సర్వం స్వార్ధమయం !

బంగారు బొమ్మ రావేమే … పందిట్లొ పెళ్ళి జరిగేనే  …సన్నాయి మేళగాళ్ళు అద్బుతంగా వాయిస్తున్నారు  అమ్మాయి దోసిట్లో కొబ్బరి బోండాం తో తలవొంచుకుని మెల్లగా అడుగులో అడుగువేసుకుంటూ నడుస్తుంటే అమ్మాయికిరువైపులా ఇద్దరు మ్తుౖతెదువులు నడుస్తున్నారు.
“అమ్మాయిని కొంచం తల ఎత్తమనండమ్మా ” కెమారా లెన్సు అడ్జస్ట్‌చేసుకుంటూ అడిగాడో ఫోటోగ్రాఫర్‌పక్కన నడుస్తున్నావిడతో.
ఈ మాటకోసమే ఎదురుచూస్తున్నట్లు వెంటనే అమ్మాయి తల కాస్త పైకెత్తి నడక వేగం తగ్గించింది. దగ్గరగా ఉన్న టీవీలో రాకుమారిలా నడుస్తున్న పెళ్ళి కూతురు వందనను, ఆమె మొహంలో ఆనందాన్ని రెప్పవేయకుండా చూస్తూవున్నాడు వర్మ
*********************************
“ఇలా ఎంతసేపని నాకళ్ళల్లోకి చూస్తూ ఉంటావ్‌”
“తెలియదు ” చూపు మరల్చకుండా సమాధానమిచ్చాడు వర్మ.
“అబ్బ ఈ టైపు డైలాగులు సినిమాల్లో చూసీ చూసీ బోరుకొట్టిందిగాని వేరె ఏదైనా చెప్పు ” నవ్వుతూ అంది వందన.
“నిజమే సినిమాల్లో అలా చెపుతుంటే వీడెవడురా బాబు పిచ్చోడిలా ఉన్నాడు అనుకునేవాడిని నేనుకూడా కానీ సినిమాల్లో చెప్పేది నిజమేనని ఇప్పుడు తెలుస్తుంది ”
“ఇక చాలుగానీ టాపిక్‌ మార్చు …” అని, ఒక్క క్షణమాగి,”ఇంతకీ ఎంతవరకొచ్చింది నీ అమెరికా ప్రయాణం ” అడిగింది వందన.
“అమెరికా ప్రయాణమా?!”
“అవును, అక్కడ మీ అన్నయ్య ఉన్నాడు కదా ”
“ఉంటే ?!”
” నువ్వు మీ అన్నయ్య ద్వారా ట్రై చేస్తున్నావని తెలిసి ”
” అబ్బే అదేం లేదే ? ”
” ట్రై చేయడం లేదా లేక నీకు వెళ్ళాలని లేదా ? ”
” వెళ్ళాలను కుంటే సరిపోతుందా, అవకాశం రావాలికదా ? ”
” అవకాశం దానంతటదిరాదుకదా ” అంది వందన కాస్త దీర్ఘం తీస్తూ.
” ఆవిషయం నాకూ తెలుసు ”
” మరి మీ అన్నయ్యనడగొచ్చుకదా ?”
” నీకింతకుముందే ఒకసారి చెప్పినట్లు గుర్తు , టాలెంటు లక్కూ ఉండి ఈరెంటికీ పరిస్థితులు కలిసొస్తే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళగలరు. అంతేగానీ మా అన్నయ్య ఉన్నాడు మీ అక్కయ్య ఉంది వాళ్ళే ఏదో చేసి తీసుకెళ్త్తారులే అనుకుంటే పప్పులో కాలేసినట్లే” అంటూ వందన వైపు చూశాడు.
ఆమె వర్మ చెప్పేది వినిపించుకోకుండా, ప్రక్కకు చూస్తోంది.
