వాడ్రేవు చినవీరభద్రుడు తన తొలి కవితా సంపుటి అంటే “నిర్వికల్ప సంగీతం” వెలువరించి నలభయ్యేళ్ళయింది. ఈ నలభయ్యేళ్ళలో ఆనాడే అజంతా జ్యోతిష్యం చెప్పినట్టుగా తెలుగు సాహిత్య ప్రపంచంలో భవిష్యత్తంతా ఇతనిదే అయింది. చినవీరభద్రుడి ప్రపంచంలో భవిష్యత్తులో మానవుడిదే విజయం, రక్కసులది పరాజయం. ఆ భవిష్యత్తు వచ్చేదే. ఈ లోపల తలుపులు బార్లా తెరిచి బయటకు వెళ్ళాల్సిన వేగమేదో ఈ కవిని పూనింది. తలుపులు బార్లా తెరిచి అజరామరమైన ప్రకృతిని లోపలికి ఆహ్వానించాల్సిన అవసరమేదో ఈ కవిని మేల్కొల్పింది. మారుతున్న ఋతువుల మధ్య జీవితాన్ని ప్రతిఫలిస్తూన్న చెట్లూ, పక్షులూ, రంగులు మారుతున్న ఎండ, ఇటువంటి వాటినే కాదు, నవీనమయిన భావాలనూ ఆహ్వానించాలంటే అన్ని తలుపులూ బార్లా తెరవాలి. మహారణ్యాల్లో ఋషుల పర్ణశాలలేపాటివి? ఋషి చుట్టూ వల్మీకం ఏర్పడిన కథ ఉంది గానీ ఏ ఋషి అయినా బయలులోనే తన తపస్సును కొనసాగించాడు. కుటీరం ఎంత చిన్నపాటిదైనా అందులో కాదు, బయటే. ఈ సంపుటిలో కవి తలుపులు బార్లా తెరవమనే పలుమార్లు చెప్పాడు. అసలు తలుపులు జనజీవనంలోకి ఎప్పుడు వచ్చి చేరాయి? ఆదిమప్రాణికి ఇళ్ళూ వాటికి తలుపులూ లేవు. ఎండ నుంచి, వాన నుంచి తెరిపి కోసమే అయితే తలుపులకి తాళాలు అవసరం లేదు. మనిషి సొంత ఆస్తి బహుశా తలుపుల్నీ తాళాల్నీ కనుక్కుంది. ఏమయితేనేం? ఇవాళ మన ఇళ్ళకూ మనసులకూ తలుపులున్నాయి, తాళాలున్నాయి. వీటిని వదిలించుకుంటే ఏది లభిస్తుందో ఆ విషయమే ఈ సంపుటి కవిత్వాంశ.
1960ల్లో మన పల్లెటూళ్ళకూ ఇవాళ్టి కాంక్రీట్ జంగిల్ మహానగరాలకూ మధ్య కనిపించే వైరుద్ధ్యం (contrast) ఎంత గాఢమయినదో ఈ సంపుటిలో కవిత్వం అంత గాఢమయినది. చినవీరభద్రుడు లోగడ రాసిన nostalgia కవిత్వం పరిచయమయిన వారికి ఇందులో అదే nostalgia పరిపక్వమై వైవిధ్యభరితమై ఎంత చదివినా తనివి తీరక, Oliver Twist లాగ they will ask for more. ఇదీ ఈ సంపుటి వైశిష్ట్యం (unique selling point)! కవికి తన జీవనయానంలో ఎంతమంది పరిచయమైనా ఎన్ని విలువైన అనుభవాలు వ్యక్తుల వల్ల కలిగినా, ఇప్పుడు “వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు రాసుకున్న కవితలూ, వాటిని వెన్నంటి నా మదిలో మెదిలే ఆ అడవులూ, ఆ కొండలూ, ఆ నదులూ, ఆ కొంగలూ, ఆ కోకిలా తప్ప మరేమీ గుర్తు రావడం లేదు.” అని కవి ముందే చెప్పుకున్నాడు. నైసర్గిక ముద్ర అంత లోతైనది. కవి దైనందిన కక్ష్య దాటగలిగాడు కనుకనే అతనికీ జ్యోతిర్మయ రోదసిలో చోటు దొరికింది. ఇదీ ఒక తపస్సు ఫలితమే.
ఒకే చిత్రాన్ని దశాబ్దాలుగా గీసిన జపనీస్ చిత్రకారుడు హొకుసాయి (కత్సుషికా హొకుసాయి, 1760-1849 – The Great Wave Off Kanagawa) వలె చినవీరభద్రుడు ఒకే శరభవరాన్నీ, ఆ పాలపూల అడవినీ, ఆ జెండా కొండనీ తల్చుకుంటూ ఇన్ని దశాబ్దాలూ రాస్తూ గడిపాడు. మిగతా అంతా, తతిమ్మా అందరూ ఈ కవికి నడమంత్రపు సిరి! వచ్చాయి, పోతాయి. కవి అదే శరభవరాన్ని మళ్ళీ మళ్ళీ చిత్రించడం, తిరగ రాయడం వేదర్షులు ఇంద్రాగ్నులను ఆజన్మాంతం సరికొత్త సూక్తాలతో స్తుతించడం వంటిది. హొకుసాయికి ఆ కెరటం లాగ చినవీరభద్రుడికి తన ఊరి ప్రకృతి, స్మృతి నిరంతర సాధన అయ్యాయి. ఇందువల్ల ఋషికి మోక్షం సిద్ధిస్తే, ఇక్కడ చదువరులూ కొన్నాళ్ళకు ముముక్షువులైపోతారు. ఎవరి శరభవరం వారికి దొరుకుతుంది. ఎవరి కనగావా కెరటాన్ని వారు కుంచెలో పట్టుకోగలుగుతారు. ఈ సంపుటి తలుపులు బార్లా తెరవమంటోంది. ఇది సొంత ఆస్తుల్ని వదిలిపెట్టి సమష్టి ఆస్తుల పట్ల దృష్టి సారించమంటోంది. “యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్”, దాన్ని కరుణాసముద్రుడు క్షమించినట్టు, మన కళంకాలు (imperfections) దశాబ్దాల తరువాతనూ ఇంకా కొంచెం ఉంటే గింటే, మహాదేవుడూ, సాటి మనిషీ క్షమిస్తారు. ఈ ఇచ్చి పుచ్చుకోవడమే ఆత్మలకు మంచిది. చినవీరభద్రుడు ఇదే చెబుతున్నాడు. మీరూ ఈ సంపుటి చదివిన తరువాత మీ ఇళ్ళ తలుపులూ మనోకవాటాలూ బార్లా తెరవండి. అక్కడ మీ పల్లెటూరే కాదు, మీ జీవితానికి తల్లి వేరూ, మీ స్మృతుల పునాదులూ ఉన్నాయి.
—-
For Copies,
Shri Pada Literary Works,
House No. 12-2-505/28 & 29
Flat 301, 3rd Floor, Venkata Sai Homes,
Gudimalkapur, Mehdipatnam,
Hyderabad – 500 028,
info.shripada@gmail.com,
www.shripadaliteraryworks.com,
+91 9063992633


