పాత్రదానం

“భగవాన్ ఈ రోజు వీలున్నప్పుడు మిమ్మల్ని ఒకసారి రమ్మని చెప్పమన్నారు, ఏదో మాట్లాడే పని ఉందిట.” ఆనందుడు చెప్పాడు, కళ్ళు తెరిచి ధ్యానంలోంచి అప్పుడే బయటకి వచ్చిన మహాకాశ్యపుడితో.

కాశ్యపుడు ఆశ్చర్యపోయేడు. తాను కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండగా చటుక్కున కనిపించిన దృశ్యం గుర్తొచ్చింది. ఎవరి ఇంరికో వెళ్ళి భిక్ష అడిగితే వాళ్ళ దగ్గిర ఏమీ లేక తన పాత్రలో గంజి పోశారు, కానీ ఇచ్చేటపుడు పేదరాలి మొహంలో ఉన్న ఆనందం గుర్తొచ్చి తన మనసు ఆనందతరంగాలలో ఓలలాడింది. కళ్ళు తెరిచేసరికి తనని భగవానుడు రమ్మన్నాడని చెప్తూ ఆనందుడు పిలుస్తున్నాడు. ధ్యానంలో ఉన్నప్పుడు ప్రపంచంలో జరిగేవన్నీ వేశ్యాప్రదర్శనశాలలో చూస్తున్నట్టు చూడవద్దనీ, వాటివల్ల సమయం, ప్రయత్నం అన్నీ వృధా అనీ భగవానుడు చాలాసార్లు చెప్పాడు. అయినా తాను పనిగట్టుకు చూడలేదే. ధ్యానం ముగించే ఒక్క క్షణం ముందు అప్రయత్నంగా కనిపించింది ఈ దృశ్యం. దీని గురించి మాట్లాడడానికేనా తనని పిలిచింది? భగవానుడు ఏమంటాడో దీని గురించి.

తనని చూడడానికి వచ్చిన మహాకాశ్యపుడితో ఏమీ ఉపోద్ఘాతం లేకుండా చెప్పాడు భగవానుడు. “ఈ రోజు సాయంత్రం భిక్షకి ఈ రాజాగృహంలో నివసించే కాలవలీయుడనే వారి ఇంటికి వెళ్ళగలరా?”

తను ధ్యానంలో చూసినదాని గురించి భగవానుడేమంటాడో అనుకున్న మహాకాశ్యపుడికి ఈ సారి మరింత ఆశ్చర్యం. ఈ కాలవలీయుడి భార్యేనా తనకి ధ్యానంలో కనిపించింది?

“తప్పకుండా వెళతాను. మరేమైనా ఉందా, ఆనందుడు మీరేదో మాట్లాడతారని చెప్పాడు.”

“అంతే, ఇంకేమీ లేదు, వాళ్ళింటికి భిక్షకి మర్చిపోకుండా వెళ్ళమని గుర్తు చేయడానికే పిలిచాను.”

మహాకాశ్యపుడు వెళ్ళిపోతూంటే ఆనందుడు కుతూహలంగా, ఏమి జరగబోతోందో అనుకుంటూ తన పనిలో నిమగ్నమయ్యేడు.


సాయంత్రం వ్యాహ్యాళికి వచ్చిన బింబిసార మహారాజు, ఆ రోజు గుర్రం దాని ఇష్టం వచ్చిన దారిలో తీసుకెళ్ళినపుడు ఊరు చివర శ్మశానం దగ్గిర తేలాడు. కాలుతున్న శవాలు ఏమీ లేవు కానీ తాను వచ్చినట్టు గమనించాడు కాబోలు ఎవరో అరుస్తున్నాడు, దగ్గిరకి రమ్మని. వెళ్ళి చూస్తే రెండు మూడు రోజుల క్రితం కొరత వేయబడిన ఎవరో నేరస్థుడు. ఆ మనిషి చేతులు వెనక్కి విరిచి కట్టివేయబడి ఉన్నాయి.

మాట వినబడేంత దూరంలో గుర్రాన్ని ఆపి అడిగాడు. “నువ్వు చేసిన నేరం ప్రకారం కొరత వేయబడ్డావు కాబోలు. నేను రాజునే అయినా న్యాయస్థానం వేసిన శిక్షని తప్పించలేను కానీ నీ ప్రాణం పోయేలోపు నా నుంచి కావాల్సిన ఉపకారం ఏదైనా ఉందా? ఎందుకు పిలిచావు?”

