మా ఊరంటే నాకు మహగొప్ప అభిమానం. నేను ప్రతిసంవత్సరం మా ఊరెళ్ళి వస్తాను. అందరికీ ఆశ్చర్యం గానే ఉంటుంది, నేను పని కట్టుకొని మావూరు ప్రతి ఏడూ ఎందుకు వెళ్ళుతున్నానా అని. మా ఆవిడైతే బోలెడుసార్లు అన్నది కూడానూ, “మీకు అక్కడింకొక పెళ్ళాం గాని లేదు గదా,” అని.
చెప్పుకోదగ్గ చరిత్ర ఏమీ లేదు, మా ఊరికి. మా ఊరికి ఆరుమైళ్ళ దూరాన ఉన్న పల్లెటూరు రాజధానిగా వేంగి రాజులు పరిపాలించారని కథ చెప్పుతూ ఉంటారు. నాకయితే ఆ కథమీద ఏమాత్రమూ నమ్మకం లేదు. అక్కడ ఆరడుగులెత్తున రెండు పెద్ద రాళ్ళు మాత్రం ఉండేవి. ఇప్పుడున్నాయోలేవో తెలియదు. ఆ రాళ్ళమీద స్కూలు పిల్లలు మేకులతో రాసిన పొడిపొడి ఇంగ్లీషు, తెలుగు అక్షరాలుండేవి, అంతే. ఆ మాటకొస్తే, ఒకప్పుడు మా ఊరునుంచి బెజవాడ వెళ్ళేరోడ్డు మీద అంతకన్నా పెద్ద రాళ్ళు పడి ఉండేవి.
చరిత్ర అయితే లేదు గానీ, ప్రత్యేకించి చెప్పుకోదగ్గ విశేషాలు బోలెడున్నాయి. స్థలపురాణాలు చెప్పుకునే అలవాటు పూర్తిగా పోయింది మనవాళ్ళకి, లేకపోతే మా ఊరిలో పన్నెండు పంపుల గురించి చక్కటి పురాణం రాయచ్చు. యాభైఏళ్ళు దాటిన ఎవరిని అడిగినా చెప్పుతారు, పన్నెండు పంపులు గురించి. ఇప్పుడు అవి ఎక్కడుండేవో తెలుసు కోవాలంటే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళనే అడగాలి. ఎందుకంటే, అంతకన్నా చిన్న వయస్సు వాళ్ళకి అసలు వీధి పంపులగురించి ఏమీ తెలియక పోవచ్చు.
ఆ పన్నెండు పంపులున్న వీధికి ఎవరో డాక్టరు గారు మునిసిపల్ కౌన్సిలరుకి డబ్బిచ్చి తనపేరు పెట్టించుకున్నారని అంటారు. ఇందులో నిజమెంతో మనకి తెలియదు. అయినా అది అప్రస్తుతం. కానీ, ఆ వీధిని అందరూ పన్నెండు పంపుల వీధి అనే అనే వారు. ఇప్పుడు అదే పేరు సార్ధకమయి పోయింది, పంపులు గల్లంతయి పోయినాక కూడాను. ఈ పంపులగల్లంతు గురించి తరవాత చెప్పుతా.
మా చిన్నప్పుడు పొద్దున్నే ఏడు ఘంటలకి పన్నెండు పంపుల వీధి కి వెళ్ళడం గొప్ప సరదాగా ఉండేది. చతురస్రాకారంగా నాలుగడుగుల ఎత్తున గోడలు కట్టి, నాలుగు పక్కలా పంపులు బిగించి ఉండేవి. అంటే ఒక్కొక్క పక్కన మూడు పంపులన్న మాట. కింద నేల సిమెంటు చప్టా. ప్రతిపంపుకిందా ఒక చిన్న అరుగు కూడా ఉండేది. ఇవి మంచినీటి పంపులు. పంపు ఆకారం ముసలికుక్క మూతిలా ఉండేది. పంపు ఎడమపక్కన వెడల్పాటి చెవి ఉండేది. అలాటి పంపులు ఇప్పుడు లేవు. చెవి వత్తి పట్టుకున్నంతసేపూ పంపులోనుండి శివగంగ ధారల మంచి నీళ్ళు వచ్చేవి. చెవివత్తి పట్టుకోలేని వాళ్ళు చెవికీ పంపు తలకీ మధ్య చిన్న ఇటిక ముక్క పెట్టి ఉంచేవాళ్ళు. అప్పుడు ఏకధారగా నీళ్ళు పడేవి. ఆ ఒక్కో ధార కైవారం ఆరంగుళాలన్నా ఉండేది. ఆ రోజుల్లో పొద్దున్నే ఆరుఘంటలనుండి, పదిఘంటలదాకా వీధి పంపుల్లో నీళ్ళు వచ్చేవి. మళ్ళీ మధ్యాన్నం మూడు ఘంటలనుంచి, సాయంత్రం ఏడు దాకా పంపులు వచ్చేవి.
