ది గుడ్ స్టోరీ

We have art in order not to die of the truth.

– Friedrich Nietzsche.

సత్యాన్ని పూర్తి వెలుగులో చూసే శక్తి అందరికీ ఉండదు. అందుకే, మనం భరించలేని గత జీవితపు అనుభవాల చేదు జ్ఞాపకాల్ని ధైర్యంగా ఎదుర్కోకుండా వాటిని వెనక్కి నెట్టేసి, వీలైతే సమాధి చేసి, మెల్లిగా మర్చిపోయే ప్రయత్నం చేస్తాం. కాని, జ్ఞాపకాలను సమూలంగా చెరిపెయ్యడం సాధ్యం కాదు. అవి కేవలం అణగదొక్కబడతాయి. మస్తిష్కపు చీకటి మూలల్లో ఎక్కడో ఒకచోట నిక్షిప్తమై ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు తిరిగి పైకి తేలుతాయి. అలజడి కలిగిస్తాయి. అప్పుడు వాటిని ఎదురుకోవడం కోసం, నీచ చెప్పినట్లు, ఒక కళనో మరో భ్రమనో తెరచాటు చేసుకుంటాం. ఆ సహాయంతో ఆ జ్ఞాపకాలకు ఒక కొత్త రూపం ఇస్తాం. లేదూ వాటిని తట్టుకోవడానికి అనువైన ఒక సందర్బాన్ని నిర్మించుకుంటాం. అలా వాటితో ఎలానో ఒకలా రాజీపడతాం.

ఏదేమైనా, బాధపెట్టే జ్ఞాపకాల రూపును కల్పితకథనాలతో మార్చుకొనే స్వేచ్ఛ మనిషికి ఉందా? ఏది నిజం? ఏది కల్పితం? కాలంతో పాటూ మన జ్ఞాపకాలూ మారుతాయి. అప్పటి సంఘటనలు కొత్త సత్యాలతో, కొత్త అర్థాలతో కనిపిస్తాయి. మన ఆలోచనలు మారేకొద్దీ, అనుభవాలు పెరిగేకొద్దీ గతం పట్ల దృక్పథమూ మారిపోతుంటుంది. గతం ఎప్పుడూ అలా కొత్తగానే కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు, ఒక రచయిత తన ఆత్మకథను రాసుకుంటున్నప్పుడు అతను కేవలం అనుభవాలని ఏకరువు పెడుతున్నాడా లేక వాటికి ఒక సందర్భాన్నిచ్చి ఒక కొత్త రూపాన్ని తొడుగుతున్నాడా? మన జీవితాలనుంచి మనం చెప్పుకునే కథలలో సత్యశోధన ఎంతవరకూ అవసరం? మన కల్పనలో ఎంతవరకూ మన జీవితం నిజం? తమ అనుభవాలకు కొత్త సందర్భాన్ని, దృక్పథాన్ని ఇచ్చుకుంటూ తమ గతాన్ని ఎంతోకొంతయినా కాల్పనికం చేసుకోవడం నైతికమేనా? అటువంటి స్వేచ్ఛ రచయితకు ఉందా? ఒక రచనలో రచయిత ప్రమేయం ఎంత? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే దిశగా సైకోథెరపిస్టు అరాబెలా కర్ట్స్ (Arabella Kurtz), సౌత్ ఆఫ్రికా రచయిత, సాహిత్యంలో నోబెల్ గ్రహీత (2003) జె. ఎమ్. కూట్సీ (John Maxwell Coetzee) మధ్య జరిగిన సంభాషణలను ది గుడ్ స్టోరీ (The Good Story: Exchanges on Truth, Fiction and Psychotherapy) పేరిట పుస్తకరూపంలోకి తీసుకొచ్చారు.

