దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 8

బొగొతా, కొలంబియా

నాలుగురోజుల క్రితం మెదెయీన్ విమానాశ్రయంలో కలసి చక్కగా మాట్లాడిన ఆ కార్మెన్, ‘మళ్ళీ విమానాశ్రయానికి వెళ్ళేటపుడు నేనే వస్తాను’ అందిగదా – ఆమెకు ఫోను చేశాను. అనుకొన్నదానికన్నా ముందే వచ్చేసింది. నేను బ్రేక్‌ఫాస్టూ చెకవుటూ ముగించుకొని బయటకు వచ్చేసరికి ఆమె తన టాక్సీతో కనిపించింది. మా ఊళ్ళో ఎలా గడిచిందీ అని అడిగింది. ‘ఊరు నచ్చింది. కొత్త విషయాలు తెలిశాయి’ అన్నాను. సంతోషపడింది. ‘మా పైసస్ మనుషులు స్నేహశీలులు. మీకు చక్కని అనుభవాలు కలిగినందుకు సంతోషంగా ఉంది’ అంది. ఇలా విదేశీ యాత్రికులను తన టాక్సీలో దింపేటపుడు ఆమె వాళ్ళ అనుభవాలు చెప్పమని అడుగుతుందట. ఎక్కువమంది సంతోషం వ్యక్తపరుస్తుంటారట… ‘హింసానేరాల నగరం పూలూ ప్రేమలూ నిండి ఉండి కనిపించడం నాకు నిజంగా అబ్బురమనిపించింది’ అంటూ నా అనుభవాలను క్రోడీకరించి చెప్పాను. ఆమె మొహంలో వెలుగు, చిరునవ్వు.

నేను కొలంబియా రాజధాని బొగొతా (Bogotá) వెళుతున్నది అబియాంకా వాళ్ళ విమానంలో – అది కొలంబియా దేశపు జాతీయ విమానయాన సంస్థ. లండన్ నించి వచ్చేటపుడూ మధ్య-దక్షిణ అమెరికా దేశాలలో ప్రయాణించినపుడూ నేను చాలావరకు అబియాంకా విమానాలే ఎక్కాను. వాళ్ళ విమానాలన్నీ సరికొత్తవి అన్న విషయం నేను గమనిస్తూనే ఉన్నాను. ఇదేమన్నా కొత్తగా వచ్చిన సంస్థా అన్న అనుమానం వచ్చింది. నా పక్కనే కూర్చున్న, హుందాగా కనిపిస్తోన్న ఓ అరవైల వయసు పెద్దమనిషితో అదే మాట అన్నాను. ఆయన చెప్పిన వివరాలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. అబియాంకాను స్థాపించి వందేళ్లు దాటిందట! ప్రపంచంలోకెల్లా అప్పట్నించీ నిరవధికంగా నడుస్తోన్న విమానయాన సంస్థలలో ఇది రెండవదట. డచ్ వారి కెఎల్ఎమ్ సంస్థ 1919లో అబియాంకాకన్నా కొద్ది నెలల ముందు పుట్టిందట. ‘మా అబ్బాయి బొగొతాలో అబియాంకా సంస్థలోనే పని చేస్తున్నాడు. అందుకే ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను’ అన్నాడాయన.

విమానం పైకెగిరింది. మేఘమండలం చేరుకుంది. మా పక్కాయన కునుకు తీయసాగాడు. ఆయన పుణ్యమా అని నేనూ నిద్రలోకి జారుకున్నాను. ఏదో అంటారుగదా – ‘ప్రేమ ప్రేమను ద్వేషం ద్వేషాన్ని రేకెత్తిస్తుంది’ అని; అదిగో దాన్ని ప్రయాణాలకూ అన్వయిస్తే ‘కబుర్లు కబుర్లకు, నిద్ర నిద్రకు దారితీస్తుంది’ అనవచ్చు!

బొగొతాలోని ఎల్ దొరాదో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు దిశగా మా విమానం తన అవరోహణ మొదలెట్టినపుడు నిద్రలోంచి బయటపడ్డాను. అన్నట్టు ఎల్ దొరాదో అంటే సిటీ ఆఫ్ గోల్డ్ – బంగరు నగరం అని అర్థమట. గత రెండువారాల్లో బొగొతా విమానాశ్రయంలో దిగడం ఇది మూడోసారి. లండన్ నుంచి వచ్చినపుడు, ఎక్వదోర్ నుంచి కార్తహేన వెళ్ళేటపుడు, ఇదిగో ఇది మూడోసారి. మూడోసారి అంటున్నానేగానీ మొదటి రెండుసార్లూ ఊరికే ఒక విమానం దిగడం, మరో విమానం ఎక్కడం… వాస్తవానికి నాకు బొగొతా నగరంతో ఇదే మొదటి పరిచయం అనాలి. అన్నట్టు అబియాంకా సంస్థ కార్యకలాపాలకు ముఖ్యస్థావరం ఈ బొగొతా నగరమేనట.

ఊళ్ళోనే ఉండబోతోన్న దాన్ అవెనీద 19 అన్న హోటలు విమానాశ్రయానికి దగ్గరే – 15 కిలోమీటర్లు. టాక్సీలో అరగంట ప్రయాణం. ఇరవై డాలర్లు. చవక అనే చెప్పాలి. చెప్పా గదా – కొలంబియాలో టాక్సీలు బాగా చవక.

స్పానిష్ ఆక్రమణదారులు పదహారో శతాబ్దంలో ఇపుడు బొగొతా నగరం ఉన్న ప్రాంతంలో కాలు మోపినపుడు అక్కడ ముయిస్కా (Muisca) అన్న స్థానిక తెగలవారు ఉండేవారు. ఆ తెగలవారు ఆ ప్రాంతాన్ని బకతా (Bacatá) అని పిలుచుకొనేవారు. రంగప్రవేశం చేసిన స్పానిష్‌వారు అక్కడో నగరం నిర్మించి దానికి సాంతా ఫె అని పేరు పెట్టారు. 1819లో ఆ ప్రాంతంలో జరిగిన బోయ్‌కా (Boyka) యుద్ధంలో గెలిచిన సిమోన్ బొలీవార్ ఆ నగరాన్ని స్పానిష్ పాలననుంచి విముక్తం చేశాడు. అక్కడ అనాదినుంచీ నివసించిన ముయిస్కా జాతుల వారి గౌరవార్థం నగరానికి బొగొతా అని పేరు మార్చాడు. కారణాలు తెలుసుకోలేకపోయాను కానీ బొగొతాకు ‘లేడీ ఆఫ్ ది ఆండీస్’ అన్న చక్కని ముద్దుపేరు ఉందట. ఆ మాట ఆ ఊళ్ళో ఉన్నంత కాలం నాకు ఒకటికి రెండుమార్లు వినిపించింది.

బొగొతా నగరం సముద్రతలానికి 2625 మీటర్ల ఎత్తున ఉంది. ఈ విషయంలో ప్రపంచంలోని రాజధాని నగరాల్లో బొగొతాకు మూడవ స్థానం దక్కుతుంది. మొదటి రెండు స్థానాలూ బొలీవియా రాజధాని ల ఫెజ్‌కూ, ఎక్వదోర్ రాజధాని కీతోకూ చెందుతాయి. బొగొతా జనసంఖ్య కోటి దాటింది. జనాభాపరంగా ఇతర రాజధాని నగరాలకన్నా సముద్రతలానికి ఎగువన ఉన్న నగరం బొగొతా. దేశమంతటా నిన్నమొన్నటిదాకా విభిన్నకారణాలవల్ల శాంతిభద్రతలు కొరవడ్డాయి గదా – అదిగో ఆ కల్లోలిత సమయంలో ఎంతోమంది దేశవాసులు రాజధానికి తరలివచ్చి, తలదాచుకొని, ఉద్యోగ సద్యోగాలు వెతుక్కున్నారు. ఆ రకంగా బొగొతా కొలంబియా దేశంలోని ప్రతి ఐదవ మనిషికీ నివాసస్థానంగా పరిణమించింది.

