రచయిత వివరాలు

పూర్తిపేరు: శ్రీపాద గోపాలకృష్ణమూర్తి
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:

 

త్యాగరాజస్వామి సంగీతానికే ప్రాముఖ్యత ఇచ్చినట్లు చక్కగా సాక్ష్యం ఇస్తాయి ఇలాంటి కీర్తనలు. నేటి తెలుగు సంగీతవిద్వాంసులకు కొందరికి త్యాగరాజుకున్న కీర్తనాసాహిత్యమ్మీద ఆయనకంటే ఎక్కువ ప్రేమ! అది అరవవిద్వాంసుల నోటిలో నలిగిపోతూంటే వీరు పద్యాలు పాడినట్టు కీర్తనలు అనేసి సాహిత్యాన్ని చక్కగా రక్షిస్తున్నారు. కలవవు రెండు కళలు! సంగీతమూ, సాహిత్యమూ కూడా కలవవు. వింత యేమిటి? ఇవి ఆదిలో వేరుగా పుట్టేయి, భరతముని చేర్చికట్టినా, కాలక్రమ వికాసంలో వేరైపోతున్నాయి. అస్తు.

అసలు కవిత్వమూ, గానమూ వేర్వేరు కళలు. పద్యమూ, రాగమూ ఈ వేర్వేరు కళలకి సంబంధించినవి కాబట్టి అవీ వేర్వేరే గాని చేరిక గలవి కావు. “సంగీతమపి సాహిత్యం సరస్వత్వాః కుచద్వయం” అంటే రెండూ ఎప్పుడూ కలిసే వుండాలి అనే అర్థము కాదేమో అంటాను. రాగానికి సాహిత్యం లేదు, మిలిటరీ బ్యాండుకి లేదు, శ్రీకృష్ణుని వేణుగానానికీ లేదు. అలాగే గద్యలో రాగం లేదు. ఏకవీర, మాలపల్లి నవలల్లో గొప్ప కవిత్వము ఉంది. రాగము లేదు.

కీర్తనల్ని వాగ్గేయకారులు పాడుతూనే రచిస్తున్నారు. త్యాగరాజు, క్షేత్రయ్య, రామదాసూ తమ కీర్తనల్ని పాడేశారు గాని, సాహిత్యం ముందు కట్టుకుని స్వరములు వేరే కట్టుకోలేదు. అంటే, కీర్తనలోని రాగం అసలుతో చేరే బయటపడుతోందని నా అభిప్రాయం. కీర్తనలోని రాగం పుట్టుకతోనే ఉంది. అల్లాగే పద్యాలతో చేరి రాగాలు రావడము లేదు. వివరంగా మనవి చేస్తున్నా. ఒక్కొక్క కవి ఒక్కొక్క రాగంలో పద్యాల్ని పాడుకున్నట్లు చెప్పేను.

మన తెలుగువారికి త్యాగరాజు తెలుగుదనముతోనేగాని ఆయన కీర్తనా సంగీతంతో నిమిత్తం లేదు. త్యాగరాజు తన కీర్తనలను సంగీతంలో మూర్తీభవించినాడుగాని తెలుగులో మూర్తీభవించలేదు. దక్షిణాదివారు పాపం తెలుగు ఏమీ రాకపోయినా, కీర్తనల సంగీతం కోసం వాటిని వల్లించుకున్నారు. వారితో సంగీతవిద్యలో పోటీ చెయ్యలేక, త్యాగరాజు కీర్తనాసాహిత్యాన్ని అరవలు పాడుచేస్తున్నారూ, మేముద్ధరిస్తున్నామని మనము బోరవిరచి ఉపన్యాసాలిస్తున్నాము. కీర్తనలో సంగీతమే ప్రధానము గనుక సాహిత్యానికి జరిగే ఈ ‘అపచారాన్ని’ గురించి నేటి కాలపు ఆంధ్రాభిమానులు తప్ప త్యాగరాజుగాని, ఆయన శిష్యులుగాని బాధపడియుండినట్టు లేదు.