నాలుగు వేడి వేడి ఇడ్లీలు ఆరగించి, ఇంటి ముందు వరండాలో సుఖంగా మడతకుర్చీలో చేరాడు ధర్మారావు. దాదాపు తొమ్మిదిన్నర అవుతుంది. ఇంటిముందూ, వీధిలో అంతా ప్రశాంతంగా ఉంది. ఆకాశంలో చిన్న చిన్న తెల్లటి మేఘాలు పెళ్ళికి పోతున్నట్లు నిదానంగా ప్రయాణం చేస్తున్నాయి. ఒక చిన్న మేఘం, అచ్చం కిరణ్ లాగానే ఉంది, బుల్లి చేత్తో, తాతయ్యా, రా, అని పిలుస్తున్నట్లు కన్పించింది.
“అమ్మాయ్ కమలా,” పిల్చాడు, ధర్మారావు.
“కాఫీ తెస్తున్నా, నాన్నా,” అని జవాబొచ్చింది ఇంట్లోనుంచి.
“అది కాదమ్మా, పిల్లవాడు కిరణ్ ఇంకా నిద్రలేవలేదా?”
“ఇంకా లేవకపోవటమేమిటీ! వాడు ఏడుగంటలకే పక్కింటి అబ్బాయితో ఆడుకోవటానికి పోయాడు,” అంటూ కాఫీ తీసుకొచ్చింది కమల.
“అలాగా, వాడి మాటలు వినపడకపోతేను.”
“వస్తాళ్ళే,” అని కాఫీ కప్పు అందించి లోపలికి వెళ్ళిపోయింది ఆమె.
కుర్చీ పక్కన ఉన్న టెబుల్ మీదనుంచి నోట్ బుక్కూ, కలమూ తీసుకున్నాడు ధర్మారావు. శ్రీరామ అని మొదట రాసాడు. తర్వాత కొంత సేపు కలం కాగితానికి దగ్గిరగా ఉంచాడేగాని ఏమి రాయలేదు. కథ అంతా తల్లో ఉంది. పాత్రలు డ్రెస్ చేసుకోని రెడీగా ఉన్నాయి. వాటిని కాగితం మీదికి దించటమే ఆలస్యం. కమల ఇరవై ఆరేళ్ళ యువతి. ఆమెకు మంచి ఉద్యోగంలో ఉన్న భర్తా, ఆరు సంవత్సరాల కొడుకూ ఉన్నారు. భర్త పేరు రమేష్. రమేష్ కళ్ళముందు కన్పించాడు. అతడు అల్లుడుగా దొరకటం తన అదృష్టం. నిదానమైన మనిషి. ఎలాంటి చెడు అలవాట్లు లేని వాడు. కాని కథలో ఇలా అసలు పేర్లు కాకుండా మారుపేర్లు వాడితే బాగుంటుందేమో. లేకపోతే పత్రికలో ఈ కథ చదివిన వాళ్ళు ఏంటండీ మీ అమ్మాయిమీదే కథ రాసారు అంటారు.
కలం కింది పెదవి మీద దొర్లిస్తూ ఆకాశం వైపు దృష్టి మళ్ళించాడు ధర్మారావు. అమ్మాయికి విమల అని పేరు పెడితే బాగుంటుంది. రమేష్ పేరు సురేష్‌గా మార్చవచ్చు.
ఎదురింటి ముందు తోటలో కొబ్బరి చెట్ల ఆకులు గాలికి ఊగుతూ ఎంతో అందంగా కన్పించాయి. వాళ్ళతోటలో చాలా చెట్లున్నాయి. తన ఇంటి ముందు అంత చోటూ లేదు, ఉన్న మూడునాలుగు చెట్లూ అంతగా పెరగనూలేదు.
“అమ్మాయ్ కమలా!”
“వస్తున్నా, నాన్నా.”
“మల్లె చెట్లకు ఈ రోజు నీళ్ళు పోసినట్లు లేదు, ఆ ఎంకమ్మ రాలేదా ఇంకా?”
“నాకు తెలియదు నాన్నా, అమ్మనడుగుతాను.”
