సంగీతమూ సాహిత్యమూ సమపాళ్ళలో మేళవించబడ్డ ఈ పాట అనే ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమయ్యిందో తేల్చి చెప్పడం కష్టమే. అనగనగా, చారిత్రకంగా ఫలానా తేదీ అని నిర్ణయించలేని కాలంలో, ఓనాడు జానపదం పుట్టింది. తరువాత్తరువాత ఆ పల్లెపదం పాట అయ్యింది. అన్నమయ్యను ఆశ్రయించి భక్తీ రక్తీ రంగరించుకుంది. త్యాగయ్య ఇంట మెట్టి రాగ తాళ సహిత కీర్తనగా రూపొందింది. క్షేత్రయ్య ప్రేమలో జలజలించి జావళీగా మారింది. అక్కడినుంచి దేశమంతా సంచరించి చివరికి రంగస్థలం ఎక్కింది. అలా మహారాష్ట్రపు “లావణీ”ల ద్వారా స్టేజీ ఎక్కిన పాట, టాకీ సినిమాల నీడన చేరి, పొంకం బింకం పొదవుకొని, ఈనాటి వరకూ తన హొయళ్ళతో మనల్ని ఆకర్షిస్తూనేవుంది.
తొలిరోజుల్లో బాగా ప్రాచుర్యం పొందిన పౌరాణికాల్ని, ఆ నాటక ఫక్కీ చెడకుండా అలాగే యధాతథంగా చలనచిత్రాలుగా మలచేవారు. అందువల్ల రంగస్థలం మీద బాగ పాడగలిగినవాళ్ళే నటీనటులుగా తెరమీద కూడా కనిపించి, తమ పద్యాల్నీ పాటల్నీ తామే పాడుకొనేవారు. ఆ కారణం చేతనే తొలినాటి సినిమాపాటలో శబ్దాడంబరం, సంగీత, స్వర ప్రాధాన్యతా మెండు.
రానురానూ ఆ ధోరణి తగ్గి భావప్రాధాన్యత పెరగడం ప్రారంభమయ్యింది. ఈ పెంపు పరిపక్వమైంది బహుశా వాహినీవారి “వందేమాతరం ” తోనో సారథీవారి “మాలపిల్ల ” తోనో.
ఏది ఏమైనప్పటికీ ఆనాటి పాటల్లో నాటకాల బాణీ మాత్రం బాగా ఉండేది. రంగస్థలంతో సంబంధమున్నకవులే సినిమాలకూ పాటలు వ్రాసేవాళ్ళు. ఆ విధంగా ఆనాడు నాటకకవులుగా ఉన్నచందాల కేశవదాసు, పాపట్ల కాంతయ్య, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, దైతా గోపాలం వంటి కవులు తొలినాటి సినిమాపాటలకు సృష్టికల్పన చేశారు. ఈ పాటలన్నీ గ్రాంధిక భాషా గుబాళింపులతో నిండి, వాటి స్వరగతులు కీర్తనా పద్ధతిలోగానీ మరాఠీ నాటక మెట్లతోగానీ వుండేవి.
బలిజేపల్లి ఆ రోజుల్లో నాటకాలకు వ్రాసిన “మాయామేయ జగంబె నిత్యమని సంభావించి…” వంటి పద్యాలుతిరుపతివెంకటకవుల పద్యాలతో పోటీపడి దీటుగా నిలిచేవని అంటారు. ఆయన సినీరంగానికి వచ్చి, వాహినీ స్టూడియోలో మట్టినేలపై కూర్చుని, పాటల్ని డిక్టేట్‌చేస్తూవుంటే వ్రాయసగాళ్ళు వ్రాసుకొనేవారట!
ఇక దైతా గోపాలం గారు ఆ రోజుల్లోనే నటనలో, కథా, కవితా రచనలో, గానంలో, దర్శకత్వంలో, ఔత్సాహికులకు శిక్షణనిచ్చేవారట. అలా ఆయన వద్ద శిష్యరికం చేసినవారిలో వేటూరి సుందరరామ్మూర్తి ఒకరు.
వీళ్ళ తరువాత బ్యాచ్‌కవులుగా సముద్రాల, పింగళి, మల్లాది, సదాశివ బ్రహ్మం, తాపీ ధర్మా రావు, దేవులపల్లి కృష్ణ శాస్త్రిని చెప్పుకోవచ్చు.
శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారిని ఓసారి ఇంటర్వ్యూ చేయబోతే “ప్రశ్నలు నువ్వడుగుతావా ప్రశ్నలూ నేనే వేసి సమాధానాలూ నన్నే చెప్పమంటావా?” అన్నారట. ఆ కోవలోకి చెందినవారే సముద్రాల రాఘవాచారి. అందమైన పాట వ్రాసి ఆ పాటకు తగిన సన్నివేశాన్ని కూడా ఆయనే సూచించి వివరించేవారట.”హృదయ విహార”, “వేదాంత వధువు” వంటి అర్ధవంతమైన దుష్ట సమాసాలతో పాటు, మా వదిన సుకుమారి వదిన మంగళకర వదిన వంటి చిలిపి ప్రయోగాలు ఆయన రచనల్లో కోకొల్లలు.
“రాదే చెలీ నమ్మరాదే చెలీ మగవారినిలా నమ్మరాదే చెలీ”
“ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా
తరువుకు కాయ భారమా కనిపెంచే తల్లికి పిల్ల భారమా”
ఇలా ఆయన కలం నుండి జాలువారిన ఆణిముత్యాలు, వేనవేలు.
దాదాపు ప్రతి సినిమాలో సముద్రాల పేరు కనిపించేదారోజుల్లో. ఆయన పేరు చాలు సినిమా అమ్ముడుపోవటానికి. కానీ ఆయనవిగా చెలామణీ అయిన పాటల్లో శైలీభేదాలు గోచరిస్తాయి. ఆ పాటల్లో ఆయన కుమారులు సముద్రాలజూనియర్(రామానుజాచారి) రచనలు కొన్ని కాగా, మిగిలినవి ఒక మహామహుడి సృష్టి. సముద్రాల ఆరోగ్యం క్షీణించిన దశలో ఆయనతో గల మైత్రీబంధం వల్ల ఈ మహానుభావుడే ఆయనపేరిట రచన సాగించాడని పరిశ్రమలో చాల మందికి తెలుసు. ఆ మనీషి పేరు మల్లాది రామకృష్ణ శాస్త్రి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఘోస్ట్‌రైటింగ్‌అనేది బహుశా ఆయనతోనే ప్రారంభమైయింది! ఆయన రచనల్లో “దేవదాసు” (జగమేమాయ…), “దొంగ రాముడు” (చిగురాకులలో చిలకమ్మా…) వంటివి సముద్రాల పేరిట చెలామణీ అయ్యాయి.
అచ్చతెనుగు నుడికారాలకు గుడికట్టి పూజించారాయన తన పాటలతో. సంస్కృతాంగ్లాలలో తమకున్న పాండిత్యం వల్ల ఆయా భాషాకవుల స్వరపద సంయోగాల్ని తెనుగీకరించిన స్రష్ట ఆయన. A thing of beauty is a joy forever అన్న కీట్స్‌కవితలోని సారాన్ని “అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం” అంటూ సొగసుగా తెలుగులోకి నిక్షేపించడం ఆయనకే చెల్లింది. చాలామంది కవులూ, కథారచయతలూ ఈయన ఏకలవ్య శిష్యులుగా వుంటూ ఈయన పలుకుబడులనీ, వాక్య నిర్మాణాన్నీ అనుకరించి అనుసరించేవారు ఆరోజుల్లో.
శ్రీ మల్లాదిలానే ఇతర భాషా సాహిత్యం లోని శబ్ద చమత్కారాన్ని తెలుగులోకి తెచ్చి పాటకు ఒక ఛెమక్కు ఒక తళుక్కు అద్దిన పదచిత్రకారులు పింగళి నాగేంద్రరావుగారు. తెలుగు సినిమా చరిత్రను ఎవరన్నా వ్రాస్తే ఆయనకొక విశిష్ట అధ్యాయం కేటాయించాలి. అంతటి ప్రజ్ఞావంతులు ఆయన. ఉటోపియా వంటి నవలలు, మర్చెన్ట్‌ఆఫ్‌వెనీస్‌వంటి నాటకాలు, యులిసిస్‌వంటి గ్రంధాలు చదివి, వాటిలోని పాత్రల స్వరూప స్వభావాలు ఆకళింపు చేసుకొని, ఆ వేషభాషల్ని, రూపురేఖల్ని తమ పాత్రలకు ఆపాదించి రచించడం ఆయన ప్రత్యేకత. విజయా వారి ఆస్థాన కవిగా మాయాబజార్, మిస్సమ్మ, పాతాళ భైరవి, పెళ్ళి చేసి చూడు, వంటి చిత్రాల రచనలో, పాత్రల సృష్టిలోని నేర్పు, సంభాషణల్లోని సహజ సౌందర్యం, ఔచిత్యం, చమత్కారం, దేనికదే మన్మోహకం, మధుమాధ్వీకం, ముగ్ధమనోహరం.
