వలస ప్రధాన అంశంగా రాయబడిన ఈ నవలలో మానవ సంబంధాల చిత్రీకరణకూడా ఎంతో వాస్తవికంగా, సునిశితంగా, హృద్యంగా సాగింది. చిత్తూరుజిల్లావాసి, భద్రావతాయనగా పిలవబడుతూ, ఇప్పటికీ జీవించి ఉన్న మంగరి నాగయ్య జీవితాన్నాధారంగా చేసుకుని బలభద్రి పాత్రను మలచారు రచయిత.

ఈ కథలుకూడా ఊరికే చదివి వదిలేసేవి కావు. మళ్ళీమళ్ళీ చదవవలసినవి. చదివి నేర్చుకోవలసినవి. సంపుటిలో కొన్ని కథలు లౌకికమైన అంశాలను చర్చించేవైతే, కొన్ని సంప్రదాయబద్ధమైనవి, మరికొన్ని ఆధ్యాత్మికపరమైనవి. ఈ కథా సంపుటిలో ప్రతీ కథ జీవితాన్ని ఒక కొత్తకోణంలో పరిచయం చేసేదే!

మీ హృదయములో బాధ గూడుకట్టుకొన్నప్పుడు ఈ పుస్తకము తెరచి ఒక్క ఐదు పేజీలు చదవగనే ఆ బాధ కరిగి ద్రవమై ఆపై యావిరి రూపమున బయటకు వెళ్ళి మీకు గాలిలో తేలియాడుచున్న యనుభూతి కలుగును. కోవిడ్-19 ప్రత్యేక వైద్యశాలలయందు దీనిని చదివించిన, రోగులకు శీఘ్ర ఉపశమనము కలుగునని ప్రయోగముల ద్వారా నిరూపితమైన సత్యము.

ఇది తన అమాయకపుకళ్ళతో చుట్టూ జరిగే జీవితాన్ని సునిశితంగా గమనించిన పిల్ల కథ. ఆ అమ్మాయి ఎక్కడా ఎవ్వరినీ నిలదీసినట్టు కనపడకపోవచ్చు; ఎదురుతిరిగి ఎవ్వరితోనూ పోట్లాడినట్టు కనపడకపోవచ్చు. కానీ తన ఎరుకలో ఒక మనిషిని మరో మనిషి గాయపరిచిన ప్రతిసారీ, అది తిరస్కారంగా పుస్తకంలో కనపడుతూనే ఉంది.

ఇవి ప్రయత్నం మీదనైనా అందరూ రాయగలిగిన కథలు కావు. ఇందులో ఉన్నదేమీ వెక్కిరింపో దూషణో కాదు. మొదట్లోనే చెప్పినట్టు చాలా అరుదైన, కథ చెప్పే ధోరణికి అద్దంపట్టే కథలు. హాయిగా, మిత్రుడితో సాగే ఆత్మీయ సంభాషణలా, లేనిపోని మర్యాదలూ నటనలూ పక్కన పెట్టి, దాపరికం లేకుండా కులాసాగా మాట్లాడుకున్న ముచ్చట్లు.

చిత్రంగా వినిపించినా, ఈ సంకలనం కవిత్వ పాఠకుల కన్నా కవులకే ఎక్కువ అవసరం. ప్రస్తుతం తెలుగులో కవిత్వం రాస్తున్నవాళ్ళందరూ వాదాలకతీతంగా చదివి చూడాల్సిన పుస్తకమిది. ఈ కొత్త పోకడల కవిత్వ రీతులను అధ్యయనం చెయ్యాలి. మూసలు బద్దలు కొట్టిన తీరును గమనించాలి. వస్తువుతో కవి ఎంత నిజాయితీగా మమేకమైతే కొత్త అభివ్యక్తి వస్తుందో అర్థంచేసుకోవాలి.

