కేశవా

ఆదర్శనగర్‌ దగ్గర బస్సు చెడిపోయింది. కూచోండి రిపేరుకి పంపించేము అన్నారు. కొబ్బరి బొండాలు కొట్టే చోట బస్సు దిగి కొత్త షూస్‌ బిగించుకుని చెమటలు సముద్రపు గాలికి ఆరుతూ ఉంటే చేపల వాసనలు పీల్చుకుంటూ సొమ్ముల కాపు గుంటలకి హాయ్‌’ చెప్పుకుంటూ కొండ ఎక్కి అవతలికి దిగిపోయేడు. కళ్ళాల నుంచొచ్చి నారాయణ తాతయ్య ఏమీ అనలేదు. తన వైపు చూసేడు నవ్వ లేదు. “ఆదర్శ నగర్‌ దెగ్గిర బస్సు చెడిపోయింది తాతయ్యా కాల్నడకన కొండెక్కి దిగిపోయేను” అన్నాడు. “Nike shoes కొత్తవి చూడు నీకో జత, నాకో జత Factory Outlet Mall లోన కొన్నాను” అని నిలబడితే ఏం మాటాడకుండా మొత్తం మీద నువ్వు వొచ్చేవురా చివరికి అని అంటున్నట్టు కిళ్ళీ రసం ఉమ్ముకుంటూ నవ్వుకుంటున్నాడు. పెట్టి లోపల పెట్టేవా? అమ్మ అన్నం పెట్టిందా?? అని అడిగేడు. ఇంట్లోకెళ్ళి కొత్తది ఎర్ర గావంచా తెచ్చిచ్చి మళ్ళీ వాకట్లో LegenderPolynomial లాగ ఉండ్రంగా కూర్చుని చెప్పులు లేకుండా నెమలితోటి ‘ఉక్క్రూ….. ఉక్కు….క్క్ర్‌..ఊఊ…..’ అని ఆడుతున్నాడు. ‘నేను అలాగ టౌను వెళ్ళొస్తాను’ అని చూరు కిందనుండి వంగి బయటికొచ్చీసేడు. అక్కడయితే కళ్ళంలో తిరగలి దిమ్మల మీదా వ్యాస పీఠం దెగ్గిరా కూర్చుని ఒక నీలం రిబ్బను ఒక బురద రిబ్బను ఆరబెట్టినట్టుండే సముద్రాన్నే చూస్తూ కూర్చోవాలి. ఇంక పదకొండు రోజులే ఉన్నాయి. తను చూస్తూ కూచోలేడు. ఈ పదకొండు రోజులూ. చూరు పడిపోతున్నట్టు అనిపిస్తుంది. చూరు కింద ఉదయం మాత్రం నిలకడగా ఉంటుంది.

నారాయణ తాతయ్య వెర్రోడి లాగ కనిపిస్తాడు. కేశవ రాజూ అంతే. కేశవ రాజు తనకు ఎప్పుడో తెలుసు. చిన్నప్పట్నించీ అదే చూరింట్లో అలాగే గోసి పెట్టుకుని ఉన్నాడు కానీ నారాయణ తాత తనకి ఇప్పుడిప్పుడే తెలుసు. దునియా తనకి తెలిసినట్టు ఒక ‘పిక్చర్‌ ‘ లాగ ఇస్తుంది. తను కూడా దునియాకి ఒక ‘పిక్చర్‌ ‘ ఇస్తాడు. అంటే తెల్లటి చొక్కా వేసుకుని ఒక రకంగా హుందాగా ఏదో ఒక ముక్క నలుగుర్లో అనడాలకి వెళ్ళినప్పుడు. అయితే తను ఇచ్చే పిక్చర్లు ఇవ్వని పిక్చర్లు అమ్మకి తెలుసు, చీలా వాళ్ళ సుజాతకీ Sonja Lumpenbrandt కీ గొల్లపూడి వాళ్ళ మల్లికి, ఇంకా ఆ పరమాత్మకి…అంటే గుంప సోమేశ్వరుడికీ బిటువాడ బిన్ని లింగేశ్వర స్వామికీ తెలిసి ఉండొచ్చును. Educated circles లోన, ముఖ్యంగా ప్రొఫెషనల్‌ సర్కిల్స్‌ లోను, ఇంకా ముఖ్యంగా అమిరికావోడి దెగ్గిర ‘పిక్చర్‌ ఏమో ఏంటో నాకు తెలీదు’ అని అనకూడదు. ‘Absolutely! Its worthy of further investigation!’ అని అనాలి. అయితే ఇప్పుడు బోగాపురం రూటు బస్సులో లేడీ కండక్ట్ర గారితోటి ఇగటాలాడుకుంటూ చిల్లర గురించి ఎదురు చూపుల్లో ఉన్నాడు. శెలవు మీద.

ఇలాటి చోట్ల, ఇక్కడ, ఈ బూర్జ కిష్టాపురం, సివిని, నిడగల్లు, ఆదర్శ నగర్‌ చుట్టుపక్కల అంత ఆదర్శంగా ఉండక్కల్లేదు. ‘ఏమో నాకు తెల్దు దద్దా!’ అని అన్నా పెద్ద తప్పు లేదు.

