జారిపోయిన కాలం

చలికాలపు పొద్దులో బద్ధకంగా
కర్మసిద్ధాంతం మేలుభావనవుతూ
బుజ్జగించే మెలకువలమధ్య
ఏ మూలో ఒక చీకటి రొద

ఒకసారి వెళ్ళి ఆ దాక్కున్న నదిలో
మునకేసివద్దామా?
ఇక్కడ ఎవరికి ఎవరు ఏమైయ్యారని
మురికి అవయవాల మధ్య మలినమైన
బ్రతుకు వివరాలన్నీ ఏ భాగీరథిలో
కలిశాయని అడుగుదాం.

ఏదీ ఇటు రమ్మను, వాళ్ళందరినీ!
నియమాల సరిహద్దుల్లో
తాపాల చిట్టాపద్దులు విప్పిద్దాం
నైతికత పొలిమేర దాపుల్లో
ముసుగేసి తొక్కిపెట్టిన రహస్యానందాన్ని
తాత్వికత పేరుతో అచ్చేసి పంచిన
కరపత్రాల చలిమంటలలో.

ఎగజిమ్మే వేడిలో ఉలికిపడుతూ
ఎక్కడో ఎప్పుడో దుప్పటి ముడతల్లో
దొరక్కపోదు జారిపోయిన కాలం.