విమర్శాదర్శము

ప్రపంచంలో ప్రతి సజీవభాష కాలానుగుణంగా తనకు కావలసిన విమర్శకులను తయారుచేసుకొంటూనే వుంది.కవిత్వంలాగే విమర్శ కూడా అతిసహజం.. అది స్వభావానికి సంబంధించినది.పండితులందరూ కవులూ విమర్శకులు కాలేరు, కానీ సిసలైన విమర్శకుడు పండితుడై తీరతాడు.విమర్శకుడు ఎగబాకే ఎత్తులకు,తరచి చూసే లోతులకు పాండిత్యమన్నది అల్పవిషయం.నరనరాన వివేచన,సదామేలుకొని వుండే రసహృదయం..ఇవీ విమర్శకుడిని పట్టి ఇచ్చే గుణాలు.రసహృదయం కవిలక్షణం భావసౌకుమార్యానికి సంబంధించినది..దీనికి స్త్రీ సంకేతం.వివేచన పండిత లక్షణం..అది భావ పటుత్వానికి సంబంధించినది..దీనికి పురుషుడు ప్రతీక. ఈ రకమైన స్త్రీపురుషుల మేలుకలయికే విమర్శకు వన్నె తెచ్చేది..ఈ అర్థనారీశ్వరత్వమే విమర్శకుడిని  అజరామరం చేసేది.ఏది తప్పినా అణాకాణీలకు ఆశపడి శివుడిలా నటించే పగటివేషగాడవుతాడు..ఆబోరు దక్కదు..

ఎవడు విమర్శకుడు?

వివేచన,రసహృదయం ఉన్న ప్రతి ఒక్కడు విమర్శకుడైపోతాడా? కాదనే సమాధానం విమర్శ స్వభావానికి సంబంధించినది..అది కవిత్వం లాగే ఒక జ్ఞానసాధన లేదా జీవితవిధానం..కావున కేవలం పుస్తకాల పురుగులు , యూనివర్శిటీ పండితులు విమర్శకులైపోరు..మనసా వాచా నమ్మినదాన్ని ఆచరించే నిజాయితీ ,స్వ పర భేదాలు లేని నిష్కల్మష వర్తన ,సాహిత్యానికి కట్టుబడి ఉండటం,రాతలో నిర్మొహమాటం, నిష్కర్ష..ఇవీ స్థూలంగా విమర్శకుడి లక్షణాలు..సూక్ష్మంగా ఆలోచిస్తే నమ్మిన దాన్ని ఆచరించే నిజాయితీ నుండే మిగిలినవన్నీ పుట్టుకొస్తున్నాయి.నిజాయితీ లేని వాడు..సాహిత్యరంగంలో  నియ్యోగప్ప్రభువు రామప్పంతులుగానో,లేదా నెపోలియన్‌ ఆఫ్‌ ఆంటి నాచ్‌ గిరీశంగానో మిగిలిపోయే ప్రమాదం ఉంది.

మన విమర్శక త్రయం

మనకు కవిత్రయంలా విమర్శకత్రయం ఉంది.రాచమల్లు రామచంద్రా రెడ్డి ,రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ ,అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు..వీరు ముగ్గురు సాహిత్యంలో భిన్న కాలాల్లో వచ్చినా నిజాయితీగా తాము నమ్మినదాన్ని శషభిషలు లేకుండా నిష్కర్షగా వ్యక్తం చేశారు.

రా.రా

రా.రా మార్క్సిజాన్ని మనసా వాచా నమ్మిన వాడు.కానీ ఒక సిద్ధాంతంగా దాని పరిమితులను చక్కగా ఎరిగిన వాడు కాబట్టే ,ఎక్కడా పాఠకులతో ఇనుపగుగ్గిళ్ళు నమిలించలేదు.ఎవరికి ఇవ్వవలసిన గౌరవాన్ని వారికిచ్చాడు.తనతో భావసారూప్యం గల శ్రీ .శ్రీ ,కొ .కు ల దగ్గరే ఆగిపోకుండా తిలక్‌ , చలాల లోతులను తరచి చూశాడు. విలువైన విషయాలు వెల్లడించాడు.భావసారూప్యం గల మహీధర,రావిశాస్త్రి రచనల్లోని లోపాలను క్షమించి వదిలివేయలేదు.రచయిత మేల్కొలపవలసింది హృదయాన్ని కానీ..బుద్ధిని కాదు అంటూ మహీధర రచనల్లో దోషాన్ని నిష్కర్షగా చెప్పాడు.అలాగే రావిశాస్త్రి వర్ణనా లౌల్యాన్ని ఎత్తిచూపాడు..శ్రీ శ్రీ లోని తాత్వికాంశని నిరూపించినా ,తిలక్‌ సౌకుమార్యాన్ని ప్రశంసించినా ,గురజాడ ,కొ .కు ల అభ్యుదయ చింతనను కీర్తించినా ,మహీధర,రావిశాస్త్రి శిల్పదోషాలను బట్టబయలు చేసినా వాటి వెనుక ఉన్నది జీవితంలోని ఒక నిజాయితీ.. శ్రమించి ప్రోది చేసుకొన్న అభిరుచి పట్ల నిబద్ధత.అందుకే ఈనాటికీ ఆయనకు సాహిత్య గౌరవాన్ని ఆపాదించేది.

రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ

సంప్రదాయ పండితుడు..సంగీతంలో ధురీణుడు..భాషా కోవిదుడు..ఈ మాత్రం చాలు ఆయన రూపు కట్టించడానికి.సంప్రదాయాన్ని విమర్శించడానికి ఇవేవీ ఆయనకు అడ్డు కాలేదు..సరికదా ఉపకరించాయి.సాంప్రదాయికులందరూ బహిష్కరించిన వేమనను మహాకవిగా నిరూపించడానికి ఆయన చేసిన సాహిత్యోపన్యాసాలు విజయనగర శిల్ప కళలా చెక్కు చెదరలేదు.అప్పటి సంప్రదాయ పండితుడిలా అనాలోచితంగా ప్రతి ప్రాచీన కవినీ ఆకాశానికెత్తే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు.చక్కగా వివేచించి తన హృదయాన్ని తాకిన దాన్నే కవిత్వమన్నాడు.రాయలనాటి రసికత మీద మక్కువ పెంచుకొన్నా ,మనుచరిత్రలోని మొత్తం పద్యాల కన్నా ,రాయల మరణాంతరం అల్లసాని పెద్దన చెప్పిన ” ఎదురైనచో..మదకరీంద్రము డిగ్గి..” పద్యం లోనే రసస్ఫూర్తి,కవితావేశం ఉన్నాయని కుండ బద్దలు కొట్టాడు.అలాగే నాచన సోమనాథుని కన్నా పలు భావగతులను తేటతెల్లం చేసే ఎఱ్ఱన కవిత్వం ఎలా మేటి కాగలిగిందో వ్యతిరేకతలకు జడవకుండా తన తీర్పును వెల్లడించాడు.స్వానుభూతి లేక శాస్త్రవాసనచే రథంలాగే వారినుద్దేశించి వంకాయ తన వంటికి పడుతుందా లేదా అన్న విషయాన్ని ఎవరో చెబితే తెలుసుకోవడం కాదు స్వయంగా ఆరగించి తెలుసుకోవాలి అని చురక అంటించాడు.

అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు

తర్క సంగ్రహం రాసిన అన్నంభట్టు ఆంధ్రుడే అని సంబరపడటం తప్ప తర్క సంపన్నంగా ఈయనలా విమర్శ రాసిన వారు అరుదు.నవద్వీపంలో కావ్యతర్క శాస్త్రాలను వల్లె వేసిన దిట్ట.అలా అని నవీన పద్ధతులు ఎరుగని వాడేమీ కాదు.తన విమర్శ గ్రంథానికి సంస్కృతాంధ్రాంగ్లాలలో పీఠికలు రాసుకొన్నారు..ఇంత హంగామా చూశాక ఈయన పాతనంతా తలకెత్తుకొని ఊరేగుతారని భావించవచ్చు ..అటువంటి చాదస్తాలు ఏవీ ఆయనకు అంటలేదు..నన్నయాదులనుండి భావకవిత్వందాకా వచ్చినది కవిత్వమే కాదుపొమ్మన్నాడు.(వేమన దీనికి మినహాయింపు)చారిత్రకంగా దారితప్పాము సరళమైన తెలుగు ఛందస్సుల్లో రాసుకోక,ఎందుకీ ఏనుగుమోత అని వాపోయాడు.. చివరికి తనే పూనుకొని ముత్యాలసరాలు కూర్చడం ఆరంభించారు..పలనాటి చరిత్రను పటుసుందరంగా పరిష్కరించి విపులపీఠిక సంతరించిపెట్టారు..పలు విషయాల్లో ఆయనతో ఏకీభవించని వారు కూడా ఆయననుండి స్ఫూర్తిపొందుతారు..