” ఏంటి నా పాటికి నేనేదో చెప్పుకుంటూ పోతుంటే నువ్వెక్కడో ఆలోచిస్తున్నావ్‌ ?”
” ఏమీ లేదు , నా క్లాస్‌ మేట్స్‌ , ఫ్రెండ్సూ అందరూ అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళు నేనుకూడా అక్కడికెళ్తే  బాగుంటుందంటున్నారు ”
” నిజమే ఫ్రెండ్స్‌ అందరూ ఒక చోట ఉండాలనుకోవడం సహజం. పోనీ నువ్వు వాళ్ళనే అడగ కూడదూ నీకో నాకో వీసా ఇప్పిస్తారేమో” నవ్వుతూ అన్నాడు వర్మ.
“అంతేకానీ నువ్వే మాత్రం ట్రయ్‌చేయవన్నమాట ” సీరియస్‌ గానే అంది వందన.
” అలా అని నేననలేదుకదా అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అంతే ”
“కన్సల్టెంట్ల ద్వారా ఎంతమంది వెళ్ళడంలేదు , నువ్వూ అలా ఎందుకెెళ్ళకూడదు”
“వెళ్ళొచ్చు , కానీ అలా ఇప్పుడువెళుతున్నవాళ్ళలో చాలామంది ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతూ… పెట్రోలు బంకుల్లో, సూపర్‌ మార్కెట్టులో పన్చేస్తున్నారని వింటున్నాం కదా”
“ఎక్కడ పనిచేస్తే ఏమి? వాళ్ళు అమెరికాలో ఉన్నారు ”
“సరే నీతో వాదించడం నాకిష్టంలేదు ఉన్నదాన్నొదులుకుని ఎక్కడికో వెళ్ళి ఏ పనిబడితే అదిచేయడం నాకు చేతకానిపని ” చెపుతున్న వర్మ మాటలకడ్డుతగులుతూ
“నీ ధ్యాస నీదేకానీ ఇవతల వాళ్ళు ఎందుకు చెపుతున్నారో ఆలోచించవా ?”
“ఏమాలోచించాలి నీ ఫ్రెండ్స్‌ అమెరికాలో ఉన్నారు నువ్వు కావాలనుకుంటే, మీనాన్న నీకు అమెరికా మొగుడ్ని తేగలడు ” కొంచెం చిరాగ్గా అన్నాడు వర్మ
“అంత కోపం తెచ్చుకోకు వరూ…సరే ఆ టాపిక్‌ వదిలేసి ఇక బయల్దేరదామా?”అంది వందన, కూర్చున్న చోటు లోంచి లేస్తూ.

*********************************

కన్యాదాన కార్యక్రమం మొదలయింది వర్మ ముఖం కళావిహీనంగా ఉంది
ప్రక్కనున్న మిత్రులు జోకులు పేలుస్తున్నారు అవన్నీ తనగురించే అని తెలిసీ ఏమీ చేయలేక మాట్లాడకుండా కూర్చున్నాడు ,
‘ రానంటున్నా బలవంతంగా పెళ్ళికి లాక్కొచ్చి నన్నో అయిటం గాడిని చేసి ఎంజాయ్‌చేస్తున్నారు ‘ మనసులో పెళ్ళికొచ్చినందుకు తిట్టుకుంటూ జరిగే తతంగాన్ని చూస్తూ ఫ్రెండ్స్‌తనపై పేల్చుతున్న జోకులువింటూ కూర్చున్నాడు

