2. పద్యానికి రాగం నిండు తెస్తుందా?

[ఈ పరంపరలో మొదటి వ్యాసం గతసంచికలో చదవండి.]

అయితే ఎందుకు మరి రాగాన్ని పద్యమ్మీద సవారి చేయించడమూ? అని ప్రశ్న వేస్తే “ఆనందం కోసం” అని జవాబు వస్తుంది. అవును, అదే అసలు కారణం. వినేవారు పద్యం పాటని సహిస్తున్నారంటే ఈ ఆనందానికి లోభించే. కవులు తమ రచనల్ని పరాయి వాళ్ళ చేత పాడించుకున్నారంటే, ఈ సౌందర్యం ఎక్కడ లోపించిపోతుందో అనే. ఈ ఆనందము న్యాయమే అయితే తప్పకుండా లోభనీయమే. “న్యాయమో అన్యాయమో ఆచర్చ నాకక్కర లేదు. నాకు పద్యాలు పాడితేనే బాగుంటాయి” అనే పండితులకి ఒక్క నమస్కారం. వారు వాదానికి అతీతులు. పద్యాల్ని పాడడం అన్యాయమైతే తప్పకుండా మానివేయవలిసిందే అనే వారికోసము రాస్తున్నాను ఈ వ్యాసాలు.

పద్యాల్ని పాడడం అన్యాయమంటున్నాను. కారణాలు మనవిచేస్తున్నాను.

‘ఒకరు ఇచ్చిన కేట్లాగు నుంచుకొనక,
పారవేయుట ఘోరమౌ పాతకంబు’

అనే పద్యం ఎవరికీ రసానందం ఇయ్యదు. ఈ పద్యాన్నే చక్కని రాగవరసతో చదివితే దీనికి విజాతీయ సౌందర్యం చేరుతుందని అందరూ ఒప్పుకుంటారు. ఈ రీతిగానే తాను చేరే పద్యానికల్లా కొద్దో, గొప్పో, అదివరకు లేని కొత్త సౌందర్యం తెస్తుంది రాగం. ఈ అదనపు సౌందర్యం రాగానిదే; పద్యానిది కాదు. ఈ కృత్రిమ సౌందర్యం ఆ సహాయకళ అయిన కవిత్వానికి లోభనీయమూ కాదు, గౌరవప్రదమూ కాదు. ‘చక్కని రాగవరస’తో చదివిన పద్యము వినువారికి హాయి గొల్పును, అట్లు కాదేని అదియొక రొదయగును అన్నారు కాశీభట్ట సుబ్బరాయశాస్త్రిగారు. ఎరువు సరుకు పెట్టుకోకపోతే అందం పాడైపోతుందనడము కాదూ ఇది? (ఇంతటి సుకుమార సంగీతగత ప్రాణులు సాహిత్యంలో ప్రవేశించడంవల్ల వారికీ సుఖం లేదు, సాహిత్యానికి శోభరాదు.) రాగం పద్యానికి ఎరువు సరుకా అంటారేమో? ఆహా. ఎరువు సరుకే. పుట్టుకలో లేకపోయె; కావ్యరూపంగా ప్రపంచాని కిచ్చినప్పుడూ రాగప్రశంస లేకపోయె. ఇంక రాగం మధ్యగాళ్ళు తెచ్చి పెట్టినది కాక మరేమిటవుతుంది?