నిలువెల్ల నిజాయితీ..ఎదురీదే సాహసం..ఉమాకాన్తులకు పెట్టని ఆభరణాలు..

నేటి విమర్శకుల్లో ఏమి లోపించింది ??

అభిరుచి !! అతి చవగ్గా అంగట్లో దొరికే సరుకు కాదు..జీవితానికీ,విలువలకూ సంబంధించినది.పట్టుమని పదిభాషల్లో కవిత్వాలను ,విమర్శలను చదివి సార సంగ్రహణ చేయకుండానే మేము విమర్శకులమని,పథనిర్దేశకులమని జబ్బ చరచుకొనే కూపస్థమండూకాలను నిత్యమూ చూస్తూనే ఉన్నాము.దోషరహితంగా రాయడంతోటే వీరి పాండిత్యం సరి.దొంగలు పడ్డ ఆరు నెళ్ళకు కుక్కలు మొరిగినట్టు,అడపా దడపా నాలుగు వ్యాసాలు వెలిగించి గడియకో పేరు చెప్పే సిద్ధాంతిలా భూమండలం బద్దలు చేశాము అనుకొనే వారి సంఖ్య తక్కువేమీ కాదు.నిజాన్ని అబద్దం,అబద్దాన్ని నిజం చేసే కన్యాశుల్కంలోని బైరాగే చాలా నయం.దూలానికి,ద్వారానికి తేడా తెలియని కవిత్వ మాయాబజారులో తెచ్చి పడేశారు..మన విమర్శక సిద్ధులు అదీ ఖేచరీ గమనమ్మీద..ఇప్పుడు ఏది కవిత్వమో ఏది అకవిత్వమో బోధపడక కవులు, పాఠకులు గగ్గోలెత్తిపోతున్నారు.

ఏది పాండిత్యం ??

పాండిత్యాన్ని నైఘంటుకార్థంలోనే తీసుకొనే వెంకటేశాలతో మనకు పేచీ లేదు. అంతకు మించి ఎదగనందుకు  జాలి తప్ప.పాండిత్యమన్నది స్వభావానికి సంబంధించినది..వుట్టి పుస్తక పాండిత్యం కాదు..దాన్నే కబీర్‌ నిరసించాడు

“పోథీ పఢి పఢి జగ్‌ మువా పండిత్‌ బయా న కోయ్‌
ఢాయీ అక్షర్‌  ప్రేమ్‌ కా పఢేసు పండిత్‌  హోయ్‌  ”

ప్రేమను,హృదయాన్ని పెంపొందించుకొమ్మంటున్నాడు..భారతంలోని ప్రశస్త రత్నాల్లో ఒకటైన విదురనీతిలోను ఈ తరహా పాండిత్య చర్చ విపులంగా వుంది.. స్వభావాన్ని,సమాజాన్ని తేటతెల్లం చేసే ఒక నిజాయితీ..ప్రేమతో నిండిన పాండిత్యం..శుష్క  వాగ్ధాటి కాదు. మన విమర్శకత్రయంలో ఈ పాండిత్యమే మనసుకు ఆహ్లాదం  కలిగించేది..దృష్టికి పదును చేకూర్చేది.. తతిమ్మా కాలేజి పాండిత్యాలవల్ల ఒరిగేదేమీ లేదు..తైల నష్టం తప్ప !!

విమర్శకుడు కవి కానవసరం లేదు

మనభాషలోని మహావిమర్శకులు ముగ్గురూ కవులు కారు..దాని వల్ల వారి విమర్శలకు వచ్చిన లోపం లేదు.కవి కాలేక విమర్శకుడు అన్న వాదం చాలా పాతది..విమర్శ వల్ల ఒక కావ్యం అంతరిస్తుంది అన్న వాదంలాగే..కావున గణించనవసరం లేదు.. “వంకాయ కూర బావుందో లేదో చెప్పడానికి వంటవాడు కానవసరం లేదు “అని ఇటువంటి సందర్భంలోనే శ్రీ శ్రీ చమత్కరించాడు.