కవితలో వడి ఒకేలా ఉన్నా పోలికల్లో తేలిగ్గా కొరుకుడుపడని సంబంధం, సామ్యం కొన్ని చోట్ల ఇబ్బందిపెడతాయి. వినూత్నమైన, పూర్తిగా తనకు సొంతమైన కల్పనాశక్తితో రాసిన పాదాలు కవితల్లో స్పష్టంగా కనపడుతాయి. ఈ కాలపు మానసికావస్థలకు తగ్గట్టుగా తిప్పుకున్నవా అనిపించే అబ్‌స్ట్రాక్ట్ భావనలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

ఈ పుస్తక రచయితలు కథన శైలిని అనుసరించడం వల్ల, బౌద్ధ సాహిత్యం ఆధారంగా లభించిన బుద్ధుడి సంభాషణలను యథాతథంగా పేర్కొనే ప్రయత్నం చెయ్యడం వల్ల ఈ రచనను ఒకటికి రెండుసార్లు చదవాలనిపిస్తుంది. తమ కథన క్రమంలో పాఠకుల జిజ్ఞాసను, ఆసక్తిని పెంపొందించే అనేక సంఘటనలను వారు విస్మరించలేదు.

ఈ సంపుటిలోని కథలన్నీ ఆధునిక జీవితపు సంక్లిష్టతనూ, ఈ కాలపు స్వేచ్ఛతో ముడిపడి ఉన్న సందిగ్ధావస్థనూ చిరపరిచితమనిపించే కథాంశాలతోనూ, సన్నివేశాలతోనూ నేర్పుగా అల్లుకున్నవి. సమతుల్యం లేని ఆలోచనల పునాదుల మీద నిర్మించుకున్న జీవనసౌధం కుదురుగా నిలబడదని చెప్పే ఈ కాలపు కథల అవసరం ఇప్పుడు మరీ కనపడుతోంది.

ఒక రచన అంటే ఏమిటి? దానికి, రచయితకి ఉండే సంబంధం ఏమిటి? రచనలో పాఠకుడి పాత్ర ఏమిటి? ఈ విషయాలు ప్రాముఖ్యంలోకి రాకముందే, ఈ కావ్యదహనోత్సవం జరిగింది. డెత్ ఆ ది ఆథర్ అని 1967లో గానీ రోలాండ్ బార్తా రాయలేదు. దానికి ముందే, ఈ సమావేశంలో ఒక పాఠకుడు ఈ ప్రశ్నలు రేకెత్తుతాడు.

గూడెంలోని పిల్లలకు పాఠాలు చెప్పడానికి వెళ్ళిన ఒక నిజాయితీ గల టీచరు అనుభవాలు, చిన్న కథలుగా మారిన సంపుటి; ‘మొగ్గలు’ అనే ఒక ప్రత్యేకమైన కవితారూపమిది అని వెలువరించిన పుస్తకం; అంతర్జాల పాఠకుల చూపునీ, కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాసిన ముక్తకాలు, ఈ సంచికలో.

తన బలిపీఠం నవల మలిప్రచురణకు ముందుమాట రాస్తూ, ఆ నవలలోని అనంగీకార భావాలనూ భాగాలనూ ఉతికి, ఆరవేస్తూ రంగనాయకమ్మ ‘ఇపుడు ఈ నవలకు ప్రభుత్వం ఎందుకు అకాడమీ అవార్డు ఇచ్చిందో నాకు స్పష్టంగా, శాస్త్రీయంగా తెలుసు’ అంటారు. శప్తభూమి నవలను మరోసారి మరోసారి చదివితే ఆ మాట నాకు పదేపదే గుర్తొస్తోంది.

ఆత్మనొక దివ్వెగా యే సౌందర్యం పాదాల చెంత ఉంచాలో వెదుక్కుంటూ వెళ్ళిన అన్వేషకుడి కథ, మూలా సుబ్రహ్మణ్యం నవల ఆత్మనొక దివ్వెగా; తెలుగు మాండలీకాల అందానికి అద్దం పట్టే కథలు ఎండపల్లి భారతి ఎదారి బ్రతుకులు; అమెరికా మ్యూజియంలలో ఏం చూడాలో తెలీనివారికి, కరదీపిక రొంపిచెర్ల భార్గవిగారి ఒక భార్గవి-రెండు ప్రయాణాలు.

మనకి రోజువారీ నలుపు తెలుపుల్లో కనిపించే విషయాలు అతనికి మాత్రం పంచరంగుల్లో కనపడి ఊరిస్తాయి. ఝల్లుమని ఒళ్ళంతా తడిపే వాన తనని లవ్వించమంటుంది, కర్రా-బిళ్ళా ఆటలో పైకెగిసిన కర్రముక్క రెక్కలు విప్పుకున్న రంగురంగుల పిట్టలా మారి రా రమ్మని పిలుస్తుంటుంది. కుదిరిన బొమ్మలే కాదు, కుదరని బొమ్మలు కూడా తమ వెనకున్న వ్యథల కథలు చెబుతాయి.