ఆలోచిస్తుంటే ఒకరకంగా ఈ అవకాశం తనే వాళ్ళకిచ్చాడేమో అనిపిస్తుంది ఆఫీసులో పనిచేసే కొలీగ్ని ప్రేమించడమే తాను చేసిన మొదటి తప్పు కాక మరేంటి సిటీలో ఏ బస్‌స్టాపు దగ్గరనిలుచున్నా గంటకు వందమందికి పైగా కనిపిస్తారు వాళ్ళల్లో ఒకరిని సెలక్ట్‌చేసుకోక ఆఫీసులో ఉన్న పదిమందిలో ఒకరిని ఎంచుకుంటే ఇలానే ఉంటుంది కాకమరేంటి ఉదయంనుండి సాయంత్రంవరకు మనకళ్ళముందే ఉంటుంది , మంచిగా మాట్లాడుతుంది ఆదర్శాలు వల్లిస్తుంది కదాని, మంచమ్మాయే అనుకుని ఎంత పొరపాటు చేశాడో నిదానంగా తెలుసుకున్నాడు. విషయం తెలుసుకునేటప్పటికి మనసు కంట్రోలు తప్పింది. వొద్దనుకున్నా ఆమె గురించే ఆలోచిస్తుంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా మరిచిపోలేకపోతున్నాడు, పెళ్ళికి రాకూడదని బలంగా నిర్ణయించుకుని కూడా పెళ్ళయితే వెంటనే అమెరికా వెళ్ళిపోతుంది ఇకపై కనిపిస్తుందో లేదో అని ముందు రానని బెట్టుచేసినా చివరకు మెల్లగా సర్దుకుని బయలుదేరాడు .వర్మ రూం మేట్‌ కం కొలీగ్‌ కిరణ్‌ “అవున్రా రోజూ ఆఫీసులో పనెగ్గొట్టిమరీ గంటలకొద్దీ మాట్లాడుతూనే వుంటావ్‌. మరలా సాయంత్రం పార్కుకెళ్ళి మాట్లాడుకునేంత ఏముంటుందిరా ?” వ్యంగ్యంగా అడిగితే “అదిప్రేమలో పడ్డోడికి తెలుస్తుందమ్మా ” అని ఆకాశంలోకి చూస్తూ సమాధానంచెప్పాడొకప్పుడు , మరిప్పుడు అతనూరుకుంటాడా ! టైం దొరికింది తనదైన స్టయిల్‌లో ఆడుకుంటున్నాడు
*********************************
ఇంతలో ఓ పురోహితుడు మంటపం పైనుంచి దిగి ఆడిటోరియంలో అక్షింతలు పంచుతున్నాడు , అనుకోకుండా చేయి చాచాడు వర్మ
వెంటనే అందుకున్నాడు కిరణ్‌ ” వహ్‌వా …క్యా సీన్‌హై …నువ్వురా నిజమైన ప్రేమికుడివంటే , నిజంగా ఏప్రేమికుడికీ రాని అమోఘమైన అవకాశం నీకొచ్చింది ,వెళ్ళు వెళ్ళి ఆశీర్వదించు ” ఎగతాళిగా అన్నాడు , పక్కనున్న మిత్రులు కిరణ్‌కు వంతపలికారు
” రేయ్‌వచ్చినప్పటినుండి చూస్తున్నా నువ్వు కొంచం ఎక్కువ మాట్లాడుతున్నావ్‌ ఎవరైనా వింటే ఏమవుతుందో ఒక్కసారాలోచించు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ” నెమ్మదిగా కోపంతో కూడిన స్వరంతో చెప్పాడు వర్మ .
” అంతేరా నిజమంటే ఎవరికైనా నిష్టూరమే! నిన్ను ప్రేమించానని నీతో హాయిగా తిరిగి ఇప్పుడెవరో అమెరికాలో ఉంటున్న వాడు దొరికాడని చేతులో శుభలేఖ పెడితే , తగుదునమ్మా అంటూ పెళ్ళికొచ్చింది చాలక మళ్ళీ ఆశీర్వదించడానికి అక్షింతలు తీసుకోవడం కూడా…” కిరణ్‌ అన్న మాటతో కోపం ముంచుకొచ్చింది.
” మీరేకదరా రానంటున్నా వినకుండా వచ్చేదాకా ప్రాణం తీసి ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అది నోరా ఇంకేమన్నానా ? ”
“మేము రమ్మనగానే వచ్చావుగా… మరప్పుడు మేమేమన్నా ఫీలవకూడదమ్మా!” వెటకారంగా అన్నాడు బృందంలోని మరో మిత్రుడు.