ప్రతి నాలుగు వీధులకీ ఒకటో రెండో వీధి పంపులున్నా, పన్నెండు పంపులూ ఒకేచోటవున్న వీధి ఈ భూప్రపంచకంలో బహుశా మా ఊళ్ళోనే ఉండి ఉంటుంది. అది ప్రత్యేకత కాదూ, మరి.
ప్రొద్దున్నే ఆరు కాకముందే అమ్మలక్కలు ఇత్తడిబిందెలతో పంపుల దగ్గిర చేరేవాళ్ళు. అక్కడే, ఇసక, చింతపండు, కొబ్బరిపీచూ పెట్టి ఇత్తడి బిందెలని బంగారంలా తళతళ మెరిసిపోయేట్టు తోమి పెట్టుకునేవారు. అలా తోముతూ, ఎంతో హాయిగా పిచ్చాపాటీ మాట్లాడుకునే వాళ్ళు. ఏ పచ్చడి ఎలా చెయ్యాలో, ఏ కూరలో ఏ తాలింపు బాగుంటుదో, ఎవరికి మనవరాలు పుట్టిందో, ఎవరబ్బాయి రంగం పారిపోయి అక్కడి పిల్లని పెళ్ళిచేసుకుంటానని బెదిరించాడో, ఒకటేమిటి, అందరి సమస్యలూ అందరూ చర్చించుకోవడం ఆనవాయితీ. ఏ రోజన్నా ఎవళ్ళన్నా మంచినీళ్ళకి రాకపోతే అందరికీ ఆదుర్దాగా ఉండేది, ఏ మో పాపం ఏమయిందోనని. ప్రపంచకంలో ఎక్కడా క్యూలో ఉండటం అనే నాగరీకం నేర్వని రోజుల్లోనే, తళతళలాడే ఇత్తడి బిందెలని ఇంచక్కా ప్రతి పంపు దగ్గిరా క్యూలో ఉంచడం మా ఊరి అమ్మలక్కలకి ఎప్పుడో తెలుసు. ఒకేచోట పన్నెండు క్యూలు ఇంకెక్కడా ఉండి ఉండవు. పోతే, క్యూలో మొదట నాబిందె, నీ బిందె అని పెద్ద పట్టింపు కూడా ఉండేది కాదు. ఏ పెద్దక్కో తొందరగా ఇంటికి పోవలసి వస్తే ఇంకో చిన్నక్క చోటు ఇచ్చేది. ఇందాకే చెప్పానుగా, శివగంగంత ధారతో పంపు నీళ్ళు వచ్చేవని. చిటికెలో బిందె నిండేది. అందరికీ మంచినీళ్ళు పుష్కళంగా ఉండేవి. అంతే కాదు. కొందరైతే బడికెళ్ళని చిన్న పిల్లలకి స్నానాలు పంపుకిందే చేయించేవాళ్ళు. ఏ అమ్మకీ అభ్యంతరం కూడా ఉండేది కాదు. అది అప్పుడు.
