భైరప్పగారి ఆత్మకథ ‘భిత్తి’

సంతేశివర లింగణ్ణయ్య భైరప్పగారు సుప్రసిద్ధ ఆధునిక కన్నడ నవలా రచయిత. వారి రచనలకు, ఆంగ్లంలోనూ, భారతీయ భాషలన్నింటిలోనూ అనువాదం జరిగింది. భైరప్పగారు మరాఠి భాషలో అధిక జనప్రియతను పొందారు. హిందిలో ఉత్తమ రచయితల వరుసలో అయిదవవారుగా నిలిచారు. వారి రచనలు అనేక ముద్రణలను పొందాయి. వారిని భారత ప్రభుత్వం 2023లో పద్మభూషణ్ పురస్కారమిచ్చి గౌరవించింది.

భైరప్పగారి రచన “భిత్తి” వారి ఆత్మకథ. వారు భిత్తి నవలను 1996లో రచించారు. ఈ ఆత్మ కథ కన్నడ భాషలో అయిదు ముద్రణలు, హిందీలో రెండు ముద్రణలు, మరాఠీలో మూడు ముద్రణలు పొందింది. 662 పుటలుగల ఆంగ్ల అనువాదాన్ని ప్రిసమ్ బుక్స్ వారు ముద్రించారు.

భైరప్పగారి బాల్యం వెన్నంటిన దారిద్ర్యం, బాధ్యత లేమి తండ్రి, సహకరించని బంధువులు, చుట్ట పక్కాలు చేసిన ఎగతాళి, అపహాస్యాలతో గడిచింది. ఏడుగురు పిల్లలున్న పెద్ద కుటుంబానికి, తల్లి ఒక్కతే ఆధారం. తల్లి మగవాడిలా కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటే, భైరప్పగారికి ఆమె పట్ల అంతులేని గౌరవం, అభిమానం కలిగాయి. ఆ గౌరవం, ఆ ప్రేమ తల్లి మరణించిన తరువాత కూడా ఆయనలో మిగిలి, జీవితాన్ని ప్రభావితం చేసే మంత్రం గా మారింది.

వారికి పదకొండు సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయారు. ఒక సోదరి సోదరుడు కూడా ప్లేగు వ్యాధితో చనిపోయారు. పధ్నాలుగేళ్ళ వయసులో తమ్ముడు శవాన్ని శ్మశానికి మోసుకుని వెళ్ళారు. వరుసగా చూచిన మరణాలు భైరప్ప గారి మనసుపై లోతైన ప్రభావం చూపాయి.వారు జీవితం లో అనేక గడ్డు రోజులను అనుభవించారు. మేనమామ,అత్తల ఆశ్రయం లో నిరాదరణ పొందారు. కడుపునిండా భోజనానికి అలమటించారు. అటువంటి స్థితిలో బతికి బట్ట కట్టడమే అపురూపం అనిపించక మానదు. మేరు పర్వతానికి వలె హృదయ సహిష్ణుతను పెంపొందించుకున్నారు. సాహసం తో కష్టాలను ఎదుర్కున్నారు.

ఆయన తన జీవితానికొక రూపం కల్పించుకోడానికి 600 మైళ్ళు కాలినడకన ముంబై చేరారు. అక్కడ హోటల్‌లో వైటర్‌గా, ఒక థియేటర్ కంపనీ లో అసిస్టంట్ గా పనిచేసారు. పట్టు వదలక చదువును కొనసాగించారు. మైసూరు విశ్వవిద్యాలయం లో ఎం ఏ ఫిలాసఫీ, బరోడా లోని మహారాజా సయాజీ రావు విశ్వ విద్యాలయం నుంచి, “సత్య మత్తు సౌందర్య “అంశం మీద పి హెచ్ డి పట్టాను పొందారు.

భైరప్ప గారు, 26-7-1934 న జనించారు. కాని బడి లో ప్రవేశానికి 20-8- 1931 గా దాఖలు చేయడం జరిగిందని (పుట 50 మొదటి ముద్రణ) లో రాసారు.

ఒక కళాకారుని జీవితాన్ని నిర్మించే నేపథ్య భిత్తిక అతడు సృష్టించే రచనల మీద గాఢమైన ప్రభావాన్ని చూపుతుంది. కాని రచనలలో ఆ గోడ రహస్య మాత్రమై మిగులుతుంది. ఒక రచనను అర్థం చేసుకోవాలంటే రచయిత జీవితచరిత్ర తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. అయితే, భైరప్ప గారి రచనలను చదివిన వారు ఆయన జీవితాన్ని గురించి తమకు తాముగా ఊహించుకుని తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకోవడం వలన, కొందరు స్నేహితులు ఆయనను ఆత్మకథ రాయమని ఒత్తిడి చేశారు. ఫలితంగా ఆత్మవృత్తాంతం “భిత్తి”గా రూపొందింది.

