తెంపుకోవే బంధనాలు

“చీరరా, చీర” అన్నాడు అనిరుధ్‌.
“చాల్లే నోర్ముయ్‌. ఏంటా మాటలు అమెరికాలో చీర కట్టుకున్న అమ్మాయిని ఎప్పుడూ చూడనట్టూ?” అన్నాడు ఇంద్రనీల్‌.
“లేదురా, ఈ అమ్మాయి అమెరికా అమ్మాయిలా లేదు. ఇండియా నుండి ఈ మధ్యనే వచ్చిన తెలుగమ్మాయిలా వుంది”
“నీకెలా తెలుసు?”
“కనిపించడం లేదూ మన ఊరి చీర, జాకెట్టు, కాళ్ళకు వెండి గొలుసులు, షోలాపూర్‌ చెప్పులు? వ్యానిటీ బ్యాగ్‌ తగిలించుకుని ఎంత దర్జాగా నడిచివెళ్తుందో!”
“అయితే మనకేంటి?”
“అపురూపమైన దృశ్యం రా, మన్‌హాటన్‌కే అందం తెచ్చింది”
“అయితే నువ్వు ఈ దృశ్యం చూస్తుండు. నేను మ్యూజియం చూసి వస్తాను”
“మ్యూజియం ఎప్పుడైనా చూడొచ్చు. అమ్మాయిరా, మన ఇండియా అమ్మాయి. వెళ్ళి పలకరిద్దాం”
“నాకంత అవసరం లేదురా”
“అవునురా, నీకసలు ఒక్క అమ్మాయి కూడ పరిచయం ఉన్నట్టు లేదు. పోనీ మగస్నేహితులెవరైనా వున్నారా?”
అనిరుధ్‌ భుజం మీద చెయ్యి వేసి, “నువ్వేరా నా బాయ్‌ ఫ్రెండ్‌!” అన్నాడు ఇంద్రనీల్‌.
“అబ్బే, మనం ఆ బాపతు కాదు” అన్నాడు అనిరుధ్‌ అంటూనే అటు చూసి, “సబ్‌వే వైపు వెళ్తుందిరా, మనమూ వెళ్దాం” అన్నాడు.
“ఇండియా నుండి సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌గా ఇక్కడికి వచ్చింది అమ్మాయిల వెంట పడటానికా?”
“నువ్వు మాట్లాడకు; రా!”
ఇద్దరూ సబ్‌వే వైపు వెళ్ళారు.
సరిగ్గా ఆ అమ్మాయికి ఎదురుగా వచ్చే ఎస్కలేటర్‌ ఎక్కారు.

అదే సమయంలో మధుబని పైకి చూస్తూ రిలాక్స్‌డ్‌గా నిలబడింది ఎస్కలేటర్‌ మీద.
మధుబని ఎక్కిన ఎస్కలేటర్‌ పైకి వెళ్తుంది.
అనిరుధ్‌, ఇంద్రనీల్‌ ఎక్కిన ఎస్కలేటర్‌ కిందికి వస్తుంది.
ఎదురుపడ్డారు. పలకరింపుగా నవ్వారు.
చేయి ఊపింది మధుబని. అంతే చాలు అనుకుని మళ్ళీ పైకి వెళ్ళారు. పరిచయం చేసుకున్నారు.
బిజినెస్‌ కార్డులు మార్చుకున్నారు. కేఫెటీరియాలో కాఫీ తాగాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.


“ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ రంగం సంక్షోభంలో ఉంది కదా! దీని ప్రభావం ఇండియాలో చాలా బలంగా పడిందట, మా వదిన చెప్పింది ఫోన్‌లో” అంది మధుబని.
“కొద్ది రోజులే మధు, మళ్ళీ మామూలైపోతుంది” అన్నాడు ఇంద్రనీల్‌.
“మా ఉద్యోగాలకు ఏమీ ప్రమాదం లేదు. కాని చాల తెలుగు కుటుంబాలు, అంటే మన ఆంధ్రప్రదేశ్‌ నుండి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌ అయోమయంలో ఉన్నారు” అన్నాడు అనిరుధ్‌.
ఒక చైనీస్‌ రెస్టారెంట్‌లో కూర్చొని నూడుల్స్‌ తింటున్నారు మధు, అనిరుధ్‌, ఇంద్రనీల్‌.
“నీ జాబ్‌ ఎలా వుంది మధు?” అన్నారు ఇద్దరూ.
“మా సంస్థ సఖి ఫర్‌ సౌత్‌ ఏషియా, డొమెస్టిక్‌ వయొలెన్స్‌ మీద పనిచేస్తుంది. సౌత్‌ ఏషియా నుండి వచ్చిన స్త్రీలకు కుటుంబంలో
ఏమైనా సమస్యలు ఉంటే మా సంస్థ వాళ్ళకు సహాయం చేస్తుంది. ముఖ్యంగా ఫేమిలీ కౌన్సిలింగ్‌” చెప్పింది మధుబని.
“ఎక్కువ కంప్లెయింట్స్‌ ఏదేశం వాళ్ళ నుండి వస్తాయి?” అడిగాడు ఇంద్రనీల్‌ ఆసక్తిగా.
“మన దేశం నుండే. అందులోనూ ఎక్కువగా మన తెలుగు కుటుంబాల నుండే” సీరియస్‌గా చెప్పింది మధుబని.
“మేం చాలా మంచివాళ్ళం. మాకింకా పెళ్ళి కాలేదు గాని అయాక భార్యను బాగా చూసుకుంటాం” నవ్వుతూ చెప్పారు ఇద్దరూ.

అలా చాల సార్లు కలుసుకున్నారు ఆ ముగ్గురు. మధుబనికి ఇంద్రనీల్‌ అంటే ఇష్టం అని అర్థమైంది అనిరుధ్‌కి.