కాగితం మీదకి మళ్ళా దృష్టి మళ్ళించాడు ధర్మారావు. విమల భర్త మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఆమేమో ఇల్లు చూసుకుంటూ పిల్లవాణ్ణి చదివించుకుంటూ సుఖంగా కాపురం చేస్తుంది.
ఇలాంటి కథ రాస్తే ఎవ్వరికీ నచ్చదేమో? చదివే వారికి కొందరికైనా నచ్చుతుందేమోగాని అసలు పత్రికలవాళ్ళు వేసుకుంటేగదా! వాళ్ళకు ఎప్పుడూ కష్టాలు కావాలి కథల్లో. ముఖ్య పాత్ర నానా గడ్డీతిని, చివరకు బుద్ధి తెచ్చుకుంటేగాని కథ కాదంటారు వాళ్ళు. వెధవ పన్లు చెయ్యకుండానే బుద్ధిగా బ్రతికిన వారి జీవితాలకు అర్థం లేనట్లు! మరి ఇలా రాస్తే విమల ఉద్యోగం చేసేది, ఒక రోజు పిల్లవాడు స్కూలునుంచి ఇంటికి వస్తున్నప్పుడు రోడ్డు మీద చిన్న ప్రమాదం జరిగింది. దానికి భర్త కోప్పడ్డాడు. నీ సంపాదన మనకు అవసరం లేదు, ఇంటి దగ్గరే ఉండి బిడ్దను జాగ్రత్తగా స్కూలుకు తీసుకుపోయి తీసుకొస్తూ ఉండు, చాలు, అన్నాడు. అప్పటి నుంచీ విమల సుఖంగా ఇంటిదగ్గరే ఉంటుంది. రోజంతా ఇంట్లో ఉండటం మొదట మొదట కష్టంగానే ఉండేది, కాని, అలవాటయిపోయి, ఇప్పుడు సుఖంగానే ఉంటుంది. ఈ మాత్రం కష్టాలు చాలా? ఇంకా పెద్ద కష్టాలు తెచ్చిపెట్టాలా? ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆఫీసులో ఒకతనితో పరిచయమయ్యింది. అతనితో స్నేహం …… ఛా. ఛా. కథ కోసం అంతదూరం పోనవసరం లేదులే. ముఖ్యంగా ఆడవాళ్ళు ఇల్లు చూసుకుంటూ సుఖంగా ఉండటం మంచిది అని చెప్పటమే గదా ప్రధానం. దానికి ఈ ఆఫీసు లవ్వూ అవీ అనవసరం.
“ఏంటీ పిల్చారటా?” శాంతమ్మ అడిగింది వరండాలోకి వస్తూ.
“నేనా? పిల్చానా? ఆ! గుర్తొచ్చింది. అదే, మల్లె చెట్లకి నీళ్ళుపోసినట్లు లేదు, ఆ ఎంకమ్మ రాలేదా అని అడిగాను.”
“అది రావటం లేదు రెండు రోజుల్నుంచి. పెద్ద కూతురి పెళ్ళట. చిన్న కూతుర్ని పంపుతుంది. ఆ పిల్ల ఇంకా రాలేదీ రోజు.”
“పెద్ద కూతురికా పెళ్ళి? ఆ పిల్లకి ఇదివరకే పెళ్ళి అయిందిగా? దాని మొగుడు పక్కింటమ్మాయితో లేచిపోయాడన్నావుగా? ఈ మధ్యేగదూ?”
“ఆ పిల్లే. ఇంకొకణ్ణి చేసుకుంటుందట,” అంటూ లోపలికెళ్ళింది శాంత.
“అలాగా!”
మల్లెచెట్ల వంక చూశాడు ధర్మారావు. దాహం, దాహం, అంటూ దీనంగా చూస్తున్నట్లు కన్పించాయి అవి. వీటిని కథలోకి తీసుకురావటం ఎలా అని ఆలోచించాడు ధర్మారావు. విమలకి మల్లెపూలంటే ఇష్టం. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో మల్లెచెట్లకి నీళ్ళుపొయ్యటం కూడా ఙ్ఞాపకం ఉండేది కాదు. అవి ఆవురావురుమంటూ ఉండేవి. ఉద్యోగం మానేసి ఇప్పుడు సుఖంగా ఇంట్లో ఉంటున్న ఫలితంగా మల్లెమొగ్గలు విరగపూస్తున్నాయి. ఇలారాస్తే ఎలావుంటుంది? పెన్ను పెదవులమీద దొర్లిస్తూ, ఎడంచేత్తో పొట్ట నిమురుకుంటూ, మబ్బులవంక చూస్తూ అలోచన్లో పడ్డాడు ధర్మారావు.
