కాళ్ళని తడిపి వెళ్తాయి
తెల్లని నవ్వులతో అలలు.
కళ్ళని తడిపి వెళ్ళే నీ స్మృతులల్లే
ఊరకే కూర్చోనివ్వదు
హోరున పొంగే సముద్రం
కబుర్లు చెప్పే ప్రియురాలు
రోజంతా ఆడుకున్నాక
బావిలో పడింది బంతి.
అస్తమించిన సూర్యుడు.
ఆఫీసు నోళ్ళతో ఉదయాన్నే
అందర్నీ మింగుతుంది నగరం.
సాయంత్రం వరకూ జనగ్రహణం.
రహదారిలో రాత్రివేళ
మంచుపూలు చల్లుతూ పరిచారికలు
వీధి దీపాలు
వసంతాగమనంతో, చెట్టుకి
వొళ్ళంతా పూలే.
మళ్ళీ తెరచిన బడి.
చీకట్లో దారిచూపుతుంది
మెరుపల్లే నవ్వి ప్రియురాలు.
కవిత్వం.
వద్దంటున్నా యుద్ధం,
మల్లెపూలు కాస్తా
మందారాలయ్యాయి.