పరిచయం
చిత్రకవిత్వం ప్రధానంగా శబ్దచిత్రం, అర్థచిత్రం అని రెండు విధాలు. ఈ రెండింటి సమావేశం వల్ల ఉభయచిత్రం ఏర్పడుతుంది. కేవలం శబ్దవిషయకమైన గుణాలంకారచమత్కృతివిశేషాన్ని కలిగి, వ్యంగ్యప్రాధాన్యం లేకపోవటం శబ్దచిత్రమని, అర్థాన్ని పురస్కరించుకొన్న గుణాలంకారచమత్కారవిశేషవత్త్వం అర్థచిత్రమని, శబ్దార్థాలు రెండింటికి తుల్యప్రాధాన్యం ఉన్న వ్యంగ్యవైభవం తోడి గుణాలంకారచమత్కృతి ఉభయచిత్రమని అప్పయ దీక్షితులవారి చిత్రమీమాంసకు సుధా టీకను వ్రాసిన ధరానందుడు నిర్వచించాడు. అనుప్రాసము, లాటానుప్రాసము, ఛేకానుప్రాసము మొదలైన శబ్దాలంకారాలకు శబ్దచిత్రాలని సామాన్యవ్యవహారం. పువ్వులతో దండను కూర్చినప్పుడు, ముత్యాలతో హారాన్ని రూపొందించినప్పుడు రకరకాల పువ్వులలోని వర్ణసమ్మేళనను చూసి, ముత్యాల వరుసలోని ఆకర్షణీయమైన క్రమప్రథను తిలకించి ముగ్ధులయ్యే రసజ్ఞుల లాగానే శబ్దచిత్రాలలో స్వసమానవర్ణసన్నివేశం వల్ల – అంటే ఒకే అక్షరాన్ని, ఒకే అక్షరసంహతిని చిత్రచిత్రప్రకారాలుగా ప్రయోగించటం వల్ల పాఠకుల మనస్సులో ఒక విచ్ఛిత్తివిశేషం ఉదయిస్తుందని, ఆ విచ్ఛిత్తి (శరీరానికి సౌందర్యలేపనం వంటి అంగరాగం) విశేషాన్ని భావించే భావుకులకు రసభావసంపత్తి కంటె ఆ శబ్దచిత్రసామగ్రిపైనే అభిమానం ఏర్పడుతుందని విద్యాధరుని ఏకావళికి తరళ వ్యాఖ్యను వ్రాసిన మల్లినాథ సూరి అన్నాడు.
అర్థాన్ని ఆశ్రయించుకొన్న చమత్కృతులు అర్థచిత్రాలు. యమకాలంకారంలో అర్థమే ప్రధానం కాబట్టి అది అర్థచిత్రమని కొందరు, అర్థం శబ్దచమత్కారంలో అణిగిపోతున్నది కాబట్టి శబ్దచిత్రమని కొందరు లక్షణకారులు ఊహించారు. ఉపమ, ఉత్ప్రేక్ష, రూపకం, వ్యాఘాతం, అతద్గుణం మొదలైన అలంకారాలను చిత్రార్థవంతంగా ప్రయోగించటమే అర్థచిత్రం. శబ్దానికి, అర్థానికి తుల్యప్రయోజనం ఉన్న శ్లేష, వక్రోక్తి, విరోధాభాసం, సమాసోక్తి, అపహ్నవం వంటివి ఉభయచిత్రాలు.
చిత్రకవిత్వాన్ని మరొక తీరున విభాగింపవచ్చును. అవి –
- స్థాన చిత్రాలు: ఓష్ఠ్యం (పెదవి కదలిక స్పష్టంగా కనిపించే ప – ఫ – బ – భ – మ వంటి అక్షరాలతో మాత్రమే ఏర్పడే పదాలు: పాపము, బాబు వంటివి), నిరోష్ఠ్యం (పెదవి కదలిక అవసరం లేనివి: జలజాక్షి, నయనతార), ఊష్మములు, దంత్యములు, తాలవ్యములు, చలజిహ్విక (నాలుక కదలవలసి వచ్చే నేనున్నాను, దుద్దు, తొత్తు వంటి పదాలతో కూర్పు), అచలజిహ్విక వంటి ఉచ్చారణస్థానాలను ఆశ్రయించుకొన్న చిత్రాలు. గణపవరపు వేంకటకవి ‘దశావతార గర్భిత గుణిత వర్ణాచలజిహ్వాకోష్ఠ్యవర్ణ భుజంగప్రయాత గర్భిత నిరోష్ఠ్యచలజ్జిహ్వా స్రగ్విణీవృత్త గర్భి తౌష్ఠ్యాచలజిహ్వా నిరోష్ఠ్యచలజ్జిహ్వా సంకీర్ణవర్ణ సమగణదండకము’ అనే విచిత్రమైన ప్రయోగాన్ని తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము లోని 832-వ పద్యంలో చేశాడు.