నేను బొగొతాలో గడపడానికి మూడురోజులు పెట్టుకున్నాను. మా హోటలు ఊరి నడిబొడ్డున ఉంది; ఆ విధంగా ఊరంతా వెళ్ళి చూడడానికి బాగా అనుకూలం. రిసెప్షన్లో ఊరి మ్యాపొకటి సేకరించి నడక ఆరంభించాను. వెళ్ళేముందు, ఈ ఊళ్ళో నడచి వెళ్ళడం క్షేమమేనా అని రిసెప్షనిస్టును అడిగాను. ఆమె క్షేమమేనని చెప్పింది. అయినా ‘మా ఊళ్ళో జేబుదొంగలకు లోటు లేదు. మీ పర్సూ ఇతర వస్తువులూ జాగ్రత్త’ అని హెచ్చరించింది. పెద్ద పెద్ద నగరాల్లో ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు అరుదేంకాదు. నావరకూ నేను జేబులకు బాగా జిప్పులు ఉన్న పాంట్లే వేసుకుని వెళుతూ ఉంటాను. అంచేత అలాంటి ప్రమాదాల బెడద నాకు తక్కువ.

మొట్టమొదటగా నేను ఊళ్ళో చూద్దామనుకున్నది అక్కడి గోల్డ్ మ్యూజియమ్ (Museo del Oro). ప్రపంచంలోకెల్లా విలక్షణమైన ప్రదర్శనశాలగా పేరుపొందిన మ్యూజియం అది. యూరప్‌వాసులు అక్కడ కాలుపెట్టక ముందే స్థానికులు వందలాది సంవత్సరాలుగా వాడిన బంగారు వస్తువులెన్నో అక్కడ ఉన్నాయని విన్నాను. ఆ మ్యూజియమ్ మా హోటలుకు బాగా దగ్గర – అంతా కలసి ఒక కిలోమీటరు.

మ్యూజియమ్‌లోకి వెళ్ళగానే ఓ బోర్డు కనిపించింది. ఈ స్వర్ణప్రదర్శనశాల కొలంబియా దేశపు సాంస్కృతిక రాయబారి. దేశపు పురాసంస్కృతిని ఇప్పటిదాకా ఏభైరెండు దేశాలతో రెండువందల పాతిక చోట్ల ప్రదర్శించి వచ్చింది. ఈ విధంగా ప్రపంచానికి కొలంబియా దేశపు పురాసంస్కృతిని పరిచయం చేసింది. వెళ్ళిన ప్రతిచోటా సందర్శకులను విస్మయానందాలకు గురి చేసింది, అని చెపుతోందా బోర్డు. నా కుతూహలం రెట్టింపయింది. లోపలికి వెళ్ళి చూశాను. నిజమే, అది ఒక అద్వితీయ అపురూప ప్రదర్శన. అక్కడ ప్రదర్శనకు పెట్టిన స్వర్ణకళాకృతులు ప్రపంచంలో ఇంకెక్కడైనా చూడటం సాధ్యం కాదనే అనిపించింది. యూరోపియన్ ఆక్రమణదారుల ఊహలకు కూడా అందని ప్రాచీన స్వర్ణకళారూపాలు క్రమపద్ధతిలో అక్కడ కొలువుదీరి సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. చుట్టూ అలముకొని ఉన్న చీకటి మధ్య ఫోకస్ చేసిన దీపాల కాంతులు ఆ బంగరు ఆకృతుల మీద పడి వాటిని ధగద్ధగాయమానం చేసే దృశ్యాన్ని మరచిపోవడం ఎవరికైనా కష్టమే. విలక్షణమైన అనుభవమది.

ధగధగల మాట అలా ఉంచి, అక్కడ ప్రదర్శించిన వందల యేళ్ళ నాటి వస్తువులు యూరోపియన్ల రాకకు ముందు అక్కడ ఎలాంటి సమాజాలు ఉండేవో, ఆ సమాజాల జీవనసరళి ఎలాంటిదో విప్పి చెప్పే శక్తి కలవి. పురాగాథలకు, స్థానిక పురాణాలకు చెందిన వస్తువులు, అప్పటి ఖగోళ విజ్ఞానాన్ని ప్రదర్శించే వస్తువులు, ఆచార వ్యవహారాలకు చెందినవి, క్రతువులూ ధర్మక్రియలకు చెందినవి, రాజులూ యోధులూ ఉత్సవాలూ సాంప్రదాయక సందర్భాలలో ధరించే కవచాలు, రక్షణ తొడుగులు, నగలు – ఆ చోట్ల ప్రవహించిన జీవవాహినికి సజీవ దర్పణం ఆ ప్రదర్శన.

ముయిస్కా తెప్ప (Muisca raft) అన్న చిన్నపాటి బంగరుబొమ్మ ఆ మ్యూజియంలోని ముఖ్య ఆకర్షణ. అప్పటి కాలంలో రాజులు మారి వారి వారసులు అధికారం చేపట్టినప్పుడు ఆచారవ్యవహారాలతో కూడిన ఒక మహోత్సవం జరిగేదట. ఆ ఉత్సవం బొగొతాకు ముప్పై మైళ్ళ దూరాన ఉన్న గ్వాతవీత (Guatavita) సరోవరం మధ్యలో జరిగేది. అదిగో అప్పటి ఆ ఉత్సవ ప్రతీక ఇపుడు ఈ మ్యూజియంలో ఉన్న బంగరు తెప్ప. చారిత్రక దృష్టితో చూస్తే ఎంతో ముఖ్యమైన వస్తువే కానీ ప్రదర్శనలో ఉన్న బంగరు తెప్ప పరిమాణంలో బాగా చిన్నది. జాగ్రత్తగా చూస్తే తప్ప కనిపించదు. ఏదేమైనా ఆ ప్రాంతపు ఘనమైన పురాజ్ఞాపిక ఆ బంగరుతెప్ప.

గోల్డ్ మ్యూజియమ్ చూడటం ముగిసేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయింది. భోజన సమయం. బొగొతాలో 1816 నుంచి నడుస్తోన్న ల పుఎర్త ఫల్సా (La Puerta Falsa) అన్న ప్రముఖ రెస్టరెంటు ఉందని ఎక్కడో చదివాను. అక్కడ సంప్రదాయ భోజనం దొరుకుతుందని విన్నాను. అలాంటి పురాతన భోజనశాలల్లో అప్పటి వంటకాలతో భోజనం చెయ్యడమంటే నాకు ఎంతో ఆసక్తి. ఊరికే భోజనం చెయ్యడమనేగాదు, అలాంటి రెస్టరెంటులో లంచ్ చెయ్యడమంటే అదో బహుముఖానుభవం. నగరపు గతంతో చెలిమి చేసే చక్కటి అవకాశం. ఏ రెస్టరెంటు అయితే నగరపు పోకడలను రెండువందల సంవత్సరాలనుంచి గమనిస్తోందో, ఆ నగరపు నడకలో పాలుపంచుకొన్న ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చిందో, వారి వారి మాటలూ చర్చలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిందో – అక్కడ భోజనం పేరిట ఓ గంట గడపడం ఎంత చక్కని అవకాశం! ఆ రెస్టరెంటు అక్కడి గ్రాండ్ కథెడ్రల్‌కు ఆనుకొని ఉన్న సిమోన్ బొలివార్ ప్లాజాలో ఉంది. ఆ దారిని అందిపుచ్చుకొని, ఆ పరిసరాల దృశ్యాలను, శబ్దాలను నాలోకి ఇంకించుకొంటూ అటువేపు అడుగులు సాగించాను.

