తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్‌ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు

బ్రాహ్మణ, పురాణ వ్యతిరేక ధోరణులకి తన సూతపురాణంతో పునాది వేశాడు రామస్వామి చౌదరి గారు. బ్రాహ్మణ రచనల్ని అశ్లీల, అధార్మిక, క్రూర, ఆర్య రచనలుగా నిర్ధారించాడు. సంస్కృత పురాణాలన్నీ, అందులోనూ ముఖ్యంగా రామాయణం, కేవలం స్వేచ్ఛావర్తనులు, నాగరికులు ఐన ద్రావిడుల్ని లొంగదీయటానికే రాసినవని ఆయన అచంచల విశ్వాసం. సంస్కృతం, బ్రాహ్మణులు, ఉత్తర భారతం ఆర్య నాగరికతా చిహ్నాలైతే, దక్షిణ భారతం, దక్షిణ భారతీయ భాషలు, అబ్రాహ్మణులు ద్రావిడ నాగరికతకు చిహ్నాలు. బ్రాహ్మణులు దక్షిణ భారతానికి ఆక్రమణదారులు. సంస్కృత గ్రంధాలు, ముఖ్యంగా రామాయణం సామ్రాజ్యవాద ప్రతీకలు. ఉత్తర భారత బ్రాహ్మణ సామ్రాజ్యవాదానికి రాముడు ప్రతినిథి. ద్రావిడ దక్షిణ భారతంలో రావణుడు ధర్మ పాలకుడు.

దక్షిణ భారతం మీద నిపుణులకి ఇదంతా పరిచితమే. రామాయణానికి ఇ. వి. రామస్వామి వ్యాఖ్యానం (దీన్ని పాలా రిచ్‌మన్‌ లోతుగా విశ్లేషించారు)రామస్వామి చౌదరి గారి మార్గానికి చాలా సన్నిహితంగా కనిపిస్తుంది[20]. చౌదరి గారి కథనం ఇ. వి. రామస్వామికి ఎన్నో సంవత్సరాల ముందే వెలువడటమే కాకుండా, వీళ్ళద్దరిలో మరో ముఖ్యమైన వ్యత్యాసం కూడ ఉంది[21]. ఇ. వి. రామస్వామిలా కాకుండా చౌదరి గారు ఒక సంపూర్ణమైన ద్రావిడ పురాజీవ శాస్త్రాన్ని నిర్మించాడు. ఆయన లెక్క ప్రకారం ఆర్యులు రాకముందు దక్షిణ భారతంలో వివిధ కులాల, వృత్తుల వర్ణక్రమం ఇలా వుంది

1. కమ్మ, రెడ్డి, వెలమ వంటి కర్షక కులాలు వీరు వీరులు, రాజులు; ఆర్య సమాజంలో క్షత్రియులు.
2. గొల్ల, పల్లి, కుమ్మరి లాటి కులాలు వీరు పూజారులు; ఆర్య సమాజంలో బ్రాహ్మణులు.
3. బలిజ, కోమటి, సాలె లాటి కులాలు వీరు వర్తకులు; ఆర్య సమాజంలో వైశ్యులు.
4. కాస, బోయ, చాకలి లాటి సేవక కులాలు వీరు సేవకులు; ఆర్య సమాజంలో శూద్రులు[22].

చాలా విశిష్టమైన క్రమం ఇది. దీన్లో బ్రాహ్మణుల స్థానం క్షత్రియుల కన్న తక్కువది. పల్లెల్లో తక్కువ కులాల వాళ్ళు పూజారి పనులు చేస్తారన్న అతని పరిశీలన ఖచ్చితంగా నిజమే. చౌదరి గారి ప్రకారం దక్షిణానికి ఆర్యుల దండయాత్రల వల్ల బ్రాహ్మణ పూజారులు రాజుల కన్న ఆధిక్యతని పొందటమే కాకుండా క్షత్రియ స్థానంలో ఉన్న కమ్మ, రెడ్డి, మొదలైన వారు శూద్రులుగా నీచస్థితికి తోసివేయబడ్డారు.

