పెళ్ళాడటానికి ప్రేమ ఒక్కటే అర్హతగా నిలిస్తే బాగుంటుంది కాని, మానవ సహజమైన కుతూహలం అవతలి వ్యక్తిలోని ప్రత్యేకతలు తెలుసుకోనిదే, ఎందెందులో అతడు/ఆమె తనకు సరిజోడో తెలుసుకోనిదే అంత త్వరగా శాంతించదు. తృప్తి చెందదు. ఈ కథానాయకుడు అలాంటి కుతూహలపరుడు.

మనం చదివిన చరిత్ర పుస్తకాలు, పరిశోధక పత్రాలు, ప్రసంగ పాఠాలూ దురదృష్టవశాత్తూ మంచి నవల రూపంలోకి మారలేదు. ఒకటీ అరా తప్ప ఇలాటి కథావస్తువు గల నవలలు ‘కాల్పనిక’ సాహిత్యమార్గం పట్టినవే. కల్పన ముఖ్యమై, చరిత్ర వాస్తవాలను తెరవెనక పారేసినట్టు వుంటాయవి. కొన్ని చారిత్రక వివరాలు మినహా వాస్తవ చిత్రణ జోలికి పోనివే అవి!

ఈ కథల్లో మనిషి, అతని జీవనపోరాటం, విధ్వంసాల మధ్యనయినా బతకాలన్న ఆరాటం, ఆ ఆరాటపోరాటాల మధ్యనే స్నేహాలు, ఆత్మీయతలు, ఎల్లలు ఎరుగని ప్రేమలు, మానవీయ స్పందనలు – అవును ఎల్లలు ఎరగని కథలు ఇవి. శ్రీలంక నుంచి కెనడా దాకా, ఆఫ్రికా నుంచి అమెరికా దాకా, గ్రీస్ నుంచి భారతదేశం దాకా – ఈ కథల రంగస్థలాల్లో ప్రపంచమంత వైవిధ్యం.

ప్రవాస జీవితపు వివిధ పార్శ్వాలు, కోణాలు, మహిళలపట్ల వివక్ష వీటిని గురించి ఒక మహిళా రచయిత రాసిన తీరు, స్పందించిన విధానం ఈ కథల ప్రత్యేకత! రాయడానికి సంకోచపడే విషయాలతో, సెన్సార్‌షిప్ ఉన్న అనేక అంశాలతో వినూత్నంగా రాసిన కల్పన కథలు తెలుగు కథను కొత్త కోణంలో చూపించాయని చెప్పవచ్చు.

ఈ నవలలో అతను తీసుకున్న జీవితం వాస్తవం, గతానికి చెందిన వాస్తవం. దీన్ని చిత్రించటానికి రచయిత చరిత్రతో దిగిన సంభాషణలో రచయితకు అనేక పాత్రలు తారసపడ్డాయి. అతనితో ఘర్షణపడ్డాయి. ఆ తరువాత అతని నుంచి స్వయం ప్రతిపత్తి కల్పించుకుని తమని గురించి తామే యదార్థంగా పరిచయం చేసుకుంటామని కథకుడితో తెగేసి చెప్పాయి.

రెండు దారులుంటాయి. ఒకటి నలిగిన, ఎవరినీ ఇబ్బంది పెట్టని, దేనితోనూ పేచీ లేని, అందరికీ ఆమోదయోగ్యమైన దారి. మరొకటి దాన్ని ఒప్పుకోలేని, రాజీ పడలేని, తోడు దొరకని, తనకు నచ్చిన సూటి బాట. ఏదీ తేలిక కాదు. ఏ బాట పట్టినా యుద్ధం లోపలి మనిషితోనో, బయటి సమాజంతోనో తప్పనిసరి అవుతుంది కొందరికి ఈ కథల్లోని పాత్రలకు లాగే.

నలుగురు యాత్రికులు – నలుగురిదీ ఒకటే బాణీ. జీవితానికీ ప్రయాణానికీ అంతరం లేదని భావించినవారు. జడజీవితం మీద తిరుగుబాటు జెండా ఎగరేసినవారు. ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త జీవితాన్ని, ఆ ప్రక్రియలో తమను తాము అన్వేషించుకుంటూ సాగినవారు.