మెలికల మెలికల రోడ్డు మీద బస్సు ఖాళీగా గాలి గాలిగా ఉప్పు చేపల రధం లాగ దడక్‌ దడక్‌ మని వెళ్తున్నాది. వెనక సీట్లో ఒకతను ఎండుగా నల్లగా చొక్కా లేకుండా నిస్త్రాణగా కిటికీ చువ్వల మీదికి వాలిపోయున్నాడు. తను మెడ్రాస్‌ లో ఉన్న మూడురోజులూ ఇక్కడ వానలు పడ్డాయిట. వానల తరవాత బీచీ ఏడ్చిన తరవాత కడుక్కుని ఒత్తుకున్న మొహం లాగ తేటగా ఉంటుంది. సరుగుడు తోటల్ల్లోకి మధ్య మధ్యన కదుల్తూ వచ్చే నీలం రంగు బురద రిబ్బన్‌ కోసం ఆత్రంగా చూసుకుంటూ ఉంటే రైతుల కుర్రాడు వొచ్చి తన పక్కన కూర్చున్నాడు. కండక్ట్ర గారు ఈ చివర్నుండి ఆ చివరికి బేలన్స్‌ గా అంగలు వేసుకుంటూ వచ్చి “ఏంట్రా అనకొండా ఇంత లేటివ్వాల?” అని టికట్టు కొట్టి చేతిలో పెట్టింది.’నీ పేరు అనకొండా?’ అని అడక్కుండా ఉండబట్టలేదు. అనకొండ మొహమాటంగా నవ్వి దిబ్బ పుస్తకాలని గుండెలకి హత్తుకుని కూర్చున్నాడు. రైతుల మొహాలు రైతుల భార్యలమొహాలు రైతుల పిల్లల మొహాలు తనకి తెలుసు. రైతుల పిల్లలతో చర్చి బళ్ళో కేరేజీలు ఇప్పినప్పుడు ‘8th B’ అంతా పచ్చి ఉల్లి పాయ వాసన ఉలవల వాసన ఎలా అయిపోతుందో సుద్ద ముక్క ధూళిని తుడుచుకుంటూ అన్నాలు తినేటప్పుడు ఎలాగో అలాగే వచ్చి పక్కన కొంచెం దూరంగా రాడ్‌ పట్టుకుని, ఇంకో చేతిలో పెద్ద దిబ్బ దిబ్బ పుస్తకాలూ కేరేజీ పట్టుకుని కూర్చున్నాడు. “ఇప్పుడే టెంత్‌ క్లాస్‌ పేసయ్యేవా?” అని కత్తు కలిపితే ”అవున్సార్‌ …” అని ‘మీదేటి వైజాగా?’ అన్నట్టుగ కళ్ళల్లోకే చూస్తున్నాడు. ” ఎమ్సెట్‌ కిప్రిపేరవుతునావా?” అని అడిగితే దిబ్బ పుస్తకాలు జారిపోకుండా గట్టిగా ఒళ్ళో హత్తుకుని మళ్ళీ ”ఫౌండేషన్‌ తీసుకుంటన్నాను…” అన్నాడు. ” నువ్వేటి పూసపాటి రేగ సెంటరుఫస్టా?” అంటే మిక్కిలి ఆశ్చర్యం తోటి సంబరం తోటి నవ్వుతూ ”మీకెవుల్చెప్పేరు?” అన్నాడు. ” మొహం బట్టి చెప్పీసేను….నీ మొహం నిండా చూడు తెలివితేటలు confidence!” అంటే ఆశ్చర్యంగా ఇష్టంగానే. ”నీ పేరేటివై అనకొండా?” అంటే వాడు జవాబు చెప్పే లోపలే కండక్ట్ర గారు నోట్లు లెక్క చూసుకుంటూనే కలగచేసుకుని ”ఆడసలు పేరు అప్పల్రాజు. ఈడి ఫ్రెండ్సందరూ కల్సి అప్పలకొండా అన్నారు. అనకొండ మూవీ వొచ్చిందెగ్గిర్నుండి ఇంక అనకొండ అనకొండలాగింక అనకొండే ఖాయం చేస్సేఁవు” అన్నాది.

ఈ నీరెండలు పచ్చటి చెట్ల కొండ వాలులు చప్పుడు చేసుకుంటూ గెడ్డలు ఎండాడ అరటి మొక్కలు సముద్రం సెంటర్‌ ఫస్ట్‌ వచ్చిన తన తెలివితేటల మీద నమ్మకం ఇవే మొఖంలో అనకొండకి ఇవన్నీ కళ్ళల్లో ఇంతకంటే ఏం లేకుండా. చూస్తే ఫ్రెండ్‌షిప్‌ నవ్వు నవ్వుతున్నాడు. చూడకపోతే తనని బేగ్‌ ని, షూస్‌ ని అన్నిట్నీ పట్టి పట్టి చూస్తున్నాడు. బావికొండ మలుపు దగ్గర ఒక పిచ్చి మబ్బు ఒక్కర్తి నిలబడి నా బొందో అని కురుస్తోంది. కొండకి అటూ ఇటూ ఎండని పట్టించుకోకుండా. ‘ఎండావానా కుక్కలికీ నక్కలికీ పెళ్ళి’ అని కిటికీలోంచి బయటికి చెయ్యి చాపుతుంటే నవ్వుకుంటూ కొంచెం బాగా దగ్గిరసా జరిగిపోయి “మీరు వాషింగటన్‌ నుండా?” అన్నాడు. “అమ్మా! నీకెవుల్చెప్పేరు?” అంటే మొహమాటంగా దిబ్బ పుస్తకాల మీదికి చూపు దించుకున్నాడు. “మొహం బట్టి చెప్పీసేవా?” అంటే “అచ్చీ…… ఇదా మీ బేగు మీద రాసున్నాది” అన్నాడు. బేగు మీద 16thInternational Conference on Shallow Water Dynamics, Washington, D.C. అనున్నాది. అది చదివి అనకొండ ఏం అనుకున్నాడో ఆదుర్దాగా ” మా చిన్నాన్న కాడికి వైజాగెల్తనాను సార్‌ ! శ్రీ చైతన్యాలో గానీ వికాస్‌ లో గానీ జాయినవుదాఁవనీసి?” అని ఒక ప్రశ్న లాగ అడిగేడు.

