జీవితం ఒక నిరంతరబాధానీరప్రవాహం.
అక్కడక్కడా ఆనందపు బండరాళ్ళు అడ్డు తగిలితే తప్పించుకొని సాగిపోతూనే ఉంటుంది,
వాటి మీద కూడా నీటి జాడలు నిలుపుకుంటూ.
వెన్నెల పరుచుకోవాల్సిన పున్నమి నాడే మబ్బులు మూగినట్టు
కొండల్ని పిండి చేయగలిగే యవ్వనంలోనే
నానావిధభయసంజనితనిర్బలత.
శిశిరయవనిక మీదే గ్రీష్మభానూదయం.
ఆమని ఒక ఆకాశకుసుమం.
వెనక్కి సారించిన చూపులో రక్తమోడుతున్న జీవితసింహావలోకనం.
* * *
అంతలో, నడివయస్సుటెడారిలో తచ్చాడుతూ ఉంటే దూరంగా యవ్వనం కనిపించింది.
దగ్గరికి వెళ్ళి పరికించి చూస్తే నిజానికది జ్ఞానోదయం.
అందుకే, విజ్ఞత వంటబట్టిన జీవనదశయే యవ్వనం.
ఆశల ఆశయాల ఆదర్శాల శుకపికనాదసంచయమే ఆమని.
(గాబ్రియెల్ గార్సియా మార్కేస్ ‘లవ్ ఇన్ ద టైం ఆఫ్ కాలరా’లో రాసిన ఈ క్రింది వాక్యం ప్రేరేపించిన ఆలోచనలకు ఈ కవిత ఒక అక్షరరూపం: “Wisdom comes to us when it can no longer do any good.” కానీ ఫిరదౌసి జ్ఞానం వృద్ధుని మనస్సును యవ్వనవంతంగా ఉంచుతుంది అన్నాడు.)