‘మన గురించి మనం చెప్పుకునే కథల్లో నిజానిజాలు మనకు పూర్తిగా తెలియకపోయినా మనకంటూ మిగిలేవి అవే కాబట్టి ఆ కథలతో మనకున్న సంబంధాలంటే నాకు ఆసక్తి’ అని చెప్తూ, కూట్సీ మన కథల్ని మూడు విధాలుగా వర్గీకరిస్తారు.

  1. నా గురించి నేను నిజాయితీగా వాస్తవమని నమ్మే కథ ఒకటుంటుంది. కానీ నాకు అస్సలు సంబంధం లేని ఆదర్శవంతుడు, సర్వజ్ఞుడు, దైవజ్ఞుడూ అయిన మరో వ్యక్తి అది నిజం కాదని భావించవచ్చు. నా కథ అబద్ధమని కాకపోయినా కనీసం పూర్తి నిజం కాదని అనుకోవచ్చు.
  2. రెండోది సర్వసాధారణంగా జరిగే విషయం. నా గురించి నేను నిజమని నమ్మే కథ ఒకటుంటుంది. కానీ నాగురించి బాగా తెలిసిన నా జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలూ ఆ కథ నాకు అనుకూలంగా అల్లుకున్న కథ అని, భ్రమలతో కూడిన కథనీ కూడా అనుకోవచ్చు.
  3. ఇక మూడవది. అందరికీ ఎవరి కథ వారికున్నట్లే నాకు కూడా ఒక కథ ఉంటుంది. ఇది పైరెండు కథలకూ భిన్నమైనది, అసలు ఏమాత్రమూ నిజం కానిదీ అయినా సరే, అది ‘నా కథ’. నాకున్న ఒకే ఒక్క కథ. అందువల్ల నేను దానికి పూర్తి విధేయుడనై ఉంటాను.

‘నిజం’ నిరాకారమైనది. నీ నిజం వేరు, నా నిజం వేరూ కావచ్చు. సౌందర్యమయంగా కనిపించేదంతా సత్యమని, వికారంగా ఉండేదంతా అసత్యమనీ అనుకోవడం మానవ నైజం. నిజానికి ప్లేటో సిద్ధాంతం ఈ పునాదుల మీద నిలబెట్టినదే. సత్యానికీ, సౌందర్యానికీ మధ్య ఎంపిక తప్పనిసరైనప్పుడు కవి మరో ఆలోచన లేకుండా సత్యాన్ని త్యజించి సౌందర్యం వైపు మొగ్గు చూపుతాడు. (The heart of the poets’ case is that beauty is its own truth.) ప్లేటో తన వాదనలో ప్రధానంగా కవిని వేలెత్తి చూపించినా ఇది ప్రతి మనిషికీ వర్తించే విషయమే. విషాదాన్నీ గతపు చేదునీ మనిషి తన జ్ఞాపకాల్లోంచి చెరిపెయ్యడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఉదాహరణకు, గతంలో నేరచరిత్ర ఉన్న వ్యక్తి, దుర్మార్గాలతో కూడిన గతంతో సహజీవనం చెయ్యడం వర్తమానంలో నరకప్రాయం కాబట్టి, తన ‘సత్యాన్ని’ అప్పటి కాలమానస్థితులకు తగ్గట్లు తనకు వీలుగా పునఃనిర్మించుకుంటాడు. గతంలో తన దుష్ప్రవర్తనకు సమర్థింపుగా కారణాలను వెతుక్కుంటాడు. అది వీలుకాని పక్షంలో ఆ వాస్తవాన్ని పూర్తిగా తన అస్తిత్వంలోనుండి చెరిపివేసుకుని తనకు మరో కొత్త వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్నీ ఆపాదించుకుంటాడు. ఈ కారణంగా కాలం గడిచే కొద్దీ, గతం నిర్దిష్టమైన సత్యానికి దూరం జరుగుతూ ఒక కాల్పనిక రూపాన్ని సంతరించుకోవడం అనివార్యమవుతుంది. ఈ కారణంగా ఎంతో కొంత కాల్పనికత లేని సత్యం అంటూ ఉండడం దాదాపు అసాధ్యం.