“నేను ఆకలి తట్టుకోలేకపోతున్నాను. చచ్చిపోయేలోపు నాకు రాజభవనం నుంచి తినడానికి భోజనం కావాలి.” నేరస్థుడు చెప్పేడు.

ఈ వింత కోరిక ఏమిటో, తాను భోజనం కానీ పంపితే ఈయన ఎలా తినగలడో అనుకున్నా నేరస్థుడి పరిస్థితి చూసి జాలిపడిన బింబిసారుడు చెప్పేడు, “సరే త్వరలో పంపుతాను,” గుర్రాన్ని వెనక్కి తిప్పి రాజభవనం కేసి మరలుతూ.


కాలవలి ఇంటికొచ్చి భార్యతో చెప్పాడు నిస్పృహతో. “పొద్దున్న నుంచి సాయంత్రం వరకూ ఊరంతా తిరిగాను కానీ చిన్న పని కూడా దొరకలేదు, మనకి ఈరోజు కూడా పస్తే అనుకుంటూ వస్తూంటే ఎవరో సన్యాసి ఈ నూకలు ఇచ్చాడు. వీటితో గంజి తప్ప మనకి మరో దారిలేదు.”

ఇటువంటి రోజులు తమకి కొత్తకాదు కనక కాలవలి భార్య గంజి కాచి గిన్నెలో పోసింది. ఇద్దరూ అది తాగుదామనుకునే లోపునే ఎవరో బౌద్ధ సన్యాసి ఇంటిముందుకు రావడం గమనించారు. ఇంట్లో తమ దగ్గిర దోచుకోవడానికేమీ లేదు కనక తలుపులు వేసే ప్రసక్తే లేదు. అవి ఈ పూరింటికి ఏమీ ఉపయోగపడవు. వచ్చినాయన తన దగ్గిర భిక్షాపాత్ర ఎత్తి అడిగాడు, “మీరు భిక్షగా ఏది ఇవ్వగలిగితే అదే ఇవ్వండి, ఇవ్వడానికి సరైనది ఏమీ లేదని బాధపడవద్దు.”

అప్పుడే కాచిన గంజి మొత్తం మహాకాశ్యపుడి భిక్షాపాత్రలో పోసింది కాలవలి భార్య. ఇదంతా చూసిన మహాకాశ్యపుడికి కన్నీళ్ళు ఆపుకోవడం అసాధ్యమైంది. తనకి ధ్యానంలో కనిపించినది ఈ మహిళారత్నమే. ఈ గంజి ఇచ్చేటప్పుడు కూడా ఆవిడ మొహంలో ఆనందంతో కూడిన చిరునవ్వు అచ్చంగా తనకి ధ్యానంలో కనిపించినట్టే ఉంది. ఈ విషయం భగవానుడికి తెలిసే తనని ఇక్కడకి వెళ్ళమన్నాడు కాబోలు. ఈవిడ ఇంత సంతోషంగా ఇచ్చిన ఈ అమృతప్రాయమైన పానీయం భగవానుడికే చెందుతుంది. తాను ఇది తీసుకెళ్ళి ఆయనకి తన స్వహస్తాలతో ఇవ్వవలసి ఉంది, ఇస్తాడు కూడా.

ఆరామం చేరాక తిన్నగా భగవానుడి దగ్గిరకి వెళ్ళి తాను తెచ్చిన భిక్ష ఆయన పాత్రలో పోసి చెప్పాడు మహాకాశ్యపుడు, “మీరు వెళ్ళమన్నట్టూ వెళ్ళి భిక్ష తెచ్చాను, ఇది తాగే అదృష్టం నాకు ఉందని నేను అనుకోను. మీరే చెప్పండి ఏమి చేయాలో?”

ఒక చుక్క తన నోటిలో వేసుకుని భగవానుడు చెప్పాడు, “ఇది తీసుకెళ్ళి ఆరామంలో అందరి సన్యాసులకీ పంచండి, ఒక్కొక్కరికీ చిన్న చుక్క వచ్చినా అదే చాలు.”

భగవానుడి భిక్షాపాత్ర తీసుకుని మహాకాశ్యపుడు ఆరామంలో అందరికీ తాను భిక్షగా తెచ్చిన గంజి తలో కాస్తా పంచాడు. భిక్షాపాత్ర శుభ్రం చేసి భగవానుడికి వెనక్కి ఇచ్చాక అడిగాడు. “ఇటువంటి మహోత్తరమైన దానం చేసిన కాలవలి భార్యకి ఏమి ప్రతిఫలం సంప్రాప్తం కాబోతోంది?”