చౌదరి గారు తన రామాయణ వ్యతిరేక వాదనని ఇంకా విశాలమైన ఆర్య వ్యతిరేక వాదన మీద నిర్మించాడు. ఆయన లెక్కలో ఆర్యులు ఎక్కడికి వెళ్ళినా ఇతర జాతుల్ని, వాళ్ళ నాగరికతల్ని అణగదొక్కారు. ఆయన ఈ ఆర్య వ్యతిరేక వాదాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాల శ్వేతజాతీయులకు కూడ వర్తింపజేశాడు వాళ్ళూ నల్ల జాతి వాళ్ళను అణిచిన వారే. ద్రావిడులు నిర్దోషులు. కుటుంబాన్ని, ఇరుగుపొరుగుల్ని అభిమానించే వారు. విభీషణుడు తన అన్నను వంచించటానికి అసలు కారణం అతను దుష్టుడు కావటం కాదని, అదంతా విభీషణుడి భార్య సరమ ప్రభావమని (ఆమెలో ఆర్య, అంటే గంధర్వ, రక్తం వుంది) కూడ సూచిస్తాడు. వాళ్ళ కూతురు త్రిజట కూడ వంచకురాలే ఆమెలో వున్నదీ కొంత ఆర్య రక్తమే కనుక ఆమె సీతను సమర్ధిస్తుంది; రావణుణ్ణి ద్వేషిస్తుంది.

పురాణాల్ని అశ్లీల, అధార్మిక, అభూత, బ్రాహ్మణ ప్రచారాలుగా ఆయన చేసిన వాదనకు చాలా ఆదరణ దొరికింది. ఇది ఆ తర్వాత వచ్చిన రామాయణ వ్యతిరేక రచనల్లో చూడొచ్చు. ఐతే తెలుగు ప్రజల్ని ఆర్యులుగా, ద్రావిడులుగా విభజించే జాతి సిద్ధాంతాన్ని మాత్రం తెలుగు వాళ్ళు నిశ్శబ్దంగా పక్కన పెట్టారు. విద్యాలయాల భాషా శాస్త్ర శాఖల్లో ద్రావిడ భాషా కుటుంబం ఉనికిని గురించి అందరూ అంగీకరించి, దాన్లో తెలుగు కూడ ఒకటని నిర్ణయించినా, తెలుగు సాహిత్యాన్ని ఆర్య ద్రావిడ విభాగాలుగా చూడటానికి సాహిత్యవేత్త లెవరూ ఉత్సాహ పడలేదు.

రామస్వామి చౌదరి గారు ప్రత్యక్షంగా ఆర్య వ్యతిరేకి ఐతే రామలింగా రెడ్డి “అధునాతనుడు”. పారిశ్రామిక, వస్తూత్పత్తి చోదిత, పెట్టుబడిదారీ సమాజంలో అభ్యుదయ సంస్కృతి కావాలనేది ఆయన మార్గం. కేంబ్రిడ్జ్‌లో ఆర్ధిక శాస్త్రం చదివినా ఆయన ముఖ్యాసక్తి తెలుగు సాహిత్యం మీదనే. ఇంగ్లండ్‌ నుంచి తిరిగి వచ్చిన దగ్గర్నుంచి తెలుగు సాహిత్య చరిత్రనీ, విశ్లేషణనీ ఆధునీకరించే పనికి నడుం కట్టాడు. రామాయణానికి సంబంధించి రామస్వామి చౌదరి గారి కన్న చాల సున్నితమైన ప్రతిఘటనని అనుసరించాడాయన. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడిగా రంగనాథ రామాయణానికి (దీన్ని గురించి ఇంతకు ముందు చెప్పాను) ఒక నిర్దుష్ట పాఠాన్ని చేయించాడు. అప్పడు నమ్ముతున్నట్టు కాక దాని కృతికర్త నిజానికి బుద్ధారెడ్డి అనే అబ్రాహ్మణుడని ఒక ససాక్ష్యమైన చర్చను లేవదీశాడు. బ్రాహ్మణ సంస్కృతి ఖండనకు ఆధునికతకు ఆహ్వానంతో కలిపి పిలుపు నిచ్చాడు. ఇది ఎందరో బ్రాహ్మణ యువకుల్ని కూడ ఆకర్షించింది.