నిక్షేపరాయడు, హాంఫట్, హై హై నాయకా, వీరతాడు, సాహసం శాయరా డింభకా, అలమలం… వంటి తమాషా అయిన గ్రామ్య ప్రయోగాలు, సంస్కృత పాళీ ప్రాకృత భాషల్ని మధించి ఆయన వెలికిదీసిన అమృతాంశుకిరణాలు, అనర్ఘ రత్నాలు. “లాహిరి లాహిరి” పాటలో లాహిరి అనే మాటను మత్తుకు, మైకానికీ పర్యాయపదంగా ఉపయోగించడంలోనే ఆయన కవితా వైభవం, సాహితీ అంతస్తూ మనకు అవగతమౌతాయి. “ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయ్”, “రసపట్టులో తర్కం కూడదు”, వంటి నిగూఢత ధ్వనించే మాటలు “కలవరమాయె మదిలో”, “ఎంత ఘాటు ప్రేమయో”, వంటి భావ పరిమళం అలమిన పాటలు పింగళివారు మనకు వదిలివెళ్ళిన అమూల్య సంపద.
ఇహ కృష్ణ శాస్త్రి గారి విషయానికొస్తే మల్లీశ్వరి ఒక్కటి చాలు ఆయన మృదుకవితా రీతిని మననం చేసుకోవడానికి. ఆ సినిమాలో ఏపాటకాపాట మన్మధ తూణీరం లోని విరిబాణం లా, విన్నవారి మనసుల్ని కొల్లగొడుతూ, మల్లీనాగరాజుల అమాయక ప్రేమకథను అజరామరం చేశాయి.మల్లెపూరేకుల్లాంటి ఆయన మాటలు, ఘంటసాల భానుమతుల గళమాధుర్యాన్ని ఊతజేసుకొని సాలూరివారి సంగీతపు తేరునెక్కి,తెలుగు పలుకున్న ప్రతి ఇంటా ఈనాటికీ వినిపిస్తూనేవున్నాయి వుంటాయి.
ఇటువంటి అసమానప్రతిభావంతుల మధ్య నిలదొక్కుకొని తమ కవితా సౌరభాల్ని తమ వంతు సేవగా తెలుగు సినిమాకు పంచి ఇచ్చిన కవులలో చెప్పుకోదగ్గవారు కొసరాజు, ఆరుద్ర, ఆత్రేయ, ఇంకా శ్రీశ్రీ.
జానపదగీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది కొసరాజు రాఘవయ్య చౌదరి.”ఏరువాక సాగాలోరన్నో…” అంటూ సేద్యగాళ్ళకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పినా “రామయతండ్రి ఓ రామయ తండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రీ” అని గుహుడి చేత శ్రీరాముడ్ని ఏరు దాటించినా ఆయాపాటల్లో ఆద్యంతం కొసరాజు ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. డబ్బింగ్‌సినిమాల రచనతో రంగంలోకి వచ్చి నేరుపాటలు వ్రాసేంతగా నిలదొక్కుకున్న విద్వత్తు, విద్యుత్తు ఉన్న కవులు శ్రీశ్రీ, అరుద్రలు.
కమ్యూనిస్టు కవిగా బ్రాండు పడని ముందు రోజుల్లో ఆ ప్రజాకవి భావకవిత్వాన్ని అల్లినా, వాటిల్లో ప్రభావకవిత్వం ప్రబోధకవిత్వం అంతర్లీనంగా ద్యోతకమయ్యేది. “అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగునదాగి సుఖమున్నదిలే”, “ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే అనురాగపుటంచులు చూద్దాం ఆనందపు లోతులు తీద్దాం”, వంటి మచ్చుతునకల్ని అందిస్తూనే కారులో షికారుకెళుతున్న పసిడి రంగు చిన్నదాని చీర గురించి చెబుతూ “చిరుగుపాతల బరువుబ్రతుకుల నేతగాళ్ళే నేసినారు, చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో” అంటాడు శ్రీశ్రీ తన మహాప్రస్థానానికి ఆనాడే శ్రీకారం చుడుతూ.
[సంపాదకుల నుంచి ఓ మాట: కారులో షికారు పాట ఆత్రేయది; శ్రీశ్రీ మహాప్రస్థానం రాసిన చాలా కాలానికి సినిమాలలోకి వెళ్ళటం జరిగింది; ఈ విషయాల్లో ఈ వ్యాసం పొరబడినా చాలా విషయాలు మా పాఠకులకి ఆసక్తి కలిగిస్తాయని వ్యాసంలో ఏమీ మార్పులు చెయ్యకుండా ఉంచేశాం. ఎవరు ఏ పాట రాశారు, ఎప్పుడు రాశారు లాటి సమాచారం ఈ వ్యాసానికి కేంద్రం కాదు గనక వాటి నిజానిజాల గురించి పాఠకులే తేల్చుకుంటారని భావిస్తున్నాం.]
