ఈపాటికే అతనొచ్చేసి
ఆ నది ఒడ్డున తోచిందేదో
రాసుకుంటూ చదువుకుంటూ ఉంటాడు
లేదూ
చదివేందుకూ రాసేందుకూ ఏముందని
కలాన్నీ కాలాన్నీ ఆ నదిలోకే విసిరేశాడో

ఆగి నిలబడి చూసినా
నాది కాదనే అనిపించే లోకం.
దిగులు బుడగకు బయటే స్థిరపడి
అనుభవానికి రాని సౌందర్యం.
ఘడియఘడియకీ సముద్రాలు దాటి వెళ్ళే
పక్షిరెక్కలతో మనసు.

లోకపు పచ్చి వాసనలను
కప్పి పెడుతున్న
రాత్రి

కన్ను పొడుచుకున్నా
కానరాని చీకట్లలో
కరుకు గొంతుకతో
గాలి హూంకరిస్తున్న
రాత్రి

ఒక్కటే ఉంటుంది
మనిషి కథ

కాకపోతే
ప్రచురించటానికి
ప్రపంచాన్ని మొదలెట్టాలి
మళ్ళీ
అదే శూన్యం నుండి

అర్జీలు పెట్టొచ్చు
దేబిరించవచ్చు
ఫేసుబుక్కులోకి పోయి స్టేటస్ పెట్టొచ్చు
ఏడ్చి అలమటించవచ్చు
రొప్పుతూ రోజుతూ బతుకు గడిపేయొచ్చు
రక్తం కక్కుకుంటూ చచ్చిపోనూ వచ్చు
చెయ్యడానికి ఎన్నిలేవు? (గొప్ప దేశభక్తులుగా మారి)

నీకు తోచిందేదో నువ్ చెప్తుంటావ్
వాడేదో ఆలోచిస్తూ వింటూంటాడు
నీకేదో తెల్సినట్టు నువ్వనుకుంటావ్
వాడికేదో తెలియనట్టు వాడనుకుంటాడు
నేను చెప్పింది వింటాడా అని నువ్వనుకుంటావ్
వీడు చెప్తోంది చెయ్యాలా అని వాడనుకుంటాడు

ఎదురెదురుగా వున్న రెండు దేహాలు
ఒక్కోసారి రెండు కెరటాలు
రాత్రి ఒక సముద్రం.

ఎదురెదురుగా వున్న రెండు దేహాలు
ఒక్కోసారి రెండు శిలలు
రాత్రి ఒక ఎడారి.

కవుకుదెబ్బలే​-​
చీకట్లో ఉఫ్ ఉఫ్‌మని
ఊదుకొమ్మంటోంది
నువ్వు కట్టుకున్న
పేక ముక్కల
​గీర మేడల్లో ​
ఎవరికీ తెలీకుండా
ఘొల్లుమని
ఏడవమంటోంది

విశ్లేషిస్తూ ప్రశ్నల్తో నేను
విపులీకరిస్తూ జవాబుల్తో నువ్వు
ఒకటొకటిగా చెరిగిపోతూ సంకోచాలు
రెక్కలు విచ్చుకొంటూ ఆనందాలు
సరాసరి ఇద్దరం
సర్దుకొంటూ మనసు

రోజు రోజూ నేనేం లెక్కపెట్టుకోను
మారే ఋతువుల నసలు పట్టించుకోను

ఉన్నదొక్కటే దేహం
మనసుకొక్కటే పంతం

ఈ చల్లటి గాలిలో
స్వేచ్ఛగా ఎగురుతున్న తూనీగనై
కొన్ని సార్లైనా
ఏ పందెపు గాలానికీ చిక్కకుండా
ఏమీ ఆలోచించకుండా
దేనికోసమో పరుగులెత్తకుండా
ఇలా వుండనీ

తెల్లని జాజుల గంధం మోస్తూ పిల్లగాలి
వయ్యారంగా ఊగిసలాడే వంగపూలు
ఊసులలో తేలిపోతూ నల్లటి హంసల జంట
హరివిల్లు పానుపు పవ్వళిస్తూ మేఘమాల

గట్టెక్కక పట్టుబడక
ఒట్టిచేతుల మెట్టమాటల
మొనాటనీ గుటకల గటగట
మధ్యకుట్టులో మూతపడ్డ పుస్తకం
మిథ్యా వాస్తవ మీటలపై
వేలికొనల పలవరింతల
డ్రిప్ డ్రాప్ డ్రిప్ డ్రాప్

సంక్రాంతికి బయట నాలుక్కూడలిలో
మా చేత వేయించిన భోగిమంట గుర్తుందా?
ఆ మంచు కురిసిన పొద్దున్న మంట దగ్గిర
నీ చేయి పట్టుకుని చలి కాచుకుంటూంటే
మా ఇద్దర్నీ తలోవైపూ పట్టుకున్న
నీ చేతుల్లో నేనున్నానంటూ ఇచ్చే ధైర్యం
మేము నీకు తీర్చలేని బాకీ

కొన్ని మోహాల్లోనో దాహాల్లోనో
నీకై నీవే చిక్కుకున్నప్పుడు
తప్పదు
చెదరిన
గడ్డిపరకల గూటినే
మమకారంగా వెతుక్కునే పిట్టలా
ఈ వేదననిలా భరించాల్సిందే

మట్టిరంగు ఆకుపచ్చ అంచు
కొత్త కొత్త ఆశలు, ఆకాశం హద్దు
అక్షింతల్లా మంచు కురుస్తూంది మోహనంగా
మెరుస్తూంది తెల్లని వెలుగుల్లో
నిద్దరోతూంది నిబ్బరంగా నీడల్లో.

మలుపులన్నీ తిరిగి తిరిగి
మన కథ కంచికెళ్ళిపోతుంది

నా నుంచి నీ వైపుకు వెళ్ళే దారి
ఒకే ఒక ఉత్తరం ముక్కకీ
ఓ సంక్షిప్త వాక్యానికీ మాత్రం తావుంచి
పూర్తిగా మూసివేయబడుతుంది

నా చిన్ని పెరటిలో పూసిన పువ్వులు
చూడలేదని నిన్ను నిష్టూరమాడాను
నువ్వు నడచి వచ్చిన అడవి ఆరోజున చూశాక
ఎంతటి సిగ్గుతో ముడుచుకుపోయాను
నా అల్పత్వాన్ని చూసి ఎంత నొచ్చుకున్నావో గదా!