- వర్ణ చిత్రాలు: ఏకాక్షరి, ద్వ్యక్షరి, సంగీత స్వరాక్షరి (మా పాపని పని మాని దాని పని గానిమ్మా), ద్విప్రాసము, చతుష్ప్రాసము వంటివి సామాన్య వర్ణచిత్రాలు. అక్షరవృద్ధి వంటివి విశేష నియమచిత్రాలు. గణపవరపు వేంకటకవి ‘ఏక ద్వి త్రి చతుః పంచ షట్ సప్తాక్షరవృద్ధి క్రమపాద నియమసీసము’ అనే విచిత్రమైన ప్రయోగాన్ని తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము లోని 878-వ పద్యంలో చేశాడు.
- స్వరచిత్రాలు: సర్వలఘువు, సర్వగురువు మొదలైనవి. ప్రాకృత పైంగళానికి ప్రదీపమనే వ్యాఖ్యను వ్రాసిన లక్ష్మీనాథ భట్టు చెప్పిన 4 లఘువులు, 30 గురువులు గల నందకము అనే స్కంధక ప్రభేదాన్ని గణపవరపు వేంకటకవి తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము లోని 372-వ పద్యంలో ‘ఛన్న కందము’ అన్న పేరుతో ప్రయోగించాడు.
- గతి చిత్రాలు: అక్షరగతిని బట్టి ఏర్పడే చిత్రాలు. ఉదాహరణకు 64- అక్షరాల ఒక పద్యంలోని 64 అక్షరాలను 8X8 అక్షరాలతో చతురస్రంగా కాని, 16X4 అక్షరాలతో దీర్ఘచతురస్రంగా కాని గీసిన ఒక బొమ్మల గడిలో వరుసగా వ్రాసి, ఆ బొమ్మ మొదటి అక్షరం నుంచి చదరంగంలో గుర్రం పావు కదలిక వలె నియమానుసారం ముందుకు నడిచి, ఆయా అక్షరాలను వరుసగా వ్రాస్తే అందులో ఇంకొక పద్యం వస్తుంది. అటువంటి పద్యానికి ‘అశ్వగతి చిత్రము’ అనిపేరు. గజపద గతి, శతధేను గుణగతి, స్వస్తిక గతి, గతప్రత్యాగత గతి వంటివి ఇందులోని కొన్ని రకాలు.
- గూఢ చిత్రాలు: ఇవి నామగోపనం, పదగోపనం, పాదగోపనం వంటివి. ఒక పద్యంలో ఒక పదాన్ని గాని, పేరును గాని, మూడు పాదాలను వ్రాసి నాలుగవ పాదాన్ని ఆ అక్షరాలలో నుంచి వచ్చేట్లు చేయటం గాని మొదలైన చిత్రరచనలు. గణపవరపు వేంకటకవి తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము లోని 845-వ పద్యంలో “పాదాద్యంతాక్షర కావ్య తత్కర్తృనామ పూర్వకవి నామగుప్తసీసము” అనే చిత్రమైన ప్రయోగాన్ని చేశాడు.
