చాలా ఏళ్ళ కిందట నేనెరిగిన ఒక అయోమయపు పెద్దాయనకు నేను చెప్పినదాకా మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడొకడు ఉంటాడని తెలియదు. ఆయన ఎన్నో ఏళ్ళుగా పాటలు విని ఆనందించేవాడు కాని అవన్నీ సుశీలా, ఘంటసాలా తదితరులంతా తమంతట తాముగా “అనుకుని” పాడుతున్న పాటలనుకునేవాట్ట. తరవాతి తరాల శ్రోతలకు మాత్రం వివిధ్ భారతి ప్రసారాల ధర్మమా అని ప్రతి సినిమా పాటకూ రచయిత ఎవరో, సంగీత దర్శకుడెవరో తెలుసుకునే అవకాశం కలిగింది. అంతకు ముందు రేడియో సిలోన్ ద్వారా పాటలు పాప్యులర్ అయాయి కాని ఈ వివరాలు తెలిసేవి కావు. పేర్లు తెలియడంతో బాటు పాటలను రూపొందించేవారి గురించిన సమాచారం కూడా అందుబాటులోకి వచ్చింది. ఉత్తమ సినీ సంగీతదర్శకుడికి సంగీతాన్ని గురించి కేవలం శ్రవ్యపరమైన అవగాహన ఉండడమే కాక సంగీతం దృశ్యపరంగా, భావపరంగా, ప్రేక్షకులపై ఎటువంటి ప్రభావం కలిగిస్తుందో కూడా బాగా తెలుస్తుంది. తన సినిమాలకు తానే సంగీతం సమకూర్చుకున్న మేధావి సత్యజిత్ రాయ్ ఒక సందర్భంలో సినీ సంగీతం గురించి చెపుతూ “నేపథ్య సంగీతం దర్శకుడు తెర మీద వ్యక్తీకరించదలుచుకున్న విషయాన్ని అండర్‌లైన్ చెయ్యాలి” అన్నాడు.
మంచి సంగీతదర్శకుడికి (కనీసం ఆనాటి స్వర్ణయుగంలో) తెలియవలసిన ఇంకా అనేక విషయాలున్నాయి. పాటలో కవి చెప్పదలుచుకున్న భావాలూ, కథలోనూ, సన్నివేశంలోనూ ఇమిడిపోయే ట్యూన్ నిర్మాణమూ, గాయనీగాయకుల పటిమను వెలికితీసే ప్రతిభా, వివిధ వాయిద్యాల అనుకూలతలూ, మొత్తంమీద వినేవారికి కలగవలిసిన ఆడియో ప్రభావమూ వీటిలో ముఖ్యమైనవి. ఇవికాక ట్యూన్ తన కాళ్ళమీద తాను నిలబడగలగాలి. ఉదాత్తత కోల్పోకుండా, చవకబారు అనిపించకుండా, ఆధునికం అనిపిస్తూనే ప్రజాదరణ పొందాలి. సినిమా ఆడినా ఆడకపోయినా పాట కలకాలం నిలవాలి. (నీలిమేఘాలలో పాట తెలియని తెలుగువారుండరు. బావ మరదళ్ళు సినిమా గురించి ఎంతమందికి తెలుసు?)