అసలు కవిత్వమూ, గానమూ వేర్వేరు కళలు. పద్యమూ, రాగమూ ఈ వేర్వేరు కళలకి సంబంధించినవి కాబట్టి అవీ వేర్వేరే గాని చేరిక గలవి కావు. “సంగీతమపి సాహిత్యం సరస్వత్వాః కుచద్వయం” అంటే రెండూ ఎప్పుడూ కలిసే వుండాలి అనే అర్థము కాదేమో అంటాను. రాగానికి సాహిత్యం లేదు, మిలిటరీ బ్యాండుకి లేదు, శ్రీకృష్ణుని వేణుగానానికీ లేదు. అలాగే గద్యలో రాగం లేదు. ఏకవీర, మాలపల్లి నవలల్లో గొప్ప కవిత్వము ఉంది. రాగము లేదు. కాబట్టి ‘కవిత్వమూ, సంగీతమూ ఎప్పుడూ చేరేవుండాలి’ అనడంలో సబబు లేదు. ఇక, రెంటినీ కుచద్వయంతో ఎందుకు పోల్చారు? అంటే, రెండూ శబ్ద సంబంధులు కావడము చేతనేమో అంటాను. సంగీతమూ, సాహిత్యమూ వాక్కుకు సంబంధించినవి. కాబట్టి వాగ్దేవి కుచద్వయమున్నారు.

ఆలాగ అన్నవారే తమ అర్థాన్ని రెండో పాదంలో వివరించారు, చూడండి. “ఏకమాపాతతోరమ్యం, అన్యదాలోచనామృతం.” కుచద్వయం పోలిక రెండోపాదానికి చెల్లదు. సంగీత మాపాతతోరమ్యము. సాహిత్యానికి ఆలోచన కావాలి. ఇవి రెండూ, రెండు సంబంధము లేని కళలు. (కవిత్వము, లేదా) పద్యము మాటలతో ఏర్పడుతుంది. రాగం స్వరాలతో ఏర్పడుతుంది. మాటలకి ‘ఇవీ’ అని అర్థాలుంటాయి. మాటలతో రచించిన పద్యానికి ‘ఇదీ’ అని ఒక దండాన్వయ ముంటుంది. ఆయా మాటలకి ఆయా అర్థాలు ఎరిగినవారికందరికీ దండాన్వయం ఒక్కటే. దీని ద్వారా పొందే ఆనందము మాత్రం వ్యక్తుల సంస్కారాన్ని బట్టి వుంటుంది. కవిత్వము మతిగల మానవులకు మాత్రమే అందుతుంది. రాగానికి అర్ధమంటూ ఏదీ లేదు. రాగము యొక్క సంబోధనము భాష తెలిసిన మానవత్వానికి కాదు, సర్వజీవుల్లోనూ వున్న చైతన్యానికి. కవిత్వం భావాల్ని చెప్పి చెప్పి గింజుకుంటున్న సమయంలో రాగం అందుకుంటుంది ‘అమ్మా, ఆకలేస్తోందే’ అంటాము; ‘కడుపు మాడుతోందే’ అంటాము; ‘అబ్బ అన్నం పెట్టవే’ అంటాం. ఇంకా ఏమేమిటో అంటాం. ఈ భావాల్నన్నిటినీ ‘మ్యావు’ అన్న ఒక్క పిల్లి అరుపులో మాత్ర కట్టి ఇచ్చేస్తుంది నాదం. సంగీతమూ, సాహిత్యమూ చేరి నడిచే కళలు కావు. కవిత్వానికి అందని ఎత్తులకి సంగీతం ఎగురుతుంది. దాని క్షేత్రము వేరూ, దీని క్షేత్రము వేరూనూ.

పద్యానికి అందం తెచ్చే పరిస్థితులూ, రాగానికి అందం తెచ్చే పరిస్థితులూ వేరు. పద్యానికి భావం పూర్తి అయేటట్టు చేసే విరుపులూ, మాటల ప్రాధాన్యతని తెలిపే ఉదాత్తానుదాత్తాలూ అందం తెస్తాయి. పద్యం చదువుకున్నప్పుడు మాటలు వేటికవి తెలిసి పోవాలి. లేకపోతే భావాలు సరీగ్గా అవగాహన కావు. రాగానికి గమకాలూ, సంచారవైలక్షణ్యతా అందం తెస్తాయి. గమకం అంటే స్వరము యొక్క కంపము. (అంటే స్థైర్యానికి విరోధి) తోడి రాగములోని రిషభము చలనశీలి. నిలిచి వినేబడదు. గమకాలన్నీ చలన శీలత్వం కలిగినవే. ఆరోహణమూ, అవరోహణమూ అనే గమకాలీ సత్యాన్ని చక్కగా చూపిస్తాయి. మన సంగీతానికి నిలిచి వినిపించే స్వరాలకంటే, గమించే వాటి అంతరాలే అందం. రాగము స్వరాల ప్రవాహం, ఆ ప్రవాహంయొక్క గమనంలో పైకాలపు స్వరముల గుత్తులూ, మొదటి కాలపు స్వరాల జారులూ (ఆరోహణమూ, అవరోహణమూను), సంచార వైలక్షణ్యతా అందాలు.