ఇక ఆరుద్ర (అసలు పేరు భాగవతుల శివశంకరం) ఆరుద్ర అనగానే గుర్తొచ్చే మరోపేరు బాపురమణ (బాపురమణపేర్లే వేరుప్రాణమొకటే). బాపురమణల “చిత్రకల్పన”కు ఆరుద్ర ఎన్నో మంచి పాటల్ని వ్రాశారు. అంత్య ప్రాసల్లో ఆయన దిట్ట. “భూమ్మీదా సుఖపడితే తప్పులేదురా..”, “ఎదొ ఏదొ అన్నది ఈ మసక వెలుతురూ”, “కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది”, “చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ” ఇలా ఎన్నని చెప్పుకోగలం. ఆంధ్ర సాహిత్య చరిత్రపై ఆయన సాగించిన అనన్యసామాన్యమైన పరిశోధన ఈనాడు “సమగ్రాంధ్ర సాహిత్యం” పేరిట ఆయన కృషికి తార్కాణంగా మన ముందు వుంది. సామ్యవాదం,చిలిపితనం, భాషాపటిమ, భావనాగరిమ కలబోసి కలయంపి చల్లిన ఆరుద్ర కవితా శక్తి అనితరసాధ్యం అమరం.
తర్వాత చెప్పుకోవాల్సింది ఆత్రేయ గురించి. ఆయన మనసుకవి, మనసుకవి. మనిషి, మనసు, ప్రేమ, దుఖం, చావు, బ్రతుకు. అంతూ ప్రేయసీప్రియుల ప్రణయవేదన, విరహం, కోపతాపాలు, తమ పాటల్లో అతి సరళంగా నింపారాయన. ఆయనది అంతరంగ కవిత్వం, అది ఆత్మాంతర్గతమైన అనుభవాల వ్యక్తీకరణ. ఆర్ద్రత,జీవలాలస, ప్రణయ పిపాస, నైరాశ్యం, ఆయన పాటలకు పునాది రాళ్ళు.
ఆతరువాత వచ్చిన వారిలో చెప్పుకోదగ్గవారు సినారే, దాశరథి. సినారే గా పేరుపొందిన సి.నారాయణ రెడ్డి తమ సినీరచనాయాత్ర గురించి “ఆంధ్రజ్యోతి” వీక్లీలో స్వయంగా, ధారావాహికంగా వివరించారు. పటిష్టమైన వాక్యనిర్మాణం, సంస్కృతాంధ్రాల సంయోగం ఆయన కవిత్వంలోని విశేష గుణాలు. దాశరథి కృష్ణమాచారి గారు సినిమాకు వ్రాసింది కొంచమే అయినా పారశీక పరిమళాల్నీ, రుబాయీ రసధార్లనీ తెలుగుపాటకు అద్ది అమృతోపమానమైన గీతాల్ని అందించారు.
ఆ తరువాత వచ్చిన కవులు, మాటల కవులు పాటల కవులు గా విడివడి రచనలు సాగించడం మొదలయ్యింది. అదే సమయంలో తెలుగు సినిమాకు చిలకపచ్చ చీర కట్టి, తరువాత్తరువాత ఆ చీరకొంగే లాగి చిలిపి ఆటలు ఆడిన ఉద్దండపిండం, కొంటెకోదండం ఒకాయన రంగప్రవేశం చేశారు.
ఆయనే వేటూరి!
తొలుత దైతాగోపాలం గారివద్ద, ఆ తర్వాత మల్లాది గారి వద్ద శిష్యరికం చేసి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు తీయించారు శ్రీ వేటూరి గారు.
సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి కొండొకచో సంగ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం, ఇలా ఎన్నో సినిమాలు! “పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు, అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ”, “ఉఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు; స్పందించు నవనాడులే వీణాగానాలు; నడలు ఎదలోని సడులే మృదంగాలు” ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి. గీతరచనకు కేంద్ర ప్రభుత్వం చేత అవార్డును పొందిన ఏకైక తెలుగు సినిమాకవి ఆయన. సీతారామశాస్త్రి వచ్చేవరకూ వేటూరిది దాదాపు ఏకచత్రాధిపత్యం అనే చెప్పుకోవచ్చు.
