ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ఈమాట ఒక కొత్తరూపు దిద్దుకుని మాసపత్రికగా మారి, కొత్తగా మరికొన్ని కొత్త పుంతలు తొక్కి ఈ సంచికతో ఏడాది. రచయితల సహకారం, పాఠకుల ప్రోత్సాహం– నాణ్యతతో ఏమాత్రమూ రాజీ పడకుండా ఈమాటను మాసపత్రికగా ఇక నడపగలమనే నమ్మకాన్ని మాకు ఇచ్చాయి. అందువల్ల ఇకనుంచీ కూడా ఈమాట మాసపత్రికగానే రాబోతున్నది. ఈ సాహితీప్రయాణంలో మాకు తోడుగా నిలిచిన రచయితలకు, పాఠకులకు, ఎన్నిసార్లు చెప్పినా ఎక్కువకాని కృతజ్ఞతలు మరొక్కసారి.
డిటిఎల్‌సి వారి సాహిత్య విమర్శ వ్యాసపోటీలలో ప్రథమ బహుమతి గెలుచుకున్న మానస, జిజ్ఞాసల వ్యాసాలు– ఆ వ్యాస సంకలనం విడుదలయిన సందర్భంగా–ఈ సంచికలో ప్రచురిస్తున్నాం; గత ఏడాదిగా తెరచాటు-వులు వినిపించిన శ్రీనివాస్ కంచిభొట్లకు మా కృతజ్ఞతలు. ఈ సంచికతో ఆ ధారావాహిక ముగుస్తున్నది. ముందుముందు వారినుంచి మరిన్ని చలనచిత్రకథనాలను ఆశిద్దాం; ఈమాటలో గత ఆరునెలలుగా వచ్చిన పాఠకుల వ్యాఖ్యలపై టి. చంద్రశేఖర రెడ్డి ఆసక్తికరమైన విశ్లేషణ; కొత్త సంవత్సరం సందర్భంగా ఈమాట పాఠకులకోసం భైరవభట్ల కామేశ్వరరావు కూర్చిన ఒక స్పెషల్ గడి; కథలూ, కవితలూ, శీర్షికలూ…