వెళ్ళానేగానీ ఆ రెస్టరెంటు దగ్గర వీధిలోని కాలిబాటలదాకా వ్యాపించి ఉన్న కస్టమర్ల క్యూ కాస్తంత ఇబ్బందిగా అనిపించింది – ఎంతైనా ఊళ్ళోకెల్లా సుప్రసిద్ధమైన రెస్టరెంటుగదా, ఆపాటి గిరాకీ ఉండడం సహజమే అనీ అనిపించింది. క్యూలో నిలబడి అది ఏ వేగంతో సాగుతోందో, నా వంతు రావడానికి ఎంతసేపు పడుతుందో అంచనా వేసే ప్రయత్నం చేశాను. ఈలోగా అప్పటిదాకా మేఘాలతో నిండివున్న ఆకాశం చిన్నపాటి జల్లు కురిపించడం మొదలెట్టింది. నేను తల కప్పుకోడానికి వీలుండే ‘హుడ్’ ఉన్న జాకెట్టు వేసుకొని ఉన్నాను. అంచేత సమస్య లేదు. క్యూ పొడవునా ఒకటొకటిగా గొడుగులు విచ్చుకున్నాయి.

ఈలోగా నా ముందు క్యూలో నించుని ఉన్న ఓ ఫ్రెంచి జంటతో మాటలు కలిశాయి. ఏది ఏమైనా సరే, ల పుయర్త ఫల్సా రెస్టరెంటులో భోజనం చేసి తీరాలన్న కృతనిశ్చయం ఆ జంటలో కనిపించింది. క్యూ గురించి నాకు కలిగిన చిరు ఆందోళన వారితో పంచుకున్నాను. ఉండనా వెళ్ళిపోనా అన్న మీమాంస వ్యక్తపరిచాను. వాళ్ళు నవ్వేశారు. గత రెండురోజుల్లో వాళ్ళు రెండుసార్లు వచ్చి టేబులు దొరక్క వెనక్కి వెళ్ళారట. ‘ఇవాళింకా అదృష్టం. మన ముందు పది పన్నెండుమందే ఉన్నారు. వర్షం వస్తోంది కదా, పెద్దగా రద్దీ లేదు’ అన్నదా ఫ్రెంచి జంట. ఆ మాటలు నాకు భరోసానిచ్చాయి. నిలబడి సాధిద్దాం అని నిశ్చయించుకున్నాను. వాళ్ళు ఫ్రాన్సులోని లియోఁ (Lyon) నగరానికి చెందినవారట. వంటావార్పుల విషయంలో ఆ నగరం ఫ్రాన్సుకు అనధికార రాజధాని అని నాకు తెలుసు. అంత ఘనమైన నగరం నుంచి వచ్చినవాళ్ళే బుద్ధిగా నిలబడితే నేనెంత అన్న భావన కలిగింది.

క్యూని దాటుకుని లోపలికి చేరుకోగానే ఓ వెయిటర్ సాదర స్వాగతం పలికి చక్కని టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అనుకొన్న దానికన్నా బాగా చిన్న రెస్టరెంటది. అంతా కలసి ఇరవై పాతికమంది పడతారు – అంతే. అక్కడి ఫర్నీచరూ అలంకరణా ఆ రెస్టరెంటుకు ఉన్న వయోగౌరవానికి సరితూగేలా ఉన్నాయి. అక్కడ వడ్డించే వంటకాలు పరిమితం. వాటిల్ని అందించే చురుకుదనం మాత్రం అమోఘం.

ఆ రెస్టరెంటులో బాగా పేరు పొందిన వంటకాలను లంచ్‌కి ఆర్డరు చేశాను: అహియాకొ సాంతా ఫెరేనొ (Ajiaco Santa Fereno) అన్నది చికెన్ తునకలు, బంగాళాదుంపలు, మూలికలు కలిపి వండిన సూపులాంటి పదార్థం. దానికి తోడుగా మొక్కజొన్న కండెతోపాటు మాంసపు తునకలు దట్టించి అరటి ఆకులో చుట్టి ఆవిరి మీద ఉడికించిన తమాలె (Tamale) అన్న వంటకమూ తెప్పించాను. ఈ రెండూగాక ఓ కప్పుడు హాట్ చాక్లెట్టూ, చీజ్ తునకలూ బ్రెడ్డు ముక్కలూ కలిపి వడ్డించే చొక్లాతే కోన్ కేసో (Choclate con queso) అన్నది మూడవ వంటకం. ఆ ప్రాంతానికీ అప్పటి కాలానికీ చెందిన అన్ని రుచులూ చవిచూడాలన్నది నా ఆలోచన, తపన. ‘ఆ చీజ్ తునకల్ని హాట్ చాక్లెట్‌లో ముంచి ఆరగించండి’ అని మా వెయిటర్ సూచించాడు.

వంటకాలు అట్టహాసంగా లేవు. కానీ రుచికి ఏమాత్రం తీసిపోవు. అక్కడి వాతావరణం సరేసరి. ఆంథోనీ బోర్డేన్ అన్న ప్రఖ్యాత అమెరికన్ పాకశాస్త్ర ప్రవీణుడు ఈ రెస్టరెంటుకు వచ్చాడట. అక్కడి తమాలె తిన్నాడట. ‘నేను తిన్న తమాలెలన్నిటికన్నా ఇక్కడిది ఉత్తమం’ అన్నాడట. ఏదేమైనా అది నాకు చక్కని అనుభవం. ఆ అనుభవంతో పోల్చి చూస్తే క్యూలో నిలబడటం అసలు సమస్యే కాదు. అన్నంతోబాటు అనుపానం అన్నట్లు అక్కడ భోజనమే కాకుండా అంతకన్నా ఆసక్తికరమైన ఆ రెస్టరెంటు పూర్వగాథ తెలియ వచ్చింది.

రెండువందల సంవత్సరాల క్రితం బొగొతా కథెడ్రల్‌లో జరిగిన వర్జిన్ ఆఫ్ కార్మెన్ ఉత్సవానికి ఆ కథెడ్రల్ అధినేత ఊరి ప్రముఖులందరినీ పిలిచి అక్కడే ఉండే ల చోంగా (La Chonga) అని పేరు పడ్డ మహిళను ఎందుకో విస్మరించాడట. అందుకు బాధపడిన ఆ మహిళ తన భర్తను కథెడ్రల్ పక్కనే ఉన్న ఇల్లు కొనేలా ప్రేరేపించిందట. అలా కొన్న ఆ ఇంట్లో చవులూరించే వంటకాలను, రుచికి సరితూగే పరిమళాలతోబాటు వండి ఊళ్ళోని ప్రముఖులందరినీ పిలిచి వడ్డించడం ఆరంభించిందట. మన మతాధినేతకు మాత్రం ఆహ్వానం పూజ్యం. ఆహ్వానం అందకపోవడం అటుంచి ఆమె ఇంటి పక్కనే ఉన్న ఆ కథెడ్రల్ ఆవరణంలోకి సదరు వంటకాల సువాసనలు ప్రవేశించి వ్యాపించడం ఆ మతాధినేతకు దుస్సహమయిందట. అవమానాలూ ప్రతీకారాల సంగతి ఎలా ఉన్నా అలా పుట్టిన ఆ వంటకాల వేదిక ఇప్పటికీ తన ప్రాభవాన్ని నిలబెట్టుకుంటూ నడుస్తోంది. ఆ వనితా విజేత ల చోంగా ఏయే వంటకాలు వండిందో అవే వంటకాలు తరాలు మారినా తమ రుచీ రూపం కోల్పోకుండా ఇప్పటికీ కస్టమర్లకు అందుతున్నాయి.