పద్యానికి గురులఘుబద్ధమైన గతి వుంది. వచనంలో లేని ఈ గతివల్ల పద్యానికి ఠీవీ, నడకా అలవడ్డాయి. వచనము పాకుతుంది. పద్యం అడుగుతీసి అడుగువేస్తూ నడుస్తుంది.

“ఆంధ్రక్షమామండ లాఖండలుండైన
వేమభూపతి కృపావీక్షణంబు”

అని చదివినప్పుడు యతి అక్షరాలమీద నొక్కులు సీసపద్యగతినీ,

“మెలత నడవినుంచి మృగమువెంటనె పోయె రామచంద్రు బోలు రసికుడేడి”

అని చదివినప్పుడు ఇంద్రగణాల వేర్పాటు ఆటవెలది గతినీ స్ఫురింపజేస్తాయి. పద్యాల కన్నిటికీ వాటి వాటికి విలక్షణమైన నడక లున్నాయి. ఈ నడకలకి అన్నిటికీ ప్రత్యేకమైన అందముంది. ఒకదాని అందం మరొక దానిది కాదు… రాగానికి గతి అంటూ ఏదీ లేదు. రాగం నడవదు, ప్రవహిస్తుంది. మందప్రవాహమూ, శీఘ్రప్రవాహమూ తప్ప ఒకరకపు గతి అంటూ లేదు రాగానికి. అటు కూడదీసుకుంటూ, ఇటువైపు దగ్గిరగా తోసుకుంటూ, గిరగిరా తిరుగుతూ, గవ్వలు గిలకరించినట్లు, మువ్వలు మోగినట్లు, లత పాకినట్లు, చక్రం తిప్పినట్లు సాగిపోతుంది రాగం.

పద్యం నడక భూమిమీదే. ఒక పెద్ద అడుగూ ఒక చిన్న అడుగూ వేసుకుంటూ పటాలంలాగా, తెడ్ల నావలాగా సాగిపోతుంది పద్యం. ప్రాచీన కవులు పద్యం నడకని మదపుటేనుగు నడకతోనూ, గుర్రం నడకతోనూ పోల్చారు. పద్యం నడక సమతలభూమి మీదే. ఒకే స్థాయిలో ఉంటుంది పద్యం. ఆపులూ, జారులూ, ఊపులూ మాత్రం వుంటాయి… రాగం ఏనుగు ఈదినట్టూ, నావ సముద్రతరంగాలమీద తూగినట్టూ, గాలికి మన ఉత్తరీయం తూగినట్టూ, నిమ్నోన్నతాలతో ఊగుతుంది. రాగం చేసే సంచారం విహాయస పథంలో; నేలమీద కాదు, రాగానికి జీవం పైషడ్జం దగ్గరచేసే సంచారమని ఆరియకుడివారి నమ్మిక. రాగానికి అల్లికే అందమని శమ్మంగుడివారి ఆశయం. వాయించినదానికంటే ధ్వనింపజేసే భాగం అందమని నాయుడుగారి ఉద్దేశం. ఇవన్నీ రాగసంచారాన్ని ముగ్గురు మూడువిధాలుగా జీర్ణము చేసుకున్న రీతులు. అన్నిటిలోనూ రాగం చేసే నిమ్నోన్నత సంచారం వ్యక్తమౌతూనే వుంటుంది. ఒక స్వరం దాటితే రెండోదానికి దిగడమో, ఎక్కడమో వుంటుంది. పద్యంలో ఒక గణం దాటితే అంతకన్న పొడుగుదో పొట్టిదో మరోగణము వస్తుంది. కాని దిగడమూ, ఎక్కడమూ వుండదు.