“చూడరా ” టీవీ లో కనిపిస్తున్న పెళ్ళికూతురుని చూస్తూ “ఆ అమ్మాయెంత సంతోషంగా పెళ్ళిచేసుకుంటోందో! నువ్వూ ఉన్నావ్‌ దేనికి దేబ్రెపు ముఖం పెట్టి నీ ఆస్తులన్నీ హరించుకుపోయినట్లు అలాకూర్చోకపోతే మాతోకలసి ఎప్పటిలానే హాయిగా ఉండొచ్చుకదా! అప్పుడు నీకీ బాధలుండవు , మాకీ కంటశోషా ఉండదు ” అన్నాడు మరో మిత్రుడు తమ మనసులో ఏముందో చెప్పడానికన్నట్లు.
” మీకేమిరా మీరెన్నయినా చెపుతారు ఆ బాధేంటో నాకుతెలుసు ” ఇంకా ఏదో చెప్పబోతున్న వర్మ మాటలకడ్డుతగిలాడు కిరణ్‌
” కదా మరి ఈ ప్రపంచంలో నువ్వొక్కడివేరా భగ్నప్రేమికుడివి ” పక్కనే ఉన్న వినయ్‌వైపు చూపుతూ “వాడిని చూడు అంతా చేతికొచ్చినవనుకున్న నలభై లక్షలు వాడికి అమెరికాలో ఉద్యోగం పోయిందనగానే చేయి జారిపోయాయే , సొంత మామే తనకూతురినివ్వడానికి ఒప్పుకోకపోతే హాయిగా వొచ్చి ఇక్కడ జాబ్‌వేటలో ఉండి ఎంత ఎంజాయ్‌చేస్తున్నాడో చూడు ” ఒక్కసారి తనగురించి మాట్లాడుకోవడం విని ఈ లోకంలోకొచ్చాడు వినయ్‌
” అంతేరా పిలవని పేరంటానికొస్తే ఎవరికైనా అలుసే , ఏదో మీతో పెళ్ళికొస్తే రెండ్రోజులు ఫ్రీ ఫుడ్డు ఫ్రీ మందు దొరికిద్దికదా హాయిగా ఎంజాయ్‌ చెయ్యొచ్చనుకుని నాఖర్చులతో మీ ఫ్రెండ్‌ పెళ్ళికొస్తే నిజంగా చులకనగానే ఉంటుందిరా ” కొంచెం బాధపడుతున్నట్లు ముఖంపెట్టి చెప్పాడు వినయ్‌
” నీ యాక్టింగు చూసి ఫీలయిపోయి నీ రిటర్న్‌టికెట్‌ పెట్టుకుంటారనుకుంటున్నావేమో అంతలేదు కొంచెం తగ్గు ” మరో మిత్రుడు చురక వేశాడు.
