అంతర్జాల విహారం చేస్తూంటే, సోషల్ మీడియాలో యాదృచ్ఛికంగా మెడికో శ్యామ్ సాహిత్య డిటెక్టివ్ కథల పుస్తకం మెరుపులు కనిపించాయి. శ్యామ్‌యానా, సరాగమాల తరువాత మెదడుకు మేతకై, మరో పుస్తక ప్రసాదమా? అని ఉత్సాహంతో ముద్రణ ప్రతి తెప్పించుకుని చదివాను. పుస్తకం యొక్క పేరు చూస్తే ఇవేవో (శ్యామ్ ఇష్టపడే) అపరాధ పరిశోధన కథలేమో అనే ఊహ కలిగినా, ‘ఇదీ క్రమం’ చూశాక ఈ పుస్తకంలో ఊరే కొద్దీ రుచి తెలిసే/తెలిపే ఆవకాయ లాంటి పునర్ముద్రితమైన పాత కథలే కాకుండా, కొన్ని కొత్త కథలు, కొంత కమామీషూ, సాహిత్య విన్యాసాలు బోల్డన్ని ఉన్నాయి అని తెలిసింది. ఇటీవల దిల్లీ ప్రయాణం చేసినప్పుడు ఒకే విడతలో ఏకబిగిన పూర్తిగా ఈ పుస్తకం చదవగలిగాను. నా అలవాటు ప్రకారం మరో రెండు మార్లు పునశ్చరణ చేసుకున్నాక ఈ సమీక్ష వ్రాయాలనిపించింది. ప్రశంసాత్మకమైన రెండు ముందు మాటలు (కథన రహస్యం తెలిపిన రచయిత – రాచపాళెం చంద్రశేఖర రెడ్డి; నిత్య సాహిత్య శోధకుడు శ్యామ్ – ఎన్ ఎస్ మూర్తి), వాటితో కలబోసుకొని రెండు రచయిత స్వగతాలు (కృతజ్ఞతలు, సాహిత్యవిన్యాసాలు) రచయిత యొక్క స్థాయిని, మనోభావాలనూ చవి చూపిస్తాయి.
‘రాసిన దానికంటే రాయందే ఎక్కువ…’ అని మొదలయ్యే ‘సాహిత్య విన్యాసాలు’ వ్యాసం ఆద్యంతం ఆసక్తికరంగా రచయిత మనసులోని భావాలను తెలియజేస్తుంది. ‘ఉపజ్ఞ’ ఈ పుస్తకానికే తలమానికమైన వ్యాసం. అందులో పదాల విన్యాసం, పన్ ప్రయోగాలు, శ్యామ్ ట్రేడ్‌మార్క్ హిందీ వరుసలు రచయిత మనోభావాలకు అద్దం పట్టి, ఆసక్తికరంగా చదివిస్తాయి. భరాగో తినిపించే సాహిత్య చిప్సూ గాసిప్సూ, కొకు జ్ఞాపకాలు, రచయితకు ఎంతో ఇష్టమైన పుసుశ (పురాణం సుబ్రహ్మణ్య శర్మ), బెర్నార్డ్ షా కథల కమామిషూ, నాలుగు ‘వే’ల కథ ఆసక్తి కలిగిస్తాయి. ఆరుద్ర ‘గుమస్తా ప్రేమగీతం’లా శ్యామ్ ‘మెడికో ప్రేమగీతం’ ఆరుద్ర రచనలను శ్యామ్ ఎంతగా ఇష్టపడతాడో చెప్పకనే చెప్తుంది. అలాగే ఆదిలాబాద్ రేడియో కేంద్రం కోసం ఆరుద్ర మీద చేసిన ప్రసంగంలో జనబాహుళ్యంలో లేని అనేక విషయాలు అలవోకగా గుండెలోతుల్లోనుంచి, స్మృతిలోనుంచి చెప్పగలగడం, శ్యామ్ అసాధారణ గ్రహణ శక్తికి నిదర్శనం. సాధ్యపడని చాసో శిష్యరికం ఒక కోణమైతే, ‘ప్రకటనల్లో నుంచి కూడా నేర్చుకోవచ్చు’ అనగలగడం రచయితలోని పరిశీలనాసక్తి, నిత్య విద్యార్థి తత్త్వానికి అద్దం పడ్తాయి.
‘అది కథకు నాడ్యూటీ’ అనే వ్యాసంలో తన పుస్తకానికి ముందుమాట వ్రాయడం నేపథ్యంలో మునిపల్లె రాజు గురించి, వారి విశిష్ట వ్యక్తిత్వం గురించి, గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు. ‘కథలు ఎందుకు రాస్తారు?’ అనే వ్యాసంలో వాల్మీకి, పుసుశ, చలం వ్యక్తపరచిన భావాలను ఉదహరిస్తూ, రచయితలూ కవులూ సదా బాలకులు అని తేల్చేస్తాడు శ్యామ్.
