రూపాయలు వెంటనే ఇచ్చేస్తాను. నిజంగా!” నమ్మకంగా వొట్టేసి చెప్పాడు.
అంతే! లొంగిపోయాను. వెంటనే ఒప్పేసుకున్నాను. ఇంటికి వెళ్ళి అమ్మతో చెప్పాను ఈ సంగతి. అమ్మ కళ్ళు సంతోషంతో మెరిశాయి.
“మరి నీకేమన్నా సమస్య వస్తుందేమో” కొంచెం భయంగా అడిగింది.
అమ్మ భయం చూసి నాకు ధైర్యం వచ్చింది.
“ఎందుకు భయం? నా పేపరు వాడికి కనబడేటట్టు జరిపి పట్టుకుంటాను. వాడు చూసి కాపీ కొడతాడు. పట్టుకుంటే వాడిదేగా తప్పు? నన్నెవరూ అనరు. వాడు కాపీ కొడుతున్నట్టు నాకు తెలియదని చెప్పేస్తాను” సాహసంగా అమ్మకి నచ్చచెప్పాను.
అమ్మ అప్పటికీ అయిష్టంగానే చూసింది.
“అదీగాక ఆకలితో సరిగా చదువుకోలేక పోతున్నానమ్మా. ఆ రెండు రూపాయలతో ఇంటిల్లిపాదికీ బియ్యం వస్తాయి. పరీక్షలన్నీ చక్కగా జరిగిపోతాయి కష్టం లేకుండా” ఇంకా నచ్చ చెప్పాను.
అమ్మ ఆ మాటలు విన్న వెంటనే ఒప్పేసుకుంది.
నా ఫ్రెండన్నట్టుగానే వెంకన్న బాబు వాడిని నా వెనక బెంచీలో నా వెనకాల వేశాడు. వాడి మొహం ఆనందంతో మతాబులా వెలిగిపోయింది.
మొదటి పరీక్ష ఇంగ్లీషు మొదటి పేపరు.
పరీక్ష మొదలు పెట్టినప్పుడు భయంతో చెయ్యి వణికింది. ఒక అయిదు నిముషాల వరకూ ఆ వణుకుతున్న చేత్తోనే పరీక్ష రాశాను. ఆ తరువాత వణుకు పోయింది.
భయం భయంగా పేపరు ఎత్తి వెనకాల వాడికి కనబడేటట్టు పట్టుకుంటూ పరీక్ష రాశాను. మధ్యలో ఇన్విజిలేటర్‌ వస్తే మామూలుగా సర్దుకున్నాను. వాడు సంతోషంగా కనబడిందంతా కాపీ కొట్టుకున్నాడు.
పరీక్ష అవగానే మాట ప్రకారం రెండు రూపాయలూ ఇచ్చేశాడు. సంతోషంగా ఇంటికెళ్ళి అమ్మ చేతిలో పెట్టాను ఆ డబ్బు. అమ్మ ఆ డబ్బుతో సరుకులు కొని ఇంటిల్లిపాదికీ అన్నం పెట్టింది.
ఈ విషయం ఇంట్లో వున్న మిగతా అక్కలకి గానీ, నాన్నకి గానీ తెలియదు. ఇది నాకూ, అమ్మకూ మాత్రమే మధ్యలో వున్న రహస్యం.
హాయిగా ఇంకో రెండు పరీక్షలయిపోయాయి.
ఆ రోజు లెక్కలు రెండో పేపరు.
మామూలుగానే పేపరు ఎత్తి పట్టుకుని చేస్తున్నాను లెక్కలు. సరిగా ఎత్తి పట్టుకోవడం లేదని వెనకాల నించీ వాడు ఒకటే నస.
“పోనీ నువ్వు రాసేసిన పేపరు ఇచ్చెయ్యి నాకు. కాపీ చేసి ఇచ్చేస్తాను” గుసగుసగా అన్నాడు.
కళ్ళు భయంతో పెద్దవి చేసి తల అడ్డంగా వూపాను.
“ఫరవాలేదురా! ఇంకో రూపాయెక్కువిస్తాను. ఇచ్చెయ్యి” అన్నాడు ఆశ పెడుతూ.
మళ్ళీ ఆశకి లొంగిపోయాను. ఇన్విజిలేటరు చూడకుండా నేను చేసేసిన ఒక లెక్కల షీట్‌ వాడికిచ్చేశాను. వాడు హాయిగా వాడి కాగితాల్లో కలుపుకుని కాపీ చేసుకోసాగాడు.
కాసేపటికి ఇన్విజిలేటరు రూమంతా తిరుగుతూ వాడి దగ్గరకి వచ్చారు.
వాడు ఏదో ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టాడు.
నాకు కాళ్ళళ్ళో వణుకు మొదలయింది. వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవడం మొదలుపెట్టాను.
ఇన్విజిలేటరు కాజువల్‌గా వాడి పేపర్లు చూస్తూ ముందుకు వెళ్ళబోయి ఆగిపోయారు కళ్ళు పెద్దవి చేసి.
“ఈ షీటేమిటీ? నీ హేండ్‌ రైటింగులా లేదే?” అంటూ ఆ కాగితాలు పైకి తీశాడు.
అంతే విషయం అంతా బయట పడిపోయింది.
ఆ షీటు మీద నా హాల్‌ టికెట్‌ నెంబరు కూడా వుంది.
“వాడు నా షీట్‌ కొట్టేశాడని నాకు తెలియదు మేష్టారూ! నేను యేమరుపాటులో వున్నప్పుడు తీసినట్టున్నాడు” భయంతో బుకాయించాను.
నా ఫ్రెండుకి వళ్ళు మండిపోయింది. నిండా మునిగిన వాడికి చలేమిటన్నట్టున్నాడు వాడు.