ఈ విషయాన్ని నిరూపించడానికి నథానియల్ హాథోర్న్ (Nathaniel Hawthorne) రచన ది స్కార్లెట్ లెటర్‌ను (The Scarlet Letter) ఉదాహరణగా తీసుకుంటాడు కూట్సీ. 17వ శతాబ్దపు ఉత్తర అమెరికాలో పరిశుద్ధ క్రైస్తవ (Puritan) వ్యవస్థకు చెందిన నవలా నాయిక హెస్టర్ ప్రిన్, ఇంటికి దూరమైన భర్త తిరిగివచ్చేలోగా వివాహేతర సంబంధం కారణంగా సంతానాన్ని కంటుంది. ఈ విషయం తెలిసిన కులపెద్దలు అడల్టరీకి గుర్తుగా ఎర్రటి A అనే ఇనుప అక్షరాన్ని మెడలో ఒక గొలుసులా జీవితాంతం వేసుకొని ఉండాలని ఆమెకు శిక్ష విధిస్తారు. కానీ హెస్టర్ దాని చుట్టూ రిబ్బన్‌లతోనూ, లేసులతోనూ ఎంబ్రాయిడరీ చేసుకుని అలంకరించుకోవడం మొదలుపెడుతుంది. హెస్టర్ తన అవమానానికి గుర్తుగా ధరించే అక్షరంతో ఎంత మమేకమైపోతుందంటే చివర్లో ఆమెను ఆ శిక్షనుండి విముక్తురాలిని చేసినా దాన్ని విడిచిపెట్టడానికి ఒప్పుకోదు. ఈ కథలో హెస్టర్ తన అవమానాన్ని ఇలా మరో రూపంలోకి ఫ్యాబ్రికేట్ చేసుకుంటుంది. ఈ విధంగా ఆమె ఒక ప్రక్క సామాజిక నియమాలకు తలొగ్గుతూనే, మరో ప్రక్క ప్యూరిటన్ వ్యవస్థలో నిషిద్ధమైన అలంకరణను ఆసరా చేసుకోవడం ద్వారా సాంఘిక కట్టుబాట్లను ధిక్కరిస్తుంది. ఈ విధంగా ది స్కార్లెట్ లెటర్ కేవలం వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాకుండా సామాజిక స్థాయిలో కూడా మన తప్పులను, మనం సిగ్గుపడే వ్యక్తిత్వ లోపాలనూ అంగీకరించే ప్రయత్నం చెయ్యమని పరోక్షంగా చెబుతుంది. ఇలా చెయ్యడం వల్ల మనిషికి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు తన ఉనికిని సరికొత్తగా ఆవిష్కరించుకునే స్వేచ్ఛ దొరుకుతుంది. గాన్ విత్ ది విండ్ నవలలో కూడా రెట్ బట్లర్ కూతురు పుట్టాక అలవాటైన తన పాత జీవితానికి స్వస్తి చెప్తాడు. ఎవరినీ లెక్కచెయ్యని స్వార్థపరుడు కాస్తా, సమాజంలో తన బిడ్డకు మంచి స్థానాన్ని ఇవ్వడం కోసం అందరితో మర్యాదగా మసులుకుంటూ గతాన్ని పునఃనిర్మించుకునే ప్రయత్నం చేస్తాడు.