లంచ్ ముగిశాక ఊళ్ళోని బొతేరో మ్యూజియమ్ చూడడానికి వెళ్ళాను. కొలంబియాలో అడుగుపెట్టిన దగ్గర్నించి ఈ బొతేరోతో నా సహవాసం కొనసాగుతోంది. కార్తహేనలో విశ్రమిస్తోన్న స్థూలకాయురాలి నగ్నప్రతిమను చూసాను. ఆ విలక్షణ కళాకారుని స్వగ్రామం మెదెయీన్‌లో రెండు రోజుల క్రితం బొతేరో పార్కులో ఏకంగా ఇరవై నాలుగు శిల్పాలను చూశాను. ఇదిగో ఇపుడీ రాజధాని నగరం బొగొతాలో బొతేరో మ్యూజియమ్! కార్తహేన, మెదెయీన్‌ల లోను, ప్రపంచ ప్రసిద్ధ నగరాల బహిరంగ ప్రదేశాలలోనూ బొతేరో రూపకల్పన చేసిన శిల్పాలు నెలకొని ఉంటే ఈ బొగొతా మ్యూజియమ్ అతని వర్ణచిత్రాలకు పట్టం కడుతోంది. ఆయన వేసిన నూట ఇరవై మూడు పెయింటింగ్స్ ఇక్కడ ఉన్నాయి. శిల్పిగా ఆయన ఎంత ప్రసిద్ధుడో చిత్రకారుడిగానూ అంతే ప్రసిద్ధుడు. శిల్పాలలోలానే చిత్రాలలోకూడా వ్యక్తుల స్థూలకాయత, నగ్నత, అతిశయ ఆకృతి కనిపిస్తాయి. బొతేరో ప్రజ్ఞ శిల్పాలకూ చిత్రాలకూ మాత్రమే పరిమితం కాదట – కళాకృతుల సేకరణలోనూ ఆయన దిట్ట అట. ఆ ప్రాంతపు పురాకళాకృతులతోపాటు ఆధునిక కళారూపాలనూ ఆయన సేకరించి భద్రపరిచాడట. కొలంబియాకు ఆయన పట్ల ఎంతటి ప్రేమాతిశయం అంటే ఈ మ్యూజియమ్ అందరూ చూడాలి అన్న ఉద్దేశ్యంతో నిర్వాహకులు దానికి రుసుము అంటూ పెట్టనేలేదు. ప్రతి ఏడూ అయిదు లక్షలమంది ఆ మ్యూజియం చూడడానికి వస్తూ ఉంటారట.

కరేరా సెప్తిమో (Carrera 7) అన్నది బొగొతా నగరంలోని ముఖ్యమైన వీధి. ఉత్తరదక్షిణాలుగా నగరమంతా సాగే ఈ ఏడో వీధి – సెవెంత్ ఎవెన్యూ – నగరానికే తలమానికం. మనుషులు నడవడానికి అటూ ఇటూ పేవ్‌మెంట్లు, పచ్చని చెట్లు, ఉల్లాసం కలిగించే వాతావరణం – మరీ ముఖ్యంగా అసంఖ్యాకమైన ఫుడ్ స్టాల్సు ఉన్నాయి. ఆ ఎవెన్యూ ముచ్చటను గమనిస్తూ, అంగళ్ళలో అమ్ముతున్న మొక్కజొన్న కండెలు, సాసేజ్‌లు, నిప్పుల్లో కాల్చిన మాంసపు తునకలు, పళ్ళు, పళ్ళరసాలు, కజ్జికాయల్లాంటి ఎంపనాదాలు, గారెల్లా కనిపించే బున్యెల్లోలు – వీటన్నిటినీ పరికిస్తూ పలకరిస్తూ ఆ ఏడో వీధిలో సమయం గడిపాను. మధ్యమధ్యలో నదురుగా ఉండే ప్రదేశాలు కనిపించినప్పుడు అక్కడ ఆగి వాటిల్ని పరిశీలించాను. అలా తిరుగుతూ తిరుగుతూ ల కాన్దెలరీయా (La Candelaria) అన్న చారిత్రాత్మక ప్రదేశంలోని కెవేదో ఫౌంటైన్ (Chorro de Quevedo) దగ్గరికి చేరుకున్నాను. గోన్సాలో యి మెనేస్ దె కెసాదా (Gonzalo Ji Menez de Quesada) అన్న స్పానిష్ ఆక్రమణదారు బొగొతా నగరానికి పునాది రాయి వేసిన స్థలమదేనట.

అక్కడికి కిలోమీటరులోపులోనే సిమోన్ బొలీవార్ ప్లాజా ఉంది. దానికి అన్ని వేపులా గ్రాండ్ కథెడ్రల్, ప్రెసిడెన్షియల్ పాలెస్ లాంటి భవనాలు ఉన్నాయి. ఆ కూడలి మధ్యలో అశ్వారూఢుడైన సిమోన్ బొలీవార్ ఘనమైన విగ్రహం ఉంది. ఆకట్టుకొనే ప్రదేశమది.

ఆ ప్లాసా దె బొలీవార్‌లో ఉన్న విశాలమైన భవనాలలో పలాసియో హుస్తీసియో (El Palacio de Justicia) ఒకటి. సామాన్య పరిభాషలో సుప్రీంకోర్టు అన్నమాట. ఆ భవనాన్ని చూడగానే నా టీనేజి జ్ఞాపకం గుర్తుకొచ్చింది. ఆ రోజుల్లో నేను జాతీయ అంతర్జాతీయ వార్తల్ని పరిణామాల్ని క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండేవాడిని. అప్పట్లో వాటి గురించి తెలుసుకోవడానికి ఉండే వనరులు అతి పరిమితం. ఇప్పటిలాగా ఇంటర్నెట్టూ సోషల్ మీడియాలూ లేని కాలం గదా – వార్తాపత్రికలు, రేడియోలు; అంతే. పరిమిత వనరులు అన్నమాట నిజమే అయినా వాటి విశ్వసనీయత ఆ రోజుల్లో చాలా ఎక్కువ. ఈనాడు, హిందూ పేపర్లను ఆసక్తితో చదువుతూ ఉండేవాడిని. ఆకాశవాణిలో రాత్రి తొమ్మిదిగంటల ఆంగ్ల వార్తాప్రసారాన్ని వింటూ ఉండేవాడిని. ఆ తర్వాత వచ్చే ‘స్పాట్ లైట్’ అన్న కార్యక్రమం నాకు అభిమాన విషయంగా ఉండేది. వీటితోపాటు అంతర్జాతీయ పరిణామాలు తెలుసుకోవడానికి బిబిసి వల్డ్ సర్వీస్ బాగా ఉపకరించేది. ఆ టీనేజి వార్తా పరంపరలో నన్ను బాగా ఆకట్టుకొని నా మనసులో నిలిచిపోయిన సంఘటన – 1985లో ఒక సాయుధ సైనికబృందం బొగొతా నగరపు బొలీవార్ ప్లాజాకు చేరువలో ఉన్న సుప్రీంకోర్టు మీద దాడి చేసి ఆక్రమించడం. ఆ దాడిలో చాలామంది సామాన్యపౌరులు మరణించారు. సామాన్యులే గాదు – ప్రధానన్యాయమూర్తితో సహా పన్నెండుమంది న్యాయాధీశులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడి వెనుక పాబ్లో ఎస్కొబార్ హస్తం ఉందన్నది అపుడు వినవచ్చిన మాట. ఆ సాయుధ సైనిక బృందానికి అవసరమైన ధనసహాయమంతా అతని కోశాగారంనుంచే వచ్చిందట!