వెనక సీట్లో అతను ఎండుగా నల్లగా చొక్కా లేకుండా కిటికీ మీదకి వాలి దగ్గుతున్నాడు. గాలి ఫట్‌ ఫట్‌ మని కొడ్తుంటే మొఖం లోపలికి తీసుకుంటూ. ముందు సీట్లో ఇద్దరు తమ పక్క సీట్లో ఇద్దరు అతనికేసే ఆదుర్దాగా చూస్తున్నారు. వెనక్కి తిరిగి చూస్తే అతను కొంచెం గస పోసుకుంటున్నాడు. తనకి ఏం చెయ్యాలో తెలీలేదు. వాటర్‌ బాటిల్‌ అందిస్తే అందుకోలేదు. ఏమీ అనలేదు. అనకొండే మళ్ళీ ‘అపరాధ భావన ‘ తోటి ” టెంతు వరకు తెలుగు మీడియం సార్‌ ! ఇప్పుడొక్కసుట్టు ఇంగ్లీష్‌ మీడియం ఐతె కష్టంగా వుంటాదంటారా?” అన్నాడు.

అనకొండ చదువుకోవాలి. వాడికి లైఫంటే సమరోత్సాహంతో తొడలు కొట్టుకుంటూ తెల్లారు ఝాములంట లేచి సీఎన్నార్‌ దగ్గరా కేటీయార్‌ దగ్గరా దస్తా కాయితాలు చుట్టలు చుట్టుకుని లెఖ్ఖలు గువ్వ గూటాయించి ఊదుకోవలిసిన రణభేరి. రాత్రంటే డాబాలమీద దండేలకి ఫార్టీ వాట్స్‌ బల్బు వేలాడదీసుకుని నడిమింటి ధనుంజయతో పిట్టగోడల మీద టీలు చప్పరించుకుంటూ త్రీ ఆదర్స్‌ బుక్కు దుళ్ళగొట్టీవలిసిన డీచ్‌ చాలెన్జ్‌ . వాడికి ఎమ్సెట్‌ తప్పదు. తను చదువుకో కూడదు. బుర్రకి కిలుము లాగ, మంగలి గజ్జి లాగ పట్టుకున్నచదువుని ప్రయత్నం చేసి చేసి ఇంక అన్ని ప్రయత్నాలూ ఆపు కూడా చేసి వొదలగొట్టుకుంటున్నా తనకీ దునియా తప్పదు. ఎమ్సెట్‌ తప్పదు. అందుకే “ఇంగ్లీష్‌ మీడియంకి దడిసిపోకూడదు. అందల్దిగిపోయి హార్డు వర్కు చేస్తే ఇంగ్లీష్‌ మీడియం ఏటి చేస్తాది దొంగముండ?! కాదంటావా?” అని ఎగసనతోసేడు. వాడూ చాలా ఉత్సాహంగా “కలన గణితం ఇంగ్లీష్‌ మీడియంల వొస్తే మంచిదాట కదండీ?” అన్నాడు. “Eÿ Absolutely! Very important!! Especially…partial differential equations and boundary value problems” అని పుర్రెక్కించేడు. అనకొండ ఇష్టంగా “ఎందుకండీ?” అన్నాడు. తనూ ఇలాగే. ప్రతిదానికీ ఎడదిడ్డం అంటే పెడదిడ్డం అనీ, ఏతీ అంటే ప్రేతీ అనీ, ఇంకా కాకరకాయా అంటే కీకర కాయా అనీ అనీవాడు. అని కేశవ రాజు జ్ఞాపకం చెప్పేడు. అది అప్పుడు. ఇప్పుడు బుద్ధిగా కాకర కాయే తింటూ జీతం అందుకుంటున్నాడు. అయితే ఇప్పుడు కనీసం ఒక్కపదిరోజులైనా ఎడదిడ్డం, ఏతీ, కాకరకాయా అమిరికావోడికి ఒదిలీసి, రోడ్డు సైడ్లంట పెడదిడ్డం, ప్రేతీ, కీకరకాయా వెతుక్కుంటూ ఎక్కడేనా దొరక్క దొరక్క దొరికితే ఆస్వాదిస్తూ ఈ జేగురు మట్టి దిబ్బల్లంట తిరగడానికి వచ్చేడు. కానీ వీడు, ఈ కాపారపు అప్పలకొండ, తనని మళ్ళీ ఆ పాత రోజులకి అక్కడ Delhi Institute of Competitions బేస్‌ మెంట్లో వానలో దొరికి పోయి కాంపిటీషన్‌ సక్సెస్‌ రివ్యూ అట్టల మీద సోడా బుడ్డీ మట్టు కళ్ళద్దాలు ధరించి తెలివితేటలుగా ఉన్న ఢిల్లీ అబ్బాయిల మొహాలు ఆరాధించుకుంటూ మురికి చిలకల ప్లేట్ల లోన భక్తిగా ఎడదిడ్డం, కాకరకాయా కొంచెం ఏతీ కలుపుకుని హడావిడిగా తిండాలకి లాగుతున్నాడు. ఇంక ‘తప్పదు యుద్ధం బంధు నాశనం ‘ అనుక్కుని వీడ్ని యుద్ధానికే రడీ చెయ్యటానికే నిశ్చయించి తను National Science Foundatioల లాగ గొంతు పెట్టుకుని “ఈ ప్రపంచకంలో వుండే వస్తువులన్నీ ఆ జీడి చెట్లూ ఈ బస్సూ ఆ సముద్రం ఈ వరహాలు గెడ్డా ఆకాశంలో గ్రహ గమన గతులూ ఈ కండక్ట్ర గారూ శ్రీ చైతన్యా వోడూ వికాస్‌ వాడూ జీవులూ నిర్జీవులూ నువ్వూ నీనూ అందరం, మనందరం ఒక లెక్క ప్రకారం నడుస్తన్నాం. అవునా?” అని సూటిగా కళ్ళల్లోకి చూసుకుంటూ అడిగేడు. “అంతే కస్సార్‌ ! ఒక లెక్క ప్రకారఁవే…!” అని వొప్పుకున్నాడు. ఒప్పుకోక పోడానికి వాడు నాగార్జునుడు ఏమీ కాడు. తన వంటి వాడే పిచ్చి అనకొండ. ” ఈ ప్రపంచకం తిరిగే ఆ లెక్కంతా కలన గణితం లోనే వున్నాది. కేలుకులస్‌ రాకపొతే ఇంకెందుకమ్మా లైఫ్‌ వేష్టు?! ఇప్పుడు ఈ కొండే వుందనుక్కో? ఏం?” అంటే, “అవునండి! తొట్ల కొండ.. ” అని ‘దనికీ లెక్కకీ ఏంటి?’ అన్నట్టు చూసేడు. ” తొట్ల కొండ కాదు. దీన్ని X అనుక్కో. ఏం?” అన్నాడు. వాడు మిక్కిలి శ్రద్ధా భక్తులతో వింటున్నాడు. ఇంక నోట్‌ బుక్కు పెన్ను బయటికి తీస్తాడు తనకి తెలుసు. ఇలాగే తను ఎందరో పెద్దల దగ్గిర నోట్‌ బుక్స్‌ పెన్నులు తీసి రాసుకోలేదా? ఇప్పుడు ఆ పెద్దలందరూ రిటారయిపోయి పెన్షన్లు అందుకుంటున్నారు. నోట్‌ బుక్స్‌ Save the Earth Campaign జరిగినప్పుడు రీసైకిలింగ్‌ కి ఇచ్చీసేడు. చిన్నారి వలస దగ్గిర జీడిపప్‌ జీడిపా జీడిపా అని కిటికీలోంచి పళ్ళేలు మొఖం మీద పెడితే ఒక పేకట్‌ చించి అనకొండకి ఆఫర్‌ చేసేడు. వాడు మొహమాటంగా ‘వొద్దండి ఒద్దు ‘అన్నాడు. పర్లేత్తీసుకో అంటే రెండు పలుకులు తీసుకున్నాడు. వెనక సీట్లోంచి గుర గుర గురమని చప్పుడుగా ఉంది. వెనక్కి చూస్తే సీట్లో అతను గుడ్లు తేల వేసి ‘అక్క్‌ … ఆక్క్‌…..’ అని ఎక్కుతున్నాడు. ‘మంచినీళ్ళు కావాలండీ?’ అంటే ఏమీ మాట్లాడలేదు.

