నక్షత్రాలు కనపడినంత కాలం
చూస్తూ ఉండు
ఒకరోజు నీకూ నక్షత్రాలకీ మధ్య
దట్టమైన ధూళిమేఘం
చిరస్థావరం కట్టుకోవచ్చు
కంటి దూరం
కాంతి దూరాలు
చేరుకోలేకపోవచ్చు
అంతెందుకు,
నువ్వు వేరే గ్రహంలోకి
బదిలీ కావచ్చు
రక్షాకవచంలా
ఆకాశం కనిపిస్తూ ఉంటుంది.
మీద పడకుండా
ఎవరో కాపాడుతున్నట్టు
ఊహల ప్రపంచాన్ని
నమ్ముతూ ఉండచ్చు
ధ్రువుడో, సప్తర్షులో
అరుంధతో
నడిపిస్తోందని
గ్రహగతులతో
తారాబలంతో
జీవితం నడుస్తోందని
అనుకుంటూ బతికేయచ్చేమో
అన్నీ ఎందుకు గానీ,
ఇవాళ్టికిక
చేతులు కడుక్కుని
వెల్లకిలా పడుకుని
ఆకాశం కేసి చూస్తూ ఉంటే
చంద్రుడు నవ్వుతూ
జోల పాడతాడు.