ముందుగా కల్పనా రెంటాల పుస్తకం “కనిపించే పదం”. ముప్పై ఒక్క కవితలు; అందులో ఎంపిక చేయదగిన చక్కటి కవితలు ఒక నాలుగు (నది సప్తపది, క్రీడాభిరామం, రాలిపడ్డ జ్ఞాపకాలు, ఒక్క మాట), ఇంకో నాలుగు చెప్పుకోదగ్గ కవితలు (నిన్ను మరవని పాట, ఇద్దరి మధ్య, మృగయా వినోదం, రహస్య వాన); ఈ ఎనిమిదింటిలో కవయిత్రి ప్రతిభ గొప్పగా వ్యక్తమయింది. Statement, figurative language చక్కగా అమరాయి.
“రాలిపడ్డ జ్ఞాపకాలు” అన్న కవితలో..
“స్నానం
దేహం మీంచి జారిపోయే నీటిబిందువులు
జ్ఞాపకం ఘనీభవించి దేహమైంది…
..నీ కోసం విచ్చుకొన్న పెదవి
పొగడపూల పరిమళంతో..
..నిలువెత్తు పూలచెట్టులా నేను
రాత్రికౌగిలిలో నలిగి
రాలిపడ్డ జ్ఞాపకాల పూలు.”
ఇంత చక్కటి కవితల మధ్య తాలిబాన్ , ముల్లాలు, దేశవిభజన ఒకటేమిటి నానా విషయ పరిజ్ఞానం నిండివుంది ఈ సంకలనంలో. ఇది దురదృష్టం.
ఇక అఫ్సర్ “వలస”. ఈ పుస్తకంలో 80 కవితలున్నాయి. నాలుగో వంతు వరకు కవితా గీటురాయి మీద నిలుస్తాయి. ఇప్పుడొస్తున్న సంకలనాలతో పోలిస్తే ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం. నది మీద, వాన మీద, కవిత్వం, స్వప్నం ఇలా కవి స్వానుభవంతో ఎరిగున్న వాటి మీద రాసిన కవిత్వం “పెళుసు బంగారు గాలి తీగల మీదుగా”
అద్భుతంగా తోస్తుంది. తెచ్చిపెట్టుకొన్న పరాయితనాలు, అరువుగొంతులు మాత్రం కవిత్వానికి చేటు చేశాయే తప్ప, స్వీయానుభవానికి ప్రత్యామ్నాయం కాలేక పోయాయి. మిరుమిట్లు గొలిపే కొన్ని కవితా సందర్భాలు
“ఒక వానా కాలం” అన్న కవితలో
కొండల మధ్య
ఎక్కణ్ణించో
వినిపించే రహస్య జలపాతం
ఇవాళ
నా చుట్టూ
వానాకాలం…
ఇసుక దేహం మీద
అలవచ్చి వెళ్ళిపోయాక తడిజాడ!
లేత రెక్కలతో ఆర్పనా వద్దా అన్నట్టు
సంశయిస్తున్న ఒట్టి మెరుపెండ
(“కురిసీ కురవనీ”)
ఇరుక్షణాల ద్వైధీ భావంతో
వొరుసుకు పోతున్న నాకు
మహా ప్రళయఘోష తప్ప
అలవోకగా జారుతున్న నిశ్శబ్దం వినిపించదు
మెలికలు తిరుగుతున్న ఉద్రిక్త దేహాల మధ్య
నలిగిపోతున్న ఆత్మల బలహీన స్వరం వినిపించదు.
(“ఇవాళ”)
ఇప్పటి కవితా సంకలనాలు వాదాలహోరులో పడిపోవడం తెలుగు కవిత్వానికి పట్టిన అనర్థం. కవయిత్రులను పట్టి పీడిస్తున్న స్త్రీ వాదం, కవులను పీల్చిపిప్పి చేస్తున్న నానా వాదాలు ఎప్పుడు వొదుల్తాయో! ఈ సంకలనాలు చదువుతుంటే, ఒక దాన్లో “గాయం” అన్న పదం తుత్తునియలు ఐతే, మరోదాన్లో స్మశానాలు, శవాలు, రక్తం క్రిక్కిరిశాయి.
ఇంకో విషయం ఏమిటంటే రెండు సంకలనాల్లోనూ statement కి, figurative language కి తేడా తెలుసుకోలేని confusion కనిపిస్తుంది.
కవిత్వమంటే బహు క్లుప్తమని, సంక్షిప్తమని గ్రహించి ఆచరించటం తక్షణావసరం. అలాగే ఆవేశాల మీద అదుపు, మాటల్లో పొదుపు కావాలి. ఎవరి అనుభవాల్ని వారు వ్యక్తం చేస్తేనే అందులో నిజాయితీ వుంటుంది; అదే కవిత్వమౌతుంది. మన చుట్టూ ఉన్న జీవితాన్ని నిండుగా అనుభవించి, చెప్పడానికి నిజంగా ఏమైనా మిగిలుంటే, అప్పుడు వ్రాయాలి కవిత్వం.అంతేగాని కవిత్వం వార్తాకథనం కాదు.
ఇది గ్రహించక ఎప్పటికప్పుడు కొలంబస్ లా దారి తప్పుతూనే ఉన్నాడు తెలుగు కవి.