- కూట చిత్రాలు: కూటచిత్రమంటే గూఢార్థమయమైన చిత్రం అని అర్థం. ఇందులో సమాధి (ప్రహేళిక అనబడే పొడుపు ప్రశ్న), బ్రహ్మోద్యము (వేదాంతం, స్వర్ణయోగం మొదలైన రహస్యార్థం కలిగిన రచన), వాణీ కూటము (వాచ్యార్థాని కంటె భిన్నమైన సంకేతం కలిగిన కూర్పు), కుతూహలాధ్యాయి (కమ కల్లా కయ కపా కలెం మొదలైన ‘క’ భాష; దడిగాడువానసిరా, వురాభల్లవ వంటివి) మొదలైన ప్రభేదాలున్నాయి. కావ్యాదర్శంలో దండి, కావ్యాలంకారంలో రుద్రటుడు, సరస్వతీ కంఠాభరణంలో భోజరాజు అనేకభేదాలను కల్పించారు. అగ్ని పురాణం, విష్ణుధర్మోత్తర పురాణం, ధర్మదాసు విదగ్ధముఖమండనం వంటివాటిలో ఇంకా వివరాలున్నాయి. గణపవరపు వేంకటకవి తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో అక్షరప్రతీకాత్మకం (ప.315), అప్రతీతార్థం (ప.808), ఏకశబ్ద బహ్వర్థావర్తనం (ప.32), ఏకసమాస శబ్దమాలిక (ప.815), వర్ణయోగము (ప.421), వర్ణలోపము (ప.310) మొదలైన కూటచిత్రాలను ప్రయోగించాడు.
- సమస్యా చిత్రాలు: క్లేశయుక్తమైన సమస్యను ఇవ్వటం, దాని చతురపరిష్కారం అన్నవి సరసగోష్ఠీవినోదాలలోని వాగ్విభూతులు. సమస్యా శతకాలు, సమస్యా కావ్యాలు సంస్కృతాంధ్రాలలో అనేకం ఉన్నాయి.
- భాషా చిత్రాలు: పదవిధి చేత, అన్వయభేదం మూలాన కల్పించే అనేక భాషాచిత్రాలు ఇవి. ఒకే పద్యం పెక్కు భాషలకు అన్వయించటం. పింగళి సూరన పద్యాన్ని అనులోమంగా (ఎడమనుంచి కుడికి) చదివితే పద్యం, విలోమంగా (కుడినుంచి ఎడమకు) చదివితే సంస్కృతశ్లోకం వచ్చే అపురూపమైన రచన చేయటం నలుగురికి తెలిసినదే. వీటిలో అన్యభాషాభాసం (ఒక పద్యాన్ని లేదా శ్లోకాన్ని చదువుతుంటే మనకు వేరేదో భాషను వింటున్న భ్రమ కలగటం) వంటివి అనేకభేదాలున్నాయి. గణపవరపు వేంకటకవి తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో ప్రాకృతీ శౌరసేనీ మాగధీ పైశాచీ చూళి కాపభ్రంశ సంస్కృతాంధ్ర భాషాష్టకము అనే చితప్రభేదాన్ని (ప.876) సరికొత్తగా కల్పించి ప్రయోగించాడు.
- భ్రమక చిత్రాలు: పద్యంలో పాదాలను గాని, మొత్తం పద్యాన్ని గాని ఎడమ నుంచి కుడివైపుకు (అనులోమం), కుడినుంచి ఎడమకు (విలోమం లేదా ప్రతిలోమం) చదివినప్పుడు ఆ పాదము లేదా పద్యం ఒకే విధంగా ఉండటం (‘వికటకవి’ అన్న పాదంలో వలె), లేదా అర్థవంతమైన మరొక పాదంగానో పద్యంగానో ఉండటం అన్నవి ఈ భ్రమక చిత్రానికి ఉదాహరణలు. గణపవరపు వేంకటకవి తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో ‘ఆదిపాదైకైకచరణానులోమప్రతిలోమాది బహుచిత్ర రగడ’ (ప.877) అన్న పదభ్రమక చిత్రాన్ని, హరిహరవర్ణనాయుక్తానులోమప్రతిలోమము’ (ప.365) అన్న పద్యభ్రమక చిత్రాన్ని, ‘అనులోమప్రతిలోమోపమానషట్కము’ (ప.32), ‘శబ్దభ్రమకానుప్రాణిత నియమ యమక గీతిగర్భితచరణ దుర్ఘటసీసము’ అన్న అపూర్వమైన చిత్రప్రయోగాన్ని (ప.466) విధవిధాలుగా చేశాడు.
