జనం మెచ్చిన మేటి రచయిత

కన్నడ రచయిత ఎస్. ఎల్. భైరప్ప 94 ఏళ్ళ వయసులో కీర్తిశేషులయ్యారు. ఒక రచయిత కన్నుమూస్తే ప్రభుత్వం ఎలా వ్యవహరించాలో కర్నాటక ప్రభుత్వం మరోసారి లోకానికి తెలియజేసింది. ప్రభుత్వ యంత్రాంగమంతా ఆ రచయితకు గౌరవం చూపడానికి తరలివచ్చింది. పాఠకుల్లో భైరప్పగారికున్న ప్రాచుర్యం అలాంటిది.

భైరప్పగారితో నాకు నాలుగు దశాబ్దాల నుంచి పరిచయం. వాళ్ళ ఇల్లు కూడా మాయింటికి దగ్గర్లోనే ఉండడం వల్ల అప్పుడప్పుడు నడక సమయంలో కనిపించి పలకరించేవారు. ఆయన చదివింది తత్వశాస్త్రం. మైసూరు విశ్వవిద్యాలయానికి చెందిన మహారాజ కళాశాలలో బి.ఎ., ఎం. ఎ. పూర్తి చేసుకొని వివిధ ప్రదేశాలలో అధ్యాపకులుగా పని చేసి, తర్వాత మైసూరులోనే స్థిరపడ్డారు. ఆయన జన్మించింది హాసన్ జిల్లాలోని సంతెశివార అనే గ్రామంలో. మైసూరులో స్థిరపడ్డా తన స్వగ్రామాన్ని ఆయన మరిచిపోలేదు. ఊరికి అప్పుడప్పుడు వెళ్ళడమే కాదు, ఆ గ్రామానికి నీటి వనరులు కల్పించడానికి ఎంతో కృషి చేసి చివరికి సఫలీకృతులై అపర భగీరథుడనిపించుకున్నారు.

27వ ఏట ‘భీమకాయ’ అనే నవలతో రచనావ్యాసంగాన్ని ప్రారంభించిన భైరప్ప 86 ఏళ్ళ వయసులో ‘ఉత్తరాకాండ’ అనే నవల రాశారు. ఆయన రాసిన 24 నవలలు, ‘భిత్తి’ అనే పేరుతో రాసిన ఆత్మకథ ఆయనకు అత్యంత ప్రాచుర్యాన్ని సంపాదించి పెట్టాయి. 55 ఏళ్ళ క్రితం ఆయన ‘వంశవృక్షం’ తెలుగులో వచ్చింది. తర్వాత ‘దాటు’, ‘పర్వ’ మొదలైన నవలలు కూడా తెలుగులో వచ్చాయి. ఆయన పుస్తకాలు తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు మొదలైన భాషల్లోకి అనువాదమై దేశవిదేశాలలో ముద్రితమయ్యాయి. దీనితో ఇంటాబయటా ఆయనకు అసంఖ్యాక అభిమానులు ఏర్పడ్డారు.

ఎస్.ఎల్. భైరప్ప మామాలు రచయిత కాదు; పరిశోధక రచయిత. ఆయన పిహెచ్.డి. కోసం ఎంపిక చేసుకున్న విషయం సత్యం-సౌందర్యం. ఈ విషయాన్నే నవలారచనలో కూడా అనుసరించానని ఆయన దృఢమైన నమ్మకం. దేన్నయినా నేరుగా చూడకుండా, విషయం తెలుసుకోకుండా రాయకూడదన్నది, ఆయన పట్టుదల. పర్వ మొదలైన నవలలు రాయడానికి ఆయన అయోధ్య, కురుక్షేత్ర, కాశి, ప్రయాగ మొదలైన చోట్ల పర్యటించి జనంతో కలిసి, వారి మనోభావాలను కూడా అధ్యయనం చేసి రచన సాగించారు. ఒక్కొక్క పాత్ర సృష్టికోసం కొంతమందితో ముఖాముఖి జరిపి, వారితో కలిసి కొన్ని రోజులు ముచ్చటించి పాత్రల్ని తీర్చిదిద్దారు. అందువల్ల పాఠకులు ఆయన చిత్రించిన పాత్రల్ని, సంఘటనల్ని తమకు సంబంధించినవే అని భావించడం జరిగింది.