అప్పటి సంగతి ఎలా ఉన్నా నేను పాలస్ ఆఫ్ జస్టిస్ చేరిన సమయంలో అక్కడ ఏదో నిరసన ప్రదర్శన జరుగుతోంది. నిరసనకారులు ఎర్రటి అంగీలు వేసుకుని ఉన్నారు. వాటిమీద ఇద్దరి బొమ్మలున్నాయి – ఒకటి చే గెవేరా; రెండోది నేను గుర్తుపట్టలేదు. ఆ నిరసనకారుల్ని పలకరించి విషయమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేశాను. వాళ్ళు వివరించే ప్రయత్నం చేశారుగానీ భాష అడ్డం వచ్చింది. అది గమనించిన పాబ్లో ఫ్లొరేస్ అన్న నిరసనకారుడొకాయన విషయం వివరించడానికి ముందుకొచ్చాడు. అతనికి ఇంగ్లీషు తెలుసు. ‘మేమంతా టీచర్లు, గవర్నమెంటు ఉద్యోగులం. మెరుగైన సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కోసం గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నాం’ అని చెప్పాడు. ఆయన సైన్సు టీచరట. భుజాల దాకా పెరిగిన జుట్టుతో విలక్షణంగా ఉన్నాడు… అక్కడికి ఆరువందల కిలోమీటర్ల దూరాన ఉన్న కోకా అన్న ప్రావిన్స్ ముఖ్య పట్టణం పొపయాన్ (Popayán) నుంచి వచ్చాడట. అంగీల మీద ఉన్న బొమ్మల గురించి అడిగితే, ‘గెవేరా గురించి చెప్పేదేముందీ… ఆ రెండో మనిషి పేరు కమీలో తొర్రెస్ రెస్త్రేపో (Camilo Torres Restrepo). మా కొలంబియాకు చెందిన మార్క్సిస్టు-లెనినిస్టు మతాధికారి. విద్యావేత్త కూడానూ – కొలంబియా యూనివర్సిటీలో సోషియాలజీ బోధించాడు’ అని వివరించాడు ఫ్లొరేస్. మామూలుగా మతానికీ మార్క్సిజానికీ పొసగదు. కానీ కొలంబియా సంగతి వేరు. ఆ మాటకొస్తే లాటిన్ అమెరికా అంతటా మతాధికారులు అణచబడ్డ వారి తరఫున మాట్లాడటం, పనిచేయడం; మతాన్ని మార్క్సిజాన్ని సమన్వయం చేసే ప్రయత్నాలు చెయ్యడం చరిత్రలో మనకు కనిపిస్తుంది. విమోచనాధార్మికశాస్త్రం – లిబరేషన్ థియాలజీ – అన్న ఆచరణాత్మక భావజాలానికి వాళ్ళు రూపకల్పన చేశారు. ఈ రెస్త్రేపో అన్నాయన 1966లో జరిగిన సైనికచర్యలో ప్రాణాలు కోల్పోయాడట. అపుడాయన వయసు అంతా కలసి ముప్పై ఆరేళ్ళు.

‘ప్రభుత్వం మాకిచ్చే జీతాలతో బ్రతకడం కష్టం’ చెప్పుకొచ్చాడు కొత్త మిత్రుడు ఫ్లొరేస్. ‘కనీసం పటిష్టమైన సోషల్ సెక్యూరిటీ పథకమైనా ఉంటే మాకూ మా కుటుంబాలకూ ఆరోగ్యాలు పాడయినపుడో ప్రమాదాలు జరిగినపుడో పనికొస్తుంది. అందుకే మా ఈ ఆందోళన’ అని వివరించాడు. సాధకబాధకాలు చెప్పుకొంటున్నపుడు క్షణాల్లో ఆత్మీయతాభావం కలుగుతుందనుకొంటాను – ‘మా ఊరు పొపయాన్ రండి. వలసకాలపు అందమైన ఊరు. మీరు ఇష్టపడతారు. వచ్చి మా ఇంట్లో నాలుగు రోజులు ఉండండి. అలా వస్తే నాకది గొప్ప సంతోషం’ అంటూ ఆహ్వానించాడు. దూరాభారం. నాకు బొగొతాలో ఉన్నవే రెండురోజులు. సాధ్యం కాని పని. అతనికి మనఃస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశాను. నా అశక్తత వివరించాను. అతను అడ్రసూ టెలిఫోన్ నెంబరులాంటి వివరాలన్నీ నాతో పంచుకొని, ‘ఈసారి మీరు కొలంబియా వచ్చినపుడు మా ఊరు తప్పకుండా రావాలి. మా ఇంట్లో ఉండాలి’ అన్నాడు. మరోసారి ధన్యవాదాలు చెప్పి విడివడ్డాను.

ఆ బొలీవార్ ప్లాజాలో మరికాస్తసేపు గడిపాను. వీధుల్లో ఉన్న బళ్ళ దుకాణాల్లో పళ్ళముక్కలు నిండిన వేడి వేడి ద్రవపదార్థం ఏదో కనిపించింది. దాని పేరు కనెలాసో (Canelazo) అట. కొలంబియాలో బాగా ప్రాచుర్యమున్న ద్రావకమట. దాల్చినచెక్కతో మరిగించిన నీళ్ళల్లో చెరకుసారా, చక్కర, రమ్ కలిపి చేసే ఆ డ్రింక్ ఈ ప్రాంతాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఒకటి కొన్నాను. ఆగి ఆగి వాన పడుతోంది. వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. తాగుతోన్న వేడి పానీయం ఆ ఆహ్లాదాన్ని రెట్టింపు చేస్తోంది. మెల్లగా ఆ కనెలాసో తాగుతూ ట్రామ్ పట్టుకుని హోటలు చేరాను.


మర్నాడు బొగొతాకు గంటన్నర దూరంలో ఉన్న గ్వాతవీత సరోవరం, ఆ పరిసరాల్లోనే ఉన్న సిపాకీరా (Zipaquirá) రాతి ఉప్పు గనులూ చూసి రావడానికి డే-టూర్ పెట్టుకున్నాను. దానికోసం కాస్త పొద్దున్నే లేచి తయారయాను. ల కాన్దెలరీయాలో ఉన్న వాన్ వాల్డెస్ కఫే (Juan Valdez Cafe) అన్నది మా బస్సు పికప్ పాయింటు. ఈ వాన్ వాల్డెస్ అన్నది కొలంబియాలో పెద్ద పేరున్న కాఫీ షాపుల శృంఖల. కొలంబియాలోనే కాదు ప్రపంచమంతటా తన పాదముద్ర ఉన్న కాఫీ బ్రాండు అది. ఆ బ్రాండు లోగోలో వాన్ వాల్డెస్ అన్న బొమ్మ ఉంటుంది. అతగాడు సొంబ్రేరో (Sombrero) అనే ఎండటోపీ ధరించి ఉంటాడు. కొలంబియాలోని కాఫీ తోటల యాజమానుల ప్రతీక ఈ వాన్ వాల్డెస్ అన్న కాల్పనిక వ్యక్తి. 2002లో వాన్ వాల్డెస్ వాళ్ళ మొట్టమొదటి కఫే బొగొతా విమానాశ్రయంలో ఆరంభమయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 500 వాన్ వాల్డెస్ కఫేలు ఉన్నాయి. కొలంబియా జీడీపీలో ఎనిమిదిశాతం కాఫీ ఎగుమతుల వల్లనే సమకూరుతోందట.