మనకు వాస్తవంలో వీలుకాని విషయాలు కాల్పనిక జగత్తులో సాధ్యపడతాయి. గతాన్ని మనకు వీలుగా ఇలా మార్చుకోవడానికి సాహిత్యం అనంతమైన అవకాశాలిస్తుంది. సహజంగా ‘కథ’ అనగానే సత్యదూరమైనది, కాల్పనికమైనదీ అనే స్థిరాభిప్రాయం ఉంటుంది. కానీ ఫిక్షన్ అనేది పూర్తి నిజమూ కాదు, అబద్ధమూ కాదు. అది సమీకరణాల్లో చరాంశంలా సాపేక్షమైనది, అస్థిరమైనదీనూ. హెస్టర్ కథను పరిశీలిస్తే ఆమె ఫలానా నేరం చేసిందని తీర్పునిచ్చిన మెజిస్ట్రేట్‌కు ఆమె గురించి తెలిసిన కథ పూర్తి యథార్థం కాకపోవచ్చు. అలాగే బ్రూక్ ఫార్మ్ హెస్టర్ ఒక ‘అనుభవం కోసం’ చేశానని నమ్మే కథ కూడా పూర్తి నిజం కాకపోవచ్చు. ఈ రెండు కథల్లో తోచిన సత్యాన్ని తూకం వేసి నిర్ణయించుకునే అవకాశం పాఠకులకు ఉంటుంది. అది కూడా ఖచ్చితమైన సత్యం కానక్కర్లేదు. హెస్టర్ కథలో సత్యం చివరకు ప్రశ్నార్థకంగా మిగులుతుంది కాబట్టే ది స్కార్లెట్ లెటర్ ఒక మంచి కథ అని అంటాడు కూట్సీ.

మానసికచికిత్సను కూట్సీ క్యాథలిక్ క్రిస్టియనుల కన్ఫెషన్ ప్రక్రియతో పోలుస్తాడు. బైబుల్‌లో You shall know the truth, and the truth shall set you free అనే వాక్యం ఉంటుంది. సైకాలజిస్టుల వద్దకు మానసిక వైద్యం నిమిత్తం వెళ్ళే రోగులను నయం చేసే క్రమంలో వారిలో అంతర్గత భయాలను పోగొట్టి వారి సత్యాన్ని పూర్తి వెలుగులో చూపగలిగే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. మానసిక రోగులకు చేసే థెరపీ లక్ష్యం వాళ్ళను గతం నుండి విముక్తుల్ని చేసి స్వేచ్ఛను ప్రసాదించగలగడం మాత్రమే అయితే దానికి ‘సత్యం’ మాత్రమే ఏకైక మార్గమా అన్నది ప్రశ్న!

మన జీవితాల గురించి మనం చెప్పుకునే కథలు వాస్తవంగా జరిగినదాన్ని ప్రతిబింబించడంలో చాలాసార్లు విఫలమవుతాయి. వాటిల్లో వాస్తవికత లోపభూయిష్టమైనది. అలాగని అవి పూర్తిగా అబద్ధాలనీ కొట్టిపారెయ్యలేం. నిజానికి మనుషులు తమ దుర్బలత్వానికి సిగ్గుపడో, తమలో చీకటి కోణాలను దాచుకోవడానికో అబద్ధాలు చెప్తారు. ఇటువంటి అబద్ధాలను కట్టుకథలుగా మలచుకుంటే తప్ప మనకు ఆ కథలు చెప్పడానికి మరో మార్గం లేదు. మన దగ్గరున్న ముడిసరుకునే సత్యమని భావించినప్పుడు దానినుంచి సాపేక్షిక సత్యాలెన్నిటినో అంశాలుగా తీసుకుని వేరు వేరు కథలల్లే అవకాశం ఉంది.

