కొన్ని అనువాదాలు

“Brahma” by Ralph Waldo Emerson

రక్తతర్పణమొనరించు రాజులైన
రక్తధారలు చిందించు ప్రాణులైన
పుడమి జేసిన కర్మలు, పొందు బాధ
దలచిరేని వారజ్ఞానధనులగుదురు
నా లీలలనెఱుగరు నయముగాను

దూరమైనను, జ్ఞప్తికి దూరమైన
నాకు దగ్గరె యగునంచు నరులెఱుగరు
వెలుగునీడల నా దృష్టి వేరు కాదు
కనగరానట్టి దేవుళ్ళ గాంచగలను
మానమవమానముల యందు మార్పు రాదు

నన్ను మరచు మనసులందు నాశమేను
దిక్కులెగురగ నే వారి రెక్కనౌదు
శంక నేను, శంకించు చకితుడేను
సుబుధులాలపించు పవిత్ర స్తోత్రమేను

దేవదేవులు నను జేర తీరి యుండ్రు
సప్త ఋషులు నను గనక తృప్తి పడరు
సజ్జనుండ! ప్రేమించుము శక్తి మేర
మంచి యన్నది యేదైన మానకుండ!
స్వార్థమెంచక నను బొందు, స్వర్గమేల?
ంంంంంంంంంంంంంంంంంంంం

ఒమర్‌ ఖయ్యామ్‌ రుబాయీలు కొన్ని

వ్రాయు చేయది కదలును, వ్రాయుచుండు
నీదు పుణ్యము, క్రతువులు, నియమ నిష్ట
లేమి మార్చవు ఆ వ్రాతనేది యాపు?
అక్షరములవి అక్షరమై నిలచును
తడి కనులు సుంత తుడుప తరము గావు

***

ఏల వచ్చితినిటకు నేనెచటి నుండి
కారణమ్మేమెఱుంగక కదులు నీటి
చందమున తప్పనిసరిగ సాగుచుందు
జీవసమీరమై సాగిపోవు కతన
నెచటికేగెడు వాడ నేనెఱుక లేక
సాగుచుందు నే తప్పక నాగకుండ
ంంంంంంంంంంంంం

“Markings” by Hammarskjold

దారి నీవు నడచుటకు తగిన బాట
ఆట ఆడి మరచెదవు ఆదమరచి
కుండ వాడుచుండిన యంత నిండుకొనును
బాధ దాచి యుంచెదవది పాలుపోక
నిజము చెప్పబడుచునుండు నీకునెపుడు
తుదిని అనుభవమ్మున నీవు తెలియగలవు

***
“A garden beyond paradise” (The mystical poetry of
Rumi) – a translation by Starr & Shiva

మతము నెఱుగరు ప్రేమించు మనుజులెవరు
నమ్మకమది యుండదు మరి వమ్ము గాదు
తనువు, బుద్ధియు, ఆత్మయు, మనసు గూడ
ఉండి లేనటులే యింక, రండి తెలియ!
మనల కేల నిపుడొరుల మాట వినగ
ప్రేమనొందక, ప్రేమించు వీలు లేక
కూరుచుండెడి వారెల్ల గ్రుడ్డివారు!