పికప్ బస్సు రావడానికింకా సమయముంది. ఈలోగా ఓ కాఫీ తాగుదాం అనిపించింది. కఫే కాస్త బిజీగా ఉంది. కాసేపు క్యూలో నుంచుని కాఫీతో బాటు రెండు మూడు చీజ్ అరెపాలు కూడా తీసుకున్నాను. మధ్య అమెరికా దక్షిణ అమెరికాల్లో తిరుగుతోన్న పుణ్యమా అని పాలు లేకుండా కాఫీ తాగటం అలవాటయిపోయింది. అలవాటేగాదు – అసలు అలాగే బావుంటోంది. ఈ దేశాల్లో కాఫీలో పాలు కలపడం అంటే మొహం చిట్లిస్తారు. కాఫీ తాగడంలోని ఔచిత్యమే దెబ్బతిన్నట్లు భావిస్తారు. పంచదార విషయానికొస్తే నేను కాఫీలో పంచదార వేసుకోవడం ఎప్పుడో మానేశాను.

బస్సు వచ్చింది. డొమింగొ అన్న మనిషి మా గైడు. అంతా కలసి ఇరవైమంది టూరిస్టులం. అందులో మళ్ళా రెండు వర్గాలు: స్పానిష్ వచ్చినవాళ్ళు, రానివాళ్ళు. స్పానిష్ తెలియని మాబోటివాళ్ళది మైనారిటీ. అంచేత పాపం డొమింగో ప్రతి విషయం ముందు స్పానిష్‌లో చెప్పి ఆ తర్వాత ఇంగ్లీషులో వివరించాడు.

గంటన్నర ప్రయాణం తర్వాత గ్వాతవీత పట్టణం చేరుకున్నాం. అందమైన ఊరు. బస్సు ఊళ్ళోంచి సాగుతూ ఉన్నప్పుడు డొమింగొ ఊరి నేపథ్యం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఇళ్ళన్నీ వెల్లవేసి ఉన్నాయి. పబ్లిక్ భవనాలకు ఎర్రరంగు పెంకులు ఉన్నాయి. రోడ్డు విశాలంగా ఉన్నా మనుషుల జాడ అంతగా లేదు. పక్కనే కట్టిన తొమైన్ ఆనకట్ట పుణ్యమా అని అసలైన ఊరు మునిగిపోయిందట. ఇప్పుడు మేము చూస్తున్నది ఆ స్థానంలో కట్టిన కొత్త పట్నం – రెప్లికా. డొమింగో అడిగిన ప్రకారం బస్సు డ్రైవరు ఓ విస్టా పాయింటు దగ్గర బస్‌ ఆపాడు. ఎర్ర పెంకుల వృత్తాకారపు భవనం ఒకటి దిగువన కనిపించింది. అది గ్వాతవీత పట్టణపు కొలోసియమట. ఊళ్ళోని ప్రముఖ కట్టడమట.

కాసేపట్లో ‘గ్వాతవీత లేక్ నేషనల్ పార్క్’ గేట్ల దగ్గరకు చేరుకున్నాం. అదంతా రక్షిత ప్రాంతం. మా బస్సులోనే ప్రయాణం చేస్తోన్న ఓ పెద్దవయసు దంపతులు నా దగ్గరికి వచ్చి పలకరించారు. ఆమె చీరలో ఉన్నారు – దక్షిణభారతశైలిలో కట్టుకున్న చీర. తెలుగులో మాట్లాడారు. మా ఊరు హైదరాబాద్ నుంచే వచ్చామని చెప్పారు. ఆయన పేరు వెంకట్రావు, ఆమె భానుమతి. డెబ్భైలు దాటిన వయసు. ఆయన తెలంగాణలో అటవీ అధికారిగా పనిచేసి రిటైరయారట. పిల్లలు సెటిలయిపోయారట. ప్రపంచమంతా తిరిగి రావాలి అన్న కోరికను తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారీ వెంకట్రావు దంపతులు. దక్షిణ అమెరికాలో కనీసం ఒక్క దేశమైనా చూడాలన్నది వారి కోరిక. తలిదండ్రుల మనసెరిగిన వాళ్ళబ్బాయి ఇదిగో, ఈ కొలంబియా టూరు ఏర్పాటు చేశాడు. ఊరుగాని ఊరులో మరో తెలుగు మాట్లాడే మనిషి కనిపించాడని వాళ్ళిద్దరూ సంబరపడ్డారు. కాసేపు కలసి తిరిగాం. కబుర్లు చెప్పుకున్నాం. దేశం లోనూ హైదరాబాద్ లోనూ ఏమవుతోందీ అని వాళ్ళను అడిగి తెలుసుకున్నాను. వాళ్ళతో మాట్లాడినంతసేపూ స్వంత ఊళ్ళో ఉన్న భావన – వాళ్ళకేగాదు నాకు కూడా అలా కొలంబియా దేశపు మారుమూల పట్టణంలో ఊహలకందని ఆ ప్రదేశంలో నా స్వంతభాషలో మాట్లాడగలగడం ఆశ్చర్యం, సంతోషం కలిగించింది. భాషాసంభ్రమం దాటాక మేము ముగ్గురం ప్రయాణాల గురించి మాటలు ఇచ్చి పుచ్చుకున్నాం. భారతదేశంలోనూ విదేశాల్లోనూ చేసిన ప్రయాణాల గురించి వాళ్ళు ప్రస్తావించారు. వాళ్ళ మాటలను బట్టి ఇద్దరూ జీవితం పట్ల పరిపూర్ణమైన సంతృప్తి కల మనుషులని అర్థమయింది. అందరు మధ్యతరగతి మనుషులలానే వీరూ కష్టపడ్డారు. పిల్లల్ని చదివించి పైకి తీసుకువచ్చారు. వాళ్ళు చక్కగా అమెరికాలో స్థిరపడ్డారు. ఇపుడు వీరిద్దరూ తమ తమ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ తమకెంతో ఇష్టమయిన ప్రయాణాలతో కాలం గడుపుతున్నారు. రిటైర్మెంట్ ఫలాలను పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. వాళ్ళను చూసి నాకూ మనసు నిండినట్లనిపించింది.

డొమింగో అక్కడ ఉన్న ముయిస్కా తెగలవారి ఇంటి ప్రతిరూపాన్ని చూపించాడు. అప్పట్లో వాళ్ళు ఎలా నివసించారో, రోజువారీ జీవితంలో ఏయే పనిముట్లూ ఉపకరణాలూ వాడారో అవన్నీ పొందికగా అమర్చి కట్టారా ప్రతిరూపాన్ని. వాళ్ళు చిప్చా (Chipcha) అన్న భాష మాట్లాడేవారట. ఇపుడా భాష అంతరించిపోయింది.

నేషనల్ పార్క్ మెయిన్ గేటునుంచి గ్వాతవీత సరోవరానికి మూడు కిలోమీటర్లు. మొదటంతా రాతిబాట. దాటడానికి కష్టపడాల్సి వచ్చింది. తర్వాత సులువయింది. అంతా కలసి 400 మీటర్ల అధిరోహణ.