విశాలమైన రోడ్డు పక్కగా నడుస్తున్నారు ఇంద్రనీల్‌, మధుబని.
కార్‌పార్కింగ్‌ పెద్ద సమస్య న్యూయార్క్‌లో. “గరాజ్‌ దొరకలేదు. పార్క్‌ చేసి నడుచుకుంటూ నీ దగ్గరకి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది, సారీ” అన్నాడు ఇంద్రనీల్‌.
“ఫర్వాలేదు … మా నాన్నకు అదిలాబాద్‌ ట్రాన్స్‌ఫర్‌ అయింది” చెప్పింది మధుబని.
“సిన్షియర్‌ కలెక్టర్లను అదిలాబాద్‌కు వేస్తారు, నక్సల్‌ ప్రాబల్యం ఉన్న ప్రాంతానికి” చెప్పాడు ఇంద్రనీల్‌.
చెయ్యి పట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు.
“ఇలా నడవడానికి అమెరికా కాబట్టి సరిపోయింది. మన ఊళ్ళలో ఐతే ఈపాటికి ఊరంతా తెలిసిపోయి వుండేది” అంది మధుబని.
“చెయ్యి పట్టుకోవాడానికి, ముద్దు పెట్టుకోవడానికి అమెరికా అవసరం లేదు. ఇండియా చాలు” అన్నాడు చిరుకోపంతో.
ఇంద్రనీల్‌ తల దగ్గరకి వంచి, ముద్దు పెట్టి, “ఇండియాలో అయితే ఇలా రోడ్డు మీద ముద్దు పెట్టలేం కదా!” అంది.
కాఫీ షాప్‌ కి వెళ్ళారు ఇద్దరు.
“మనిద్దరికీ ఒకటి చాల్లే. ఇండియాలో ఫిల్టర్‌ కాఫీ లాగుండదుగా. అమెరికాలో కాఫీ అంటే వేడినీళ్ళు తాగినట్టే” అంది.
అక్కడికి ఇద్దరు అమ్మాయిలొచ్చారు. వాళ్ళను చూసి ఇంద్రనీల్‌ చేయి గుండెకు తగిలేటట్టు దగ్గరగా జరిగి నిలబడింది మధుబని.
ఆ అమ్మాయిలిద్దరు వీళ్ళని గమనిస్తున్నారు.
“నీ అదృష్టానికి వాళ్ళు అసూయ పడాలనా అలా చేసావు?”
అవునన్నట్టు తల ఊపింది మధుబని.
“అడక్కుండా వరం ఇచ్చినందుకు థాంక్స్‌” అన్నాడు ఇంద్రనీల్‌.


ప్రియమైన మధు,
నీ ఈమెయిల్స్‌, ఉత్తరాలు అన్నీ అందాయి. ఎలా ఉన్నాడు నీ ఇంద్రనీల్‌? మీ ప్రేమ ఎంతవరకు వచ్చింది? అలా ప్రేమిస్తూనే వుంటావా, పెళ్ళి చేసుకునే ఆలోచన ఏమైనా వుందా? ఇక్కడికి రాకు. పి ఎచ్‌డి లు చేసిన వాళ్ళు పిల్లలకు ట్యూషన్‌ చెప్పుకుంటున్నారు. నీకు ఉద్యోగం దొరకదు.
ఫెమినిజం, సింగిల్‌ లివింగ్‌, లివింగ్‌ టుగెదర్‌ లాంటి పనికిమాలిన విషయాలు మాట్లాడటం మానెయ్యి. ఫెమినిజం మాట్లాడే వాళ్ళందరికీ కుటుంబం, భర్త, పిల్లలు అన్ని వున్నాయి. అమెరికన్‌ జీవనవిధానంలో కూడ పార్టీకి వెళ్ళాలంటే పక్కన మగవాడుండాలి. మన దేశంలో ఒంటరిగా ఉండే ఆడపిల్ల పబ్లిక్‌ ప్రాపర్టీ లాంటిది. ఎవరైనా వాడుకోవచ్చు. ఈ ప్రాపర్టీ రూపాయి విలువ చేయదు. వెనక ఒక మగవాడు ఉన్నాడంటే ఆ ఆడపిల్ల కబ్జా ప్రాపర్టీ లాంటిది. దాన్ని ఎవరూ వాడుకోరు. ఎవరితో ప్రమాదం ఏమీ లేదు. కాని గౌరవించరు. నీ వెనక భర్త వుంటే నువ్వు లీగల్‌ ప్రాపర్టీవి. లీగల్‌ ప్రాపర్టీ విలువైనది. దానికి చట్టం రక్షణనిస్తుంది. సమాజం గౌరవిస్తుంది.
నా మాట విని ఇంద్రనీల్‌తో మాట్లాడి పెళ్ళి చేసుకో. నీ పెళ్ళి నువ్వు చేసుకున్నావంటే మీ అన్నకు భారం తగ్గుతుంది. లక్షలు లక్షలు కట్నం ఇవ్వాలి. మీ చెల్లెలికి పెళ్ళి చేయాలి కదా. నువ్విక్కడికి వచ్చావంటే మీ నాన్న నిన్ను ఏ సారా కాంట్రాక్టరుకో ఇచ్చి కట్టబెట్తాడు. నా మాట విని జీవితాన్ని తెలివిగా మలుచుకో. పనికిమాలిన నీ పి ఎచ్‌డి భోగిమంటల్లో వేసి తగలబెట్టు.
ఒక డాలరు ఖర్చు పెట్టేటప్పుడు యాభైసార్లు మన రూపాయిని గుర్తు చేసుకో. అన్నట్టు బంగారం ధర తగ్గింది. డబ్బులు పంపావంటే నీకూ, మీ చెల్లికి నగలు చేయిస్తాను.
మీ
వదిన
మైత్రేయి

సుదీర్ఘమైన వదిన ఉత్తరం చాలాసార్లు చదివింది మధుబని. “నేను ఎవరి ప్రాపర్టీనీ కాదల్చుకోలేదు వదిన” మనసులో అనుకుంది.


“నీల్‌, నాకు అర్జంటుగా పేయింగ్‌ గెస్ట్‌ ఎకామడేషన్‌ కావాలి. ఇప్పుడు నన్ను హోస్ట్‌ చేస్తున్న వాళ్ళు ప్యారిస్‌ వెళ్తున్నారు. ఫ్రండ్స్‌ ఎవరైనా నన్ను హోస్ట్‌ చేస్తారా?” అడిగింది.
“నేను ఫ్రండ్‌ని కానా, నా దగ్గర వుండు” అన్నాడు ఇంద్రనీల్‌.
“మన స్నేహం దెబ్బ తింటుందేమో”
“అలాంటిదేమీ జరగదు. ప్లీజ్‌ నామాట కాదనకు” అభ్యర్థించాడు ఇంద్రనీల్‌.
మరుసటి రోజు ఇంద్రనీల్‌ ఎపార్ట్‌మెంట్‌కి మారిపోయింది మధుబని.