2006 మే 5వ తేదీన బొంబాయిలో 87 ఏళ్ళ వయసులో కాలం చేసిన నౌషాద్ కొన్ని దశాబ్దాలుగా ఎనలేని గౌరవం పొందాడు. అతను మరణించినప్పుడు అతని జీవిత విశేషాలను గురించి వివరంగా రాయని పత్రిక లేదు. ఏ షారుఖ్‌ఖాన్ లేదా అమితాభ్ బచ్చన్ పెంపుడు కుక్కకో జలుబు చేసినప్పుడు మాత్రమే హడావిడి పడిపోయి, అదొక ముఖ్యవార్తలాగా కవర్ చేసే బొంబాయి జర్నలిస్టులందరూ ఏనాడో మరుగునపడిపోయిన నౌషాద్ గురించి ప్రత్యేకవ్యాసాలు రాశారు. అందుకు కారణమేమిటి? నౌషాద్‌ను హిందీ సినిమా సంగీతానికి ఆదిపురుషుడనలేం. అందరికన్నా ఎక్కువ పాటలను స్వరపరచాడనీ కాదు. డబ్బు సంపాదనపరంగా కాని, పాప్యులారిటీని బట్టిగాని అతనికి అగ్రస్థానం లభించదు. ఇతర సంగీతదర్శకులలో అతనికున్న ప్రత్యేకత ఎటువంటిది? నౌషాద్ జీవితవిశేషాలను చాలా పత్రికలు ప్రచురించాయి కనక వాటి గురించి మళ్ళీ వివరంగా చెప్పుకో నవసరంలేదేమో. అతని సంగీతపు విశిష్టతను గురించి నా అభిప్రాయాలను పంచుకోవడమే ఈ రచన యొక్క ఉద్దేశం. తక్కిన ప్రొఫెషనల్ రంగాలలాగే సినిమా సంగీత దర్శకులు ఒకవంక గత వైభవాన్నీ, తమ పాత పాటలకు లభిస్తున్న ఆదరణనూ అస్వాదిస్తారు కాని వర్తమానకాలంలో చేతినిండా పని ఉన్నవాడిదే విజయం అనే భావన వారిని వెన్నాడుతుంది. 85 ఏళ్ళు దాటాక 2005లో తాజ్‌మహల్ అనే సరికొత్త సినిమాకి సంగీతాన్నందించిన నౌషాద్ అజయ్ చక్రవర్తి, హరిహరన్ మొదలైనవారి చేత పాడించిన పాటలు ఆనందాన్నీ, ఆశ్చర్యాన్నీ కూడా కలిగిస్తాయి. మియాఁ మల్హార్ మొదలైన జటిలమైన శాస్త్రీయ రాగాల్లో ఆయన మధురమైన బాణీలు కట్టాడు.
మనదేశపు సినిమాల్లోని అనేక అవాస్తవిక అంశాల్లో ముఖ్యమైనది సంగీతం. వాస్తవికతను మరిచిపోగలిగితే మన సినిమాపాటలకు సినిమాలతో సంబంధం లేనటువంటి ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంది. అది ప్రజల సంగీతంగా నిత్యజీవితంలో ఒకప్పటి జానపద సంగీతపు స్థానాన్ని ఆక్రమించేసింది. కొన్ని మంచి సినిమాపాటలు సంప్రదాయ సంగీతాన్ని పోలిన “శాశ్వతత్వం” సంపాదించుకున్నాయి. మనదేశపు సంగీతంతో సంపర్కం కోల్పోనంతవరకూ, లేదా పూర్తిగా విడనాడనంతవరకూ ఇటువంటివాటికి త్వరలో మరుగున పడే ప్రమాదం ఉండదు. మన సంగీత సంప్రదాయాలకు ప్రాంతీయ భేదాలున్నాయనేది తెలిసినదే. రకరకాల భారతీయ భాషల్లోని సినిమా పాటలు ఈ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఇవన్నీ పాత బాణీలకు కొత్త సంగీతరూపంలో కొన్ని దశాబ్దాలనుంచీ దేశంలో ప్రతి మూలకూ శ్రోతలకు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు ప్రతి ప్రాంతంలోనూ ముస్లిం మతస్థులూ, హిందీ, ఉర్దూ భాషలు తెలిసినవారూ ఉండడంతో వీటిలో ఎక్కువ ప్రాచుర్యం పొందినవి హిందీ సినిమాపాటలే. దాదాపు 70 ఏళ్ళ క్రితం టాకీలు మొదలైనప్పటి నుంచీ మన దేశపు సినిమాల్లో సంగీతం ప్రధాన ఆకర్షణ అయింది. మొదట కలకత్తా, తరవాత బొంబాయి, మద్రాసు వగైరా నగరాల్లో పెద్ద ఎత్తున మొదలైన చిత్రనిర్మాణంతో బాటు సంగీతదర్శకులూ, గాయనీగాయకులూ, వాద్యకారులూ అందరూ పేరు సంపాదించి, పరిశ్రమలో ప్రధాన అంశం అయిన సంగీతాన్ని అందించసాగారు. వీరిలో నౌషాద్ ముఖ్యుడు.