అక్కడి భౌగోళిక విలక్షణతలు, వృక్ష జంతుజాతుల వివరాలు చెప్పుకొచ్చాడు డొమింగో. మేము నడక ఆరంభించిన మెయిన్ గేటు సముద్రతలానికి 2660 మీటర్ల ఎత్తున ఉంది. అక్కడి వృక్షజాలం ఒక రీతిన ఉంది. కాస్తంత నడిచాక ‘మనం 2800 మీటర్ల హద్దును దాటాం’ అని డొమింగొ సూచించాడు. అక్కడ వృక్షజాలపు సరళి మారింది. వైజ్ఞానిక పరిభాషలో అక్కడ ఉన్నది రామొ (Páramo) ఎకోసిస్టమ్. ఈ రకమైన పర్యావరణం ఆండీస్ పర్వతసీమలో – అలాంటి ఎత్తుల్లో ఉండే ఏ పర్వత శ్రేణిలో అయినా – మనం గమనించవచ్చు. వృక్షాలూ అడవులూ తగ్గుమొహం పడతాయి. అన్ని కాలాల్లోనూ ఎల్లవేళలా మంచు నిండి ఉండే హిమసీమ ఇంకా దూరాన – 4000 మీటర్ల ఎత్తు దాటాక, మనకు తటస్థపడుతుంది. ఈ నడుమభాగమంతా ముందు పొదలు తుప్పలు, అవి దాటాక పచ్చగడ్డి భూములు ఉంటాయి. మేము 2800 మీటర్లు దాటీదాటగానే వృక్షాలు కనుమరుగయాయి. నిడుపాటి పొదలూ తుప్పలూ మొదలయ్యాయి. అక్కడ కనిపించే మొక్కలూ పూలలో అరవై శాతం ఆ ప్రాంతానికే పరిమితమైనవట. ప్రపంచంలో మరెక్కడా కనిపించవట. (ఇలా అడవులు తుప్పలుగానూ, పొదలుగానూ, పచ్చగడ్డి భూములుగానూ, అవికూడా లేని రాతినేలగానూ మారే ప్రక్రియ మనకు గౌరీకుండ్ (2000 మీటర్లు) నుంచి కేదారనాథ్ (3800 మీటర్లు) వెళ్ళే పదిహేను కిలోమీటర్ల కాలిబాటలో ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. – అను.) ఆ మూడు కిలోమీటర్ల దారిలో కొన్ని విస్టా పాయింట్లున్నాయి. అక్కడనించి పరిసర సీమ ఎంతో అందంగా కనిపించింది. కొండలు… చిన్న చిన్న గృహ సముదాయాలు… అక్కడక్కడ ఫార్మ్‌హౌసులు – పచ్చదనం సరేసరి. మినీ స్విట్జర్లాండా అనిపించింది.

అధిరోహణ ముగించి ఒక గుట్టమీదకు చేరగానే ఉన్నట్టుండి దిగువన పగడాల రాశిలా వెలిగిపోతూ గ్వాతవీత సరోవరం కనిపించింది. చుట్టూ కొండలు, నడుమన సరోవరం. అప్పటికే దక్షిణ అమెరికాలోని అగ్నిపర్వతాల బిలముఖ సరోవరాలను చూసిన వారికి ఇది కూడా ఒక క్రేటర్ సరోవరం అనిపించక మానదు. కానీ కాదట. కొండల మధ్యనున్న భూమి క్రుంగిపోవడం వల్ల ఈ సరోవరం ఏర్పడిందని వివరించాడు డొమింగో.

గుట్ట మీదినుంచి దిగి తిరిగి బస్సు దగ్గరికి చేరడానికి ఎక్కువ సమయమే పట్టింది – కాకపోతే అది పెద్దగా శ్రమ లేకుండా జరిగిపోయింది – తుప్పలు నిండిన మార్గంలో దారికి అవతలి చివర నిలిపి ఉన్న బస్సు దగ్గరికి అందరం చేరుకున్నాం. దారి ఎంతో పరిశుభ్రంగా ఉంది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ నీళ్ళ సీసాలు, కవర్లు అక్కడ నిషిద్ధమట. అంచేత వాటి బెడద లేదు. ‘దగ్గర ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్సు బయటకు కనబడకుండా దాచిపెట్టుకోండి’ అని డొమింగో ముందే మా అందర్నీ హెచ్చరించాడు.

ఇక్కడ నివసించిన ముయిస్కా తెగలవారికి తమదంటూ విలక్షణమైన నాగరికత ఉండేది. మాయన్, ఇన్కా, ఆస్టెక్ నాగరికతలతో పోల్చదగిన నాగరికత ముయిస్కా వారిది. కానీ మిగిలిన వారిలాగా ముయిస్కా తెగవాళ్ళు ఒకరినొకరు జయించి సామ్రాజ్యాలు నెలకొల్పుకోలేదు. తమలో తామే ఒక సమాఖ్యగా ఏర్పడి జీవించారు. స్పానిష్ ఆక్రమణదారులు అక్కడ కాలుబెట్టిన సమయానికి ముయిస్కాల సంఖ్య ఎనభై లక్షలవరకూ ఉండేదట.

సువర్ణనగరం – ఎల్ దొరాదో అన్న పౌరాణిక ఊహాభావన స్పానిష్ ఆక్రమణదారులను ఎంతగానో ఉత్తేజపరచింది. స్పానిష్‌లనే గాదు యూరప్ నుంచి వచ్చిన ఆక్రమణదారులందరినీ దురాశ సరిహద్దులకు చేర్చిందా భావన. వారి ఆకాశాన్నంటే ఆశలకు స్థానిక తెగలవారి కథలూ గాథలూ ఆజ్యం పోశాయి. అసలా సువర్ణనగరం అన్న భావనకు కొలంబియా ప్రాంతపు ముయిస్కా తెగలవారు గ్వాతవీత సరోవరంలో జరిపే ఉత్సవకాండ మూలకారణం అని చెప్పవచ్చు. ఆ సింహాసన అధిరోహణ క్రతువును చూసిన యూరప్ అన్వేషకులు ఆ అనుభవం గురించి రాశారు. కథలు కథలుగా సాటి యూరోపియన్లకు చెప్పారు. అది ఇతరుల ఆశాదురాశలకు కేంద్రబిందువయింది. ఆశనిరాశలూ అతిశయోక్తుల సంగతి ఎలా ఉన్నా రాజులు మారినపుడు గ్వాతవీత సరోవరం లాంటిచోట జరిగే ఉత్సవకాండ స్వరూప స్వభావాలు తెలుసుకోవాలంటే కథలూ పుక్కిటి పురాణాలూ పనికిరావు. స్థానిక చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం క్షుణ్ణంగా తెలిసిన గైడు ఎంతైనా అవసరం. అవి చెప్పడానికి మాకు దొరికిన నిష్ణాత మార్గదర్శి డొమింగో. అతను చెప్పిన వివరాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి.