మనకు వాస్తవంలో వీలుకాని విషయాలు కాల్పనిక జగత్తులో సాధ్యపడతాయి. సత్యానికీ, సౌందర్యానికీ మధ్య ఎంపిక తలెత్తినప్పుడు కవి మరో ఆలోచన లేకుండా సత్యాన్ని త్యజించి సౌందర్యం వైపు మొగ్గు చూపుతాడు. విషాదాన్నీ గతపు చేదునీ మనిషి తన జ్ఞాపకాల్లోంచి చెరిపెయ్యడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు.

విప్పారిన కళ్ళతో, వికసించిన మనసుతో, శ్రుతి అయిన సర్వాంగాలతో అడవిని తమలోకి ఆవాహన చేసుకొని కాలపు ప్రమేయమూ స్పృహా లేకుండా ఏనాడో వదిలివచ్చిన మనల్ని మనం వెదుక్కుంటూ, తిరిగి ఆవిష్కరించుకొంటూ తిరుగాడే వ్యక్తులు అత్యంత అరుదు.

రాజిరెడ్డి చెప్పేవాటిలో చాలా మటుకు సబ్బునురగలాంటి తేలికపాటి సంగతులే. గాలిబుడగలను చిట్లించినంత సరదాగా రాసుకొస్తాడు వాటి గురించి. ఆ సంఘటనలు అతి సామ్యానమైనవి, ఏ ప్రత్యేకతా లేనివి, అసలు చెప్పేందుకేమీ లేనివే కూడా కావచ్చు కాక. అతని మాటలనే అరువు తెచ్చుకుంటే ‘ఉత్తి శూన్యమే’. కానీ, శూన్యంలో ఏదీ లేదని ఎలా అనగలం?!

ఉపకారాలని అపకారాలని చేసే మహాసముద్రం నా స్నేహితుడు అనుకుంటాడా ముసలివాడు. జీవితం ఆ మహాసముద్రం లాంటిదేనని చెప్పకనే చెప్పే చిట్టిముత్యం లాంటి నవల ఇది. నీ పోరాటం నీదేనని, నీ అనుభవమే ఏనాటికైనా నీ తలుపు తట్టగల అదృష్టమనీ పాఠం చెప్పే నవల

1995లో తన ‘క్రాస్‌రోడ్స్’ కథాసంపుటి కోసం వడ్డెర చండీదాస్ రాసిన ముందుమాటను తాను పోగొట్టుకున్నానని, ఆ చేతిరాతప్రతి తిరిగి ఈమధ్యే దొరికిందనీ చెబుతూ సదాశివరావు ఇటీవల ఆ ప్రతిని, ఆయనే తీసిన చండీదాస్ ఫోటోని, మాతో మరికొందరు మిత్రులతో పంచుకున్నారు.

ఇస్మాయిల్‍గారు టాగూర్‌ను సదాబాలకులు అన్నారని మనకు తెలుసు. అయితే మంచి కవులందరూ సదాబాలకులే. వాళ్ళలో పసితనపు సమ్మోహనత్వమేదో నిలిచే ఉంటుంది. ఆ పసితనపు స్వచ్ఛత సూదంటురాయిలా ఆకర్షించినట్టు, వీళ్ళ కవిత్వం కూడా పాఠకులను లాగుతూ ఉంటుంది. ఈ సంపుటిలో కూడా ఇదే ప్రధాన ఆకర్షణ.

ఏభై రోజుల కొండపొలం అనుభవాన్ని రచయిత వర్ణించిన తీరు అద్వితీయం! ఉత్కంఠభరితంగా, ముందుముందు ఏమవుతుందోనన్న ఆరాటంతో చివరివరకు చదివిస్తుంది. గొర్రెకాపరుల అనుభవాల్ని ఇంత చక్కగా వర్ణించి ఈ 21వ శతాబ్దంలో కూడా గొర్రెకాపరుల జీవితాలు ఇలా ఉంటాయా అన్న ఆశ్చర్యంలో మనల్ని ముంచెత్తుతుందీ నవల.