ఉదాహరణకు సెర్బాంతేస్ (Servantes) రాసిన డాన్ కిహోటేను (Don Quixote) తీసుకున్నా అందులో మనం సృష్టించుకునే ఆదర్శవంత సత్యం (ideal truth) వాస్తవిక సత్యం (real truth) కంటే మెరుగైనదేమో అనిపిస్తుంది. నవల రెండో భాగంలో ఒక సందర్భంలో కిహోటే తాను అశ్వారూఢుడయిన మహా వీరుడిని అన్న భ్రమ నుండి విడివడి ఇలా అంటాడు: ‘నాకు ఒక శూరుడి ధర్మం పట్ల నమ్మకముంది, నేను నా నమ్మకాలకనుగుణంగా మసలుకునే వ్యక్తిని. అలా చెయ్యడం ద్వారా మనిషిగా నన్ను నేను మెరుగుపరుచుకుంటాను. నేను మునుపటిలా స్పానిష్ సమాజంలో శిథిలమైపోతున్న నా భవంతిలో మరణం కోసం ఎదురుచూస్తూ దుర్భరమైన స్థితిలో ఉండడం మీకు ఇష్టమా? లేదా ఇప్పటిలా పేదలకు, అణగారిన వర్గాలకు, బాధితులైన స్త్రీలకూ రక్షకుడుగా ఉండడం ఇష్టమా? అయినా నా నమ్మకాలు మనిషిగా నా ఎదుగుదలకు తోడ్పడుతున్నప్పుడు మీరు వాటిని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారెందుకు?’

కిహోటే మాటల్ని పరిశీలిస్తే మనిషి శారీరక, మానసికాభివృద్ధికి తోడ్పడుతున్నప్పుడు కొన్ని భ్రమలని కూడా వాస్తవాల్లా నమ్మడంలో కోల్పోయేదేముంటుంది అనిపిస్తుంది. మనిషి మానసికారోగ్యానికి అవసరమైన మోతాదులో కాల్పనికత చేసే మేలుని గురించి చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ నాకైతే కనపడలేదు. నేటి సమాజంలో శాస్త్ర సాంకేతికాభివృద్ధి కారణంగా సృజనాత్మకతకు తావివ్వని మితిమీరిన స్పష్టత, తార్కికత లాంటివి మనిషి మానసికాభివృద్ధిని అనేక విధాలుగా నిర్వీర్యం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. కిహోటే ఆదర్శవాదాన్ని అతడి అనుచరులందరూ ఆచరించకపోయినా అతడి ఆదర్శాల వల్ల ప్రపంచానికొరిగే నష్టమైతే లేదని ముక్తకంఠంతో తీర్మానిస్తారు. ఇటువంటి భ్రమల వల్ల ప్రపంచం మరికొంచెం సజీవంగా, వినోదాత్మకంగా మారుతుందని అభిప్రాయపడతారు. ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించడం అందరికీ సాధ్యం కాదు, కానీ కొందరు జీవిస్తుంటే చూసి తృప్తి పడేవాళ్ళు కూడా మరికొందరు ఉంటారు.

ఎప్పుడో ఆరేడేళ్ళ క్రితం యూత్, డిస్ట్రెస్ నవలల నాటి కూట్సీకి భిన్నమైన దృక్పథం ఈ కూట్సీలో కనిపిస్తుంది. ఒక అసాధారణమైన జ్వర తీవ్రతతో సృజనకు పూనుకునే కళాకారుల్లో నైతికతను ఆశించకూడదని, ఆ మాటకొస్తే నైతికపరిధిలో ప్రాణంపోసుకునే ఏ కళారూపమైనా ఉత్తమమైనది కాదనే ఆనాటి తన వాదనకు భిన్నంగా, ఇక్కడ ప్రామాణికతకు (authenticity) నైతికతకు భేదాన్ని గుర్తించిన తీరులో కూట్సీలో ఒక పరిణతి చెందిన రచయిత కనిపిస్తాడు. ఒక మనిషి అబద్ధమాడినా, మోసం చేసినా, దొంగతనం చేసినా కూడా తనను తాను సత్యవంతుడని, మోసగాడు, దొంగ కాదనీ అనుకోనంతవరకూ ఆ వ్యక్తి ప్రామాణికమైన వ్యక్తిగానే లెక్క. కానీ ఎందుకో సమాజం ప్రామాణికతకు అవసరం లేని గొప్పతనాన్ని ఆపాదిస్తుంది. ఉదాహరణకు డికెన్స్ లాంటి రచయితలు తమ రచనల్లో ప్రామాణికతకు పెద్దపీట వేస్తారు, హిపోక్రసీని సహించరు, కానీ అనైతికతపట్ల మాత్రం ఉదారంగా వ్యవహరిస్తారెందుకో అంటాడు కూట్సీ.