“కాళ్ళు పక్కకి జరుపుకోండయ్యా”
“ఏంటీ?” ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపించి కళ్ళు తెరచి చూశాడు ధర్మారావు. “కాళ్ళు పక్కకి జరుపుకోండయ్యగోరూ.” చీపురుకట్ట చేతిలో పట్టుకొని పక్కన నిలబడి ఉంది తొమ్మిదిపదేళ్ళ అమ్మాయి. ఎంకమ్మ కూతురు లాగుంది. తనకు కునుకు పట్టిందని గ్రహించాడు ధర్మారావు.
కాళ్ళు కుడి వైపుకు పెట్టి, “అమ్మాయ్, మల్లెచెట్లకు నీళ్ళు పోశావా?” అని అడిగాడు.
“నాకు తెలియదయ్యగోరూ.”
“తెలియదంటే ఎట్లా? అవి చచ్చిపోవూ?”
“కసువుజిమ్మి గిన్నెలు కడిగి రమ్మంది మమ్మ,” అంటూ మళ్ళా కసువు చిమ్మటం మొదలుపెట్టింది చిన్నక్క.
“అవుననుకో, అయినా మిగతా పనులు కూడా నేర్చుకోవాలి కదా?”
చిన్నక్క జవాబు చెప్పలేదు.
“అన్ని పన్లూ నేర్చుకోకపోతే రేపు పెద్దదానివయ్యాక ఎవరింట్లోనన్నా పని దొరకొద్దూ?”
ఈసారీ జవాబు రాలేదు.
చెమిటి పిల్లతో మాట్లాడుతున్నట్లు, “పని చెయ్యకపోతే తిండి ఎక్కణ్ణుంచొస్తుంది?” అన్నాడు ధర్మారావు.
తల వంచుకుని చకచకా కసువు చిమ్మి సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది చిన్నక్క.
కలం మళ్ళా కాగితం మీదికి దించాడు ధర్మారావు. కథ అంతా తల్లో ఉన్నా రాయటం ఇంత కష్టంగా ఉందేమిటీ? విమల తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. బాగా చదువుకుంది. ఈ ధర్మదేశంలో వేలసంవత్సరాలకొద్దీ ఆడవాళ్ళు ఇంటిని కాచుకుంటూ, పిల్లల్ని పెంచుతూ, భర్తను సుఖపెడుతూ వచ్చారు. తల్లిదండ్రులు సత్తా ఉన్న వారయితే కూతురుకు మంచి సంబంధం తెచ్చిపెట్టే వారు. ఇప్పుడు చదువుకూడా కావాల్సి వస్తుంది. ఉద్యోగాలు, సంపాదనా కూడా కావాలనే భ్రమతో కొందరు తమజీవితాలనూ కుటుంబాలనూ నాశనం చేసుకుంటున్నారు. తిరిగి మన సంస్కృతీ, సాంప్రదాయాలు ప్రచారంలోకి వస్తేగాని ఈ దేశం బాగుపడే మార్గం లేదు. కాని, ఇదంతా రాస్తే ఎలా? ఇలా రాయకుండానే, చదివేవాళ్ళు ఈ విషయం గ్రహించేలా రాయాలి. మరి కథలో ఇద్దరు అమ్మాయ్యిలు ఉంటే సరిపోతుంది. ఒక అమ్మాయి ఉద్యోగం చేస్తూ, నానా బాధలు పడుతూ, భర్తను సరిగ్గా చూడకుండా, పిల్లవాడిని పెంచటానికి సమయం లేక పతనం అయిపోతుంది. విమల ఆ అమ్మాయికి ప్రత్యర్థి. అప్పుడు చదివేవాడికి అర్థం కాక చస్తుందా? ధర్మారావు ముఖం మల్లెమొగ్గలా వికసించింది.