ఇప్పుడు పన్నెండు పంపుల వీధి పేరేమిగిలింది. ఒక్క పాత పంపు కూడా లేదు. అంటే కొత్తరకం పంపులున్నాయనుకునేరు. ఊ హూ! అదీలేదు. బోసిగా పంపు గొట్టాలు విరిగిన గోడల సందుల్లోనుంచి వెకిలిగా కనిపిస్తాయి. సిమెంటు చప్టా పగిలి నెఱ్ఱలేసింది. పంపుకింద గట్టులు చితికిపోయాయి. ఇప్పుడు ఏ వీధిపంపుల్లోనించీ నీళ్ళు రావు. అసలు నీళ్ళు రావని కాదు, పుష్కళంగా నీళ్ళు రావు. పన్నెండు పంపు గొట్టాలలో రెండు గొట్టాలనుంచి నీళ్ళు వస్తే అది గొప్పే. పొద్దున్న ఇరవై నిమిషాలు సాయంత్రం ఇరవై నిమిషాలు, నీళ్ళు పడతాయి, అంతే. ఒక్కొక్క సారి ధార కనిపించదు కూడాను. ధార కైవారం సన్నగా పురికొస కన్నా అన్యాయంగా ఉంటుంది. క్యూలో ముందున్న మూడు బిందెలు నిండితే గొప్పే. మునపటిలా పిచ్చా పాటీ లు లేవు, సరిగదా జుట్టూ జుట్టూ పట్టుకొని కొట్లాడుకోవడం పరిపాటి అయ్యింది. పంపు “వదిలాడు” అని తెలియంగానే కొంపమునిగినట్టు అమ్మలక్కలంతా ఒకటే పరుగు, నా బిందె ముందున్నదంటే, నా బిందె ముందున్నదని.ఇంటిల్లిపాదీ తాగే నీళ్ళు దొరకడమే అపురూపం, ఇంక స్నానాలకీ సంధ్యలకీ నీళ్ళెక్కడివి? పూర్వపు రోజుల్లో పంపు వదిలేవాడు ఒకడున్నాడని ఎవరికీ తెలిసి ఉండేది కాదని నా నమ్మకం. ఇప్పుడు వాడెవడయితేనేం, కనిపించని దేవుడి కన్నా వినిపించుకోని నాయుడికన్నా ముఖ్యుడే.
మా ఊరికి చుట్టూ మూడు పెద్ద ఏరులున్నాయి. అందుకనే మా ఊరిని ఏరులూరు అని అంటారు.కలిపేసి పలికితే ఏళ్ళూరు అవుతుంది. సరిగా ళ పలకలేని నాయకుడే ఎవడో ఏలూరు అన్నాడు. అదే సార్ధకమయిపోయింది. తరవాత పండితులెవరో హేలాపురి అని సంస్కృతీకరించారు కూడాను. కృష్ణ, గోదావరీ నదుల సంగమం మా ఊరి కాలవ. తూర్పు లాకుల దాకా గోదావరి నీళ్ళు, పడమటి లాకుల దాకా కృష్ణ నీళ్ళూ. కృష్ణ ఎత్తు, గోదావరి పల్లం. ఆ రెండునదులూ కాలవలో సమతలంగా కలపడానికి తూర్పు లాకులు, పడమటి లాకులు ఉండేవి. ఆ లాకులు ముయ్యడం, తియ్యడం, పడవలని జాగ్రత్తగా కాలవలోకి పంపించడం చూడటానికి ఎంతో ముచ్చటగా ఉండేది. చైత్ర వైశాఖ మాసాల్లో లాకులు కట్టేసి కాలవ మూసేసే వాళ్ళు. అప్పుడు కాలవ ఎండి పోయేది. మళ్ళీ మృగశిర కార్తె రాంగానే, కాలవ వదిలే వాళ్ళు. మళ్ళీ ఇంచక్కా కొబ్బరికాయలు, అరిటిపళ్ళ పడవలూ తూర్పునించి పడమరకీ, పడమటినుంచి తూర్పు వేపుకీ వెళ్ళేవి. ఆ కాలవ నీళ్ళే పంపుల చెరువుల్లోకి పట్టి ఉంచేవాళ్ళు, ఎండా కాలంలో మంచినీటి కరువు రాకండా! ఇప్పుడు ఆ గొడవే లేదు. కాలవలో సమృద్ధిగా నీళ్ళు ఎప్పుడూ ఉండవు. కాలవలో పడవలు లేవు. పంపుల చెరువులు పూడి పోతున్నాయి. అందుకే కాబోలు, పంపుల చెరువులు అమ్మేస్తారని కూడా అంటున్నారు, చెరువులు మూసేసి ఇళ్ళు కట్టడానికి డెవలపర్లు బోరుగ గద్దల్లా కాసుకు కూచున్నారని వినికిడి. ఇందులో నిజమెంతో నాకు తెలియదు.