కళాసృజన విషయంలో గాని, సత్యశోధనలో గానీ పూర్తి స్పష్టతను ఆశించడం సరికాదనే వాదనను నిరూపించే క్రమంలో సెబాల్డ్ (W. G. Sebald) నవల ఔస్టలిట్స్‌లో (Austerlitz) సూత్రధారుడు ఆపెరా గాయకుల గురించి రాసిన ఒక వివరాన్ని కూట్సీ ప్రస్తావిస్తాడు. ఒకప్పుడు ఈ గాయనులు స్టేజ్ మీద ఉన్నప్పుడు తమ కనుపాపలు పెద్దవిగా చేసుకోవడం కోసం కళ్ళలో బెలడోనా డ్రాప్స్ వేసుకునేవారట. కంట్లో బెలడోనా కారణంగా వాళ్ళేమీ స్పష్టంగా చూడగలిగేవారు కాదు కాని, వాళ్ళ కళ్ళు స్పష్టంగా కాంతులీనుతూ కనపడి ప్రేక్షకులకు వారు మరింత సౌందర్యవతుల్లా కనిపించేవారు. ఇలా చేయడం వల్ల వారి గాయకప్రతిభలో వచ్చిన మార్పేమీ లేదు. కాని, అది వారి ప్రదర్శనను ప్రేక్షకులు మరింతగా ఆస్వాదించడానికి సహాయపడుతుంది. ఇలా, ఒక విషయంలో నైపుణ్యాన్ని సాధించే క్రమంలో సృజనకు కాస్త పట్టువిడుపులు ఉండడం అవసరం. ఈ పట్టువిడుపుల వల్లనే సృజనాత్మకతతో కూడిన కళారంగంలోనూ, భావోద్వేగాలతో నిండిన మనోప్రపంచంలోనూ వివిధ రకాలైన నూతనోత్తేజాలకు ఆస్కారం ఉంటుంది. మానసిక చికిత్స, సృజనాత్మకత అనే రెండు దారులూ సరిగ్గా ఇటువంటి సందర్భాల్లోనే కలుస్తాయి.

కథలన్నీ అన్యాయంపై న్యాయం సాధించే విజయంగా ఉంటే పాఠకులకు రుచిస్తుంది. తప్పు చేసినవాడికి శిక్ష పడి తీరాలనుకుంటారు పాఠకులు. అలా కాని పక్షంలో ‘అంత ఘోరమైన పాపాలకు పాల్పడి అలా ఎలా తప్పించుకుని సుఖంగా ఉంటాడు!’ అనుకుంటాడు సగటు పాఠకుడు. సినిమాలలో హీరో విలన్‌ని కొడితే మనం ఉత్సాహంగా చప్పట్లు కొడతాం. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం గెలిచాయని సంతోషపడతాం. ది స్కార్లెట్ లెటర్, డాన్ కిహోటే, గాన్ విత్ ది విండ్ లాంటి కథల్ని మంచి కథలుగా నిలబెట్టేది ఈ న్యాయభావన (notion of justice) మాత్రమే అంటాడు కూట్సీ. ఉదాహరణకు కథానాయకుడు తన అనైతికమైన గతాన్ని తిరగరాయాలని ప్రయత్నించి విఫలమవ్వడం జగద్ధర్మం గురించి చెబుతుంది. అదే అతడు తన గతాన్ని సులభంగా దాచిపెట్టి సుఖసంతోషాలతో కడదాకా జీవించాడని చెప్పే కథ పాఠకులకు రుచించదు. ఎందుకంటే అందులో న్యాయాన్యాయాల ప్రసక్తి లోపిస్తుంది కనుక.