ఆయనను గురించి ఆయన భార్య ఒక ముఖాముఖిలో కొన్ని విషయాలు వెల్లడించారు. ఆయనెప్పుడూ అంతర్ముఖులై ఉండేవారు. ఒక నదిని గాని, పర్వతాన్నిగాని, జలపాతాన్నిగాని చూస్తూ అలాగే ఉండిపోయేవారు. పక్కన తన మనుషులున్నారనే పరిజ్ఞానం కూడా ఉండేది కాదు. రచనలో మునిగినప్పుడు ఆయనకు నిద్రాహారాల ధ్యాస ఉండేది కాదు.

భైరప్ప గారితో పరిచయం ఉన్నవారికి, ఆయనను గమనించిన వారికి ఈ రచయిత అంతర్ముఖ స్వభావం తెలుస్తూనే ఉండేది. ఆయన ఆత్మీయులతో తప్ప ఎక్కువగా ఎవరితో కలిసేవారు కాదు. ఆయన ఇల్లు మైసూరు నగరం, కువెంపు నగర్లో ఒక ముఖ్యమైన, రద్దీగా ఉండే వీధిలో ఉంది. భరించలేని శబ్దాల మధ్య, తలుపులన్నీ మూసుకొని ఒక మూల ఆయన రాసుకుంటూ ఉండేవారు. ఆయన ఇంటివరకు వెళ్ళినవారు కూడా లోపలికి వెళ్ళడానికి తటపటాయించేవారు.

కన్నడ ఆధునిక సాహిత్యంలో సంప్రదాయ బద్ధమైన రచనలు, మన భావకవిత్వంలాంటివి ఒక వైపు, అధునికతని, సామాజిక భావాలని వ్యక్తం చేసేవారు మరోవైపు కనిపిస్తారు.

తెలుగులో విశ్వనాథ, దేవులపల్లి కృష్ణశాస్త్రి మొదలైన వాళ్ళలాగా కె. వి. పుట్టప్ప, ద.రా. బేంద్రె లాంటి వాళ్ళుంటే, పఠాభి, శ్రీశ్రీ, ఆరుద్ర లాగా వి. కె. గోకాక్, గోపాలకృష్ణ అడిగ, యు. ఆర్. అనంతమూర్తి లాంటి వారున్నారు. భైరప్ప ఈ రెండో రకం వాళ్ళ మీద అసహనం ప్రదర్శించేవారు. వాళ్ళని తీవ్రంగా విమర్శించేవారు. అందువల్ల భైరప్ప రచయితగా ఎంత పేరు పొందినా అభ్యుదయ రచయితల అభిప్రాయంలో ప్రగతి విరోధిగా ముద్ర వేసుకున్నారు. మరీ రానురాను హిందుత్వపరమైన అభిప్రాయాలను, రాజకీయాలను ఆయన బలంగా సమర్థిస్తూ వచ్చారు.

భైరప్పగారి వ్యక్తిగత అభిప్రాయాలను తీవ్రంగా విమర్శించేవారు కూడా ఆయన సృజన శక్తిని, విషయాలను లోతుగా పరిశీలించే ప్రామాణికతను, పాత్రలను విశ్లేషణాత్మకంగా చూచే విధానాన్ని కాదనలేరు. చెప్పదలచుకున్న దాన్ని ప్రామాణికంగా చెప్పే గుణం ఆయనది. ముఖ్యంగా ఆయన ఔదార్యం, తాను నడచి వచ్చిన దారిని మర్చిపోకుండా ఉండడం ప్రశంసనీయ గుణాలు. వారాలు చేసుకొని పైకి వచ్చిన జీవితాన్ని ఆయన మర్చిపోలేదు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం, సరస్వతీ సమ్మాన్ లాంటి ఎన్నో పురస్కారాలు ఆయన పొందినా వాటి తాలూకు ధనాన్ని గుప్తంగా దానం చేస్తూ వచ్చిన గొప్ప గుణం ఆయనది. తన యావదాస్తిని ఒక ట్రస్టుగా ఏర్పరచి సాహిత్యానికి, ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలని వీలునామా రాసి కుటుంబ సభ్యులకు కూడా దూరమయ్యారనే వార్త ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా ఎస్.ఎల్. భైరప్పగారిది ఒక విభిన్న వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వం ఆయన రచనల్లో కూడా ప్రతిఫలించి లక్షలాది పాఠకులకు ఆయన్ను దగ్గర చేసింది.


రాళ్ళపల్లి సుందరం

రచయిత రాళ్ళపల్లి సుందరం గురించి:

రాయటం మొదలుపెట్టి సుమారు 60 ఏళ్ళు. రాసింది తెలుగు, కన్నడం, ఇంగ్లీషుల్లో 110 పుస్తకాలు. పెక్కు పరిచయాలు, దేశవిదేశ యాత్రలు, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన.

 ...