మా ముఖ ద్వారాలకు
లేనిపోని అలంకారాలు చెయ్యొద్దు
తడబడే అడుగులు చూసి
మెట్ల తలలు కొట్టించొద్దు
గడపలను పగలకొట్టించొద్దు
నోరు తిరక్క మాటల్ని వొంచితే
నాలుక మందమై ఒత్తుల్ని ఖండిస్తే
‘ ఎవడు అడగొచ్చాడ ‘ ని
ఏకంగా అక్షరాలనే భక్షిస్తే
క్రొత్త గాలి బావుందని
మెచ్చుకోలు చప్పట్లు విప్పొద్దు
సన్మానాలు చేసి శాలువాలు కప్పొద్దు
మా పాటకు మద్దెల మీరు
మీ పాటకు మద్దెల మేము
గోడలే శ్రోతలైన పాట కచ్చెరీలో
పరస్పరం భుజాల్ని చరుచుకుని
పరవశులమై చిందులెయ్యొద్దు
చిత్రకారుడి స్పర్శలు
రాగాల మేళవింపులూ
బోసిగా నిల్చున్న గోడకు
ఇంద్రధనుర్వర్ణాల
రససంగమం కలిగిస్తే
ఇవన్నీ హంగులూ తతంగాలు
కాలాహరణ కారణాలని కొట్టి పారెయ్యొద్దు
గుండె చప్పుళ్ళకూ
హృదయ స్పందనలకు
భేదం గుర్తించే గుణాన్ని
మత్తుమందుతో నిద్రపుచ్చొద్దు
మందీ మార్బలం ఉందనీ
మందలో మన మాటే వేదమని
ఉత్సవ విగ్రహాలకు ప్రచార స్తోత్రాలు చెయ్యొద్దు
మొక్కుబడి మంగళ హారతులు ఇవ్వొద్దు
రేపటికి అస్తుల్ని పస్తుల్ని ఆస్తులుగా
మిగల్చొద్దు