ఆ రోజు ఇంద్రనీల్‌ ఫ్రండ్స్‌ అందర్నీ ఎపార్ట్‌మెంట్‌కి పిలిచాడు, మధుబనిని పరిచయం చేయడానికి.
లయగా మోగిన కాలింగ్‌బెల్‌ శబ్దానికి తలుపు తీసింది మధుబని. ఎదురుగా ఇంద్రనీల్‌. “చాలా అందంగా వున్నావు” అన్నాడు.
“రోజూ చెప్పే మాటేగా” అంది
లోపలికి వచ్చాడు ఇంద్రనీల్‌.
ఇల్లంతా అందంగా సర్ది కనిపించింది. పోచంపల్లి తెరలు ఆ ఇంటికి కొత్త అందాన్ని తెచ్చాయి. ఇండియా నుండి తెచ్చుకున్న శాండిల్‌ క్యూబ్స్‌ పరిమళం ఇల్లంతా వ్యాపించింది.
చుట్టూ పరికించి చూసి “నా ఇల్లు, నా జీవితాన్ని కూడ మార్చేశావు మధు.
“ఈ ఇల్లు, నువ్వు, నేను, మన ప్రేమ ఇలాగే వుంటే జీవితంలో ఇంకెలాంటి కోరికలు లేవు నాకు” అంటూ మధుబనిని దగ్గరికి తీసుకున్నాడు.
“ఏరా తలుపేసుకోకుండానే సరసమాడుతున్నావా?” అనిరుధ్‌ గొంతు వినిపించింది.
“ఇప్పుడే వచ్చానురా” చెప్పాడు ఇంద్రనీల్‌.
“హైదరాబాద్‌లో కళాంజలిలో అడుగుపెట్టినట్టుంది” అంటూ లోపలికి వచ్చాడు అనిరుధ్‌.
అనిరుధ్‌తో పాటు బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, శ్రీలంకల నుండి వచ్చిన ఫ్రండ్స్‌ వచ్చారు.
“త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నామని చెప్పమంటావా ఫ్రండ్స్‌కి?” అడిగాడు ఇంద్రనీల్‌.
“కలిసివుంటున్నాము అని చెప్పు, పెళ్ళి సంగతి తర్వాత” అంది మధుబని.
“రెండూ ఒకటేగా”
“కాదు. పెళ్ళి అవగానే మగవాళ్ళు మారిపోతారు. మన తెలుగు అబ్బాయిలు ముఖ్యంగా. నా జీవితం ఇంకొకరి చేతిలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మేరేజ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ అలాంటిది” చెప్పింది మధుబని.
“నా మీద నమ్మకం లేదా?”
“ఉంది. కాని పెళ్ళి వద్దు. ఫ్రండ్స్‌గా వుందాం”

“ఇంద్రనీల్‌, ఇప్పుడు నీ ఇల్లు సౌత్‌ ఏషియా లాగుంది” కామెంట్‌ చేసారు ఫ్రండ్స్‌.
“మనం అంతా ఎప్పుడైనా గొడవపడి విడిపోతామేమోనని భయంగా వుంది. ప్రపంచంలో ఇక మీద యుద్ధం అంటు జరిగితే అది ఏషియా ఖండం మీదనే. అందులో పాల్గొనే దేశాలు మూడో ప్రపంచదేశాలు” ఫ్రండ్స్‌ చెప్తూ నవ్వుతున్నారు.
“ఇతను పీటర్‌, నా ఫ్రండ్‌” అంటూ ఒక ఆఫ్రికన్‌ అమెరికన్‌ని పరిచయం చేశాడు అనిరుధ్‌. ఇతను న్యూజెర్సీలో ట్రాష్‌ కలెక్ట్‌ చేసే పని చేస్తాడు. ట్రాష్‌ను చూసి అది ఏ దేశం వాళ్ళు పడేసారో చెప్పగలడు. ఇతనికి ఈ మధ్య ఓ ట్రాష్‌ క్యాన్‌లో ఓ ఎన్వలోప్‌ కనిపించిందట. అందులో కొన్ని కాగితాలు వున్నాయి. ఆ భాష ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఆ అక్షరాలు చూడగానే నవ్వు వస్తుంది అంటున్నాడు. ఆ ఎన్వలోప్‌ పట్టుకుని చాల మందిని అడిగాడంట ఆ భాష ఏదో చెప్పమని. ఎవరూ చెప్పలేకపోయారు. ఎవరో అన్నారంట “రకరకాల నాగరికతలు, భాషలు ఇముడ్చుకున్న భారతదేశం వాళ్ళ దగ్గర ప్రయత్నించ”మని. నిన్న ఒక ఇండియన్‌ రెస్టారెంట్‌ కెళ్ళి చూపిస్తే ఇది మాత్రం ఇండియన్‌ లాంగ్వేజి కాని మాకు రాని భాష ఇది అన్నారంట. ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు. పీటర్‌కి రకరకాల లైఫ్‌ స్టైల్స్‌, కల్చర్స్‌ అంటే ఇష్టం, ఆర్టిస్ట్‌ కూడా” అన్నాడు అనిరుధ్‌.
“ఎన్వలోప్‌ కారులో వుంది, వెళ్ళి తేనా?” అడిగాడు పీటర్‌.
“ఆఁ, మళ్ళీ ఎక్కడ వెళ్తావులే, రేపు చూడొచ్చు” అన్నాడు అనిరుధ్‌.
వాళ్ళకేం తెలుసు ఆ ఎన్వలోప్‌లో ఒక అమ్మాయి కన్నీళ్ళు దాగి వున్నాయని? అనిరుధ్‌ కేం తెలుసు ఆ అమ్మాయి అతని జీవితంలోకి వస్తుందని? …
ఆ సాయంత్రం వాళ్ళ మధ్యకి నవ్వుల్ని మోసుకొచ్చింది. వాళ్ళ వాళ్ళ దేశాల పాటలు పాడుతూ ఆహ్లాదంగా గడిపారు.


“మధు, లంచ్‌ టైంలో ఫోన్‌ చెయ్యలేదు. ఎందుకని?” అడిగాడు ఇంద్రనీల్‌.
“ఆ టైంలో ఒక కంప్లెయింట్‌ అటెండ్‌ చేయడానికి బయటకు వెళ్ళాను. పేఫోన్‌ నుంచి చెయ్యాలనుకున్నాను కాని పర్స్‌లో కాయిన్స్‌ లేవు. అన్నీ డాలర్‌ బిల్లులే వున్నాయి. కాబట్టి చేయలేకపోయాను” అంది మధుబని.
“మధు, ఎప్పుడూ కొన్ని కాయిన్స్‌ రవికలో దాచి వుంచుకో. నాతో మాట్లాడటానికి పనికి వస్తాయి”
“అమెరికాలో రవికేమిటి? టీషర్ట్‌”
“సరే, ఏదో ఒకటి. కొన్ని కాయిన్స్‌ దాచిపెట్టుకో. ఎమర్జెన్సీలో పనికి వస్తాయి” అన్నాడు ఇంద్రనీల్‌ చిలిపిగా నవ్వుతూ.