‘నాకు నచ్చిన కొన్ని పుస్తకాలు/రచనలు’ తెలుగు కథావీధి లోని కొన్ని అరుదైన సౌరభాల గురించి విశ్లేషణ, ‘నేనూ-తులసిగారు’లో వీరిద్దరి చిన్ననాటినుంచి సాగిన సుదీర్ఘ సాహిత్య సల్లాపాలు, తులసి శ్రద్ధ, పర్ఫెక్షనిజం, గురించి స్వీయ అనుభవంతో శ్యామ్ వ్రాసింది కాబోయే రచయితలకు, ముఖ్యంగా అనువాద రచయితలకు స్ఫూర్తిదాయకంగా నిలిచే అంశాలు. ‘చదవడమా మానడమా!’ వ్యాసంలో వ్రాసిన ప్రకారం పుస్తకాలను రుచి చూసినా, కొరికినా, మింగినా, కొరికి నమిలి మింగినా కలిగే మేధో అభ్యుదయం గురించి పాఠకులకు చక్కటి విషయాలు తెలుస్తాయి.
‘ఒక తహతహ’, ‘సాహిత్యం–మనం– ఆలోచనలు–పరిస్థితులు-పరిమితులు’, ‘చదవడమా? మానడమా?’ – వ్యాసాలు డిటెక్టివ్ మెడికో శ్యామ్ తన సుదీర్ఘ ప్రయాణం గురించిన అంతరంగ విశ్లేషణ, ఎదుర్కున్న సవాళ్ళు, నేర్చుకున్న పాఠాలను ప్రతిబింబిస్తాయి. ‘కథలు ఎందుకు చదవాలి?’ ముఖ్యంగా కాబోయే కథకులకు రిఫరెన్స్‌గా ఉపయోగపడుతుంది. వృత్తి రీత్యా వైద్యుడైన మెడికో శ్యామ్ వైద్యరంగం నేపథ్యంలో వ్రాసిన కథలు – ఐసీసీయూ, ముక్కుపుడక, అదేమాట; కథారచన ప్రాతిపదికగా రాసిన కథలు – అనువాద కథ, వంటకం, కథకుడి అంతరంగం. తెలుగు కథా సాహిత్యంలో అరుదుగా కనిపించే మధ్యమ పురుషలో రాయబడ్డ ‘కథకుడి అంతరంగం’ ఆకట్టుకునే కథ. కథలు ఎందుకు రాస్తారు?; కథలు ఎందుకు చదవాలి?; వంటకం; వీటినీ చేర్చి నిశితంగా పరిశీలిస్తే కథకుడిగా మెడికో శ్యామ్ పరిధి ఎంత విస్తారమో ప్రస్ఫుటమౌతుంది!
ఇక పుస్తకంలో మిగిలిన భాగంలో ఉన్న కథలు కొన్ని కొత్తవి (వంటకం); కొన్ని ముందెప్పుడో రాసినవైనా కొత్తగా ఇప్పుడే ముద్రితమైన కథలు (చెయ్యడమా మానడమా, ఛీ, రెణ్ణిమిషాలు); మరికొన్ని పునర్ముద్రితమైన కథలు (ఐసీసీయూ); పాతావకాయ కొత్త రుచిలా ఊరిస్తూ ఉరకలు వేస్తూ ఆలోచింపచేస్తూ అబ్బురపాటు కలిగిస్తూ చదివిస్తాయి! ఛీ, రెణ్ణిమిషాలు – కథలు, మెడికో శ్యామ్‌కి దాట్ల నారాయణమూర్తి రాజు విసిరిన సవాలుకు ప్రతిస్పందనగా వ్రాసిన కథలు. పుస్తకానికి పేరుగా ఎంపికచెయ్యబడ్డ ‘సాహిత్య డిటెక్టివ్ కథ’లో రచయిత పేరు ‘మెడికో’ శ్యామ్‌గా నామకరణం జరిగిన విధంతో ప్రారంభమయ్యి బాల్యం నుంచి సాగిన ప్రయాణంలో కలిసిన ప్రముఖులతో పంచుకున్న అనుభవాలూ, జ్ఞాపకాలూ, అభిప్రాయాలూ ఆసక్తిని రేకెత్తిస్తాయి.
అరుదుగా కొన్ని అచ్చుతప్పులు ఉన్నా ఉత్తమ ప్రచురణ విలువల కల పుస్తకం మెడికో శ్యామ్ సాహిత్య డిటెక్టివ్ కథలు. ఈ పుస్తకం ఒక కీప్ సేక్ – దాచి ఉంచుకొని తిరిగి తిరిగి చదివింపచేసే పుస్తకం!
ప్రచురణ: ఎమెస్కో బుక్స్ ప్రై. లి.
ధర: రు.175/-
కాపీలకు: తెలుగుబుక్స్.ఇన్; పల్లవి నారాయణ (+91-9866115655).