వలసచరిత్రలో తెలుగువెలుగులు: జగమునేలిన తెలుగు

‘మతి’ మనిషిని రకరకాల చోట్లకి పరిశోధన నిమిత్తం పరిభ్రమణం చేయించడాన్నే ‘మతిభ్రమణం’ అనాలేమో?! రాహుల్ సాంకృత్యాయన్‌ను పుస్తకాల బరువు మోసే కంచరగాడిదల వెంట ఘోర వాతావరణంలో నడిపించినది ఈ భ్రమణమే కదా! ఇదే డి. పి. అనురాధ అనే యువరచయిత, పరిశోధకురాలికీ కలదు! అందుకనే కొంచం కదిలించగానే మన పూర్వం తెలుగువారి వలసలు, మూలవాసుల కదలికల తీరుతెన్నులూ వరదలా చెప్పుకురాగలరు. ఎన్ని విదేశాల్లో తెలుగువారు వలసవెళ్ళి ఎలా బ్రతికేరో, కళాసంస్కృతుల విషయంలో ఎంత ఘనకీర్తి సాధించారో, అదే చరిత్ర మరుగున ఎలా పడిపోయిందో వివరించగలరు. అవన్నీ వెలికి తీయడం ఎంత ప్రాణప్రదమయిన పనో పాఠకులకు తెలిసే విధంగా చేసిన ప్రయత్న ఫలమే ఇదిగో ఈ పుస్తకం జగమునేలిన తెలుగు! తూర్పు దేశాల్లో స్థిరపడిన ఆదిమ తెలుగుజాతివారి ప్రాచీన ప్రాభవం నేటికీ ఎలా గుబాళిస్తోందో చెప్పే నవలారూపంలోని ఈ పుస్తకం రచయిత ఆవేశ ప్రవాహాన్ని, ఆమె స్ఫూర్తినీ మనకు చేర్చేట్టు కృషిచేసింది.

మనం చదివిన చరిత్ర పుస్తకాలు, పరిశోధక పత్రాలు, ప్రసంగ పాఠాలూ దురదృష్టవశాత్తూ మంచి నవల రూపంలోకి మారలేదు. ఒకటీ అరా తప్ప ఇలాటి కథావస్తువు గల నవలలు ‘కాల్పనిక’ సాహిత్యమార్గం పట్టినవే. కల్పన ముఖ్యమై, చరిత్ర వాస్తవాలను తెరవెనక పారేసినట్టు వుంటాయవి. ‘కవిద్వయం’ అయినా ‘వాఘిరా’ అయినా, మరేదయినాగాని కొన్ని చారిత్రక వివరాలు మినహా వాస్తవ చిత్రణ జోలికి పోనివే అవి!

కాబట్టి చరిత్ర శిలాశకలాల కింద మన మరుపు, స్పృహకింద పడి కనిపించనివి పైకి తీసి వాటిని చక్కని కథనంతో నడిపే రచన రావటం ముఖ్యం అనే సదుద్దేశంతో రాసిన నవల ఇది. ఇందుకే రచయిత అన్నేసి దేశాలు పరిశోధక దృష్టితో ప్రయాణించారు. శ్రీలంక, మయన్మార్, వియత్నాం, థాయ్‌లాండ్, ఇండోనేషియాల్లో ముఖ్యమైన పట్టణాలు, మారుమూల పల్లెలు ఎలాగో తిరిగి మరీ పరిశీలన సాగించిన వైనం ఈ నవల చూపెడుతుంది. ఆయా ప్రాంతాల్లో తెలుగు మూలాలు గలవారి వేషభాషలు, ఆచారవ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు, సంస్కృతి చూసి, మాట్టాడి, ఆపై చారిత్రక ఆధారాలతో కూపీ లాగారు రచయిత. ఆగ్నేయాసియాలో తెలుగువెలుగుని దేదీప్యమానం చేసే బోలెడన్ని ఇతర విశేషాలూ శోధించి నవలలో చక్కగా వాడుకున్నారు. బతుకుతెరువు కోసం తప్పనిసరయి వెళ్ళినవారి వైవిధ్యం, కళాకారుల ఉత్తమ కృషి, వారి పనితనం, నిక్షిప్తమైనవి ఏరి తీసి, దుమ్ముదులిపి కథారూపంలో ఇక్కడ అమర్చారన్నమాట. నిజమే, పై వివరాలు చరిత్ర పరిశోధకులు అక్కడక్కడ అప్పుడెప్పుడో పొందుపరచకపోలేదు. కానీ అవి అసమగ్రం అన్న గ్రహింపు వలనే అనురాధ తిరిగి తిప్పలు పడక తప్పింది కాదు- వీటి ఫలితం మన చేతులకి చేరిందిప్పుడు. ఇలా అనేకాంశాలు తనివితీరా తడిమిచూసి పరవశాన చరిత్ర వాస్తవ దృశ్యాలను నవలగా చేయడం ఆషామాషీ కాదుగదా!