ఆ రోజు రాత్రి మధుబని వదిన ఫోన్‌ చేసింది. మధుబని అలా ఇంద్రనీల్‌ ఇంట్లో ఉండడం ఆమెకు ఏమీ నచ్చలేదు. మధుబనికి చాలా జాగ్రత్తలు చెప్పింది. “మన ఆశయాలు, మన అభిమానం మగవాళ్ళకు ఉపయోగపడతాయి. మన ఫెమినిజం వల్ల మగవాళ్ళు బెనిఫిట్‌ పొందుతారు. చివరికి మనం ఎక్స్‌ప్లాయిట్‌ చెయ్యబడతాం” అని చెప్పింది. ఇంద్రనీల్‌ పెళ్ళి చేసుకోకపోతే మధుబని పరిస్థితి ఏమిటని ఆమెకు కంగారుగా వుంది.
“అతని అవసరాలన్నీ నువ్వు తీరుస్తూ ఉంటే ఇక పెళ్ళి ఎందుకు చేసుకుంటాడు?” చెప్పింది మధుబని వదన.
“వదిన, చేసుకుంటాంలే, ఇంద్రనీల్‌దేం ఆలస్యం లేదు. నేనే కాస్త ఆలోచిస్తున్నాను” అంది మధుబని.
“ఎంతవరకు వచ్చింది మీ ప్రేమ? నీతో బాగా ప్రేమగా ఉంటాడా? నీ గురించి పట్టించుకుంటాడా?” అంటూ ఎన్నో ప్రశ్నలు అడిగింది మధుబని వదిన.
“వదినా, వదినా, నా గురించి వర్రీ అవకు. నీల్‌ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ కనురెప్పల నుంచి కాళ్ళ దాకా ముద్దుపెట్టుకుంటాడు ‘ ” చెప్పింది మధుబని కాస్త రొమాంటిక్‌గా.
“ఏంటే, కాళ్ళంటున్నావ్‌, కాళ్ళ దాకా వచ్చినతను ఆగుతాడా? ఎంతవరకు వచ్చింది మీ వ్యవహారం? ఇదిగో చెప్తున్నాను ఎన్నారై అబ్బాయిని నమ్మావంటే మోసపోతావ్‌” కోపంగా అంది మధుబని వదిన.
“వదిన, నువ్వనుకున్నట్టు ఏమీ కాలేదు. మాకసలు టైం లేదు వదినా ఏ పని చేయడానికి. ఏదో కార్లో వెళుతూ ముద్దు పెట్టుకున్నాడు అంతే. కార్లో అంతకన్న ఏమీ జరగదు, భయపడకు” అంది మధుబని.
“కార్లో కాపురమే చెయ్యొచ్చు. సరే, నాకెందుకు. కొంప ముంచే పనులు చేయకు. ఇండియా అమ్మాయిలకు అదొక్కటే ఎసెట్‌. అర్థమైందా?” అని ఫోన్‌ పెట్టేసింది మధుబని వదిన.

“మా వదిన ఫోన్‌. త్వరగా పెళ్ళి చేసుకొమ్మని చెప్తుంది” అంది మధుబని.
“మరి ఇంకేమిటి ఆలస్యం? గుళ్ళో పెళ్ళి చేసుకుందామా?” అడిగాడు ఇంద్రనీల్‌.
“అమెరికా గుళ్ళో చేసుకున్న పెళ్ళి ఇండియాలో చెల్లదు. అయినా నాకు పెళ్ళి అక్కరలేదని చెప్పానుగా. నువ్వు ప్రేమగా చూసుకున్నంత కాలం నీతోనే వుంటాను” అంది మధుబని.


ఆ రోజు అనిరుధ్‌, ఇంద్రనీల్‌ చాల బిజీగా వున్నారు. ఇంటెల్‌ కంపెనీ నిర్వహిస్తున్న సెమినార్‌ పనులతో క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుండి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌ ఎందరో వచ్చారు. ఎక్కడ చూసినా తెలుగువాళ్ళతో కాన్ఫరెన్స్‌ హాల్‌ కళకళలాడుతుంది.
“కాన్ఫరెన్స్‌ పేపర్స్‌ రెడీ అయ్యాయా?” అంటూ ఇంద్రనీల్‌ రూం కొచ్చాడు అనిరుధ్‌ మరికొంతమంది తెలుగు ఫ్రండ్స్‌తో.
“నేను ఇప్పుడే వచ్చాను. టేబుల్‌ మీద చూడు, ఉంటాయి” అన్నాడు ఇంద్రనీల్‌ మరో పని చేస్తూ.
పేపర్స్‌ తీసుకుంటూ, “నీకు మెసేజ్‌ ఉందిరా” అన్నాడు అనిరుధ్‌ ఆన్సరింగ్‌ మెషీన్‌ వైపు చూస్తూ.
“ఆన్‌ చేయరా, మన కాన్ఫరెన్స్‌కు రానివాళ్ళు ఎవరో చేసివుంటారు” అన్నాడు ఇంద్రనీల్‌ చేస్తున్న పనిలో నుండి తల ఎత్తకుండా.
అనిరుధ్‌ ఆన్సరింగ్‌ మెషీన్‌ ఆన్‌ చేసాడు. మధుబని గొంతు. “నీతో పనేమీ లేదు. రవికలో కాయిన్స్‌ వుంటే నువ్వు గుర్తొచ్చావు. ఫోన్‌ చేసాను. అంతే” ముద్దు పెట్టిన చిరుసవ్వడి. తర్వాత ఫోన్‌ పెట్టేసిన శబ్దం.
ఊహించని ఆ సంఘటనకి సిగ్గుపడిపోయాడు ఇంద్రనీల్‌. అక్కడున్న వాళ్ళందరూ ఆ మెసేజ్‌ని బాగా ఎంజాయ్‌ చేసారు. “అనిరుధ్‌ నన్ను జీవితమంతా ఆట పట్టిస్తాడు” అనుకున్నాడు ఇంద్రనీల్‌.


“ఈ బిజీ లైఫ్‌లో వర్షం చూడాలంటే కుదరదు. వీక్‌ఎండ్‌లో వర్షం కురిసిందంటే అదృష్టమే” అన్నాడు ఇంద్రనీల్‌.
“మధు, పులిహోర చేయి డిన్నర్‌లోకి” అన్నాడు అనిరుధ్‌.
“ఒరేయ్‌, నాక్కాబోయే భార్య చేత పనులు చేయించుకుంటావా?” అన్నాడు ఇంద్రనీల్‌.
ఇంద్రనీల్‌ మాటల్ని పట్టించుకోకుండా “మనిద్దరికి మాత్రమే చేయి మధు” అన్నాడు అనిరుధ్‌.
అంతలో ఒక ట్రైబల్‌ వాయిస్‌ గాలిలో తేలుతూ పాటగా ఆ ముగ్గురి చెవులకు సోకింది.
“పీటర్‌ రాక ముందే అతని పాట వస్తుంది. పాట అతని ఐడెంటిటీ” అంటూ తలుపు తీసాడు అనిరుధ్‌. ముగ్గురు అతని కోసం తలుపు దగ్గర చూస్తున్నారు.
పీటర్‌ వస్తూనే ఎవర్ని పలకరించడు. మనం విష్‌ చేసినా మాట్లాడడు. పాట పాడుతూ వస్తాడు. వచ్చి ఒక నిమిషం పాటు లయగా అడుగులు వేస్తాడు, అచ్చం మన జానపదనృత్యం లాగా.