“పంది కొక్కు ఒకటి ఒక గంత తవ్వుతోంది. మీ పూసపాటి రేగ బష్టాప్‌ నుంచి ఈ X గుండా ఆదర్శ నగర్‌ కేశవరాజు గారింటికి. ఏం?”

“ఆయనెవరండి..?”

” ఆయను మన స్నేహితుడు. ఆయన్ని ఆ అనుక్కో. పూసపాటి రేగ కొండొడ్డుకి B అనుక్కో! ఏం?”

“ఊఁ…” అని పెన్ను, ఠావు కాయితాల నోట్‌ బుక్కు తీసేడు.

“పందికొక్కుని Alpha అనుక్కో!” అంటే పాపం ఇంక ఉండబట్టక కిసుక్కుని నవ్వేడు ‘పందికొక్కు ఆల్ఫా ఏటి సార్‌?’ అన్నట్టుగ.

“ఇగటాలు కాదువై నిజంగానే! పోనీ నీకు నచ్చిన పేరే చెప్పు!” అన్నాడు. ఎటూ తేల్చుకోలేక వాల్పోష్టర్ల కేసి చూస్తున్నాడు. వాల్పోష్టర్లకీ రోడ్లకీ పిట్టలకీ కొండలకీ వేటికీ పేర్లు ఉండవు. మనుషులకే పేర్లుంటాయి. కేశవరాజుని నారాయణ తాతనీ చూసి చూసి అనిపించిందే ఇలా అనుక్కున్నదే వాడికి చెప్దామా అని అనుక్కుంటూ ఉండగానే వాడు “హృతిక్‌రోషన్‌ ” అన్నాడు. ఇగటాలకి దిగే వోడంటే తనకీ చెప్పొద్దా ఒక ‘ఇది’. సరే “Call it HK1” అన్నాడు. “Next we can write down the governing equations for the randomizederosive motion of HK1 from B through Hill X to A, formulating and simultaneously solving the equations of biomechanics and rock mechanics with HK1 as the primary variable in Cartesian space….” అని రజనీ తన గ్రాడ్యుయేషన్‌ రోజు కొనిచ్చిన MontBlanc తీసి వాడి పుస్తకంలో పర పరా రాసి చూపిస్తే వాడు చెవుల పిల్లి లాగ చెవులు రిక్కించుకున్నాడు. ఇలాటి మోళీలు తను చాలా నేర్చుకున్నాడు. ఇవి వీడు కూడా వికాస్‌ కో శ్రీచైతన్యా కో బిట్స్‌ పిలానీవో ఇల్లినోయో ఇలాగ ఎక్కడో ఒక చోట నెమ్మది మీద నేర్చుకుంటాడు. ఈ బన్నీ మొహం ఇంకెంత కాలమో ఇలాగే ఉండదు.