ఇంటి ముందు ఆటో ఆగటం చూసి అప్పుడే దాదాపు పన్నెండు గంటలవుతుందని గ్రహించాడు ధర్మారావు. భోజనానికి పిలిచిన స్నేహితుడు వీరేశం, భార్య లక్ష్మీ ఆటోలోంచి దిగారు. ఆటో వాడికి డబ్బులిచ్చి లోపలికి వస్తూనే, “ఏంటోయ్ ధర్మం, కాగితాలూ నువ్వూ, ఇంటి దగ్గరకూడా పనితప్పటంలేదా ఏంటీ?” అన్నాడు వీరేశం పక్కనే కుర్చీలో కూర్చుంటూ. లక్ష్మి నమస్కారం అన్నట్లు చూసి మందంగా నవ్వి లోపలికి వెళ్ళింది.
“లేదులే, పనా పాటా, ఏదో కథ రాద్దామని కూర్చున్నాను.”
“కథా! నువ్వు కథలు కూడా రాస్తావని తెలియదే నాకు?”
“ఇంతకు ముందెప్పుడూ రాయలేదు. ఇదే ప్రధమ ప్రయత్నం.”
“దేని గురించీ కథా?”
“నీకు నచ్చదులే.”
“అదేంటీ! దేన్ని గురించో చెప్పకుండానే నీకు నచ్చదులే అంటే!”
“ఈ మధ్య ఆడపిల్లలు ఉద్యోగాలు చెయ్యాలని ఎగబడుతున్నారు. అటు ఉద్యోగాల్లోనూ పెద్దగా పైకిరావటం లేదు, ఇటు కుటుంబాలూ పాడు చేసుకుంటున్నారు. మన సాంప్రదాయం ప్రకారం ఆడవాళ్ళు ఇల్లుచూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ ఉంటే చాలు, బయట పనిచెయ్యటం మంచిదికాదు, అని చెప్పాలని రాస్తున్నాను.”
“ఇందులో కొత్తేముందీ? ఇలాంటి సాంప్రదాయ వాదులు స్వతంత్రం రాక ముందునుంచే ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచం మారింది కదా? ఇంకా సాంప్రదాయాలు పట్టుకోని వేలాడతామంటే ఎట్లా! ఇప్పుడు ఆడ పిల్లలకు ముఖ్యంగా కావాల్సింది ఆర్థిక స్వాతంత్రం. ఉద్యోగాలు చెయ్యకపోతే స్వతంత్రం ఎక్కణ్ణుంచొస్తుందీ?”
“సాంప్రదాయాన్ని నాశనం చెయ్యాలని ఏవేవో కాకమ్మ కథలు చెప్పిన ఆ కమ్యూనిష్టులకు ఏగతి పట్టిందో నీకు తెలుసుగదా? ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం పేరుతో మన సాంప్రదాయం మీద మరొక దెబ్బ తియ్యాలని చూస్తున్నారు కొందరు. వాళ్ళకూ అదే గతి పడుతుంది. ఈ పదివేల సంవత్సరాల జీవనది అర్థాంతరంగా వచ్చే ఎండలకు ఎండిపోదు,” అన్నాడు ధర్మారావు ఆవేశంగా.
“ఓహో! బాగుంది నీ ఉపన్యాసం! ఏదో విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకాలు చదివినట్లున్నావు ఈ మధ్య. లేక ఘాటైన మందేదన్నా వేసుకున్నావా?” అన్నాడు వీరేశం నవ్వుతూ.
“అన్నయ్యా, రండి లోపలికి! అదేంటండీ, ఆయన్ని బైటనే కూర్చోబెట్టి కబుర్లు చెప్తున్నారు?” అంటూ చిన్నగా ధర్మారావుని మందలిస్తూ ప్రత్యక్షమయింది శాంత.
“మన వీరేశమేగా, ఏమన్నా కొత్తవాడా ఏంటీ?” అని, “సరే, లోపలికి పోదాం పద, భోజనం చేసే వేళ అవుతుంది,” అని వీరేశంతో లోపలికి నడిచాడు ధర్మారావు శాంత వెనకాలే.