ఆల్కెమీ అంటే రసవాదం లేదా పరుసవేది. అంటే కొన్ని సాధారణమైన వస్తువుల కలయికతో బంగారాన్ని పుట్టించడం. ఏది ఇంగిలీకమో, ఏది పాదరసమో, ఏది వెలిగారమో, ఏది పాముకుబుసమో, ఎరిగి, సమపాళ్ళలో కలిపి, స్వర్ణతుల్యమైన పాటల్ని ఒడుపుగా పుట్టించిన చెంబోలు సీతారామశాస్త్రి ఒక్క సినిమాతో సిరివెన్నెల సీతారామశాస్త్రిగా స్థిరపడిపోయారు. ఉదాత్తమైన భావాలూ శక్తివంతమైన పదాల్తో సున్నితమైన సులభగ్రాహ్యమైన పాటల్ని వ్రాయడంలో ఆయనకాయనే సాటి.
వీళ్ళు మాత్రమే కాక “కురిసింది వాన నా గుండెలోన” అంటూ రాజశ్రీ, “తనువా హరిచందనమే” అంటూ విజయరత్నం, “ఓహో గులాబిబాల” అని అనిశెట్టి, “నిదురపోరా తమ్ముడా” అని పినిశెట్టి, “నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది” అని గుంటూరు శేషేంద్ర శర్మ ఇంకా వీటూరి, మల్లెమాల, కాటూరి, జాలాది, దాసం గోపాలకృష్ణ, దాసరి నారాయణ రావు, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, సామవేదం షణ్ముఖ శర్మ, భువన చంద్ర, చంద్రబోస్, గురుచరణ్ ఇలా ఎందరో శబ్ద స్రష్ఠలు తెలుగు పాటను పెంచి పోషిస్తూన్న పద పరబ్రహ్మలు.
సినిమా సంగీతానికున్న (వుండాల్సిన) ఒకే ఒక్క గుణం సౌలభ్యం. ఏనాటికీ చెడని సౌలభ్యం. వి.ఎ.కె.రంగారావు గారి మాటల్లో చెప్పాలంటే “దారిని పోయే దానయ్యను సైతం గానయ్యను చేసే” సౌలభ్యం. పాట సాహిత్యం విన్న వెంటనే అర్ధం అయినా కాకపోయినా, సంగీతానికి అనుగుణంగా దాని పదసంచారం ఉన్నంతకాలం, తెలుగు శ్రోతలు వుంటూనేవుంటారు వింటూనేవుంటారు.
[డెబ్భయ్యేళ్ళ సినిమా పాటను గురించి పాతికేళ్ళ నేను వ్రాయబూనుకోవడం సాహసమే. అయితే, నేనిదివరకు చదివిన ఇంద్రగంటి, వి.ఎ.కె, జి.వి.జి, ఇంటూరి ఇత్యాదుల వ్యాసాలు, ఇంటర్వ్యూలు, చెణుకులు నాకు మార్గదర్శకత్వంగా నిలిచి సహాయపడ్డాయి. ప్రత్యేకించి వేటూరి గారు ఆంధ్రప్రభ కిచ్చిన ఇంటర్వ్యూ: అదొక వజ్రాల గని, విజ్ఞాన ఖని. ఇందులో నేను పేర్కొన్న చాలా విషయాలు ఆయన చెప్పినవే. ఈ రచనకై నన్ను ప్రేరేపించిన శ్రీ విష్ణుభొట్ల లక్ష్మన్న గారికి కృతజ్ఞతలు.
ఈ వ్యాసం వ్రాస్తున్నంత సేపూ నా మదిలో మెదిలిన మహానుభావుడొకరున్నారు. హైదరాబాదులో తమ కుమారుడి ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళి కలిస్తే, ప్రేమగా దగ్గర కూర్చోబెట్టుకొని, తెలుగు సాహిత్యం గురించీ,సినిమాల గురించీ,ఆ గానగంధర్వులు తమ గంభీర ధోరణిలో చెప్పిన ముచ్చట్లు నేను జీవితాంతం మర్చిపోలేను. ఆయనే శ్రీ ప్రతివాదభయంకర శ్రీనివాసాచార్యులు (ప్రఖ్యాత గాయకుడు పి. బి. శ్రీనివాస్). ఆరు భాషల్లో అనర్గళంగా, వృత్త యతి ప్రాసాబద్ధమైన కవిత్వాన్ని ఆశువుగా చెప్పగల పాండిత్యం ఉన్నా, నా బోంట్లను ఆదరించి, నా కలం గిలికింపుల్ని చదివి, వెన్నుతట్టి ప్రోత్సహిస్తూన్న ఆయన మంచితనానికి చంద్రునికో నూలుపోగులా ఈ చిరుకానుక]