[‘లెటర్స్ టు ది ఎడిటర్’ అనేది పత్రికలలో ఒక రివాజు, ఒక సంప్రదాయం. పాఠకుల అభిప్రాయాలకు, కామెంట్లు, లైకులకు భిన్నమైనది. సంపాదకుడిని సంబోధిస్తూ వివరంగా వ్రాసే ఉత్తరాల ద్వారానే చక్కటి సాహిత్యచర్చ సాధ్యం అని నమ్మిన పాఠకుల కోరిక ప్రకారం ఈ శీర్షిక ప్రారంభిస్తున్నాం. ఈ విభాగంలో ప్రచురించే ఉత్తరాలకు సంపాదకులనుంచి ప్రత్యుత్తరం ఉంటుంది. అలా సంపాదకులతో నేరుగా ఒక సంభాషణ సాధ్యమవుతుంది. అప్పుడప్పుడూ లెటర్ ఫ్రమ్ ది ఎడిటర్ కూడా ఇందులో భాగం కావచ్చు. ఈ విభాగానికి పంపే ఉత్తరాలు ఏ ఒక్క రచనకో సంబంధించినవి కావచ్చు, కాకపోవచ్చును. పత్రిక గురించి, సాహిత్యధోరణుల గురించి అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు మీ ఉత్తరాలలో ఉండవచ్చు. దయచేసి మీ ఉత్తరాల నిడివి నియమితంగా ఉండేలా చూసుకోండి. ప్రశ్నలు, అభిప్రాయాలు సూటిగా స్పష్టంగా ఉంటే బాగుంటుంది. – సం.]
ఈమాట సంపాదకులకి:
తెలుగునాట అచ్చు పత్రికలలో ‘సంపాదకునికి ఉత్తరాలు’ అనే శీర్షిక మరుగునపడి చాల కాలమయ్యింది. అందుకు కారణాలు చాలా ఉన్నాయి. వాటన్నిటి జోలికీ పోకండా నాకు తట్టిన ఒక ముఖ్య కారణం చెపుతాను.
ఫేస్‌బుక్. ఫేస్‌బుక్‌లో లైకులు కామెంటులూ లెక్కపెట్టుకోవడంతో చాలామంది మంచి రచయితలు కూడా సంతృప్తిపడుతున్నారు. సదరు కామెంటులు, లైకులూ కేవలం ముఖస్తుతి కావడంతో, చక్కటి చర్చకి పనికిరావటల్లేదు. కొద్దోగొప్పో వస్తే, అది కొద్దిక్షణాల్లో మాయమైపోతుంది.
జుకర్బర్గు మహిమ!
కథలపైన, వ్యాసాలపైన, కవితలపైనా మంచి విమర్శ రావాలని సంపాదకులు అభిలషిస్తే, అది ఉత్తరాలద్వారానే సాధ్యం… అని, నానమ్మకం.
మరొక సున్నితమైన విషయం. ఈ మధ్య నా రామాయణపారాయణ వ్యాసంపై వచ్చిన కామెంట్లు చూడండి. అందులో కలగాపులగమయిపోయి, ఇక్కడ వలసకొచ్చి తిష్ట వేసినవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం, నా పిడకలవేటలోనే ఉండిపోయింది. నెల ఆఖరు రోజుల్లో రాయబట్టి అది మీ కామెంట్ల లిస్టులో కామెంటుగా మిగిలిపోయింది. అదేగనక ఉత్తరమయితే, చర్చ జరిగే ఉండేదని నా అభిప్రాయం.
ఇంత రాద్ధాంతం ఎందుకు? ఒకప్పుడు, మేము ముగ్గురు మిత్రులం భారత్‌లో ఉండేరోజుల్లో తెరిపి లేకండా ఇంగ్లీషు, తెలుగు దినపత్రికలకి చాలా విషయాలపై ఉత్తరాలు రాసేవాళ్ళం. మిగిలిన ఇద్దరూ నన్ను ‘ఉత్తర’ కుమారుడు అనేవాళ్ళు. డ్రాఫ్ట్ నాది. వాళ్ళు ఎడిటర్లు.
అప్పట్లో ఉత్తరాలద్వారా చాలా రాజకీయాలపై, కొంతమంది కవిత్వంపై చర్చలు సాధించాం. అమెరికాకు వచ్చికూడా ఆంధ్రజ్యోతికి ఉత్తరాలు రాశాను. జవాబులు తెప్పించాను. ఫుర్రెతో పుట్టిన బుద్ధి!
కనీసం నాకోసమైనా దయచేసి ఉత్తరాలు శీర్షిక మొదలుపెట్టండి.
చాంతాడంత మీ కామెంట్లలిస్టు అలానే ఉంచుకోండి.
మీ మిత్రుడు
వేలూరి వేంకటేశ్వర రావు.
[వేలూరిగారూ, మీ కోరిక ప్రకారమే ఈ శీర్షికను మొదలుపెడుతున్నాం. మాకు మీలా ఉత్తరాలు వ్రాసేవారున్నంతవరకూ మేము ఈ శీర్షికను నడుపుతూనే ఉంటాం. చక్కటి సాహిత్యచర్చకు ఏ రకమైన ప్రయత్నమైనా మేము ఎప్పుడూ సంసిద్ధమే. – సం.]