హాల్లోకి వస్తూ, “అరే! కమల వచ్చినట్లుందే,” అన్నాడు వీరేశం కమల కనపడ్డంతోనే.
“అవునంకుల్, నాలుగు రోజులయింది.”
“అల్లుడు రమేష్ ఏదో పనిమీద ఢిల్లీ వెళ్ళాల్సొచ్చింది. ఎలాగూ ఇప్పుడు పిల్లవాడికి స్కూలులేదుగదా అని, హైదరాబాదులో ఒంటరిగా ఉండటం ఎందుకులే అని వాళ్ళని ఇక్కడ వదిలేసి పోయాడు ఢిల్లీ పోతూ,” అన్నాడు ధర్మారావు.
“అలాగా, బావుంది,” అన్నాడు వీరేశం. “మరి నీ మనుమడు ఏడీ?”
“పిల్లవాడు పక్కింటికెళ్ళాడట ఆడుకోవటానికి,” అని, “అమ్మాయ్, కిరణ్ ఇంకా రాలేదేమ్మా?”
“వస్తాళ్ళే, మీరు కూర్చోండి,” అని ఇద్దరినీ డైనింగ్ టెబుల్ దగ్గరకు పిల్చింది కమల.
ఇద్దరూ కూర్చున్నారు. అప్పటికే పదార్థాలన్నీ అమర్చిపెట్టి ఉన్నాయి టేబుల్ మీద.
“మీరూ రండి, అందరం కూర్చోని భోజనం చేద్దాం,” అన్నాడు వీరేశం, శాంత, లక్ష్మీ ల వంక చూస్తూ.
“ఫరవాలేదులెండి, మీరిద్దరూ అయింతర్వాత, మేం ముగ్గురం తింటాం లెండి,” అన్నది శాంత. లక్ష్మీ, కమల టేబుల్ దగ్గరే కుర్చీల్లో కూర్చున్నారు. శాంత మంచినీళ్ళు గ్లాసుల్లో పోసి, ఇద్దరికీ వడ్డించటం మొదలుపెట్టింది.
“ఏమ్మా, కమలా, హైదరాబాదులో జీవితం ఎలావుంది?” అడిగాడు, వీరేశం.
“బాగానే ఉంది, అంకుల్.”
“ఎన్నాళ్ళుంటావమ్మా? సెలవుపెట్టొచ్చావా?”
“సెలవూ లేదూ, ఏమీ లేదు, అంకుల్. నేనిప్పుడు ఉద్యోగం చెయ్యటం లేదు.”
“అలాగా. ఎందుకనీ?”
“అదే వీరేశం, నీకు ఇందాక చెప్పానుగదా. ఇద్దరూ రోజంతా పరుగెత్తుతుంటే ఇంట్లో శాంతి ఉండొద్దూ? ఉద్యోగంలో పడుంటే ఇప్పుడు ఇలాగా ఇంటికి రావటం వీలయ్యేదా?” అన్నాడు ధర్మారావు.
“మీరన్నా చెప్పండి అన్నయ్య గారూ, బలవంతాన ఆ స్కూల్లో ఉద్యోగం చేయిస్తున్నారు నాచేత. రోజంతా పని చెయ్యాలి. వాళ్ళు ఇచ్చే జీతం ఆటో ఖర్చులకుకూడా చాలదు. ఎందుకొచ్చిన ఉద్యోగాలో ఏమో. ఆడ వాళ్ళం ఇల్లుచూసుకుంటూ ఉంటే సరిపోదూ?” అని ఫిర్యాదు చేసింది లక్ష్మి.
“బాగుంది, ఆంటీ, మీ చేత బలవంతంగా ఉద్యోగం చేయిస్తున్నారు అంకుల్. మా వారేమో నన్ను బలవంతంగా ఉద్యోగం మాన్పించారు.” అని నిట్టూర్చింది కమల.
“అదేంటమ్మా! అబ్బాయి మాన్పించాడా? నువ్వే ..” అన్నాడు ధర్మారావు నమ్మలేనట్లు.