“అవునురా ఈ మధ్య ఎక్కడ పెళ్ళి జరిగినా పెళ్ళికొడుకు అమెరికాలో ఉన్నోడే అయి ఉంటున్నాడు , ఆంధ్రా లో ఉండే వాళ్ళసలు పెళ్ళి చేసుకోవడంలేదా ?” మరో మిత్రుడు తనకొచ్చిన సందేహాన్ని బయటపెట్టాడు
“అదీ నిజమేరా ఇండియాలో అదీ ఆంధ్రాలో ఉండే అబ్బాయిలు అమ్మాయిల తల్లి దండ్రులకు కనిపించడంలేదు అమ్మాయిలకేమో టైం పాస్‌కావడానికొక బకరా కావాలికదా అని ఇదిగో ఇలాంటోడినొకడ్ని చూసుకుని తీరా అమెరికా సంబంధం కుదరగానే ఓ శుభలేఖ చేతులోపెట్టి, అదిగో అలా పెళ్ళి పీటల మీద కూర్చుంటున్నారు” అని వర్మ వైపు వందన వైపు చూసి తనకు జరిగిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ చెప్పాడు వినయ్‌

ఇంతలో ఆడిటోరియంలో హడావుడి మొదలయింది

*********************************

భజంత్రీలు చాలా వుత్సాహంగా వాయిస్తున్నారు. పెళ్ళికూతురు , పెళ్ళికొడుక్కి మధ్యన అడ్డుగా ఉంచిన తెర తొలగిపోయింది , అప్పటివరకూ అలా పట్టుకు నిలుచున్న పిల్లలు, చేతులు విదిలించుకుంటూ అక్కడ నిలుచుంటే , అప్పటిదాకా లేనిది ఓ వీడియో గ్రాఫర్‌ కు అడ్డొచ్చారా పిల్లలు మీ పనయిపోయింది ఇక దిగిపోండని కసురుకున్నాడు
“అవసరం తీరిపోయాక ఎవరిసంగతైనా యింతే ” కొంచం పైకే అంటూ మంటపం పైనుండి కిందికి దిగారు .
ముందుకు వొంగి ఒకరి నెత్తిన ఒకరు జీలకర్రా బెల్లం పెట్టుకుని ఉండిపోయారు పెళ్ళికుమార్తె , పెళ్ళి కుమారుడు ఇదివరకయితే ఎక్కడకూర్చున్న వాళ్ళక్కడినుండి చేతిలోని అక్షింతలు జల్లేవాళ్ళూ అవి వాళ్ళ ముందున్నవరుసలోనో లేక ఆముందున్న వరుసలోనో పడేవి కానీ ఇప్పుడలాకాదు ఒక్కొక్కరు లేచి వెళ్ళి మంటపం ఎక్కి ఇద్దరిపైనా అక్షింతలు వేసి ఫోటోకి, వీడియోకీ ఓ ఫోజిచ్చి రావాలి , నెత్తిన పెట్టిన బెల్లం వీడియో లైట్ల వేడికి కరిగి ఇద్దరి ముక్కుమీదగా జారుతూ నోటిదగ్గర ఆగిపోతుంది వచ్చిన ఆహ్వానితులందరూ అలా అక్షింతలు వేయడానికి ఓ గంటపైనే పట్టింది పీటలపైకూర్చున్న ఇద్దరికీ నీరసమొచ్చినంత పనైంది. అక్షింతలు వేసినవాళ్ళు వేసినట్లు ఇక మనమొచ్చినపనైపోయిందని భోజనాలకు బయలుదేరారు . తీరా చూస్తే ఆడిటోరియం మొత్తం మీద ఓ ఇరవై ముప్పై మంది ఉంటారేమో. ఇప్పుడు వాళ్ళలో వర్మ బృందం కూడ ఉంది.
*********************************
” మీరు వెళ్ళి ఆ గిఫ్ట్‌ ఏదో ఇచ్చి రండి నేనిక్కడే ఉంటా ” చెప్పాడు వర్మ.
మిగిలిన నలుగురూ గిఫ్ట్‌ ఇవ్వడానికి బయలుదేరారు.
ఫ్రెండ్స్‌ గిఫ్ట్‌ ఇచ్చి విషెస్‌ చెపుతుంటే, వందనకు వర్మ గుర్తొచ్చాడు
ఆమె కళ్ళు అతని కోసం వెతుకుతూ వర్మ ఉన్నచోట ఆగిపోయాయి అతన్నలా చూడగానే ఆమె తడబడింది ఆత్మ విమర్శ చేసుకుంది , “చేసింది తప్పే కానీ దానివల్ల నేను కోరుకున్న సుఖాలు… భోగభాగ్యాలు అనుభవించబోతున్నప్పుడు ఆ తప్పుగురించి ఆలోచించాల్సిన అవసరంలేదు” తనను తాను సమాధానపరచుకుంది
*********************************
నూతన దంపతులకు అరుంధతిని చూపిస్తూ ఏవో మంత్రాలు చదువుతున్నాడు పురోహితుడు వర్మ దృష్టి అటుపడింది.