కార్యమో, కాలక్షేపమో ఏదీ తోచక సగం నిద్రలో ఎడం చేత్తో ఏవో జ్ఞాపకాలు రాసిపడేసిన (మన నెత్తిన) తీరు కథలు కావు… పుస్తకం నిండార వున్న చిన్న చిన్న సంగతులన్నీ మనిషి స్పృహ తాలూకు తేమ ఏ మాత్రం ఎండిపోకుండా వున్నా, దానికి పని కల్పిస్తాయి. పత్రికల్లో వార్త చదవనివాళ్ళకు సైతం వారి ఆలోచనల్లో చిన్నపాటి సుడిగుండమొకటి బయలుదేరి ‘వాట్ మస్ట్ బి డన్?” అని నిలదీస్తుంది.

సృజనలో అసందర్భంగానైనా, అసంబద్ధంగానైనా తాము చెప్పదల్చుకున్నది చొప్పించే కళాకారులు చుట్టూ ఉన్న ప్రస్తుత కాలంలో, కళ కళ కోసమే అన్న భావనను ఇంత బలంగా చిత్రించిన నవల రావడమే ఆశ్చర్యం. ఒకసారి సృజన నీ నుండి వేరు పడ్డాక, అదిక నీది కాబోదన్న మాటలను, రచయిత పండించుకున్న విధానమిది.

ఉరికంబంలాగానో, ధ్వజస్థంభంలాగానో నిటారుగా నిలబడి మనం అన్నిటినీ ప్రశ్నించగలం. అసలు ప్రశ్నే ఎదురవని సమాజం చివరికి అంతరంగం కూడా సులువుగా పట్టుబడవని రచయిత నందిగం కృష్ణారావు ఈ నవలతో మనముందుకు వచ్చారు. ఆ పై, ఇరుపక్కల తోడై నీకో నిజాయితీ, నిన్ను దాటిన ప్రయోజనం, వీటిలో మనిషితనం వుండాలనీ కూడా గుర్తు చేయించే పనిపెట్టారు ఈ నవలతో.

సాహిత్య వాతావరణంలో స్తబ్దత అన్న పదానికి అర్థం, కొత్త రచనలు రావడం లేదని మాత్రమే కాదు, వచ్చిన రచనల్లో కొత్తదనం లేదని కూడా. దానిని చెదరగొట్టడానికి మనకున్న వాతావరణమే మారాలి. అది అంత తేలిగ్గా జరిగే పని కాదు. అయితే, వచ్చే ప్రతి రచనా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మరో సృజనకు ప్రేరణ నిస్తుంది.

తమ పిల్లల పసితనం లోని అమాయకత్వంలో కనపడకుండా దాక్కున్న కళ్ళు చెదిరే తెలివీ, సమయోచిత సంభాషణలకీ అబ్బురపడి ఆ అబ్బురాన్ని పదిమందికీ పంచి ఆనందించే చిట్టి తల్లులని గుండెకి హత్తుకోవాలనిపిస్తూ వుంటుంది. అందుచేత ఈ నెమలీకల్ని అలా తడిమే సాహసం చేస్తున్నాను.

భారతీయ భక్తి సాహిత్యంలో శివుణ్ణి, విష్ణువుని స్తుతిస్తోనో, ప్రేమిస్తోనో కవిత్వం చెప్పడం మొదలైన ఎంతో కాలానికిగాని శక్తిని ఆరాధిస్తూ చెప్పే కవిత్వం రాలేదు. వేదాల్లోని వాగ్దేవి సూక్తం, ఉపనిషత్తుల్లోని ఉమా హైమవతి, ఇతిహాస, పురాణాల్లోని దేవి, బౌద్దుల తార, తాంత్రిక దశమహావిద్యల్లో కాళి ఒక ఉపాస్య దేవీమూర్తిగా భక్తికవుల హృదయాల్ని కొల్లగొట్టుకోడానికి పద్దెనిమిదో శతాబ్దిదాకా ఆగవలసి వచ్చింది.