కాబట్టి పద్య గమనానికీ, రాగ గమనానికీ పోలిక లేదు. పద్యానికి అందం తెచ్చే అంశాలకీ, రాగానికి అందం తెచ్చే అంశాలకీ పోలిక లేదు. దాని సౌందర్యం దీనికీ, దీని సౌందర్యం దానికీ విజాతీయం.

“విజాతీయమైతే కావచ్చును గాని విరోధముందని ఏమిటి నిశ్చయం?” అని అడుగుతారేమో. విరోధము అసలే లేదనీ, పైపెచ్చు సహకారము కావలసినంత వుందనీ వాదించేవారున్నారు. వారి వాదానికి సారము ఇది —”ప్రతికళయందు కొంత విశిష్టమైన మేలిమియు కలదు. అట్టి కొదవయు గలదు. ప్రతికళయు తనయందలి కొఱత నెఱుగును గావుననే తన ప్రధానధర్మమును చక్కగా నెరవేర్చటకు ఇతర కళల సాహాయ్యము నపేక్షించును” అని. కవిత్వము స్థూలభావములనే ప్రదర్శించగలదు గాని సూక్ష్మాతిసూక్ష్మభావములను ప్రదర్శించలేదనీ, గానమీ పనిని నెరవేర్చగలదు కాబట్టి సాహిత్యపు స్థూలభావాలకి గానము సూక్ష్మసూక్ష్మతరభావాల్ని చేర్చినట్లయితే బంగారానికి తావి అబ్బినట్లుంటుందనీ వారి అభిప్రాయము.

మాటవరసకి ఇది నిజమే అనుకుందాం. అయినప్పుడు, ఏ కవి పద్యమునైనా పదిమంది పాడినప్పుడు, ఆ పదిమందిలో ప్రతి ఒక్కరూ, ఆ కవిగారి స్థూలభావాలకి తమ సూక్ష్మతిసూక్ష్మభావాల్ని చేర్చారన్నమాటే కదూ! నన్నయగారి పద్యాలికి మన సూక్ష్మాతిభావాల్ని చేర్చడము ఆయన కపచారము కాదూ. ఒకవ్యక్తి ఒక ఉపాఖ్యానాన్ని పాడి వినిపించాడంటే అందులో ఈయనగారి సూక్ష్మసూక్ష్మాతిభావాలు దండిగా చేరతాయి. మరోవ్యక్తి పాడి వినిపిస్తే ఆయన భావాలు చేరతాయి. కవిగారి భావాలకి ఎవరికి తోచిన సూక్ష్మభావాల్ని వారు చేర్చినట్లే అవుతోంది మొత్తానికిది. నటరాజు విగ్రహానికి మనము రంగు పూయడము వంటిదే ఇది. అమ్మయ్యో! నా కంత అహంకారము లేదు.