సంగీతకారులు, చిత్రకారులు, రచయితల వంటి కళాకారులందరూ మనకు మనం విధేయులుగా ఎలా ఉండాలో నేర్పిస్తారు. మన అనుభవాల సాపేక్షకతత్వం కారణంగా లోపాలతో సహా మన ప్రామాణికతను అంగీకరించడం తప్ప మనకు మరో దారి లేదని రుజువు చేస్తారు. ఒకనాటి ప్యూరిటన్ వ్యవస్థలో కన్ఫెషన్ తీసుకునే చర్చ్ ఫాదర్ స్థానాన్ని, ఈనాటి మతాతీత సంప్రదాయంలో కళాకారులు భర్తీ చేస్తున్నారు.

The art I love seems to say this to me: ‘Look at what is going on around you – in all its richness and detail and colour, its beauty and its ugliness; don’t stop looking and thinking about what you see; but also don’t forget that it is you who are looking, that you have a position and a place from where you look – and so do other people. Inhabit that place fully.’

మనసులో భారం దింపుకోడానికి పుస్తకపఠనం ఒక మంచి చికిత్స అయితే రాయడం ఒక మంచి ఆత్మచికిత్స అవుతుంది. రాయడం అనే సెల్ప్ థెరపీ వల్ల మంచి చెడులు విశ్లేషించుకునే అవకాశం వస్తుంది. మనం చేసిన తప్పులకు అక్షరరూపం ఇవ్వడానికి, ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోడానికీ ఉపయోగపడుతుంది. మనం నిద్ర పోతున్నప్పుడు కూడా మనలో కళాకారుడు మెలకువగానే ఉంటాడు. కాల్పనికవాదం సృష్టించిన కథలలో కళాకారుడి లోపలి గాయం కీలకాంశం. అతణ్ణి మెలకువగా ఉంచేది ఆ గాయమే, దాని తాలూకు వేదనే. తన గాయాన్ని మాన్పుకోడానికి కళాకారుడు కళను సృష్టిస్తాడు. సత్యాన్ని పూర్తి వెలుగులో చూసే సాహసం లేకనే తన లోపలి భయాలకు, అంతఃసంఘర్షణలకూ సృజనను సాధనంగా చేసుకుని కాల్పనిక లోకాలకు రూపకల్పన చేస్తాడు. తద్వారా తన గాయాలనుండి ఉపశమనం పొందుతాడు. కథకుడికీ, మామూలు మనుషులకూ తేడా ఏమిటంటే, కథకుడు పూర్తి స్పృహతో తనలో అన్ని భావోద్వేగాలనూ జడ్జిమెంట్ లేకుండా అనుభవిస్తాడు. నైతికానైతికతలకు అతీతంగా తనలో చెలరేగే భావాలకు నిజాయితీగా అక్షరరూపమిచ్చే ప్రయత్నం చేస్తాడు. దీనికి భిన్నంగా సాధారణ వ్యక్తులు తమలో లోపాల్ని అణచివేసే/ అధిగమించే ప్రయత్నం చేస్తారు. సంఘానికి భయపడో, సిగ్గుపడో తమలో చెడుని దాచుకునే ప్రయత్నం చేస్తారు. ఆ సంఘర్షణ కొన్నిసార్లు వారి జీవితాన్ని కబళిస్తుంది కూడా. రచయితే లేకపోతే మామూలు మనుషులకి మనలో లోపాలను గురించి మాట్లాడటానికి సరిపడే భాష ఉండేది కాదని కొందరి భావన. రచయిత కథలను చెప్పడం ద్వారా మనల్ని మనం ఎలా మెరుగుపరుచుకోగలమో, కలవరపరిచే గతం నుండి విముక్తి ఎలా సాధించగలమో నేర్పిస్తాడు.

అలా నేర్పించేది ఒక మంచి కథ. ఎ గుడ్ స్టోరీ.