వెనక సీట్లో అతను రోగి గుర గుర లాడుతున్నాడు. ముందు సీట్లో వాళ్ళు, పక్క సీట్లో వాళ్ళు లేచి “సత్యం? సత్యఁవు..?” అని బెంగగా అడుగుతున్నారు. తన చేతిలోది మంచినీళ్ళ బాటిల్‌ అతని చేతిలో పేట్టేడు. అతని కళ్ళ గుడ్లు పూర్తిగా తెల్లగా అయిపోయేయి. నీళ్ళ సీసా ఎత్తి నోట్లో పోసుకుంటే పెదవి చివర్లంట కారిపోతున్నాయి. పిడికిలి గట్టిగా సీట్‌ రాడ్‌ ని బిగించి పట్టుకుని ‘ అక్‌ … అక్క్‌..’ అని రెండు మూడు సార్లు సీట్లోంచి ఎగిరి పడి ఇంక ఏం కదలకుండా ఉండిపోయేడు. వెనక సీట్లో వాళ్ళు, ముందు సీట్లో వాళ్ళు, పక్క సీట్లో వాళ్ళు సగం సగం నిలబడి ‘ ఏటయింది? ఏటి..?’ అని ఒకళ్ళనొకళ్ళు అడుక్కుంటున్నారు. అనకొండ ఇది తనకెందుకు అన్నట్టుగ ముందుకి వంగి కూర్చున్నాడు. పక్క సీట్లో పచ్చ రంగు చారల టెర్లిన్‌ చొక్కా వేసుకున్నాయన లేచొచ్చి వెనకతని చెయ్యి పట్టుకుని చూసేడు. అతనికి ఏమీ అర్ధం కానట్టు వెనకంతా కలయచూసి ముందున్న తనవైపు చూసి కళ్ళల్లో నీళ్ళు తిప్పుకుంటూ లోగొంతుకతోటి ఏడుపులాగ “పోయేడంటారా?” అన్నాడు. తను చదువుకున్న వాడిలాగ అవుపించేడనో. ఇంగ్లీష్‌ మాటలన్నీ వినో.

నాకు తెలీదు క్షమించండి అని కళ్ళతోటే సంజాయిషీ చెప్పుకున్నాడు.

బస్సు వెనాక కూర్చుని జ్యోతిచిత్ర చదువుకుంటూ ఉన్నతను ఒకడొచ్చి ఆయన భుజం మీద చెయ్యి వేసి ” మీ వోడా?” అనడిగేడు. ఆయన నల్లటి బుగ్గల మీదికి రెండు చుక్కలు కన్నీళ్ళు దిగుతూ ఉంటే అవునాని తలూపేడు. “మాయబ్బాయండీ. ఒంట్లో బాగా లేదు. రాయగడా డాక్టర్లు వైజాగెలిపోమన్నారు….” అని నువ్వు డాక్టర్‌ వి కాకపోతావా నీకే ఏదో ఒకటి తెలీక పోతుందా అని అడుగుతున్నట్టు తనవైపే, అక్కడ ఉన్న ఎనమండుగుర్లోకీ ముఖ్యంగా తననే చూస్తున్నాడు. ఏనుగు కళ్ళలాంటి ఆ చిన్న కళ్ళలో నీరు తిరగటం,ఒక రోజు మాసిన సాల్ట్‌ ఎండ్‌ పెప్పర్‌ గెడ్డం మాపు రంగు యెల్లో టెర్లిన్‌ చొక్కాకి తన దగ్గర వీటికి ఏ జవాబూ లేదు. వెనాక సీట్‌ జ్యోతిచిత్రా అతను ఆయనకీ, ముందు సీట్లో ఉన్న బంధువులకీ “డ్రైవరుకీ కండక్ట్రకీ తెలీకుంట ఈ ముందరెక్కడేనా దిగిపోండి! ఆటోవో టేక్సీయో చేయించుకోని ఎనక్కెలిపోండి! బష్టేండ్లో దించితే పెద్ద కేసూ తల్నొప్పైపోతాది…!”అని చెప్పేడు. కండక్ట్ర గారు అంతా చూసి అన్నీ అర్ధం చేసుకుని ఏమీ చూడ్నట్టు ఏమీ అర్ధం కానట్టూ డ్రైవర్‌ దగ్గిరికెళ్ళి ఏదో చెప్పింది. మళ్ళీ వెనక్కొచ్చి “ఇక్కడ ముందుకి రిక్వష్టాపు కాడ ఆపించుతాను, దిగిపోండి!” అని చెప్పి పెద్ద అంగలు వేసుకుంటూ వెళిపోయింది.

