ఒప్పుకోలు

అందాకా కానే కాదని
చివరికి ఔనని ఒప్పుకున్నప్పుడు
వాడు ప్రయాస నుండి విడుదలైనట్టుంటాడు
వాఙ్మయ కథల్లోని ముక్త జీవిలా ఉంటాడు
కలకలం లేని నవ్వక్కడ తుంపరలా కురిసిపోతుంది

మనం దేని మీద పంతాలు పోతామో
అది అసత్యమో అర్ధసత్యమో ఐనప్పుడు
ఒక్క ఒప్పుకోలు కొన చాలు –
బింకాలు
దులిపినట్టు వదులుతాయి
యుద్ధాలు తునకలై విరుగుతాయి
వినికిడి శ్రోతలా మిగులుతుంది

రాయని సంగతులెన్నో గరిమలై ఊగే
ఆ ఒప్పుకోలు క్షణికం ద్రావకమై
సౌజన్యం చిమ్ముతుంది

మనిషితనం పతాకలా ఎగిరి
తతిమ్మా సంగతులు ఫలకాలై మిగిలినప్పుడు
ఒప్పుకోలు ఒంటి రెక్క పక్షి కాదని అర్థమౌతుంది