నవలలో నాయకుడు సూర్యవర్మ, ఈ రచయితా వేరువేరు కారు – ఒకరే. సంకల్పం అనే బండి ఎక్కి చరిత్రలోకి ప్రయాణం చేస్తారు. నాటి తెలుగుల భాష, సాంస్కృతిక ప్రతీకలూ ఏమి గుర్తుచేస్తున్నాయో చూస్తాడు అతడు. ఇందుకు ఎంచుకున్న ‘టెక్నిక్’ బావుంది. నిన్న, నేడు, రేపటియానంలో, ప్రయాసలో ఎక్కడా అసహజం అనిపించని సరళమార్గంలో పాఠకుల చేత సుఖయాత్ర చేయించారు రచయిత.

నవల చదువుతోంతే మనం ‘మన్’జాతిలో మనవాళ్ళను కలవగలం… థాయ్‌లాండ్ ‘చిమ్మయి’ మన పిల్లగానే గుర్తిస్తాం. ద్వారావతి, హరిపుంజాయి వంటి థాయ్ ప్రాంతాల్లో మన పూర్వీకులను పరిచయం చేసుకుంటాం. తెలుగు చీర చుట్టిన ‘చామదేవి’ని పలకరించగలం, చంపాలో ‘భద్రేశ్వరుని’ గుర్తించగలం, అక్కడ బంగారు తాపడాలు చేసిన ఘననిర్మాణాలు, శిల్పాలు చెక్కిన తెలుగు సంతతి చుట్టూ ప్రదక్షిణం చేస్తాం, మన పూర్వీకుల తపనల స్వరూప విశేషాలను తాకిరాగలం. శ్రీలంకకు మన శ్రీకాకుళానికి గల సత్సంబంధాన్ని చవిచూడగలం. ఇందుకే ఈ నవల చదవాలి! మనం కూడా కాలయంత్ర రథం ఎక్కి వివిధ ప్రాంతాల తెలుగువారి ప్రాచీన స్మృతులూ చేచప్పుడూ వినిరాగలం. నాటి తెలుగు శ్రామికులను నేరచరితులుగా, వట్టి బానిసలుగా చిత్రించిన బ్రిటిష్, లేదా స్థానిక పాలకుల దుర్మార్గ ఫలితం నేడు ఎలా వుందో పరిచయం అవుతుంది అక్కడక్కడా ఈ పేజీల్లో. ఈ నవల అటు చరిత్ర పరిశోధకులయిన యువతకు, యువ, నవ రచయితలకూ బాధ్యత గుర్తుచేస్తుంది. చిన్న నవలే, పెద్ద పనిపెడుతుంది మనసుకి.

ఈ నవలకు పేరు చరిత్ర పరిశోధనపత్రానికి వుండవలసిన టైటిల్ పెట్టారు- మరేదయినా వుంటేనే బాగుండుననిపిస్తుంది. ఐతేనేం! జిజ్ఞాస రేపే చిరుదీపం ఈ చిట్టి నవల. బొమ్మలు, ఫోటోలు చేర్చి జర్నలిస్టు రిపోర్టువంటి రూపం కల్పించినా- ఇది పాఠకులకు గైడ్‌వలే వుంది, నవలగానూ బావుంది.


జగమునేలిన తెలుగు
గోదావరి నుండి జావా దాకా…
ప్రతులకు: తెలుగుజాతి (ట్రస్టు), ఫోన్: 94404 48244,
అన్ని ప్రముఖ పుస్తకాల అంగళ్ళు.

తల్లావజ్ఝుల శివాజీ

రచయిత తల్లావజ్ఝుల శివాజీ గురించి: జననం విద్యాభ్యాసం ఒంగోలులో. కళాసాహిత్య విషయాలలో పితామహులు తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రిగారి ప్రభావం బాల్యం నుంచీ. బొమ్మలు గీయడం చిన్నప్పటినుంచే స్వయంకృషితో నేర్చుకున్నారు. పాత్రికేయుడిగా ఉద్యోగవిరమణ అనంతరం ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని అడవులలో తిరిగి వారి జీవితాన్ని దగ్గరనుండి పరిశీలించారు. ఆ ప్రకృతి, ఆ జీవనవిధానపు స్వచ్ఛత, సరళత, నిరాడంబరతలు భారతీయ సంస్కృతి, ఇతిహాసాలలో వేళ్ళూనుకున్న వీరి చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. చక్కటి రచయిత, కళావిమర్శకుడు అయిన శివాజీ ఎన్నో చిత్రప్రదర్శనలు చేశారు. ...