“పది రోజుల లోపుల ఆవిడ ఒక గొప్ప ధనికురాలైన ఇంటిదవుతుంది.” భగవానుడు చెప్పాడు.


ఇంటికొచ్చిన బింబిసారుడు మర్చిపోకుండా తన వంటమనిషిని పిలిచి చెప్పాడు శ్మశానంలో కొరతవేయబడిన మనిషికి తాను తినే భోజనం పంపమని. ఇక్కడే పెద్ద చిక్కు వచ్చిపడింది – భోజనం తయారు చేయడం కష్టం కాదు కానీ ఎవరు శ్మశానానికి ఈ భోజనం పట్టుకెళ్ళి ఆ కొరత వేయబడిన మనిషిచేత తినిపించేది?

దీని కోసం సైనికులు కాని, రాజభవనంలోంచి మరొకరు ఎవరూ కానీ వెళ్ళలేమని చెప్పినప్పుడు చాటింపు వేయించాడు బింబిసారుడు నగరంలో – ఇలా శ్మశానంలో కొరతవేయబడిన మనిషికి భోజనం తినిపించినవారికి బహుమతి ఇవ్వబడుతుంది అంటూ. చాటింపు విన్న కాలవలి ఇంటికొచ్చి భార్యతో చెప్పాడు అసలు సంగతి. విషయం ఏమిటంటే కాలవలికి శ్మశానంలో కొరత వేసిన మనిషి దగ్గిరకి వెళ్ళగలిగినా వాడి నోట్లో భోజనం పెట్టి తినిపించగల ధైర్యం లేదు. ఇది విన్న కాలవలి భార్య అన్నది కొంచెం అనుమానంగా. “నేను వెళ్ళి తినిపించగలను కానీ వాడు నన్నేమీ చేయడు కదా?”

కాసేపు ఇద్దరూ కలిసి చర్చించారు మొదటి విషయం. చేతులు వెనక్కి విరిచి కట్టేసి ఉన్నాయి కనక కాలవలి భార్యని నేరస్థుడు చేతులతో ఏమీ చేయలేకపోవచ్చు. కాళ్ళతో ఏమైనా చేయగలడా అంటే కొరత వేసి ఉన్నాడు కనక అది దాదాపు అసంభవం. ఇంక మిగిలినది నోరు. ఇంకా బతికి ఉండి, ఈవిడ పట్టుకెళ్ళిన భోజనం తినగలిగితే, నోటితో కరవడం లాంటిది ఏదైనా చేయవచ్చేమో మహా చేయగలిగితే. ఎందుకైనా మంచిది కాలవలి భార్య కనిపించకుండా పదునైన ఒక చిన్న చురకత్తి పట్టుకెళ్ళడం మంచిది. ఏది ఎటుతిరిగి ఎటొచ్చినా ఆ కత్తి ఆత్మ రక్షణకి పనికిరావొచ్చు. మిగిలిన రెండో విషయం, అందరికీ తెలిసినదే కాని పైకి చెప్పనిది. శ్మశానానికి వెళ్ళేదారిలో తాటిచెట్లమీద పిశాచాలు ఉన్నాయని చెప్పుకుంటారు. అవి కాలవలి భార్యని ఏదైనా చేస్తే? కాసేపు తర్జనభర్జనలు పడ్డాక తేల్చుకున్న విషయం ఇదీ. కాలవలి భార్య వెళ్ళేది త్వరలో చావడానికి సిద్ధంగా ఉన్న అశక్తుడైన మనిషికి చివరి కోరికగా తిండి తినిపించడానికి; పిశాచాలకి హాని చేయడానిక్కాదు. తాను వెళ్ళేది మంచి పనిచేయడానికి కనక పిశాచాలు తనకి హాని చేయకపోవచ్చు. అయినా ఇలా మీనమేషాలు లెక్కపెడుతూ ఉంటే అక్కడ నేరస్థుడు చావవచ్చు. అప్పుడు రాజు ఇచ్చే బహుమానం పోతే తమకి మరో కొన్ని వారాలు ఖాళీ కడుపులు తప్పవు. ధైర్యే సాహసే లక్ష్మీ.