కరేబియన్‌ కవి డెరిక్‌ వాల్కాట్‌ కవి కవిత్వం గూర్చి రాయకూడదంటాడు.. ఆ రాతలు ఆత్మ సమర్థకాలని ఆయనకు గట్టినమ్మకం..అది అలా ఉండనిస్తే పో ,బ్రాడ్‌ స్కీ , పాజ్‌ లాంటి మహాకవులు గొప్ప విమర్శలు వెలయించారు.వారు కలం పట్టకపోతే ఎన్నో సత్యాలు మరుగున పడిపోయేవి..వారి కవితా శక్తి విమర్శనాపాటవానికి దోహదపడిందే తప్ప ద్రోహం చేయలేదు..మన తెలుగు లో ఇస్మాయిల్‌ ,శ్రీ శ్రీ ఇదే కోవకే చెందుతారు

కొత్తపాతల మేలుగలయిక

మన విమర్శకులకు తెలిసిన విషయాలు రెండు నింద , స్తుతి(కవులకు అదే వర్తిస్తుంది,ఏదో సామెత చెప్పినట్టు తల్లి చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా ?) ఆధునికులు విధిగా నన్నయాదులను నిందించి పరవశిస్తే ,సాంప్రదాయికులు ఆధునికులలో తప్పులెన్నుతారు.రెండు వాదాలు అతివాదాలే.మధ్యే మార్గం ఏర్పరచు కోవలసిందే.. నిందాస్తుతుల వల్ల సత్యం వెలికిరాదు..

ప్రాచీన కవిత్వాలు ఏ భాషలోనైనా శ్రమకోర్చి ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిందే..ఆంగ్లకవిత్వాన్ని తీసుకొంటే ఛాసర్‌ కాలం నాటి స్పెల్లింగ్‌ , ఉచ్ఛారణ వేరు.కాబట్టి , ఆధునిక స్పెల్లింగ్‌ కు అనుగుణంగా తిరగరాసి కొత్తపాఠకులకు సుబోధకం చేయడం జరుగుతూనే ఉంది..మన భాషలో వ్యవహారం  ఇంత సులువుగా లేదు.  ప్రతి పదార్థ తాత్పర్యాలు లేదా కావ్యాన్ని వచనంలో తిరగరాయడం.ఈ రెండూ కావ్యం అందాన్ని పూర్తిగా అందించలేవు..ఈ లోపు ప్రాచీన కావ్యాల పట్ల గుడ్డి వ్యతిరేకత ,అభిమానం మంచివి కావు.హేతుబుద్ధి ,రసహృదయాలతో అంచనా వేయాలి దేన్నైనా !!

భారతానువాదంలో నన్నయ్య భారతాన్ని పలువురు పలురకాలుగా భావిస్తున్నారు అని నిండుగా ఒక సీస పద్యంలో వర్ణించాడు.నన్నయకు లేని పేచీ ఇతరులకు ఉండ నవసరం లేదు..భారతాన్ని మహేతిహాసంగా భావించి గౌరవం ఇవ్వవలసిందే..

గ్రీకులోను ,ఇటాలియన్‌ లోను ఏ భాషలోను ఇంత గొడవ లేదు.ఆధునికులైన ఒడిస్సస్‌ ఎలిటస్‌ ,సెఫెరిస్‌ ,కవాఫీ ల గొప్పతనం తెలుసుకోవాలంటే  వారిని ప్రాచీన గ్రీకు కవులు శాఫో ,హోమర్‌ ల తో పోల్చనవసరం లేదు.అలాగే డాంటే గొప్పతనం తెలుసుకోవాలంటే ఇటీవలి కాలపు ఇటాలియన్‌ కవి మొంటాలే తో పోల్చ నవసరం లేదు.అసలు ఎవరూ అలా ఆలోచించరు..కవిత్వం  చారిత్రకంగా ఎలా పరిణమించింది అన్న ఏకైక దృష్టితో చర్చిస్తారే తప్ప.పది తరాల కవులను ఒక గాటన కట్టేసే పనులు ఏ దేశంలోనూ ఎవరూ చేయరు.

సాకల్యంగా పరిశీలించిన పిమ్మట విమర్శకుడు పెంపొందించుకోవలసింది.. సమన్వయ దృష్టి అని తేలుతుంది..అంతేగాక అనేక కపాలాలను పరిశీలించి మానవ పరిణామాన్ని విశదీకరించే శాస్త్రజ్ఞుడిలా విమర్శకుడికి కావలసినది నిరపేక్ష దృష్టి.అది నిజాయితీగా జీవితానికి ,సాహిత్యానికి కట్టుబడటం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది..వైయక్తిక స్థాయి దాటి ఎదగలేని వారు సమన్వయ కర్తలు కాలేరు.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...