నిజమేమిటంటే, ఈ యాభై యేళ్ళలో మా ఊరి జనాభా కనీసం మూడురెట్లన్నా పెరిగి ఉండాలి. మరి వీధి పంపులు పెరగటానికి బదులు తగ్గి పోయాయే, కారణం ఏమిటి చెప్మా అన్న అనుమానం రాకపోదు. ఆ అనుమానమే నాకూ వచ్చింది. మా ఊరికి ఒకప్పుడు మునిసిపల్ చేర్మన్ గా వెలిగించి ఇప్పుడు క్లబ్బులో జోరుగా పేకాడుకునే పెద్దమనిషిని అడిగాను. ఆయనచేతిలో పేకముక్కలు చూసుకుంటూ, జోకర్లు అటునించి ఇటు, ఇటునించి అటు సర్దుకుంటూ, నావైపు చూడకండానే ఠక్కున సమాధానం చెప్పాడు. “అదేమిటండీ వెంకటేశ్వర్రావు గారూ, మరీ చోద్యం గా అడుగుతారు, ఇప్పుడు అందరికీ ఇంటి పంపులు ఇచ్చేశారు, వీధిపంపుల అవసరం ఏ మున్నాది?” పేకాటనుంచి రిటైరయి, పక్కనే కిబిట్జర్ గా కూర్చున్న సత్యం గారు అందుకున్నాడు, ” ఆ మాట నిజమే! కొన్ని ఇళ్ళకయితే, రెండు మూడు పంపులు కూడా ఇచ్చారు, ఒక్కో పంపుకీ పది వేలు భరణంగా పుచ్చుకొని. ఏం ప్రయోజనం? నీళ్ళు రాని పంపులు ఎన్నుంటేనే! మా పక్క లాయరు గారింట్లో రెండు పంపులున్నాయి. ఎండాకాలంలో గొట్టాల్లోకి నీరెక్కదు, ఎవడికీ చెప్పాచెయ్యకండా దొంగతనంగా మోటరెడితేకానీ! వానాకాలంలో రోడ్డుమీద సప్లై పంపుగొట్టాల్లోకి మురిక్కాలవల మురుగు ఎక్కేసి, పంపుల్లో వచ్చే దోసిలి నీళ్ళు దొడ్లోకెళ్ళి కాళ్ళు కడుక్కోటానికి కూడా పనికి రావు. అసలు ఆ నీళ్ళు తాగే ప్రశ్నే లేదు. అధవా గతిలేక తాగితే గ్యారంటీగా కలరా వచ్చి చస్తారు,” అని ముగించాడు.
“మరి ఇంతమంది జనాభాకీ మంచినీళ్ళు ఎలా?” అని అడగంగానే పక్కవాడు వేసిన ముక్కెత్తుకుంటూ, ” బాటిల్ నీళ్ళే సార్ బాటిల్ నీళ్ళు. మంచినీళ్ళు కొనుక్కొని తాగాలిసిందే,” అని అంటూ కోకోకోలా కంపెని వాడి మంచినీళ్ళ ప్లాస్టిక్ సీసా మూత తీసి గుక్కెడు తాగి మళ్ళీ భద్రంగా మూతపెట్టుకున్నాడు, గోవిందయ్య నాయుడు గారు.
యూరినల్ కెళ్ళి రెండు గేలనుల నీళ్ళు కమోడ్ కడగటానికి, మరోగేలను నీళ్ళు చేతులు కడుక్కోటానికీ అలవాటుపడ్డ భాగ్యనగరం వాడికి పన్నెండు పంపుల వీధిలో మంచినీటి ఎద్దడి గురించి ఎలా తెలుస్తుంది? ఆ మాటకొస్తే, అసలు ఎందుకు తెలియాలి? అలాంటి సందేహాలు రావడం, దరిమిలా చచ్చు ప్రశ్నలు వెయ్యడం ఆధునిక నాగరిక లక్షణం కాదు.