- చ్యుతక చిత్రాలు: అక్షరచ్యుతి (పదబంధంలో ఒక అక్షరం లోపించినందువల్ల కొత్త అర్థం ఏర్పడటం), బిందుచ్యుతి, మాత్రాచ్యుతి మొదలైనవి చ్యుతక చిత్రాలు. వసుచరిత్రలో ‘సారసలోచనలు’ రసభంగమైతే ‘సాలోచనలు’ అవుతారన్న చిత్రం చ్యుతక చిత్రమే. గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో ఏ పుటను తీసినా ఎక్కడికక్కడే ఇటువంటి చ్యుతక చిత్రాలు కోకొల్లలుగా కనుపిస్తాయి.
- అనేకార్థ చిత్రాలు: శబ్దాల అనేకార్థత్వం వల్ల, లింగ వచన విభక్తి సంధి నియమాల వలన శ్లేషచిత్రం ఏర్పడుతుంది. రుద్రటుడు కావ్యాలంకారంలో వర్ణ శ్లేష, పద శ్లేష, లింగ శ్లేష, భాషా శ్లేష, ప్రకృతి శ్లేష, ప్రత్యయ శ్లేష, విభక్తి శ్లేష, వచన శ్లేషలను నిర్దేశించాడు. విశ్వనాథ కవిరాజు సాహిత్య దర్పణంలో సభంగ శ్లేష (పదాల విరుపు వల్ల అర్థభేదాలు ఏర్పడటం), అభంగ శ్లేష (పదాలను విడదీయకుండానే అర్థాంతరాలను సాధించటం), సభంగాభంగ శ్లేష (ఒకసారి విడదీసి, ఒకసారి విడదీయకుండాను అనేకార్థాలను కూర్చటం) అని చెప్పాడు. విద్యానాథుడు ప్రతాపరుద్రీయంలో ప్రకృత శ్లేష, అప్రకృత శ్లేష, ప్రకృతాప్రకృత శ్లేష అని వివరించాడు. వీటన్నిటిని కలిపితే ఇంకా అవాంతరభేదాలనేకం ఉన్నాయి. ఇవి కాక సోద్భేదము, నిరుద్భేదము అని వీటిలో మళ్ళీ అవాంతరశాఖలు కనబడుతున్నాయి. ఇవన్నీ కలిపి వందలాది భేదాలు. వీటిని భిన్నజాతీయాలు, అభిన్నజాతీయాలు అన్న ప్రభేదాలతో హెచ్చవేస్తే అనేకార్థచిత్రాలు వేలకొద్దీ ఉంటాయి. పింగళి సూరన రాఘవపాండవీయములో ఆంధ్రభాషా సంస్కృతాభిభాషాశ్లేష, శబ్ద శ్లేష, అర్థ శ్లేష, ముఖ్యగౌణవృత్తి శ్లేష, అర్థాన్వయ శ్లేష, శబ్దాన్వయవిభేద శ్లేష, అని తాను స్వయంగా కల్పించిన ప్రభేదాలను నిరూపించాడు. వీటివల్ల ద్వ్యర్థి, త్ర్యర్థి, చతురర్థి, పంచార్థి, సప్తార్థులే గాక శతార్థులను వ్రాసినవారున్నారు. ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో గణపవరపు వేంకటకవి వీటిలో పెక్కింటిని పెక్కు వినూత్నరీతులలో అసంఖ్యాకంగా ప్రయోగించి ఉండటం విశేషం.