కమల ఏమీ సమాధానం చెప్పకుండా ముభావంగా ఉండిపోయింది. విషయం గమనించిన వీరేశం, “ధర్మం, నువ్వు చెప్పేది బాగానే ఉందిగాని, ప్రపంచం అంతా ముందుకు నడుస్తుంది. పూర్వకాలం లో ఆడవాళ్ళు ఉద్యోగాలు చెయ్యలేదుకదా అని అదే మంచిదంటే కుదరదు. నువ్వు ఇది చదివావో లేదో పేపర్లో ఈ మధ్య, స్వీడెన్ లో నూటికి తొంభై ఎనిమిది మంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారట. వాళ్ళు సుఖంగా ఉండటం లేదూ?”
“ఉన్నారో లేదో నాకేం తెలుసూ, అయినా ప్రతి దానికీ ఏ స్వీడెన్ లోనో, ఇంగ్లాండ్ లోనో, అమెరికాలోనో చేసినట్లే మనం కూడా చెయ్యాలని ఎక్కడుందీ?”
“ధర్మం. నువ్వు ఏ ప్రపంచం లో ఉంటున్నావోగాని, ఇప్పుడు ప్రతివాడు అమెరికాలో లాగా బ్రతకాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజుల్లో ఆడపిల్లల్ని చదివించటం ఇంట్లో కూర్చోబెట్టుకోవటానికి కాదు. అమెరికాలో ఉద్యోగం చేస్తుందనే కోరికతోనో, లేక అమెరికా అల్లుడు దొరుకుతాడనే ఆశతోనో!”
“అదేదో కొన్నాళ్ళు అలాగే జరిగిందిలే. ఇప్పుడు పరిస్థితులు మారాయని చెప్పుకుంటున్నారుగా. అక్కడా ఉద్యోగాలు దొరకటం లేదట.”
“అందుకని చదవటం, ఉద్యోగాలు చెయ్యటం మానుకుంటున్నారా? లేదు. ముందు ముందు ఇక్కడ కూడా ఆడవాళ్ళు ఉద్యోగాలు చెయ్యటం ఇంకా ఎక్కువ అవుతుంది. యూరప్ లో అసలు ప్రతి ఆడ మనిషీ ఉద్యోగం చేస్తుంది. ఆందువల్ల …….”
“అందువల్ల ఆఫీసు లవ్వులెక్కువవుతున్నాయి. డైవర్సులెక్కువవుతున్నాయి. ఓక్కొకామె జీవితకాలంలో ముగ్గుర్ని చేసుకుంటుందట. ఇదేగా యూరప్ లో జరుగుతుంది?”
“ఎంతమందిని చేసుకుంటున్నారో నాకు తెలియదనుకో. ఆయినా ఇష్టం లేనివాణ్ణి వదిలేసి ఇష్టంఉన్నవాణ్ణి చేసుకుంటే తప్పేముందీ?”
” చేసుకున్నాక ఇష్టం లేకపోవటం అంటే ఏమిటీ? కాపురం చేస్తున్న వాళ్ళ మధ్య ఏదో ఒక విషయంలో తేడాలు రాకుండా ఉంటాయా? ఫ్రతి చిన్న విషయానికి మొగుణ్ణి వదిలెయ్యటమేనా?”
“చిన్న విషయాలకే డైవర్సులు ఇస్తున్నారని ప్రచారం చేసేది నీలాంటి సాంప్రదాయ వాదులు. ఆసలు డైవర్సులు లేకుండా పోవాలని నీలాంటి వాళ్ళ కోరిక. ఆది జరిగేది కాదు. ఫ్రపంచం ముందుకు నడుస్తుంది, ధర్మం. ఇష్టం లేని వాడిని వదిలేసి ఇష్టం వచ్చిన వాడిని చేసుకోవటం ఈనాటి ధర్మం.”
“నే పోతన్నా అమ్మగోరూ,” అన్నది తలుపు దగ్గర నిలబడి ఉన్న పనిపిల్ల, సంభాషణకు అంతరాయం కలిగిస్తూ.
“అప్పుడేనా? కొంచెం ఉండు,” అంది శాంత.
“ఈ పిల్లనెప్పుడూ చూడలేదే, మీ పనిమనిషేమయిందీ?” అడిగింది లక్ష్మి.