కాలవలి భార్య బింబిసారుడి దగ్గిరకి వచ్చి నేరస్తుడికి భోజనం పట్టుకెళ్తాననేసరికి ఆయనకి కొంత ఆశ్చర్యం. తర్వాత తెల్సిన వివరాల ప్రకారం కాలవలి ఏ పనీ దొరకక తిండిలేక మాడడం కంటే కనీసం ఇటువంటి పని అయినా చేసి ఏదో మనుగడ సాగిద్దామనుకోవడం. ఈవిడ చెప్పడం ప్రకారం భర్తకి ధైర్యంలేక ఈవిడే వెళ్తోంది. చేసేదేమీ లేదు కనక నేరస్థుడు చచ్చిపోయేలోపు తానిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి బింబిసారుడు కాలవలి భార్యకి రాజభోజనం ఇచ్చి పంపాడు. ఆవిడ వెనక్కి వచ్చాక అడగాలి నేరస్తుడికి నిజంగా భోజనం పెట్టినట్టు ఋజువు ఏదైనా చూపించగలదా లేక కాలవలి, ఈవిడా కలిసి ఈ రాజభోజనం ఆరగించారా అనేది.


తలమీద బుట్టతో రాజభోజనం పెట్టుకుని నడుస్తూపోతున్న కాలవలి భార్య శ్మశానం దగ్గిర్లో ఓ తాటిచెట్టు కిందకి రాగానే ఓ కంఠం వినిపించింది. “ఆ భోజనం నాకేనా?”

కొంచెం తొట్రుపడినా కాలవలి భార్య చెప్పింది. “కాదు, ఇది శ్మశానంలో కొరతపడిన ఒక మనిషికి రాజుగారు పంపిన భోజనం, వెళ్ళి తినిపించాలి.”

“పోనీలే, మా పిశాచాల బతుకుకి తగులుకున్న గొడవ ఏమిటంటే మేము ఆక్రమించుకుని ఉండే చెట్టు వదిలి ఎక్కడకీ వెళ్ళలేం. ఓ ఉపకారం చేసిపెట్టు. ఓ కోసు దూరం నడిచాక మరో తాడిచెట్టు కనిపిస్తుంది. దానిమీద ఉండే దేవసుమనుడితో ‘నీ కూతురికి ఒక మగ పిల్లవాడు పుట్టాడు; తల్లీ పిల్లాడూ క్షేమం’ అంటూ ఓ మాట చెప్పగలవా? నీ సహాయం ఊరికే పోదులే.”

“సరే.” కాలవలి భార్య ముందుకి కదిలింది.

కోసు దూరం నడిచాక కనిపించిన తాడిచెట్టు కింద నిలబడి అరిచింది కాలవలి భార్య, “ఓ సుమనా నీ కూతురికి మొగ పిల్లవాడు పుట్టాడుట. తల్లీ పిల్లాడూ క్షేమం.”

“అవునా? మంచి వార్త తెచ్చావు, సంతోషం. దీనికి బహుమతిగా ఈ తాటిచెట్టు మొదట్లో నిధి ఉంది; తవ్వుకుని తీసుకుపో, అది నీదే.” మరో కంఠం వినిపించింది.

పిశాచాల మాటలు ఎంతవరకూ నిజమో అనుకుంటూ శ్మశానంలో నేరస్తుడి దగ్గిరకి వచ్చింది కాలవలి భార్య. శరీరంలో గుచ్చుకున్న శూలం ప్రాణాలు తోడేస్తున్నా ఆకలి బాధ మరింతగా ఉన్న నేరస్తుడు చెప్పాడు. “రాజుగారి ఇంటినుండి భోజనం తెచ్చావా, సరే నోట్లో పెట్టు.”

భోజనం తినిపించడం అయ్యాక తట్ట నెత్తిమీదకి ఎత్తుకుని వెళ్ళబోతూంటే నేరస్థుడు అడిగాడు. “వెళ్ళిపోయే ముందు కాసిని నీళ్ళు తాగించి నోరు తుడిచి వెళ్ళగలవా?”

తిండీ నీరూ లేక మరో ప్రాణి చుట్టుపక్కలేనప్పుడు అనుభవించే నరకం తప్పించుకోవాలనుకున్నాడేమో ఏదో విధంగా; దగ్గిరకి వచ్చి నీళ్ళు తాగించి వెళ్ళబోతూంటే నోటితో కాలవలి భార్య జుట్టు పట్టేసుకుని వదిలిపెట్టలేదు నేరస్తుడు. కాసేపు పెనుగులాడాక ఇంక తప్పక కాలవలి భార్య తాను తెచ్చిన చురకత్తితో జుట్టు కోసేసుకుని నేరస్తుడి నుంచి విడిపించుకుని ఇంటికి బయల్దేరింది.


వెనక్కి వచ్చిన కాలవలి భార్యని అడిగాడు బింబిసారుడు. “నువ్వు నేరస్తుడికి భోజనం పెట్టినట్టు ఏదైనా ఋజువు చూపించగలవా బహుమానం ఇచ్చేముందు?”

