శరీరమిదం కామ్య సాధనం

నాలుగు కాళ్ళు
ఇద్దరు మనుషులు
పెనవేసుకున్న ప్రబంధ దృశ్యం

కదులుతున్న నాలుకల
కమలుతున్న శరీరఛాయ
నిశ్శబ్దాన్ని అదిమిపెట్టే
ఊపిరి విన్యాసం

యాంత్రిక చర్యల మధ్య
వేడెక్కిన కొలిమి
ఏది మధ్యం ఏది మొదలు

బాహాబాహీలో
చెమర్చిన భుజాలు

ఉఫ్‌న అరే దీపకళిక
వెలుతురు నాలుకలన్నీ
చప్పరిస్తున్న
ఉప్పు కప్పుల
ఉబ్బు తబ్బులు
కీర్తి కోసం యుద్ధం
జయాపజయాల
క్షేత్ర విన్యాసం
బాహువుల మర్రిచెట్టు నీడలో
వేళ్ళు, నోళ్ళు
జలదరించే ఛద్మ చక్షువులు

జవనాశ్వాల దూకుడు
స్పుట విస్ఫోటనాల
మార్మిక క్రియ

ఎవరు చెప్పేరు
సృష్టి కార్యమని
విస్పష్ట దేహ శాస్త్రమిది
ఎంత పరలోకమే
శరణ్యమయినా
శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్


ఇంద్రప్రసాద్

రచయిత ఇంద్రప్రసాద్ గురించి:

ఆవంత్స సోమసుందర్ అంతేవాసిగా సాహిత్యంతో ప్రారంభమయిన ఇంద్రప్రసాద్ గారి సాహిత్య ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నడిచి వచ్చిన దారి (కవిత్వం 1993), కాలం సైకత తీరం (కవిత్వం 2023), మూడు పడవలు (కవిత్వం 2024) అనే సంకలనాలను ప్రచురించారు.

 ...