గానము కవిత్వానికి నిండు తెస్తుందా? అసలు తేగలదా? అనే ప్రశ్న వేసుకుని ఇప్పుడు తర్కిస్తాను. నిండు తేవడమంటే పద్యసౌందర్యము వ్యక్తమయ్యే పరిస్థితులకు వ్యతిరేకి కాకుండా, తన సౌందర్యాన్ని పద్యానికి చేర్చడము. రాగం ఈ సత్కార్యాన్ని అసలే చెయ్యలేదంటున్నాను. రాగం రాణించగల పరిస్థితులకీ, పద్యం రాణించగల పరిస్థితులకీ చుక్కెదురు. ఒక పద్యం యొక్క భావం శ్రోతలకి చక్కగా, సుళువుగా అందాలంటే ఆ పద్యంలోని అర్థమూ, వ్యంజకశక్తి, పోహళింపులోని సౌందర్యమూ చక్కగా వ్యక్తమయేటట్టు కావ్యపఠనం జరగాలి. రాగానికి అందం తెచ్చే అంశాలే వేరు. స్వరాల స్ఫుటత్వమూ, గమక సంపదా, ఆరోహణావరోహణాల వక్రవేగ సౌందర్యమూ – ఇవి బాగుంటే రాగం బాగుంటుంది.

పద్యంతో రాగాన్ని కలిపి పూన్చినప్పుడు పద్యపఠనానికి అందం తెచ్చే సాధనాలు రాణిస్తూనే వుండి, ఈ సాధనాలకి తోడు రాగానికి అందం తెచ్చే సాధనాలు కూడా రాణిస్తే పద్యగానం కవిత్వానికి కోరదగినదే. కాని అసలు జరిగేదేమిటీ? పద్యానికి రాగాన్ని చేర్చి నడిపినప్పుడు అటు పద్యపఠనానికి అందం తెచ్చే సాధనాలూ, ఇటు రాగానికి అందం తెచ్చే సాధనాలూ చెక్కుకు పోతాయి. ఎలాగు చెక్కుకు పోతాయో వివరిస్తాను, చిత్తగించండి.

పద్యంలోని అక్షరాల గురులఘుభేదాన్ని స్ఫుటంగా ఉండనీయక, గమకాలు వాటిని సాగతీస్తాయి. తమంతట తామే రంజించే శక్తి కలిగిన స్వరాలు తాము పట్టుకునే అక్షరాలకన్న మెరుగెక్కి మాటల్ని నాదంలో ముంచుతాయి. ఒకే మట్టంలో సాగిపోయే పదముల యొక్క స్వరాలను రాగంలోని ఆరోహణావరోహణాలు కిందికీ మీదికీ వంచేసి పదముల పోహళింపు సౌందర్యాన్ని చెడగొట్టతాయి. మాటల వ్యంజకశక్తిని పోషించే ఉదాత్తానుదాత్తాలు, స్థాయీభేదమే నైజంగా గల స్వరాల సంచారంలో చెక్కుకుపోతాయి. ఛందోగతివల్ల పద్యానికి రావలసిన విలక్షణ సౌందర్యాన్ని రాగగతి మింగేస్తుంది.

అదీ పద్యానికి రాగము చేసే కీడు. ఇక సాహిత్యం రాగానికి చేసే కీడును పరికిద్దాం. అక్షరాల గురులఘు భేదం ఎక్కడ విపరీతంగా లోపించి పోతుందో అని గమకాలు మొగమాటపడి లోపించిపోతాయి. ప్రతి స్వరమూ తన స్ఫుటత్వాన్ని అక్షరము యొక్క క్రీనీడలో చేరివుండే నిరూపించుకోవలసిన అవసరముంటుంది. కనుక, రాగాలాపనలోని గమక సౌందర్యమూ, స్వరముల స్ఫుటత్వమూ పోయి రాగము ఆరోహణావరోహణాల సౌందర్యము మీదనే ఆధార పడుతుంది. కాబట్టి పద్యానికి రాగం చేరిస్తే, రాగము తన సౌందర్యాన్ని కొంత త్యాగము చేసి పద్యసౌందర్యాన్ని కొంత లోపింపజేసి దాన్ని అధిష్ఠిస్తోంది. రాగంలో పోయేవి గమకాలూ, పద్యానికి పోయేవి ఉదాత్తానుదాత్తాలూను. రాగము యొక్క చైతన్యం గమకాలూ, సాహిత్యంయొక్క చైతన్యం ఉదాత్తానుదాత్తాలూను! పద్యగానమంటే చైతన్యం వినా సంగీత సాహిత్యాలన్న మాట!