- విపర్యాస చిత్రాలు: పద్యపాదంలోని మాత్రాక్రమంలో మార్పుచేసి, ఆ గతిభేదం వల్ల కొత్త వృత్తాలను సాధించటాన్ని విపర్యాసచిత్రము అంటారు. ఇది గురులఘువుల పరివృత్తి మూలాన, గణవిభాగంలోని మార్పు వలన పరిపరివిధాలుగా ఉంటుంది. లాక్షణికులు చెప్పని ఒక్క ఉదాహరణను మాత్రం చూపుతాను:
౹౹౹ U౹౹ U౹U U౹ U౹
౹౹౹ U౹౹ U౹U U౹ U౹
U౹ U౹౹ U౹U U౹ U౹
U౹ U౹౹ U౹U U౹ ౹౹౹
౹౹౹ U౹౹ U౹౹ ౹౹౹ U౹
౹౹౹ U౹౹ U౹౹ ౹౹౹ ౹౹౹
U౹ U౹౹ U౹U ౹౹౹ U౹
U౹ U౹౹ U౹U ౹౹౹ ౹౹౹
౹౹౹ UU౹ U౹౹ U౹ U౹
౹౹౹ UU౹ U౹౹ U౹ ౹౹౹
U౹ UU౹ U౹౹ U౹ U౹
U౹ UU౹ U౹౹ U౹ ౹౹౹ఈ పన్నెండు గతిభేదాలను ద్విపద గాను, తేటగీతి గాను రెండు విధాల వాడుకోవచ్చును. ఇది విపర్యాస చిత్రాలలో ఒకటి. గణపవరపు వేంకటకవి తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో వీటిలోని మొదటి ప్రభేదాన్ని స్వీకరించి ‘ద్విపద తేటగీతి’ అనే చిత్రప్రయోగాన్ని (ప.385) చేశాడు. నాదెండ్ల పురుషోత్తమకవి గారు తమ అద్భుతోత్తర రామాయణంలోనూ, కృష్ణానదీ మాహాత్మ్యంలోనూ వేల విధాల గతిభేదాలతోడి పద్యాలను కల్పించటానికి వీలయే చిత్రరచనలను చేశారు. ఈ గతిభేదాల విషయమై వేంకటకవి వలె పరిశోధనలు చేసి లెక్కలేనన్ని ప్రభేదాలను సృష్టించినవాళ్ళు సాహిత్యంలో ఎక్కువమంది కనబడరు.
- గర్భ చిత్రాలు: ఒక పద్యంలో వేరొక లఘుపద్యాన్ని ఇమిడ్చే ప్రక్రియకు గర్భ చిత్రము అనిపేరు. ఇది చ్యుతకభేదాలలోనూ, విపర్యాసచిత్రాలలోనూ కొద్దిపాటి తేడాతో కనుపిస్తుంది. రావిపాటి లక్ష్మీనారాయణ గారు గర్భచిత్రాన్ని ఒక కావ్యంగా మలిచి ‘నిర్వచన భారత గర్భ రామాయణము’ అని భారతార్థాన్ని ప్రవచించే ఒక కావ్యంలో ప్రతిపద్యంలోనూ కొన్ని అక్షరాలను తొలగిస్తే రామాయణార్థం వచ్చే అపురూపమైన కావ్యాన్ని వ్రాశారు. గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ప్రసిద్ధమైన రూపాలనే గాక సీసపద్యంలో ఉత్పలమాల (ప.53), సీసపద్యంలో శార్దూలం (ప.54), శార్దూలవృత్తంలో కందపద్యం (ప.84) వంటి అపూర్వాలైన ఛందశ్చిత్రాలను ప్రయోగించాడు.
- బంధ చిత్రాలు: అక్షరాలను నాగము, పద్మము, ఖడ్గము మొదలైన బొమ్మలలో కూర్చి రచించే చిత్రరచనలకు బంధ చిత్రములు అని పేరు.
ఈ విశేషాలను గురించి మరొకసారి విశదంగా వివరిస్తాను. పైని చెప్పిన చిత్రాలలో ఒక్కొక్క చిత్రాన్ని గురించి ఒక్కొక్క పుస్తకం వ్రాయతగినంత సమాచారం లభిస్తుంది. భగవదనుగ్రహం ఉంటే ఒక్కొక్క చిత్రాన్ని గురించి ఒక్కొక్క వ్యాసం వ్రాసే ప్రయత్నం చేస్తాను. ఆ చిత్రరచనలు అన్నింటికి సంగమస్థానమూ, భారతీయ చిత్రకావ్యపరంపరలో అత్యపూర్వమూ అయిన అయిన ఒక చిత్రాన్ని గణపవరపు వేంకటకవి తన ప్రబంధరాజ విజయవిలాసములోని 808-వ పద్యంలో నిలిపాడు. ‘ఈమాట’ వచ్చే సంచికలలో దానిని సవిస్తరంగా వ్యాఖ్యానిస్తాను.
ఈ వ్యాసంలో ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము కవికాలాదులను గురించి, కావ్యకథను అధికరించి విశేషించి వ్రాయటం లేదు. ఆ కావ్యంలోని కొన్ని శబ్దార్థచిత్రరచనలను మాత్రం ముక్తాముక్తంగా వివరిస్తున్నాను.