“అబద్దం మేష్టారూ! వాడే ఇచ్చాడు. నేను దొంగతనం చేయలేదు. ఇచ్చినందుకు వాడికి డబ్బివ్వాలి కూడా” ధైర్యంగా నిజం చెప్పేశాడు.
నాకింక ఏడుపాగలేదు. కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి. వెక్కు పట్టేసింది. ఈ గండం లోంచి బయటపడితే బతికున్నంత కాలమూ ప్రతీ శనివారమూ వుపవాసం వుంటానని మొక్కేసుకున్నాను.
ఇన్విజిలేటర్‌కి బాగా కోపం వచ్చేసింది.
“మీ ఇద్దరినీ డిబార్‌ చేయిస్తాను వెధవల్లారా!” అని తిట్టి పేపర్లని తీసుకుని మమ్మల్ని బయటకి నడవమన్నారు.
ఇంక స్పృహ తప్పి పడి పోతానేమోనన్నట్టుగా వుంది నాకు. ఈ పరీక్ష పోతే ఇంట్లో మొహం ఎలా చూపించనూ? అదీగాక మూడేళ్ళ డిబార్‌ అంటే జీవితం నాశనం అయిపోయినట్టేగా! ఇంక చావొక్కటే శరణ్యం నాకు. ఏడుపు ఎక్కువయింది నాకు.
అదే టైంలో దేముడు పంపినట్టు వచ్చారు ఆ స్కూలు హెడ్మాష్టర్‌ ప్రతీ రూమూ చూసుకుంటూ. ఆయన అంతకు ముందు యేడాది మా స్కూళ్ళో పని చేశారు. ఆయనకి నా గురించి కొంతవరకూ తెలుసు.
“ఏం జరిగింది మేష్టారూ?” అని ఇన్విజిలేటర్‌ని అడిగారు.
ఇన్విజిలేటర్‌ జరిగింది చెప్పారు. హెడ్మాష్టర్‌ నా ముఖంలోకి చూశారు. ఏ క్షణంలోనైనా స్పృహ తప్పి పడిపోతానన్నట్టుగా వున్నాను ఏడుస్తూ. ఒళ్ళమ్తా వొణుకుతోంది.
హెడ్మాష్టర్‌ ఇన్విజిలేటర్‌ చెవిలో నెమ్మదిగా ఏదో చెప్పారు. మిగిలిన పిల్లలు పరీక్ష రాయడం ఆపి మా వైపే చూస్తున్నారు.
గంటు పెట్టుకున్న ముఖంతో ఇన్విజిలేటర్‌ మా పేపర్లు మాకిచ్చేశారు. మమ్మల్నిద్దర్నీ  వేరే వేరే బెంచీల మీద కూర్చోపెట్టారు.
దేముడున్నాడన్న నమ్మకం పూర్తిగా గట్టిపడిమ్ది నాకు ఆ క్షణంలో. వంచిన తలెత్తకుండా మిగిలిన పరీక్ష రాశాను.
వుంటున్న ఇంటికి ఆ పరీక్ష సెంటరు నాలుగు మైళ్ళ దూరం. పరీక్ష అవగానే కాళ్ళీడ్చుకుంటూ ఇంటికెళ్ళాను. పని జరగక పోవడం వల్ల నా కష్టార్జితం నాకు రాలేదు ఆ రోజు. డబ్బు లేకుండా మిగిలిన పరీక్షలు ఆకలిగా ఎలా నెట్టుకొస్తానో అర్థం కాలేదు.
అవమానం, బాధా, దుఃఖం, ఆకలీ.
అమ్మ ఇంటి గుమ్మం మెట్ల మీద కూర్చుని నా కోసం ఎదురుచూస్తోమ్ది. నన్నంత దూరంలోనే చూసి సందులో నడుచుకుంటూ నా దగ్గరకి వచ్చింది.
అర్థం కానట్టు చూశాను.
“ఇవాళ అనుకోకుండా ఇంటికి ఓ ఇద్దరు చుట్టాలొచ్చి వెళ్ళారు. నీ అన్నమూ, నా అన్నమూ వాళ్ళకి పెట్టాల్సి వచ్చింది. నువ్వు వెంటనే కొట్టుకి వెళ్ళి ఆ రెండ్రూపాయలతో సామాన్లు తెస్తే అరగంటలో అన్నం వండేస్తాను” అంది అమ్మ గబగబా.
నా మొహం పాలిపోయింది. యేడుపు మొహంతో జరిగింది చెప్పాను. అమ్మ మొహంలో బాధ ఎంతో స్పష్టంగా కనబడింది. మాట్లాడకుండా నన్ను దగ్గరకి తీసుకుని ఇంటికి నడిచింది నాతో పాటు.
అరగంట తర్వాత కాదు గానీ, ఒక మూడు గంటల తర్వాత అమ్మ కడుపు నిండా అన్నం పెట్టింది. ఆ రోజే కాదు, పరీక్షలన్ని రోజులూ కడుపు నిండా అన్నం పెట్టింది అమ్మ.
అయితే ఆ రోజు తర్వాత నించీ, అమ్మ మెడలో పసుపు తాడుకున్న రెండు మంగళ సూత్రాల బిళ్ళల బదులు ఒక పసుపుకొమ్ము మాత్రమే చూశాను.
*     *    *   *    *   *   *
కథ చెప్పటం ఆపి పిల్లాడి వేపు చూశాను.
వాడి కళ్ళు చెమ్మ గిల్లి వున్నాయి. దగ్గరకొచ్చి నన్ను కౌగలించుకుని, నా భుజం మీద తల పెట్టుకున్నాడు. వాడి వీపు తట్టుతూ చాలా సేపు అలాగే వుండిపోయాను.