కానీ ఎవరూ రిక్వష్ట్‌ చెయ్యని చోటే గొడవ గొడవగా బస్సులు ఆగిపోయి హారన్లు కొట్టుకుంటున్నాయి. బస్సులు ఆటోలు రిక్షాలు ఆవులు కూరల బండి స్కూటర్లు అన్నీ ఆపీసి రోడ్డు మీద పెద్ద పెద్ద తారా జువ్వలూ చీంపటాస్‌ కాయలూ కాలుస్తున్నారు. అక్కడ ఆశల మెట్టు నిండా ఘాటెక్కిన గంధక ధూమం ఆ ధూమం మధ్యన పోటెత్తే సప్త సముద్రాల్లాగ ఎమ్సెట్‌ పిల్లలూ వాళ్ళ తండ్రులూ తల్లులూ మేష్టర్లూ సమరోత్సాహం తోటి చట్టలు చరుచుకుంటూ తారా జువ్వలూ సీంపటాస్‌ కాయలూ కాలుస్తున్నారు. చంకల్లో తారాజువ్వలు పట్టుకుని ఎగస్పార్టీ విద్యాసంస్థ వోడి మీద కవ్వింపుగా “అగీఫోర్‌ అగ్గీఫోర్‌!” అని అరుస్తున్నట్టు. అనకొండ చాలా ఫాసినేషన్‌ తోటి చీంటపాసు కాయల్నీ, ఓపెన్‌ టాప్‌ జీప్‌ ల మీద కుంకం బొట్లు, దండలు వేసుకుని ఊరేగింపుకి సిద్ధంగా ఉన్న రేంకర్లనీ, పెద్ద పెద్ద బేనర్ల మీద ‘మెడిసిన్‌ రెండవ ర్యాంకు, ఇంజినీరింగు మూడు, ఏడు, ఎనిమిది…’ అని ఇలాగ విజేతల ఫొటోలున్న రాతల్నీ చూస్తున్నాడు. పోలీసులు లాఠీలు పట్టుకుని దిబ్బాలమ్మ స్వీట్స్‌ దుకానం దగ్గిర ఒద్దికగా ఒక సైడుకి నిలబడి, ఆరాధనా భావంతో ప్రొసెషన్నిచూస్తున్నారు. వెనాక సీటతను మళ్ళీ లేచి టెర్లిన్‌ షర్ట్‌ ఆయన దగ్గిరికొచ్చి “దిగిపొండిక్కడ దిగిపొండి! ఇంతకంటే మంచి శాన్సు రాద్దిగిపొండి…” అని హితవు చెప్పేడు. ఆయన వెనక సీట్లో మనిషిని చివరి సారిగా మళ్ళీ చెయ్యి పట్టుకుని “సత్యఁవు..?” అని పిల్చి సీట్లోంచి లేచి నిలబడ్డాడు. డ్రైవరు చూసి చూసి బస్సు సైడుకి తీసి ఆపీసేడు. నలుగురు బంధువులూ లేచి అతన్ని చెరో చెయ్యీ ఇద్దరి భుజాలమీద వేసుకుని ఇద్దరు చెరో కాలూ పట్టుకుని గబ గబా బస్సు దిగిపోయేరు.

అనకొండ నోట్‌ బుక్‌ మూసీసేడు. ఎండ లోకి పొగలోకి కళ్ళు చిట్లించుకుంటూ “ఆదర్శనగర్‌ వెల్లాలంటే ఇక్కడే బస్సు మారాలండి” అన్నాడు. “అది కాదు. ఈ అప్పెక్కీసి అటు దిగి పోతే అక్కడే కేశవ రాజుగారిల్లు. వొస్తావా?” అంటే ” నీను రానండీ” అన్నాడు. అనకొండ రాలేడు తనకి తెల్సు. ‘మీ మాటలింకా వింటే బావుణ్ణు’ అన్నట్టుగ చెవుల పిల్లి లాగ చెవులు రిక్కించుకునే ఉన్నాడు. ” రోజూ ఈ రూటంటే ఎల్తాన్లే. మళ్ళీ మీటవుదాం!” అని అరిచి కదుల్తున్న బస్సులోంచి స్లోగా బండి కదుల్తుండగానే టపీమని గెంతీసేడు. అనకొండ కిటికీ లోంచి తనవైపే చూస్తూ టాటా చెప్తుంటే. రాయగడా వాళ్ళు నలుగురూ అతన్ని భుజాల మీదే వేసుకుని తారా జువ్వల్ని తప్పించుకుంటూ ఆటో బేరం చేసుకుంటున్నారు.

ఈ దునియాలో ఉన్న నిదానాన్నీ సున్నితాన్నీ అంతట్నీ ఎంబ్రాయిడరీల్లోకి ఆకులు, పువ్వులు, చిలకలు, ఉడతలు, బాతు పిట్టలు, లేళ్ళు హంసలుగా అలంకరించుకుంటున్నఆంటీ పళ్ళ మధ్య దారం తెంపి “ఆఁ ఆఁ…… ఒచ్చేడు….ఓహో…దా అమ్మా…” అని ఎనౌన్స్‌ చేసింది. అని తన కుర్చీలోంచి లేచిపోయి మజ్జిగ తెచ్చింది. కేశవ రాజు “Why don’t you sit in this cushy chair?” అన్నాడు. cushy సీట్లు అక్ఖల్లేదు. పీట చెక్కమీద మటం వేసుకుని కేశవ రాజు ఎదురుగా క్లళ్ళల్లో కళ్ళు పెట్టి చూశా అని టీ వూదుకోడాలే కావాలి. ఇదే ముక్క చెప్తే ‘ఊఁ ఊఁ’ అని తల ఊపేడు. రిటారయిపోయి ఇప్పుడు సోషల్‌ సర్వీస్‌ కింద ఆరు, ఏడు, ఎనిమిది చదివే బచ్చా గాళ్ళకి, బచ్చీలకి, గుంట బకిరీలకి ఇంగ్లీష్‌ నేర్పించి గురు దక్షిణ కింద చెక్కేలక పండు కిళ్ళీలు పొందుతున్నాడు. “ఇదేటివై ఈ టెక్స్ట్‌ బుక్కు నిండా తప్పులేనువై! ముందు బుక్కు దిద్దుదాం రా! ఆఁ? Thatway….correcting the text, you can learn some good English! రేపొస్తావా? ఇదే టైముకి? కిళ్ళీలు మర్చిపోకు…. పిప్పరెంటు పువ్వు ఎగష్ట్రా……..” అని ఆజ్ఞాపిస్తున్నాడు.