సినిమా సంగీతానికి పితృసమానుడని అనిల్ బిశ్వాస్‌ను ఎవరో పొగడబోతే ఆయన వారిస్తూ ఆ బిరుదుకు నిజంగా అర్హుడైనవాడు ఆర్. సీ. బోరాల్ అనీ, తనను కావాలంటే పినతండ్రిగా అనుకోవచ్చనీ ఛలోక్తి విసిరాడు. 1937 ప్రాంతాల్లో తానొక యువకుడుగా ఉత్తర్ ప్రదేశ్ నుంచి బొంబాయికి వచ్చినప్పటికే అనిల్ బిశ్వాస్ సంగీత దర్శకుడుగా పనిచేస్తున్నాడని నౌషాద్ ఒక సందర్భంలో చెప్పాడు. ప్లేబాక్ లేని ఆ రోజుల్లో ఔట్‌డోర్ షూటింగ్ చూడటానికి నౌషాద్ కొత్తగా వెళ్ళినప్పుడు ఏదో సినిమాకి ట్రాలీ షాట్ తీస్తున్నారట. అక్కడ అనిల్ బిశ్వాస్ ఆర్కెస్ర్టాని కండక్ట్ చేస్తూ, వెనక్కి నడుస్తూ గోతిలో పడ్డాడట. తబలాలూ, హార్మోనియం అన్నీ మెడల్లో కట్టుకుని వాయిస్తూ అందరూ మైక్ రేంజ్‌ని దాటకుండా ఉండవలసి వచ్చేదనీ, ప్లేబాక్‌తో ఆ పరిస్థితులు మారాయనీ నౌషాద్ వివరించాడు. అతని శకం అటువంటి రోజుల్లో మొదలైంది. అప్పట్లో బెంగాలీ పద్ధతిలో కలకత్తాలో తయారైన సంగీతానిదే పెద్దపీట. కొంత శాస్త్రీయం, కొంత స్థానిక జానపదం, కొంత రవీంద్ర సంగీత్ కలిసిన ట్యూన్లు బోరాల్, తిమిర్ బరన్, పంకజ్ మల్లిక్ మొదలైన నిష్ణాతుల చేతుల్లో జనాదరణ పొందిన సినిమాపాటలుగా అందరినీ ఆకట్టుకోసాగాయి. వీటిలో ఈడుస్తూ, సాగదీస్తున్నట్టు వినబడే బెంగాలీ గాత్రధోరణిని తొలగించినవాడు కె.ఎల్.సైగల్. తెలుగులో ఘంటసాలలాగా తానున్నంత కాలమూ పోటీ అనేది లేకుండా సాగిన అతని జైత్రయాత్ర అపూర్వమైనది. అప్పట్లో బొంబాయిలో కొందరు పంజాబీ, ఉత్తరాది శైలిలో ట్యూన్లు చెయ్యగలిగిన సంగీత దర్శకులుండేవారు కాని సైగల్‌తో సరితూగగలిగిన గాయకులు లేరు. ఒకప్పుడు హిందీ సినిమా గాయకుల్లో మకుటంలేని మహారాజుగా వెలిగినవాడతను.