వారి బాల్యం, చదువుకోసం వారు పడిన కష్టం, అధ్యయనం కోసం చేసిన కృషి, అమితమైన సాహిత్యాభిలాష, సంగీతం పై గల మక్కువ లను అనవసమైన ఉద్వేగాలకు తావివ్వక యథాతథంగా తెలిపారు. వారి స్వీయ జీవితం లోని ఒడిదుడుకులకు క్రుంగుబాటును ఎక్కడా వెల్లడించకుండా తమ ఆలోచనలకు స్థిరమైన రచనారూపాన్ని ఇచ్చారు.

వారి జీవితాన్ని గురించి చదువుతుంటే, స్వాతంత్ర్యానికి పూర్వోత్తర కాలం నాటి సామాజిక ఆర్థిక, మత, రాజకీయ వాతావరణం స్థూలంగా పరిచయం అవుతుంది.

వారికి బాల్యం నుంచీ, గ్రామీణ నగర జీవితాల అనుభవగతమైన పరిచయం ఉంది.

విపులంగా సాగిన ఆత్మచరిత్ర భిత్తి లో వారి శ్రీమతి, సరస్వతి గారి గురించి, ఆమె” నొణవిన కరె” గ్రామానికి చెందింది, మా ఇద్దరికి ఫలానా సంవత్సరం లో వివాహమయింది, అన్న విషయాలు మాత్రమే తెలిపారు. వారిరువురి, సంసార జీవితాన్ని గురించి గాని, భైరప్ప గారి సాహిత్య ఘనతలో ఆమె వహించిన పాత్ర ను గురించి తెలుసుకోవాలన్న సంగతి లో వారు అపరిచితునిగా మిగిలి పోయారు. భర్త గా మాత్రమే కాక, వారికి కలిగిన ఇద్దరు కుమారులను గురించి కూడా ప్రస్తావించలేదు, భైరప్ప గారు తమకున్న కుశలతా నైపుణ్యాలను విపులంగా తెలిపారు. తమకు ఈతలోను, వక్తృత్వంలోను, గల పటుత్వాన్ని గురించి చెప్తూ, నాలా చేపలు కూడా ఈదలేవు, ఏ విషయాన్నైనా స్వంతగా ఆలోచించి మంచి ధాటితో మాట్లాడగల ప్రతిభ ఎవ్వరికీ లేదు, తరగతిలో నేనే హీరో, మరొక జాతి,మతాలను గురించి నాలా ఎవ్వరూ ప్రతిపాదించలేరు, అని భేషజం లేకుండా తెలుపుకున్నారు.

ఆ నాటి పరిస్థితులలో సమాజం లోని కుల భేదాలు, భారత దేశం లోని రాజకీయ పరిణామాలు,

సాహిత్య క్షేత్రం లో కలిగిన నూతన ధోరణులు, అన్నింటిని గురించి సమగ్రంగా పర్యవేక్షించారు. అనేకమైన అసమానతలు, ఉద్యమ పరిస్థితులు, కుటుంబ స్తోమతల అపసవ్యాల నడుమ తమ సృజన శీలతను దృఢం గా కాపాడుకున్న విలక్షణ వ్యక్తిత్వం వారిది.

వారి జీవితం లోని సంవేదనలు, తమ చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల కలిగిన సూక్ష్మ సంవేదనలను వారు, భిత్తి లోకంటె, ఇతర నవలలు గృహ భంగ, అన్వేషణ, ధర్మశ్రీ లలో స్పష్టంగా వెల్లడి అవుతాయని విమర్శకులంటారు. భిత్తి ని చదివడానికి ముందు ఈ రచనలను చదివితే పాఠకులకు వారి నవలల రచనా నేపథ్యం అవగతమౌతుందని అంటారు.

భిత్తి ఆత్మ చరిత్ర కష్టాలలో కడతేరిన వ్యక్తి సంకల్ప సిద్ధిని నిరూపిస్తుంది. “ఒక రచయితకు కలిగిన కష్టాలు ఆయనను ఒక మహోన్నత రచయితగా రూపొందించడంలో ఎంతగానో సహకరించాయి” అన్న విషయాన్ని నిరూపిస్తుంది.

భిత్తి ఆత్మ కథనంగా మాత్రమే కాక అపురూపమైన కథనంతో తో కూడిన నవలగా అనిపిస్తుంది. ఏ మాత్రమూ అనుకంపానికి తావివ్వకుండా అటు జీవితం లోనూ, నవలా రచనలలోను భిన్నమైన వ్యక్తిత్వ నిరూపణను కావించుకున్నారు. సెప్టెంబరు 24/25 నాడు కన్ను మూసారు.

(విషయ సంగ్రహణ కన్నడ వ్యాసాలనుండి)