పై ఎపార్ట్‌ మెంట్‌ వాళ్ళబ్బాయి లేచి థేంక్స్‌ చెప్పి కోచింగ్‌ సెంటర్‌ కి వెళిపోయేడు. కేశవ రాజు తన బాల్యాన్ని మడత కుర్చీలో కూర్చుని టీ చప్పరించుకుంటూ రమణా రావ్‌ ఏ రవణమ్మా అని కళ్ళకి కడుతున్నాడు. కేశవ రాజుకి తను ఏమీ చెప్పక్కర్లేదు. తనకి కేశవ రాజు ఏమీ చెప్పక్కర్లేదు. కానీ..అంటే ఉట్టినే. చెప్పుకోడాలు.

ఆంటీ జున్ను పేకట్లు పట్టుకుని మెట్లు ఎక్కి లోపటికొచ్చి కస్తూర్బా గాంధీ లాగ ‘జున్ను తిను ఇందా’ అంటుంది. ధర్మ తల్లి. దునియా గురించి ఒక నిజాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి తెలుసుకో గలిగింది ఉన్నాది:ఆంటీలు ధర్మ తల్లులు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ మొగుళ్ళ నీడల్లోంచి నిబ్బరంగా హవాయి చెప్పులు వేసుకుని జాబిరీల్లోకి వచ్చి బూందీ, టీ, బిస్కట్లు జున్ను ఇచ్చి “ఎండ లో ఇప్పుడెందుకూ ఆ కొత్త రోడ్డు వరుకూ…కూర్చో మరేం మించి పోలేదు” అని నవ్వుతారు. ‘నువ్వు ఉక్క ఉక్క మధ్యానాలు వేప చెట్టు నీడల్లోన ఎంబ్రాయిడరీ సామ్రాజ్యాలకి క్వీన్‌ విక్టోరియావి నువ్వు తక్కువ దానివి కాదులే ఆంటీ ‘ అని కళ్ళ తోటే అన్నాడు. దారప్పోగు పళ్ళతో కొరికి తెంపి ‘ నాకు అన్నీ తెలుసు రా కనక రాజు ‘ అని అర్ధం వచ్చేలాగ నవ్వి మళ్ళీ కుట్లు కుట్టుకుంటోంది. అన్నం సరిగ్గా తినలేదేమి అని అడిగింది. వడ దెబ్బ తిన్నావా అని. Death అని ఇలాగ చదివేను కానీ మనిషి నా కళ్ళెదూరుకుండా ప్రాణాలొదిలీసేడు ఎప్పుడూ చూళ్ళేదు అని చెప్పేడు. అనకొండా ఎమ్సెట్లో జాయిన్‌ అవుతున్న విషయం చెప్పేడు. అన్నం సాయించలేదు అని చెప్పేడు.

కేశవరాజు హార్ట్‌ అయి ఉంటుంది అని గుండెల మీద చెయ్యి పెట్టి చూపించేడు. అపార్ట్‌ మెంట్ల నీడలు గదుల్లోకి దిగుతున్నాయి. గదుల నీడలు వరండాల్లోకి చీకటిగా దిగుతున్నాయి.నీడల్లోంచి మెట్ల వరుకూ వచ్చి ” రేపొస్తావు కదా? ఊఁ….tomorrow…” అని చెయ్యి ‘ హస్తం గుర్తుకే మీ ఓటు ‘ లాగ, అభయ వరద హస్తం లాగ కూడా ఎత్తి మలుపులో తను మరుగైపోయే వరుకూ అలా ఎత్తే ఉంచుతాడు.

మర్నాడూ ఆ మర్నాడూ ఎర్ర గావంచా జండా భుజం మీద వేసుకుని చెమటలు తుడుచుకుంటూ కేశవ రాజు దగ్గిరికి వెళ్ళడమే అయింది. కేశవ రాజు ఆంటీ ఙధషథదదlప బోర్డు దగ్గిర్నుంచి ‘ఓహో?! ఆఁ…ఆఁ…దా. ఇలాగొచ్చీ…’ అనీసి అనడాలు. ఆంటీ పిక్కలు కలిపీసి సంచీలో పోసి బోర్డు మడిచీసి తనున్న కుర్చీ ఖాళీ చేసి ఇచ్చి వంటింట్లోకి వెళిపోడాలు. కేశవ రాజు పక్కన ఆంటీ మిక్కిలి దయతోను చాలా సున్నితంగానూ లేచి ఖాళీ చేసిన కుర్చీని వెళ్ళి కేశవ రాజు డార్లింగ్‌ లాగ ఎక్కి కూర్చోడాలు. కేశవ రాజు కిళ్ళీ రసం బుగ్గలో అదిమి పట్టుకుని ఫేను తిరగడం చూపించి ‘ఉందిరోయ్‌ కనకా ఫేను ఉన్నాది కనక మనం లకీ కనక్‌ ..’ అని సరదా మొహము పెట్టుకుని, కిళ్ళీ వుమ్మటానికి డైనింగ్‌ టేబిల్‌ కీ గోడకీ మధ్యన ఉన్న అడుగున్నర శూన్యం లోంచి వాష్‌ బేసిన్‌ దగ్గిరికి వెళ్ళడాలు. పడక కుర్చీలు దిళ్ళున్న కుర్చీలు ఇబ్బందిగా ఉంటాయి అని కేశవ రాజుకి ఎదురుకుండా డైనింగ్‌ టేబిల్‌ చెక్క కుర్చీ మీద వీర మఠం వేసుకుని అసుక్కొట్టుకోటానికే అక్కని, పూర్వ గురువు అయిన బావనీ ధిక్కరించి, అమ్మగార్లతో గుండె నొప్పి అని అబద్ధాలు చెప్పి ఆవకాయలు, లడ్డూలు, పీకుడు హల్వాలు, చెగోడీల మూటలు, సమగ్రాంధ్ర సాహిత్య సర్వస్వాలూ మోసుకుంటూ ఏర్‌ పోర్ట్‌ లంట అద్దాల వెనక నుండి చూసి ‘ఇంక నువ్వు ఎక్కడికో ఆ ఊరు పోయి సుఖంగా బతుక్కో నాయినా ‘ అని అన్నట్టు ఏడ్చే అమ్మని శాంతి నగర్‌ అశాంతికి వొదిలి వెళ్ళటము కేశవ రాజు దగ్గిరికే. అంటే తన దగ్గిరికి తనే. కేశవ రాజు అని ఎవడూ లేడు. చెమట్లు కారుతూ తలుపులు గుద్దుకుంటూ వెళ్ళి చూస్తే కేశవ రాజు బదులు ఒక గోడలో చిల్లు లాగ వుంటుంది. వెనక్కి తిరిగి వచ్చీ కేశవ రాజుకి ఎవడూ ఉత్తరాలూ రాయలేడు. ఉత్తరాలు ఎవడికి వాడే ‘My dear most beloved myself’ అని ఇలాగా రాసుకుంటాడు. ఇవి పగళ్ళు.