యువకుడుగా నౌషాద్
కె.ఎల్.సైగల్ బొంబాయికి తన నివాసం మార్చుకున్నాక 1946లో షాజహాన్ చిత్రంలో నటించాడు. దానికి సంగీత దర్శకుడు నౌషాద్. అప్పటికే నడివయస్సు పోకడలతో, అనారోగ్యంతో కనిపించే సైగల్ ఆ సినిమాలో ఒక కవి పాత్రలో కనిపిస్తాడు. అతని ప్రేమ సఫలం కూడా కాదు. అయినా ఈ నాటికీ ఆ సినిమాలో చెప్పకోదగినవల్లా సైగల్ పాటలే. కుర్రతనంలో నౌషాద్ బొంబాయి చేరినప్పటికే సైగల్ చాలా పెద్ద స్టార్. నేను విన్న ఒక ఇంటర్‌వ్యూలో ఏదో సందర్భంలో మొదటిసారిగా తనకు బట్టతలతో కనిపించిన సైగల్‌ను గుర్తించలేకపోయానని నౌషాద్ చెప్పాడు. తన పేరు విని విస్తుపోయిన నౌషాద్‌ను చూసిన సైగల్ నవ్వి “సినిమాల్లో నువ్వు చూసేది నా విగ్గు నాయనా” అన్నాట్ట. తరవాత షాజహాన్ చిత్రం రికార్డింగ్‌కి తాగి వచ్చిన సైగల్‌తో నౌషాద్‌కు నానా ఇబ్బందులూ కలిగాయట. పైగా పాట బాగా రావటానికి సైగల్ తన డ్రైవర్‌ను పిలిచి “కాలీ పాంచ్” పట్టుకురమ్మన్నాడట. హిందూస్తానీ సంగీతంలో “కాలీ పాంచ్” అంటే ఆరున్నర శ్రుతి. సైగల్ భాషలో అది “మందు” సీసాకు ముద్దుపేరు. ఆ ప్రయత్నాన్ని వారిస్తూ నౌషాద్ ఆ మర్నాడు తాగకుండా రమ్మని సైగల్‌ను బతిమాలుకున్నాట్ట. మైకం లేకుండా పాడిన తన పాటలన్నీ బాగా వచ్చాయని గమనించిన సైగల్ నౌషాద్‌తో “నీవంటి యోగ్యుడు నాకు మునుపే పరిచయమై ఉంటే బావుండేది” అన్నాట్ట. ఆ సినిమాలో రూహీ మేరే సప్నోంకీ రానీ అనే పాటలో చివరి పంక్తి సైగల్‌తో పాడతానని కోరిన అప్పటి యువగాయకుడు రఫీ గొంతు కూడా ఆ పాటలో వినిపిస్తుంది. అందులో (సింధు) భైరవిలో సైగల్ పాడిన జబ్ దిల్ హీ టూట్‌గయా అనే పాట సైగల్‌కు ఎంత ఇష్టమంటే ఆయన చివరి కోరిక ప్రకారం అంత్యక్రియల సందర్భంలో నౌషాద్ తన ఆర్కెస్ర్టా చేత ఆ ట్యూన్ వాయింపించాడట. అస్తమిస్తున్న సైగల్ తేజం, ఉదయిస్తున్న నౌషాద్ ప్రతిభా కలిసిన అద్భుత సమ్మేళనాన్ని షాజహాన్ పాటల్లో మనం చూడవచ్చు.