“కీర్తనలు కూడా అంతేనా?” అని అడుగుతున్నారు కొందరు. ఆహా. అంతే. కీర్తనలలో సంగీతానిదే రాజ్యము. సాహిత్యము కీర్తనలోని సంగీతానికి బంటు. సంగీత సాహిత్యాలు కలవవు. కలిపితే ఏదో ఒకటి తరుక్కు పోయిందన్న మాటే. తొలిరోజుల్లో ఆట, తరువాత పాట, తరువాత మాటా పుట్టాయని సంస్కృతిపరులందరూ ఒప్పుకునే మాటే. ఆటకి ‘భాష’ చాలనప్పుడు మాటలతో కలిసిన పాట అతరించింది, భరతాచార్యుల కాలంలోని క్రీడనీయకాలకి నాట్యమూ, స్వరతాలపదాశ్రయమైన గాంధర్వమూ, అభినయమూ కూడ వలసివచ్చింది. అంతకు ముందు ఈమూడూ వ్యాప్తిలో ఉండనే ఉన్నాయి. కాని మహేంద్రవిజయధ్వజ నాటకంలోనికి వీటిని మూడింటినీ గ్రహించి నృత్యగీత వాద్యాలకి సభాగౌరవం కలిగించినవాడు భరతాచార్యుడు. స్త్రీపురుషుల అన్యోన్య ప్రేమకి సంబంధించి వుండడము చేత స్వరతాలపదాశ్రయమైన గాంధర్వాన్ని బౌద్ధులు బహిష్కరించారు. కాని జన సామాన్యానికి ఈ కళలలో గల అభిమానాన్ని బట్టి వాద్యసంగీతాన్ని మట్టుకు ఊరేగింపుల్లో బాహాటంగా ఉపయోగించుకున్నారు అని జాతక కథల్నిబట్టి తెలుస్తుంది. వీణావాదనమూ, దాని కనుగుణంగా నృత్యం చెయ్యడమూ రాజుల అంతఃపురాల్లో ఉండేవి. నృత్యగీత వాద్యాలు మాత్రం మారుడి సాధన సామగ్రి గానే చూపించారు బార్హతు శిల్పులు. మహాయాన బౌద్ధంతో నృత్యగీత వాద్యాలు భూలోకంలోకి దిగేయి.

(అమరావతి శిల్పంలోని ‘సర్వతోభద్రము’ చూడండి) కాని కీర్తనలకి పూర్తిగా ఆంక్ష తొలిగి పోలేదు. (నాగార్జునకొండలో పంచాసికుని గానానికి బౌద్ధులు చెవులలో వేళ్ళు పెట్టుకున్నారు.) గానమూ, తక్కిన కళలూ పూర్తిగా అడుగున పడిపోకుండా రాజులు కాపాడేరు. (కాళిదాసు అజుడిచేత “ప్రియ శిష్యా లలితే కలావిధా” అని ఏడిపించాడు) సముద్రగుప్తుడి చేతిలో వీణ ఉంది అతని నాణేల్లో. జంత్రగాత్రాలు నాట్యంనించి విడిపోయాయన్నమాట గుప్తుల కాలం నాటికి! జంత్రమే లేని నోటిపాట అజంతాలో కిన్నరదంపతుల్లో కనబడుతోంది. కాని అప్పటికీ సంగీతమనబడే నృత్యగీత వాద్యాల చేరికకి గౌరవం ఉన్నట్టుగా హర్షుని ‘రత్నావళి’ సాక్ష్యమిస్తుంది. కవులూ, సంగీతశాస్త్రకారులూ నృత్యగీత వాద్యాలకే సంగీతము అని పేరు పెట్టారు. కాని ‘అన్యులు’ రాగమూ, స్వరమూ, తాళమూ చేరిందికూడా సంగీతమే అన్నారట.