పాట దగ్గరైంది. కంపాలా అడవుల్లో మారుమోగే పోరాటగీతం. పాడుతూ లోపలికి అడుగు పెట్టాడు పీటర్‌. వర్షంలో కొంచెం తడిసివచ్చాడు. వస్తూనే ఒక నిమిషం నృత్యం చేసాడు. అతని చుట్టూ చప్పట్లు కొడుతూ ఇంద్రనీల్‌, అనిరుధ్‌, మధుబని తిరుగుతున్నారు. పీటర్‌ మామూలుగా వున్నప్పుడు ఇంగ్లీషులో మాట్లాడుతాడు. బాగా సంతోషంగా వున్నా బాగా కోపంగా వున్నా స్వాహిలి భాషలో మాట్లాడతాడు. మనకు అర్థమైందా లేదా పట్టించుకోడు.
జేబులో నుంచి ఒక ఎన్వలోప్‌ తీసి అనిరుధ్‌తో స్వాహిలి భాషలో మాట్లాడడం మొదలుపెట్టాడు. అతని యాక్షన్‌ వల్ల అతనేమంటున్నాడో అర్థమవుతుంది. “రెండు రోజుల్నుంచి నీ వెంట తిరుగుతున్నాను ఈ ఎన్వలోప్‌లో భాష ఏంటో తెలుసుకోవడానికి. నీకు తెలీకపోతే చెప్పు వెళ్ళిపోతాను” అంటున్నాడు.
ఎన్వలోప్‌ చేతిలోకి తీసుకున్నాడు అనిరుధ్‌.
“తెలుగురా” అన్నాడు. దాని పైనున్న అడ్రస్‌ పైకి చదివాడు. “డి. భూమయ్య, కోనేరు కట్ట వీధి, శ్రీనివాసమంగా పురం, తిరుపతి, చిత్తూరు జిల్లా.” ఎన్వలోప్‌ లోపలి ఉత్తరాన్ని బయటికి తీసి చదివాడు. తర్వాత పీటర్‌ వైపు తిరిగి, “ఇది నా మాతృభాషలో రాసిన ఉత్తరం. చారుమతి అని ఒక అమ్మాయి పెళ్ళయి అమెరికా వచ్చింది. భర్త పెట్టే బాధలన్నీ ఇందులో రాసుకుంది వాళ్ళ అమ్మానాన్నకు. కాని ఇక్కడ ఎక్కడుంటుంది మనకు తెలీదు” అన్నాడు.

అది విని పీటర్‌ చాలా బాధ పడ్డాడు. “న్యూజెర్సీ ఏరియాలో దొరికింది నాకు” మళ్ళీ గుర్తు చేసాడు.
న్యూజెర్సీలో వందల తెలుగు కుటుంబాలు ఉన్నాయి. ఎక్కడని వెదకాలి ఈ చారుమతిని? అందరు ఆలోచిస్తున్నారు.
“ఆ అమ్మాయి స్వయంగా వచ్చి చెప్తే సఖి సంస్థ సహాయం చేస్తుంది” అంది మధుబని.
“మధు, మీ వదినకు చెప్పు తిరుపతి అడ్రస్‌ కనుక్కొని, అమెరికాలో భూమయ్య కూతురు ఎక్కడుంటుందో కనుక్కోమని” అన్నాడు ఇంద్రనీల్‌.
మధుబని వెంటనే ఈమెయిల్‌ ఇచ్చింది వాళ్ళ వదినకు. తర్వాత సఖి ఫర్‌ సౌత్‌ ఏషియా ఆఫీసుకు ఫోన్‌లో వివరాలు తెలియజేసింది. ఆ ఉత్తరం మీద దర్యాప్తు చేయమని పీటర్‌, అనిరుధ్‌, ఇంద్రనీల్‌ ఒక కంప్లెయింట్‌ రాసి మధుబని చేతిలో పెట్టారు.

అర్థరాత్రి మూడు గంటల ప్రాంతంలో మధుబని వదిన ఫోన్‌ చేసి వివరాలు చెప్పింది. ఆ వివరాల ప్రకారం భూమయ్య కూతురు చారుమతికి పెళ్ళై ఆరు నెలలైంది. భూమయ్య అమెరికా అల్లుడైన ధనంజయకు పది ఎకరాల మాగాణి, మామిడితోట, ఒక ఇల్లు ఇచ్చి పెళ్ళి చేసాడు. పెళ్ళి చేసుకున్న నెల రోజుల్లో ధనంజయ్‌ చారుమతిని అమెరికా తీసుకువచ్చాడు. అక్కడ భూమయ్య తన ముద్దుల కూతురు సుఖంగా ఉందనుకుంటున్నాడు.
ఒక భూమయ్యే కాదు, పెళ్ళి చేసి అమెరికాకు కూతుళ్ళను పంపే అందరు తల్లిదండ్రులు అలాగే అనుకుంటారు. ఇక్కడ భూలోకస్వర్గముందని, ఆ స్వర్గంలో తమ కూతుళ్ళు హాయిగా విహరిస్తూ వుంటారని అనుకుంటారు. పరాయి నేల మీద, పరాయి మనుషుల మధ్య, పూర్తిగా తమది కాని సంస్కృతిలో తమ కూతుళ్ళు ఎలా బ్రతుకుతున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించరు. అవును, కూతుళ్ళు ఎప్పుడూ పరాయివాళ్ళు కదా! పరాయా ధన్‌! వాళ్ళ అదృష్టం కొద్ది కాస్త మంచి మొగుడు దొరికితే జీవితం సాఫీగా సాగిపోతుంది. మంచి మొగుడు, మంచి యజమాని రెండూ ఒకటే బానిసబంధం. కాస్త మంచి యజమాని దొరకాలని కోరుకోవడం తప్ప ఈ సంబంధం నుండి బయటపడే అవకాశమే లేదు. కనీసం మంచి యజమానిని ఎన్నుకోవడానికి లేదా పాత యజమానిని వదిలి కాస్త మెరుగైన యజమాని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం కూడ లేదు.

ఆలోచిస్తుంది మధుబని. ఇక ఒక్క నిమిషం కూడ ఆలస్యం చేయకూడదు. అడ్రస్‌ వెతుక్కుంటూ వెళ్ళి చారుమతిని కలవాలి. తెల్లవారినంత వరకు ఎదురు చూస్తే ఆలస్యం అవుతుంది అనుకుంటూ సఖి ఆఫీసుకి బయలుదేరింది. న్యూయార్క్‌ నగరం నిద్రపోదు అనుకుంది మధుబని సందడిగా వున్న ఇంటర్‌స్టేట్‌ హైవేని చూసి.
సఖి ఫర్‌ సౌత్‌ ఏషియా లో కంప్లెయింట్‌ ఇచ్చింది మధుబని. డొమెస్టిక్‌ వయొలెన్స్‌ సెల్‌ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది. కాబట్టి క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ టీం అందుబాటులో వుంటుంది. మధుబనితో పాటు మరో నలుగురు కలిసి వ్యాన్‌లో బయలుదేరారు. చారుమతి ఇంటి అడ్రసు పెద్ద కష్టమేమీ కాలేదు.