“ఈ పిల్ల ఆ ఎంకమ్మ కూతురే. దాని పెద్దకూతురుకి పెళ్ళి. రేపే. రెండు మూడు రోజుల్నించీ రావటం లేదు. ఇదుగో ఈ పిల్లని పంపిస్తుంది. దీనికేమో ఏదీ చేతకాదు,” అంది శాంత విసుగ్గా.
“ఆ పెద్ద కూతురికి ఒకసారి పెళ్ళయింది. డాని మొగుడు ఇంకొకదానితో లేచిపోయాడు. మొన్నీమధ్యనే. అదేమో ఇప్పుడు ఇంకొకడిని చేసుకుంటుంది. మీ యూరప్ కంటే ముందుకు పోతున్నారు వీళ్ళు,” అన్నాడు ధర్మారావు వీరేశం వైపు చూస్తూ చమత్కారంగా.
“పోతారు. వాళ్ళకేమన్నా అడ్డూ ఆపూ, మంచీ మర్యాదలూ ఉంటేగా. మీకు గుర్తుందో లేదో, మూడు నాలుగేళ్ళ క్రితం వాళ్ళ ఊరి నుంచి ఒకమ్మాయిని తీసుకొచ్చింది లక్ష్మి. ఆ అమ్మాయి మా యింట్లో నాలుగైదు నెలలు కూడా పనిచెయ్యలేదు. రోడ్ల పని చేసే వాడినెవడినో చూసుకొని వాడితో వెళ్ళిపోయింది. ఆమ్తే, మళ్ళా కనపళ్ళా. మీ పనిమనిషి కూతురుగ్గూడా అలాంటివాడెవడో దొరికుంటాడు,” అన్నాడు వీరేశం, కనుబొమ్మలు ఎగరేస్తూ.
“సరేలే ఊరుకోండి,” అని మందలించింది లక్ష్మి, కళ్ళు తలుపు దగ్గిర కూర్చున్న అమ్మాయివైపు తిప్పుతూ.
భోజనాలు అయింతర్వాత పాత్రలన్నీ వంటగదిలో సింక్‌లో పడేసింది శాంత. వాటిని కడిగేసి అమ్మగారి దగ్గర సెలవు తీసుకోని ఇంటికి చేరింది చిన్నక్క. గుడిసెముందు కొత్తగా వేసిన తాటాకు పందిరికి రంగు కాగితాలు అంటిసున్నాడు పిన్నమ్మ కొడుకు. కొంచెంసేపు చూస్తూ నిలబడి గుడిసెలోకొచ్చింది చిన్నక్క.
లోపలికొస్తుండగానే, “ఇంతసేపేంజేత్తన్నవే? ఇంటికాడ ఇంతపనిబెట్టుకొని? ” నిల దీసింది ఎంకమ్మ.
“పోనిత్తె గదా, వోరు తిన్నాక గిన్నెలు కడిగి వత్తన్న.”
“సరే, పెద్దక్క నీకోసం జూత్తావుండింది. ఇప్పుడే పిన్నమ్మకాడికి బోయింది. కొట్లో ఎందో గావాలంట. పోయిరా,” అని పురమాయించింది ఎంకమ్మ.
“అమ్మా, పెద్దక్క తప్పుజేత్తందే?”
“ఏంతప్పూ?”
“ఏమో, శాంతమ్మగోరింట్లో అయ్యలు సెప్పుకుంటుండరు.”
“ఏంజెప్పుకుంటుండరూ?”
“మొగుడు బోతే మల్ల జేసుకుంట మరేద గాదంట.”
“అట్టనా! నీముందే అన్నరా?”
“నేనక్కడే కూసునుంటి.”
“ఆ నా బట్టలకి మనబోటిగాళ్ళు గనబడతరా.”
“మరి పెద్దక్క తప్పుజేత్తందా?”
“తప్పులేదు గిప్పులేదు. దానిష్టం. యిష్టముంటే చేసుకుంటతి, లేకపోతే ఊరుకుంటతి. యీళ్ళెవురూ సెప్పటానికి? సడేలే, పెద్దక్కనడుకు కొట్లో ఏంగావల్నో,” అంది ఎంకమ్మ మళ్ళా పన్లోబడుతూ.