షాజహాన్ చిత్రంలో సైగల్
1919లో లక్నోలో జన్మించిన నౌషాద్ అలీ కుటుంబంలో సంగీతం ప్రసక్తి ఉండేదికాదు. చిన్నప్పుడు మూకీ సినిమాలకు సందర్భాన్నిబట్టి తెర ఎదుట కూర్చున్న వాద్యబృందం సంగీతం వాయిస్తూంటే అతను ముగ్ధుడై వినేవాడట. హార్మోనియం రిపేర్లతో మొదలైన అతని సంగీతపు పిచ్చి క్రమంగా బలపడటంతో 1937 ప్రాంతాల పద్ధెనిమిదేళ్ళ వయసులో తండ్రిని ఎదిరించి బొంబాయికి పారిపోయి వచ్చేశాడు. అక్కడ కొత్తలో కాలు నిలదొక్కుకునేందుకు అతను చాలా అవస్థలు పడవలసివచ్చింది. ఆ వివరాలన్నీ నౌషాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
(http://www.indianmelody.com/naushadarticle1.htm)
పియానిస్టుగానూ, అసిస్టెంట్ సంగీతదర్శకుడుగానూ సినిమాల్లో పని మొదలుపెట్టిన నౌషాద్‌కు గురువు వంటివాడు ఖేమ్‌చంద్ ప్రకాశ్. మహల్ చిత్రంలో 1949లో లతా పాడిన ఆయేగా ఆయేగా పాటతో ఈనాటికీ అందరికీ గుర్తున్న ఖేమ్‌చంద్ ప్రకాశ్ అంతకుముందు కె.ఎల్.సైగల్ నటించిన తాన్‌సేన్ మొదలైన ఎన్నో సినిమాలకు చక్కని సంగీతం అందించాడు. 1950లో తన 43వ ఏటనే చనిపోయిన ఖేమ్‌చంద్ ప్రకాశ్ సంగీతపు ఛాయలు కొన్ని నౌషాద్ పాటల్లో మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు మహల్‌లో లతా పాడిన ముష్కిల్ హై బహుత్ ముష్కిల్ అనే పాట ఆ తరవాత బైజూబావ్‌రా కోసం నౌషాద్ చేసిన బచ్‌పన్‌కీ ముహబ్బత్‌కో అనే పాటకు మాతృకలాగా అనిపిస్తుంది.
ఖేమ్‌చంద్ ప్రకాశ్
సితార్ విద్వాంసుడైన రవిశంకర్ తన పుస్తకంలో “సినిమా సంగీతమంతా తక్కువ రకమైనది కాదు. అందులో నౌషాద్‌వంటి ప్రతిభావంతులు కొద్దిమంది ఉన్నారు” అని రాశాడు. ముగలే ఆజంలో తాన్‌సేన్‌కు బడే గులామలీ చేత ఖయాల్ పద్ధతిలో పాడించడాన్ని మాత్రం తప్పుపట్టాడు. పదహారో శతాబ్దంలో ఖయాల్ పద్ధతి ఇంకా మొదలుకాలేదనేది తెలిసిన సంగతే. బైజూ బావ్‌రాలో అమీర్‌ఖాన్ చేత పాడించినప్పుడు కూడా అదే పొరపాటు జరిగిందని చెప్పవచ్చు. అందులో పతాక సన్నివేశంలో పోటీకి బైజూకు డి.వి.పలూస్కర్, తాన్‌సేన్‌కు అమీర్‌ఖాన్ పాడారు. టైట్‌ల్ సంగీతానికి కూడా అమీర్‌ఖాన్ చేత పూరియా ధనాశ్రీ (పంతువరాళిని పోలినది) రాగంలో పాడించారు. షబాబ్‌లో మళ్ళీ అమీర్‌ఖాన్ ముల్తానీ రాగంలో ఒక ఖయాల్ పాడాడు. ఇవన్నీ నౌషాద్ పెద్ద గాయకులతో చేసిన మంచి ప్రయత్నాలు. ఇదికాక నౌషాద్ ఆర్కెస్ర్టాలో ఇమ్రత్‌ఖాన్, రయీస్‌ఖాన్ వంటి మేటి సితార్ విద్వాంసులూ, రామ్‌నారాయణ్‌వంటి సారంగీ నిపుణులూ, శివకుమార్ శర్మవంటి ఉత్తమ సంతూర్ వాయిద్యకారులూ అనేకసార్లు పాల్గొన్నారు. బడే గులామలీని తాను మొదట సంప్రదించినప్పుడు ఆయన పాడటానికి నిరాకరించాడనీ, ముగలే ఆజం దర్శకుడైన కె. ఆసిఫ్ మాత్రం తన మొండిపట్టు వదలలేదనీ నౌషాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. “ఇదెక్కడి గొడవయ్యా బాబూ, నేను ఏకంగా పాతిక వేలిమ్మని అడుగుతాను, మీ డైరెక్టర్ పారిపోతాడు” అన్నాట్ట ఉస్తాద్‌గారు. అయినా నౌషాద్ చెప్పినట్టే జరిగింది. కోరినంతా ఇచ్చి ఆసిఫ్ ఆయన చేత పాడించాడు.