ఆ రోజు ఉదయం తన జీవితంలో కొత్త వెలుగులు తెస్తుందని తెలియని చారుమతి కిటికీలో నుండి బయటికి చూస్తుంది. వ్యాన్‌ దిగి తమ ఇంటివైపు వస్తున్న అమ్మాయిల్ని చూసి సంబరంగా తలుపు తీసింది.
“మీరేనా చారుమతి?” అడిగింది మధుబని.
“అవునండి” అంటూ తల ఊపింది చారుమతి.
“మీ వారు ఉన్నారా?”
“స్నానం చేస్తున్నారు”
ఇక ఆలస్యం చేయదల్చుకోలేదు మధుబని. గబగబా అడిగింది “ఈ ఉత్తరం మాకు చెత్తకుండీలో మీ ఇంటికి చాలా దూరంలో దొరికింది. మీరు రాసిందేనా?”
తను రాసిన ఉత్తరం భర్త చెత్త కుండీలో పారేసాడని తెలిసాక ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది.
“మేం నీ కోసమే వచ్చాం. నీ ఉత్తరం చదివాం. నిన్ను మీ ఊరికి పంపిస్తాం. నీ భర్త ముందు మేం అడిగిన దానికి జవాబు చెప్పు” అంది మధుబని.
ఇంతలో ధనంజయ వచ్చాడు. హలో లేడీస్‌ అంటూ చాలా మర్యాదగా పలకరించాడు. లోపలికి రమ్మని ఆహ్వానించి కూర్చోబెట్టాడు.
మధుబని అసలు విషయం కావాలని దాచి చెప్పింది “మేము సఖి సంస్థ నుండి వచ్చాము. అమెరికాలో స్థిరపడిన కుటుంబాల గురించి వివరాలు సేకరిస్తున్నాము. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌ గురించి” అంది.
“మీ పేరు?” అడిగింది మధుబని.
“ధనంజయ్‌. కాని డేన్‌ అని పిలవండి” అన్నాడు.
“మీ భార్య గురించి చెప్పండి” అంది.
“చెప్పడానికి ఏమీ లేదు. ఊర్లో పిడకలు చేసేది, నేను దీన్ని పెళ్ళి చేసుకుని అమెరికా తెచ్చాను. ఇది అమెరికాలో ఉండబోతుందని ఎప్పుడూ ఊహించి ఉండదు. దీనికి ఎంతసేపు సంగటి, జొన్నరొట్టెలే తప్ప మన పీజ్జా, బర్‌గర్‌, ప్యాన్‌కేక్‌, కెంటకీ ఫ్రైడ్‌ చికెన్‌ లాటివి నచ్చవు” అన్నాడు.
“మరి మీ భార్య మీతో సుఖంగా ఉందా?” అడిగింది మధుబని.
“దానికి పట్టిన అదృష్టాన్ని మీరు దాని నోటి తోనే వినండి” అన్నాడు చాల ధీమాగా.
“మేల్‌ ఇగో. బొత్తిగా తెలివి లేని మనిషి. ఉత్తరం చెత్తకుండీలో పడేసాడా, ఇప్పుడేమో స్వయంగా చారుమతిని పిలుస్తున్నాడు. ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేయడానికి మంచి అవకాశం. ఈ మనిషికి అమెరికాలో ఏ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉద్యోగం ఇచ్చింది?” అని ఆశ్చర్యపోయింది మధుబని.
“ఏమే ఇలారా” పిలిచాడు ధనంజయ్‌.
చారుమతి అక్కడికొచ్చింది. “నీతో వీళ్ళు మాట్లాడాలట” చెప్పాడు.
“మీకు అమెరికా నచ్చిందా?” అడిగింది మధుబని.
“నచ్చడానికి ఇల్లు దాటి ఎక్కడికైనా వెళ్తేగా?”
“మీకు ఇక్కడ బాగుందా, మీ ఊరు బాగుందా?”
“నాకు మా ఊరే బాగుంది”
“మీ వారితో ఇక్కడ సుఖంగా ఉన్నారా?”
“లేను” అంది చారుమతి.

ధనంజయ్‌ తెల్లబోయి చూస్తున్నాడు చారుమతి వైపు. అతను ఊహించని జవాబులు చెప్పింది చారుమతి. సఖి వాళ్ళు చారుమతి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసారు. ఆమె ఫోటోలు తీసుకున్నారు.
అప్పుడు చెప్పింది చారుమతి తను డొమెస్టిక్‌ వయొలెన్స్‌ విభాగం నుండి వచ్చినట్టు. “మీరు పోస్ట్‌ చేయకుండా చెత్త కుండీలో పడేసిన చారుమతి ఉత్తరం ఆధారంగా మా సంస్థలో మీ మీద కంప్లెయింట్‌ రిజిస్టర్‌ అయింది. మీరు చారుమతిని మాతో పంపాలి లేదా ఇండియా పంపే ఏర్పాట్లు చేయాలి వెంటనే. పరిస్థితి మా చెయ్యి దాటితే పోలీస్‌ని ఇన్వాల్వ్‌ చేయాల్సొస్తుంది. ఇండియాలో మీ మీద ఫ్యామిలీ కోర్టులో హెరాస్‌మెంట్‌ కేస్‌ రిజిస్టర్‌ ఔతుంది. తర్వాత మీ ఇష్టం” కూల్‌గా చెప్పింది మధుబని.
అప్పుడు అర్థమైంది ధనంజయకి వాళ్ళు ఎవరో, తన మీద ఎంత బలమైన ఆధారాలతో వచ్చారో. చాలసేపు నోట మాట రాక నిలబడిపోయాడు. తర్వాత గబగబా లాభనష్టాలు లెక్కవేసాడు. ఇండియాలో తెలిస్తే పెద్ద గొదవ అవుతుంది. పొలం, తోట, ఇల్లు అన్నీ పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పోలీసులకు తెలిస్తే ఉద్యోగానికి ప్రమాదం. అందుకని ఈ అమ్మాయిల్ని మానెజ్‌ చేయాలి.
“నా వల్ల తప్పై పోయింది. ఇక మీద చారుమతికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను” అన్నాడు ధనంజయ్‌.
చారుమతి ఏడ్చేసింది మధుబని చేయి పట్టుకుని. “చారుమతి మా ప్రొటెక్షన్‌లో ఉంటుంది కొంతకాలం. ఈ పేపర్స్‌ సైన్‌ చేయండి” అంటూ సఖి అగ్రిమెంట్‌ అతని చేతిలో పెట్టింది. “మీరు రోజూ సాయంత్రం మా కౌన్సిలింగ్‌ వింగ్‌ కి రావాల్సి వుంటుంది” చెప్పింది మధుబని.

ఒక చిన్న సూట్‌కేస్‌తో చారుమతి వాళ్ళతో బయలుదేరింది. స్వేచ్ఛాప్రపంచం లోకి తొలి అడుగు వేసింది.