నేడు మనం ‘సంగీతం’ అనే కళ 12వ శతాబ్దం నాటికి నాట్యం యొక్క బానిసత్వంనించి పూర్తిగా తప్పుకునేటంత పెరిగిందన్న మాట. జయదేవుడూ, మీరాబాయీ మొదలైన వాగ్గేయ కారుల ధర్మాన్న సంగీతసాహిత్యాల చేరికకి సత్త ఏర్పడింది. కాని కృష్ణరాయల కాలంవరకూ జంత్ర గాత్రాలకే ప్రాధాన్యత, కీర్తనలలో చాలా చరణాలుండేవి. వాటినిండా అక్షరాలే, తాళ్ళపాక వారు పల్లవీ, అనుపల్లవి, చరణమూ అనే మూడింటినీ వాడి కీర్తనా శిల్పాన్ని పెంచారు. క్షేత్రయ చౌకకాలంలో పదాల్ని రచించి రాగానికి కీర్తనలో ఎక్కువ చోటు కల్పించాడు. త్యాగరాజస్వామి సంగతుల పద్ధతిని ప్రవేశపెట్టి కీర్తనలోని సాహిత్యాన్ని గుర్రంమీది నుంచి దింపి రాగాన్ని గుర్రమ్మీది కెక్కించారు. తోడి శివరామయ్య వంటివారి ధర్మాన్న రాగాలకి సభాగౌరవం కలిగింది. ఈనాడు వేణువుకీ, వీణకు, ఫిడీలుకీ, జలతరంగిణికీ కచేరీలు కల్పించి, రసికులు సాహిత్యసాహచర్యం లేని సంగీతాన్ని గుర్తించుకుంటున్నారు, గ్రామొఫోను ధర్మమా అని నాయడుగారి వంటి సంగీతోపాసకుల రాగాలాపనకే స్వతంత్ర స్థాయి కలిగింది. కాలక్రమాన్న మీరూ, నేనూ ఊహించలేనంత చిత్రంగా… సంగీతము సాహిత్యాన్ని ఒక్క తాపు తంతుంది. అస్తు.

కాగా, కీర్తన ఇంకా సంగీతానికి ఆధారమాత్రంగా పట్టుకుని వ్రేలాడుతూన్న సాహిత్యానికి ఉదాహరణం. కీర్తనలో సంగీత సాహిత్యాలు గంగాయమునాల్లాగ కలిసివున్నాయనీ, అరవలు సాహిత్యాన్ని పాడుచేస్తున్నారనీ జరిగే ప్రచారం మనల్ని వెనక్కి యీడుస్తోంది. కీర్తనా సాహిత్యాన్ని ఎవరూ వేరే పాడు చెయ్యనక్కర లేదు. అక్షరస్వరాల కాలంనించి (రాగస్వరూపాన్నీ ఆరోహణావసానాన్నీ చూపించే) అనుపల్లవి కాలానికి, అక్కడనుంచి సాహిత్యాన్ని చిందరవందర చేసే చౌకకాలపు పదాలకీ, తరువాత సాహిత్యాన్ని ముక్కలుగా కొట్టేసే సంగతుల కాలానికీ జరిగిన వాగ్గేయకారులే మరికొంత కాలానికి సాహిత్యాన్ని ఒక్క తాపు తంతారు. కాబట్టి సంగీత సాహిత్యాల ప్రత్యేకతని మనం ఎంత త్వరగా గుర్తించుకుంటే అంత మేలు. గుర్తించుకోకుంటే ఆకళలు ముందుకి సాగిపోతాయి. మనమే వెనకపడతాము. పద్యంలోని రాగం సాహిత్యాన్ని పట్టి ఈడిగిల బడుతూన్న సంగీతం. దాన్ని ఒక్క తాపుతన్నండి అంటాను.

(ప్రథమ ప్రచురణ: భారతి పత్రిక. సర్వజితు చైత్రము. 1947.)