ఆధునికత, దానికి స్పందన

అదే సమయంలో ఇంగ్లీష్‌ పాఠశాలలు, కళాశాలలు వాటి పాఠ్యాంశాల్లో చరిత్ర, భూగోళ శాస్త్రం, జీవ, భౌతిక శాస్త్రాల వంటి శక్తివంతమైన కొత్త అంశాలని చేర్చాయి. ఈ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు క్లిష్టమైన ప్రశ్నలు వెయ్యటం మొదలుపెట్టారు దండకారణ్యానికి లంక ఎంత దూరం? ఆంజనేయుడు దాటిన సముద్రం వెడల్పెంత? వానరాలకు ఒక సమాజం, రాజ్యం, రాజు వుండేంత నాగరికత ఎలా వచ్చింది? వస్తే, వాటిని జంతువులుగానే లెక్క వెయ్యటం న్యాయమా?

ఈ సామాజిక, రాజకీయ నేపథ్యంలో, ముందు అబ్రాహ్మణ కవులు, మేధావులు; ఆ తర్వాత అధునాతన రచయితలు (వీళ్ళలో కొందరు బ్రాహ్మణులు కూడ ఉన్నారు) సంప్రదాయ రామాయణాలకు ఎదురుతిరిగి రామకథని తిరగరాయటం మొదలెట్టారు. క్రమం తప్పకుండా ఈ రామాయణ వ్యతిరేక కథనాలు వాల్మీకంలోని సమస్యా భాగాల మీదనే కేంద్రీకరించాయి. రాముడు నిజంగా జనం అనుకునేంత గొప్పవాడు కాదనీ, బ్రాహ్మణ, రాచరిక, పితృస్వామ్య వ్యవస్థల సమర్థన కోసం రాముడికి లేని ఔన్నత్యాన్ని ఆపాదించారని చూపించారు.

ఆంధ్రలో ఆధునికత ముఖ్యంగా భావకవిత్వం అనే సాహిత్య విప్లవ మార్గంగా ప్రస్ఫుటమైంది. ఆధునికతా ప్రభావం వల్ల పూర్వపు బ్రాహ్మణ సంస్కృతిని తోసి రాజనటం తేలికయ్యింది. కొత్తతరం కవులు, రచయితలు వాల్మీకి రామాయణం ప్రామాణికతను ప్రశ్నించే పనికి నడుం కట్టారు.

బ్రాహ్మణ పండితుల్ని ఢీకొన్నప్పటికీ, రామస్వామి చౌదరి గారు తన రచనల కోసం వాళ్ళ ఛందస్సుని, భాషని ఉపయోగించాడు. కవితా శైలి విషయంలో వాళ్ళతో తగవులున్నా, తన శంబుక వధ, ఇతర రచనల్ని బ్రాహ్మణ సాంప్రదాయిక పద్యచ్ఛందస్సుల్లోనే రాశాడు. దీన్లో ఆయన చాలా పనితనం చూపించాడు కూడ. దానివల్ల సమకాలీన బ్రాహ్మణులు సైతం అతనికి “కవిరాజు” అన్న బిరుదునిచ్చి గౌరవించారు.

కాని, ఆధునికత పునాదిగా వచ్చిన భావకవిత్వం సాంప్రదాయిక దృష్టిని తిరస్కరించింది. పండితుల సూత్రాల్ని ధిక్కరించి కొత్త సాహితీ సంప్రదాయాల్ని సృష్టించటానికి కవుల్ని ప్రోత్సహించింది. భావకవుల చేతిలో వ్యతిరేక రామాయణ కథలు కొత్త సాహిత్యభాషలో వెలువడ్డాయి.

అలాటి ఒక నాటిక ముద్దుకృష్ణ గారు రాసిన అశోకం (1930). దీన్లో రాముడు, సీత, రావణుడు వ్యావహారిక భాషలో పిచ్చాపాటీ మాట్లాడుకుంటారు. అప్పటివరకు పౌరాణిక పాత్రలు సంస్కృత సమాస భూయిష్టమైన భాషలో మాట్లాడటం ఆనవాయితీగా వస్తూ వుంది. పాత్రల్ని మానవ స్థాయి కన్న ఎత్తుగా ఉంచి వాటికి దైవత్వాన్ని ఆపాదించింది. రావణుడు లాటి పై కులాల దుష్ట పాత్రలు కూడ అదే భాషను వాడాయి. ఈ ఆచారాన్ని చలం గారు బద్దలు కొట్టాడు (ఈ విషయం తరవాత వివరిస్తాను). ముద్దుకృష్ణ గారు ఆయన్ను అనుసరించాడు.