“నేను, చారుమతి ఇంటికి వస్తున్నాము. చారుమతి మరీ పల్లెటూరి అమ్మాయి. తెలుగు తప్ప మరే భాషా రాదు. ఇక్కడ షెల్టర్‌ హోమ్‌ కన్నా నాతో పాటు ఇంట్లో ఉంటే బాగుంటుందనుకుంటున్నాను. నీకేమైనా అభ్యంతరమా?” ఫోన్‌లో అడిగింది మధుబని.
“పిల్చుకురా” అన్నాడు ఇంద్రనీల్‌.
మధుబని, చారుమతి ఇంటికి వచ్చారు. “ఈ గది నువ్వు వాడుకో చారుమతి. నేను నీకు ఎదురుగా వుండే గదిలో వుంటాను. ఈ రెండు గదులకు ఒకే బాత్‌రూమ్‌ ఉంది. అనిరుధ్‌, ఇంద్రనీల్‌ వాడుకునే వాళ్ళు. ఇప్పుడు నువ్వు, అనిరుధ్‌ వాడుకోండి. అన్నట్టు అనిరుధ్‌, ఇంద్రనీల్‌ మంచి ఫ్రండ్స్‌. మేం అందరం ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటాం. స్నానం చేసిరా. టీ తాగుతూ మాట్లాడుకుందాం” అంది మధుబని.
“ఇంద్రనీల్‌, అనిరుధ్‌! ఏం చేస్తున్నారు రూమ్‌లో? వచ్చి టీ తాగండి. చల్లారిపోతుంది” పిలిచింది మధుబని.
ఇంద్రనీల్‌, అనిరుధ్‌ వచ్చేసారు. వస్తూనే, “వచ్చిందా చారుమతి?” అన్నారు.
“వస్తుంది, ఉండండి” అంది టీ అందిస్తూ.
అప్పుడే స్నానం చేసింది చారుమతి. అరవిరిసిన మల్లెపూవు లాగుంది. సురక్షితమైన చోట ఉన్నాను అన్న ఫీలింగ్‌ ఆమె మొఖంలో సంతోషాన్ని తెచ్చింది. మామూలు నేతచీర, కుంకుమబొట్టుతో తెలుగుతనం ఉట్టిపడుతూ, మెరుపుతీగలా కదిలి వచ్చింది.
“ఈ అమ్మాయి చారుమతి” పరిచయం చేసింది మధుబని.
“నమస్కారమండి” అంటు చేతులు జోడించింది చారుమతి.
“ఈయన అనిరుధ్‌. నీ గురించి చాలా శ్రద్ధ తీసుకున్నారు” కృతజ్ఞతగా అనిరుధ్‌ వైపు చూసింది చారుమతి.
చిరునవ్వుతో ఆమెను ఆహ్వానించారు వాళ్ళిద్దరూ.
“టీ తీసుకో” అంటూ కప్పు అందించింది మధుబని.
“కప్పులో తాగడం రాదండి, గ్లాసులో పోసుకుతాగుతాను” అంటూ అంచు వున్న స్టీలు గ్లాసు అందుకొని, అందులో టీ వంపుకుంది చారుమతి.
“మరిచిపోయాను, ఇండియా నుండి ఫ్రండ్స్‌ వస్తూ బొబ్బట్లు తెచ్చారు, తిందాం” అంటూ ఓ ప్యాకెట్టు విప్పింది మధుబని. బొబ్బట్లను ప్లేటులో సర్ది డైనింగ్‌ టేబుల్‌ మీద సర్దింది. ఆ ప్యాకెట్టును చుట్టిన కాగితాన్ని ట్రాష్‌లో పడేసింది.
చారుమతి వెంటనే ఆ కాగితాన్ని అందుకొని, “తెలుగు పేపరు! ఎన్నాళ్ళకు చూసాను!” అంది సంబరంగా.
“తెలుగు పుస్తకాలు చాల ఉన్నాయి మా ఇంట్లో. చదువుదువులే” అంది మధుబని.
“వంట చేస్తూ మాట్లాడుకుందాం” అంటూ కూరగాయలు ఫ్రిజ్‌లో నుండి బయటికి తీసింది మధుబని.
“తరుగుతాను” అంటూ అవి అందుకొంది చారుమతి.
ఇంద్రనీల్‌ డిష్‌వాషర్‌ నుండి గిన్నెలు తీసి సర్దుతున్నాడు. అనిరుధ్‌ లాండ్రి చేస్తున్నాడు. మధుబని వంట చేస్తుంది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నా, అందరి ఆలోచనలు చారుమతి గురించే.
“మీ అమెరికా నాకేమీ నచ్చలేదు” కూరగాయలు తరుగుతూ చెప్తుంది చారుమతి. “అందరూ ఇదేదో పెద్ద ఊరు అంటారు కదా, ఏం ఊరో ఏమో, ఒక్కరికీ తెలుగు రాదు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ మాట్లాడరు. మా ఆయన ఎక్కడో ఊరవతల ఇల్లు తీసుకున్నాడు. కనుచూపు మేరలో ఒక్క మనిషి కనిపించడు. మా ఇంటికి ఎవరూ రారు. ఈయన ఉదయం వెళ్ళి రాత్రికి ఇంటికి వస్తాడు. నాతో ఏమీ మాట్లాడడు. అలా ఏమీ మాట్లాడకుండా నెలలు గడిచిపోయాయి. మాటలు మర్చిపోతానేమోనని అద్దంలో చూస్తూ నాతో నేనో మాట్లాడేదాన్ని. గోడల్తో మాట్లాడేదాన్ని. .. మా ఆయన నన్ను ఎందుకు పెళ్ళి చేసుకున్నాడో అర్థమే కాదు. నాతో మాట్లాడడం ఇష్టం లేదు. నా వంట ఇష్టం వుండదు. నేనంటే ఇష్టం లేదు. నేను బాగా లేనా?” అడిగింది చారుమతి.
“నీకేం, కుందనపుబొమ్మలా వున్నావు” అంది మధుబని.
కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ చెప్పసాగింది చారుమతి.
“మా ఊర్లో నా చేతుల్తో ఎంత మందికి అన్నం వండి పెట్టేదాన్ని! అలాంటిది చాలాసార్లు పస్తులున్నాను ఇక్కడ. ఈయన ఏమో బయట తినేసి వస్తాడు. ఇంట్లో వంట చేసుకోడానికి ఏమీ వుండవు. అడిగితే మర్చిపోయాను తేవడానికి అంటాడు. ఉదయం పాలల్లో మొక్కజొన్న పలుకుల్లాటివి వేసుకుని తిని వెళ్ళిపోతాడు. నాకేమో అది సగించదు. ఇడ్లి, ఉప్మా, దోస లాంటివి చేసుకు తినాలని ఉంటుంది. నాకేం తెలుసు పెళ్ళైతే నాకిష్టమైన భోజనం కూడ చేయలేనని! రాత్రిపూట అదేంటో తింటాడు మా ఆయన రెండు రొట్టె ముక్కల మధ్య ఒక ఆకు, ఒక టమోటా ముక్క. నేను తిన్నానా లేదా ఏమీ పట్టించుకోడు”
“మరీ దుర్మార్గుడిలా వున్నాడు” అన్నాడు ఇంద్రనీల్‌ అందరికీ వినిపించేటట్టు.
“ఏంటో మా నాన్న! అమెరికా అల్లుడని మోజుపడి పెళ్ళి చేసి ఇచ్చాడు. నా పరిస్థితి తెలిస్తే ఏడుస్తాడు” చారుమతి చెప్తూ చెప్తూ ఏడుస్తుంది. ఏడుస్తూ చెప్తుంది. సంఘటనలు గుర్తొచ్చినప్పుడల్లా కూరగాయలు కోయడం ఆపి చెప్తుంది. మళ్ళీ తలవంచుకుని కూరలు తరుగుతుంది.