“ఒకటి కాదు రెండు ఋజువులు చూపించగలను. ఈ తెగిపోయిన జుట్టు ఒకటి. దీని తాలూకు మిగతా జుట్టు ఆ నేరస్థుడు చచ్చిపోయి ఉంటే వాడి నోట్లో కాని, బతికి ఉండి ఉమ్మేసి ఉంటే వాడున్న చోట నేలమీద కానీ ఉంటుంది. రెండో ఋజువు పిశాచాలు చెప్పిన తాటిచెట్టు మొదట్లో నిధి. అక్కడ నిధి ఉంటే నేను మాట సాయం చేసినందుకు పిశాచాలు నన్ను నిధి తవ్వి తీసుకోమని చెప్పిన మాట నిజమే.”

తన మనుషులని పంపి నిజాలు తేల్చుకున్నాక బింబిసారుడు చెప్పాడు కాలవలి, అతని భార్యతో, “మీ ధైర్యం మెచ్చుకోదగిందే. నేరస్థుడి దగ్గిర నీ జుట్టూ, పిశాచాలు చెప్పిన నిధీ నువ్వు చెప్పిన ఋజువుల ప్రకారం కనిపించాయి. పిశాచాలు చూపించిన నిధి మీదే. తీసుకెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టూ వాడుకోండి.”


భగవానుడి దగ్గిరకి వచ్చి తమకి నిధి దొరికిందనీ దానిలో కొంత భగవానుడికి ఇద్దామనుకుంటున్నామనీ కాలవలి, అతని భార్య చెప్పినప్పుడు భగవానుడు ఇలా చెప్పాడు.

“ధర్మాధర్మ నిరాశంకః సర్వాశీ సుఖమేధతే
ధర్మ్యాం తు వృత్తిమన్విచ్చన్విచితాశీహ దుఃఖితః

ఏది ధర్మం, ఏది అధర్మం అనే సంశయానికి తావు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టూ నడుచుకునే వారు భౌతికంగా అన్నీ సులభంగా సాధించగలరు. ధార్మిక జీవనం అవలంబించి మంచి చెడ్డలు విచారించేవారికి – నిధి లేనప్పుడు మీకు జరిగినట్టే – పోషణ కష్టంగానే ఉంటుంది. ఆ నిధి మీ దగ్గిరే ఉంచుకుని ధర్మమార్గం పాటిస్తూ మీకు చేతనైనంతలో భిక్షువులకి సహాయం చేస్తూ ఉండండి. మహాకాశ్యపుడికి భిక్షగా ఏమీ ఆశించకుండా సంతోషంగా గంజి ఎలా పోశారో అదే మనఃస్థితి నిలుపుకోవడం ముఖ్యం. ఏది దానం చేస్తున్నాం అనేదానికంటే ఎలా, ఎటువంటి మనఃస్థితితో దానం చేస్తున్నాం అనేదే గుర్తుంచుకోవల్సిన విషయం. ఇదే అనాధపిండకుడి విషయంలో కూడా మనం గమనించాము కదా?”

కాలవలి, అతని భార్యతో భగవానుడు చెప్పిన మాటలు అక్కడే కూర్చుని వింటూన్న మహాకాశ్యపుడు ఉలిక్కిపడి తేదీలు లెక్కచూశాడు. తనకి కాలవలి భార్య భిక్షగా గంజి పోసినది సరిగ్గా పది రోజుల క్రితం. భగవానుడి నోటి మాట అక్షర సత్యమైంది. ఈ విషయం వెంఠనే అందరితో చెప్పాడు మహాకాశ్యపుడు.

మహాకాశ్యపుడు చెప్పినది విని ఆనందుడు, అనాధపిండకుడూ అమితాశ్చర్యంతో అక్కడే ఉన్న భగవానుడి వైపు చూశారు. భగవానుడి మొహంలో చిరునవ్వు చెక్కుచెదరకుండా ఎప్పటిలాగానే ఉంది.

[బుద్ధుడి జీవితంలో జరిగిన ఈ సంఘటనలో కొన్ని చోట్ల కాలవలికి బింబిసారుడు కోశాధికారి పదవి ఇచ్చాడనీ, మరోచోట ఈయన, వాళ్ళావిడా డబ్బున్న ధనికులయ్యారనీ ఉంది. నేను ఈ ధనికులయారనే విషయం తీసుకుని ఇది రాశాను. ఈ కధ దాదాపు శంకరుల కనకధారాస్తవం సంఘటన లాంటిదే – ర.]