నేను ఏ ఊరెళ్ళినా నీటి కోసం వెతుకుతాను
నా అసలు ముఖం నీటి అద్దంలోనే
దొరుకుతుంది
రాజమండ్రి గౌతమీ ఘాట్లో
తప్పిపోయిన నన్ను
కరీంనగర్లో దిగువ మానేరు తల్లి
ప్రేమగా ఒడికట్టుకుంది
తల్లి ఎక్కడైనా తల్లే
డ్యాంలు కట్టిన చోట
రాశి పోసిన అనుభవాల నీటి మట్టము
మునగబెట్టిన బతుకు ఆనవాళ్ళుంటాయి
పోరాటపు నేల వొంటి మీద కప్పిన
నీలి జలతారు వస్త్రము
అనేక రక్తపు గాయాల్ని దాచిపెడుతుంది
ఈ డ్యాం దు:ఖం కాస్త కాస్త నాకర్థమయ్యేది
నిండు మనిషి పొట్టలో కదిలే
ఆకుపచ్చటి తడి రూపాన్ని ఊహించగలిగేవాణ్ణి
నీటి బిందువులోంచే సుఖ దు:ఖాల సింగిడి
నిగనిగలాడుతుంది కనుక
ఎల్ ఎం డీ గట్టు మీద కూర్చుని
నాలో నన్ను తడిమి చూసుకునేవాణ్ణి
మనిషి ఎన్ని రంగుల ఒదిగిన కాంతి రహస్యమో కదా
ఈ నీటి కుప్ప మీద వలస పక్షిలా ఎగురుతున్నప్పుడు
నేను దాటిన ఊళ్ళ సరిహద్దులన్నీ
ఇందులో చేప పిల్లల్లా ఈత్తూ కనిపించేవి
నన్నోదార్చే కాసిన్ని తేమగల అక్షరాల్ని
దోసిట్లోకి తీసుకుని పైతట్టున చల్లుకునేవాణ్ణి
నా కవిత్వానికిక్కడే కొత్త మొప్పలు మొలిచాయి
దేశి పలుకుబళ్ళ గవ్వలగురిగి దొరికింది
ఈ డ్యాం గేట్లెత్తినప్పుడల్లా
రంది తీరక ఉసురు దీసుకున్న కలలన్నీ
భోరున పల్లానికి పారేవి
మానేరు పెద్దవ్వనప్పుడు
ఊరడించడం ఎవ్వరి తరం కాని పని
(కరీంనగర్ చుట్టుపక్కల 3.5-4 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే రిజర్వాయరు పేరు లోయర్ మానేరు డ్యాం. దాని గట్టు మీద ఎంతో మంది వాకింగ్ చేస్తారు. బోటింగ్ ఉంటుంది. నాకెంతో ఇష్టమైన ప్రదేశం)