వలస ప్రధాన అంశంగా రాయబడిన ఈ నవలలో మానవ సంబంధాల చిత్రీకరణకూడా ఎంతో వాస్తవికంగా, సునిశితంగా, హృద్యంగా సాగింది. చిత్తూరుజిల్లావాసి, భద్రావతాయనగా పిలవబడుతూ, ఇప్పటికీ జీవించి ఉన్న మంగరి నాగయ్య జీవితాన్నాధారంగా చేసుకుని బలభద్రి పాత్రను మలచారు రచయిత.

ఈ కథలుకూడా ఊరికే చదివి వదిలేసేవి కావు. మళ్ళీమళ్ళీ చదవవలసినవి. చదివి నేర్చుకోవలసినవి. సంపుటిలో కొన్ని కథలు లౌకికమైన అంశాలను చర్చించేవైతే, కొన్ని సంప్రదాయబద్ధమైనవి, మరికొన్ని ఆధ్యాత్మికపరమైనవి. ఈ కథా సంపుటిలో ప్రతీ కథ జీవితాన్ని ఒక కొత్తకోణంలో పరిచయం చేసేదే!

మీ హృదయములో బాధ గూడుకట్టుకొన్నప్పుడు ఈ పుస్తకము తెరచి ఒక్క ఐదు పేజీలు చదవగనే ఆ బాధ కరిగి ద్రవమై ఆపై యావిరి రూపమున బయటకు వెళ్ళి మీకు గాలిలో తేలియాడుచున్న యనుభూతి కలుగును. కోవిడ్-19 ప్రత్యేక వైద్యశాలలయందు దీనిని చదివించిన, రోగులకు శీఘ్ర ఉపశమనము కలుగునని ప్రయోగముల ద్వారా నిరూపితమైన సత్యము.

ఇది తన అమాయకపుకళ్ళతో చుట్టూ జరిగే జీవితాన్ని సునిశితంగా గమనించిన పిల్ల కథ. ఆ అమ్మాయి ఎక్కడా ఎవ్వరినీ నిలదీసినట్టు కనపడకపోవచ్చు; ఎదురుతిరిగి ఎవ్వరితోనూ పోట్లాడినట్టు కనపడకపోవచ్చు. కానీ తన ఎరుకలో ఒక మనిషిని మరో మనిషి గాయపరిచిన ప్రతిసారీ, అది తిరస్కారంగా పుస్తకంలో కనపడుతూనే ఉంది.

ఇవి ప్రయత్నం మీదనైనా అందరూ రాయగలిగిన కథలు కావు. ఇందులో ఉన్నదేమీ వెక్కిరింపో దూషణో కాదు. మొదట్లోనే చెప్పినట్టు చాలా అరుదైన, కథ చెప్పే ధోరణికి అద్దంపట్టే కథలు. హాయిగా, మిత్రుడితో సాగే ఆత్మీయ సంభాషణలా, లేనిపోని మర్యాదలూ నటనలూ పక్కన పెట్టి, దాపరికం లేకుండా కులాసాగా మాట్లాడుకున్న ముచ్చట్లు.

చిత్రంగా వినిపించినా, ఈ సంకలనం కవిత్వ పాఠకుల కన్నా కవులకే ఎక్కువ అవసరం. ప్రస్తుతం తెలుగులో కవిత్వం రాస్తున్నవాళ్ళందరూ వాదాలకతీతంగా చదివి చూడాల్సిన పుస్తకమిది. ఈ కొత్త పోకడల కవిత్వ రీతులను అధ్యయనం చెయ్యాలి. మూసలు బద్దలు కొట్టిన తీరును గమనించాలి. వస్తువుతో కవి ఎంత నిజాయితీగా మమేకమైతే కొత్త అభివ్యక్తి వస్తుందో అర్థంచేసుకోవాలి.