“ఒరే నువ్వు తప్పుమాట్లాడుతున్నావ్‌. నువ్వు, వినయ్‌, నేమైనా అంటే వీడు ఫీలవుతాడు ” అంటూ వర్మ నుద్దేశించి చెప్పాడు కిరణ్‌
చటుక్కున చూశాడు వర్మ.
“అరే ఆ అమ్మాయికి పెళ్ళికూడా అయిపోయింద.ి ఇక నన్నేమనీ లాభంలేదు. మీ కంఠ శోష తప్పితే ఒరిగేదేమీలేదు అనవసరంగా నాగురించి ఆలోచించి మీటైం వేస్ట్‌చేసుకోకుండా పదండి తిని బయలుదేరదాం ”
భోజనాలు చేసి లాడ్జికి బయలుదేరారు
అమ్మాయిల మనసు చాలా సున్నితమైందని పత్రికల్లోనూ సినిమాల్లోనూ చూసినప్పుడు నిజమే అనుకునేవాడు కానీ అదంతా పచ్చి అబద్ధమని యిప్పుడు తెలుసుకున్నాడు ఆమె హాయిగా పెళ్ళిచేసుకుంటే నేనెందుకు బాధ పడాలి ? తనను తాను ప్రశ్నించుకున్నాడు వర్మ. నిజమే అవసరం లేదనిపించింది జ్ఞానోదయమయింది వర్మకు
ఏదో కామెంట్‌ చేద్దామన్నట్లు వర్మవైపు తిరిగాడు కిరణ్‌ . వర్మ ముఖంలో ఏమాత్రం బాధ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయి “ఏందిరా నీలో ఇంతమార్పు , ఇప్పటిదాకా వెధవ ముఖమేసుకుని కూర్చుని ఇంతలోనే మామూలుగా అయిపోయావు?” ప్రశ్నించాడు.
” అంటే మీ ఉద్దేశం ఏందిరా , ఆమెకు వేరెవరితోనో పెళ్ళయిందని నేను దేవదాసులా తయారవ్వాలనా … అంతవసరం నాకులేదు నేనేమీ పిచ్చోడినికాదు, ఈ కాలం అమ్మాయిని మరీ అంత గాఢంగా ప్రేమించడానికి , ఆమెలేనిదే నేనూ లేనని పిచ్చోడిలా తయారవడానికి!  జస్ట్‌ ప్రేమించా అంతే ! చివరి క్షణం వరకూ ఎదురుచూశా సినిమాల్లో లాగా ఎవరో ఒకరొచ్చి ‘ఆపండి పెళ్ళి’ అంటారేమో అని. కానీ అలా సినిమాల్లో మాత్రమే జరుగుతుందని ఇప్పుడే గుర్తొచ్చింది జరిగినదానిలో నాకొచ్చిన నష్టం ఏమీలేదు. ఆమెతో తిరిగినప్పుడు వేష్టయిన పెట్రోలు తప్ప . అయినా అన్నీ మనచేతుల్లో ఉంటే మనమీ భూమ్మీద నిలుస్తామా చెప్పు ప్రేమించిన ప్రతి ఒక్కరూ పెళ్ళిచేసుకోవాలనిలేదు. అలా అని పెళ్ళిచేసుకున్న వ్యక్తితోనే కలసుండాలనీలేదు ఏది జరిగినా మనమంచికోసమే అనుకుని లయిట్‌గా తీసుకోవాలమ్మా” అంటూ ‘మళ్ళీ ఈ టైపు డబ్బున్న అమ్మాయి ఎక్కడదొరుకుతుందో ‘ మనసులో ఆలోచిస్తూ ముందుకు కదిలాడు.