రాత్రి రిటన్‌ ట్రిప్పుల్లో అనకొండ మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. ఉండుండి ఓ రోజు రాత్రి ఇంటికొచ్చీసేడు వాళ్ళ చిన్నాన్న తోటి. “వికాస్‌ లో జాయిన్‌ చెయ్యమంటారా శ్రీ చైతన్యా లో జాయిన్‌ చెయ్యమంటారా?” అనడిగేడు వాళ్ళ చిన్నాన్న. పూసపాటి రేగలోనే వుండి చదువుకోవొచ్చు కదా దాని బదులు ఇందిరా వికాస్‌ పత్రాలు కొని ఈడి పేరుమీద వేసీయండి బతికిపోతాడు అని నోటి వరుకూ వచ్చింది కానీ గుండెలు చాల్లేదు. How to Study కాపీ ఒకటి ఇచ్చేడు. అనకొండ మిక్కిలి వినమ్రంగా ఎడ్యులేషన్‌ కళ్ళంట ఒంపుకుంటూ ఏటేనా చెప్పండి అని అడిగేడు. అమ్మ ద్వారగుమ్మాలకి ఆనుకుని వింటున్నాది. ఒక తెల్లకాయితం పరా మని తీసి ఫిజిక్స్‌ ఎన్నొస్తాయి? మేత్స్‌ ఎన్నొస్తాయి? ఎంత కెమిష్ట్రీ డవుటయితే మటుక్కీ ఒక థర్టీ ఎయిట్‌ వరుకూ లాగించలేడా? అని స్కోర్స్‌ వేసి చూపించేడు. “చదువు ఒక తపస్సు లాటిది! హార్డువర్కు చేసియ్యాలి!” అని చెప్పేడు.

అందరూ సంబరపడ్డారు. తన దగ్గిర వాలెట్లో ముగ్గురి ఫొటోలున్నాయి. కేశవ రాజు, నారాయణ తాత, శ్రీనివాస రామానుజం. “ఇందుట్లో ఎవడు కావాలో తీసుకో” అని చూపించేడు. వాడు మూడూ మార్చి మార్చి చూసి రామానుజం ఫొటో తీసుకున్నాడు.

రాత్రుళ్ళు అమ్మ ఏం మాట్లాడకుండా అన్నాలు పెట్టి అద్దాల బీరువా గదిలోన పక్క వేయిస్తున్నాది. కొండ అద్దమందు కొంచెమే ఉన్నాది. “చింతాతయ్య ఏడీ?” అనడిగితే కళ్ళాలవైపు చూపిస్తోంది. నిదానాన్ని తెల్లటి గోసి గుడ్డగా పెట్టుకుని వెర్రోడి తెలివితేటలు ఏమో తెలివి తెలివిగా ఉండే వోడి తెలివితక్కువ తనం ఏమోనమ్మా అనిపించేలాగ బండ మీద దునియాకి రాజా లాగ కూర్చుని నవ్వుతున్నాడు. లేత వేప చివుళ్ళు నెమళ్ళకి తినిపిస్తూ నెమళ్ళ మధ్య క్రిష్ణుడి లాగ నవ్వుతున్నట్టే నవ్వకుండా. ఎనలైజ్‌ చేసి ఒక పేపర కింద వేసీడానికి నేనేమీ linear integral equation of the second kind ని కానురా smart ass అని అర్ధం వచ్చే లాగా జబ్బ మీద తెల్లగా అయిన చర్మాన్ని మిక్కిలి స్నిగ్ధ మనోహరముగా గోక్కుంటూ నవ్వుతున్నాడు. ఇంక నాలుగు రోజులున్నాయి. బండ మీద నారాయణ తాతయ్య ఉంటే, లేదూ కేశవ రాజు ఎదురుగా ఉంటే లేక లైట్‌ హౌస్‌ వెలుగుతూ ఆరుతూ వెలుగుతూ ఆరుతూ వెలుగుతూ ఆరుతూ ఉంటే తను చూస్తూ కూర్చోగలడు. ఈ ఉన్న నాలుగు రోజులూ. ఇక్కడ్నించి చూస్తే చూరు కింద రాత్రుళ్ళూ నిలకడగా ఉంటాయి.చూరు పడిపోతున్నట్టనిపిస్తుంది కానీ పడిపోదు.

(ఇంకా ఉంది)