చారుమతి మాటలకు వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లాయి. అలా చెప్తూనే వుంది చారుమతి.
“మీ అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుండి ఈ రోజు చాల తృప్తిగా భోజనం చేసాను. టమోటో పప్పు, బెండకాయ వేపుడు, రసం, కరివేపాకుపొడి అచ్చం మా ఊర్లో తిన్నట్టు వుంది” అంది చారుమతి.
“ఇవన్నీ ఇండియన్‌ స్టోర్స్‌లో దొరుకుతాయి. సాయంత్రం వెళ్ళి కొనుక్కుందాం. ఇంకా నీకు ఏమేం కావాలో చెప్పు. ఇక్కడ ఇండియన్స్‌ చాల మంది వున్నారు. అలాగే తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. తెలుగు పుస్తకాలు ఉన్నాయి. మన ఊరి సినిమాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే మన ఊర్లో ఉన్నట్టే ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత నీకు అలవాటైపోతే మన ఊరి కన్నా బాగుంటుంది. కొన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉండొచ్చు. తర్వాత నిన్ను ఇండియా పంపించే ఏర్పాట్లు చేస్తాను” అంది మధుబని.
అలాగే అంటూ తల ఊపింది చారుమతి.


“చారుమతి నాకు నచ్చిందిరా” అన్నాడు అనిరుధ్‌.
“చూడు , పెళ్ళిచూపుల కోసం కాదు ఆ అమ్మాయిని ఇక్కడికి తెచ్చింది” అన్నాడు ఇంద్రనీల్‌.
“నిజంగా చెప్తున్నానురా, చారుమతి లాంటి అమ్మాయి భార్య అయితే, ఇంకేం కావాలి. నా చెల్లెళ్ళు ఇలాగే ఉంటారు. వాడు ధనంజయ్‌ వట్టి రోగ్‌. ఆడపిల్లల విలువ తెలియదు. భార్య విలువ అంతకన్నా తెలీదు వాడికి. వాడు వదిలేస్తే ఐ మీన్‌ డివోర్స్‌ హాయిగా ఉంటుంది ఈ పిల్ల” అన్నాడు అనిరుధ్‌.
“మన ఇండియా సంగతి నీకు తెలీదా? విడాకులు తీసుకున్నాక ఆడపిల్లను మొగుడు వదిలేశాడు అంటూ చులకనగా చూస్తారు. మళ్ళీ పెళ్ళి చేయడం కూడ కష్టమే. కాని నువ్వన్నట్టు ఇలాంటివాడితో ఉందటం కంటే ఒంటరిగా బ్రతకడమే మేలు” అన్నాడు ఇంద్రనీల్‌.
“అంతగా ఐతే నేను చేసుకుంటాను లేరా” అన్నాడు అనిరుధ్‌.
చాలా మామూలుగా అన్న మాటలు. ఆడపిల్ల మీద సానుభూతి, గౌరవంతో అన్న మాటలు. కాని అవే మాటలు నిజమౌతాయని, ఆ అమ్మాయిని అనిరుధ్‌ ప్రేమిస్తాడని ఇంద్రనీల్‌ ఊహించలేదు. అనిరుధ్‌ కూడ అనుకోలేదు చారుమతి తన జీవితంలోకి వస్తుందని.


ఇండియన్‌ షాప్‌ కెళ్ళి కావల్సిన వన్ని కొన్నది మధుబని. ఆ షాప్‌లో వాళ్ళు అందరు ఇండియన్స్‌. అక్కడ కొనడానికి వచ్చిన వాళ్ళు సగం మంది ఇండియన్స్‌. వాళ్ళను చూసి చాల సంతోషపడిపోయింది చారుమతి. ఆ షాప్‌ అంతా తిరిగి చూసింది. చారుమతి ముఖంలో సంతోషం చూశాక హాయిగా ఊపిరి పీల్చుకుంది మధుబని. తెలుగు పాటల కేసెట్స్‌, డీవీడీలు, కూరగాయలు అన్నీ కొంది మధుబని.
దారిలో వస్తూ వస్తూ, “మా ఇంట్లో నువ్వు సంతోషంగా వుండు” అంది మధుబని. “అలాగేనండి. కాని ఒక్క విషయం. ఉదయం వరకు మీరెవరో నాకు తెలీదు. నాకు సహాయం చేయడానికి వచ్చారు. నేను కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండాలి కదా, మరి నేను మీరు భారం కానా?”
“ఏమీ కావు” అంది మధుబని.
“ఒక మాట చెప్తానండి” అంది చారుమతి.
“చెప్పు”
“నేనేమో రైతుకూతుర్ని. అందరికి పెట్టడం తప్ప ఇంకొకరి ఇంటికి వెళ్ళి తినడం అలవాటు లేదు. ఊరికే మీ దగ్గర తిని కూర్చోవడమంటే బాగుండదు. నేను ఉన్నంతవరకు మీ ఇంటి పనులు చేసిపెడతాను. సరేనా?” అంది చారుమతి. “అలాగే” అంది మధుబని, మనసులో ఆమె అభిమానానికి ముచ్చట పడుతూ.
“మేమందరం ఉదయాన్నే వెళ్ళిపోతాం. నువ్వు నాతో మా సఖి ఆఫీసుకు రా. కాని అక్కడ కూడ నీకు బోర్‌గా ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళ ఇండియన్‌ రెస్టారెంట్‌ ఒకటి ఉంది. వాళ్ళకు హిందీ, కొంచెం తెలుగు వచ్చు. అక్కడ అయితే నీకు టైం బాగా గడిచిపోతుంది. వచ్చేపోయే వాళ్ళతో రెస్టారెంట్‌ సందడిగా ఉంటుంది. నీ అంత అమ్మాయిలు చాల మంది ఉంటారు. నిన్ను ఉదయాన్నే అక్కడ దింపి నేను వర్క్‌కి వెళ్ళిపోతాను. మళ్ళీ సాయంత్రం నిన్ను తీసుకు వెళ్తాను” అంది మధుబని.
“అలాగేనండి”


రోజు ఉదయాన్నే లేచి పనులన్నీ గబగబా ముగించుకుంటుంది చారుమతి.
రోజు చారుమతిని ఇండియన్‌ రెస్టారెంట్‌లో వదిలి తను ఆఫీసుకు వెళ్తుంది మధుబని.