గ్వాతవీత ఉత్సవక్రియలో మొట్టమొదటగా పేముతో అల్లిన దృఢమయిన తెప్ప తయారు చేస్తారు. దాన్ని చక్కగా అలంకరిస్తారు. సింహాసనం ఎక్కుతోన్న వ్యక్తిని నగ్నంగా చేసి ఒళ్ళంతా బంకమట్టి పూస్తారు. అలా పూశాక ఆ శరీరానికి బంగారు రజను అద్దుతారు. ఆ దశలో ఆ వ్యక్తి బంగారంతో చేసినట్టు మెరిసిపోతాడు. అలా అలంకరించిన ఆ వారసుడికి మరో నలుగురు ప్రముఖులను తోడిచ్చి తెప్ప మీద సరోవర కేంద్రానికి తీసుకువెళతారు. అక్కడ ఆ బంగారు మనిషి తనకు పులిమిన తొడుగులు విసర్జించి, వాటికి పచ్చలను జోడించి సరోవరానికి అర్పిస్తాడు. తోడు వచ్చిన ప్రముఖులు కూడా అదే విధంగా సరోవరానికి కానుకలు అర్పిస్తారు. ఆ ఉత్సవాన్ని చూడడానికి వచ్చిన సామాన్య ప్రజానీకం కూడా సరోవరంలోకి బంగారు తునకలు విసురుతారు. ఆ ఉత్సవక్రియ ముగిశాక తెప్ప ఒడ్డుకు చేరుతుంది. అందరూ ఆ వారసుడిని తమ నూతన ప్రభువుగా స్వీకరిస్తారు. ఆ తర్వాత సంగీతం, నాట్యం, విందులు, వినోదాలు సరేసరి. నేను నిన్న మ్యూజియమ్‌లో చూసిన బంగరు తెప్ప ఇదిగో ఈ ఉత్సవ ప్రతీకే…

ఎల్ దొరాదో అన్న ఇతిహాసానికి ఈ ఉత్సవ ప్రక్రియ ఆధార బిందువు. మొదట్లో ఎల్ దొరాదో అనే పదానికి స్వర్ణ పురుషుడు అన్న అర్థం ఉండేది. క్రమక్రమంగా ఆ మాటకు ఆ ప్రాంతంలో ‘మారుమూల ఉన్న అజ్ఞాత సువర్ణనగరం’ అన్న అర్థం ఏర్పడింది. నిజానికి గ్వాతవీత ప్రాంతంలో బంగారం దొరకదు. అక్కడి ముయిస్కా తెగలవాళ్ళు పశ్చిమ ప్రాంతాలనుంచీ పసిఫిక్ ప్రాంతాలనుంచీ బంగారం తెప్పించుకొనేవారు. ఆ తెగలవారే యూరోపియన్ల ధాష్టీకంనుంచి తప్పించుకోవడానికి ఎల్ దొరాదో అన్న గుప్తనగరం ఎక్కడో మారుమూలన ఉందన్న విషయం ప్రచారం చేసారని ప్రతీతి. అలా ఆ ఐతిహ్యం రూపుదిద్దుకుంది.

ఎల్ దొరాదో అన్న ఊహ ఎలా పుట్టినా, ఆ భావం ఎంతోమంది సాహసిక అన్వేషకులకు ప్రేరణ కలిగించింది. వారికి సిరిసంపదలు లభించడం సంగతి ఎలా ఉన్నా, దక్షిణ అమెరికాలోని చొరలేని మారుమూల భాగాలు మనిషికి చేరువ అయ్యాయి. ఆ ప్రక్రియలో అమెజాన్ మహానది ఆరంభబిందువు నుంచి సాగరసంగమ స్థలం ద్వారా శోధించడం, నదిమీద పయనించడం, నది రూపురేఖలూ గమనరీతీ డాక్యుమెంట్ చెయ్యడం జరిగింది. బహుశా ప్రపంచంలోని నిధుల వేట పరంపరలో ఎల్ దొరాదో అన్వేషణ అగ్రపీఠాన నిలుస్తుందనుకుంటాను.

ఈ ఎల్ దొరాదో అన్న స్థానానికి ఒకటికి మించిన దేశాలూ ప్రదేశాలూ పోటీపడ్డాయి. కొలంబియా, ఎక్వదోర్, పెరు, బ్రెజిల్, గయానా – అలా అనేక చోట్ల ఎల్ దొరాదో ఉనికి కోసం వెదుకులాట సాగింది. ఆ అన్వేషణ దక్షిణ అమెరికాకే పరిమితం కాలేదు: ఉత్తర, మధ్య అమెరికాలకూ వ్యాపించింది. ఎన్నో శోధనాయాత్రలకు కారకమయింది. ఆ భావం చుట్టూ పుస్తకాలు వచ్చాయి. మెకనాస్ గోల్డ్ లాంటి సినిమాలు వచ్చాయి. అంతేగాకుండా ఆ స్వర్ణ లాలస ఎంతోమంది అన్వేషకుల ప్రాణాలు బలితీసుకుంది. ఆయా ప్రాంతాలలో ప్రశాంతంగా జీవిస్తున్న స్థానిక తెగలవారి జీవితాలను అతలాకుతలం చేసింది. అదే సమయంలో కొత్త కొత్త ప్రదేశాలు కనుగొనడానికీ దారి తీసింది. ఏదేమైనా ఆ ఎల్ దొరాదో మనిషి కంటికి కనపడలేదు. హిమాలయ పర్వతాల్లోని షాంగ్రి-లా, సముద్రగర్భంలో కలసిపోయిందని కొంతమంది నమ్మే అట్లాంటిస్ నగరాల్లాగా ఈ ఉండీ లేని ఎల్ దొరాదో మృగతృష్ణలా మనిషిని కవ్వించి వదిలిపెట్టింది.

సువర్ణ నగరాన్వేషణ సంగతి ఎలా ఉన్నా గ్వాతవీత సరోవరంలో బంగారం అన్వేషణ ఎంతో పకడ్బందీగా రెండుమూడుసార్లు జరిగింది. 1545లో స్పానిష్ ఆక్రమణదారులు చెరువును తోడేద్దామని ప్రయత్నించి విఫలమయ్యారు. మూడు నెలలు ప్రయత్నించగా ప్రయత్నించగా వారికి లభించింది పిసరంత బంగారం. 1580లో మరో ప్రయత్నం జరిగింది. బొగొతాకు చెందిన వ్యాపారి ఒకరు ఇరవై మీటర్ల లోతు వరకూ నీళ్ళు తోడివేయగలిగాడు. కొన్ని బంగారు ఆభరణాలు దొరికాయి. పెట్టిన ఖర్చూ శ్రమలతో పోలిస్తే దొరికింది నామమాత్రం. కానీ ఆ ప్రయత్నాలు అక్కడితో ఆగలేదు. 20వ శతాబ్దపు తొలి దినాలలో లండన్ నగరపు పెట్టుబడిదారుల మద్దతుతో ఓ వాణిజ్యసంస్థ చెరువును ఖాళీ చేసే పని చేపట్టి విజయవంతం అయింది. చెరువు దిగువన ఓ సొరంగం నిర్మించి నీళ్ళన్నీ తోడేసింది. అడుగున మట్టీ మీద బురదా మిగిలాయి. అవి కొద్ది రోజుల్లో ఎండిపోయి గట్టిపడ్డాయి. ఇంతా చేసి వాళ్ళకు దొరికింది ఆనాటి ఉత్సవాల్లో తెప్పల్లోని ప్రముఖులు సమర్పించిన కొద్దిపాటి బంగారం. 1960లో ఆ కంపెనీ దివాలా తీసింది. ప్రభుత్వం మేలుకుని ఆ సరోవరాన్ని పరిసరప్రాంతాలనూ రక్షితప్రదేశంగా గుర్తించింది. చెరువుతో చెలగాటం చట్టవిరుద్ధం అని ప్రకటించింది. మళ్ళా మనం నగరంలోని గోల్డ్ మ్యూజియమ్ దగ్గరికి వెళితే ఈ గ్వాతవీత సరోవర ప్రాంతంలో దొరికిన బంగరు తునకలు ఆ ప్రదర్శన శాలలో మనకు కనిపిస్తాయి.


గ్వాతవీతకు పశ్చిమాన గంట దూరంలో ఉన్న సిపాకీరా ఉప్పుగనులకేసి సాగిపోయాం. చెరువులూ కొండలూ అడ్డమున్నాయి కాబట్టి గంటా గంటన్నర. పక్షి మార్గంలో వెళితే అంతా కలసి పాతిక కిలోమీటర్లే. ఈ సిపాకీరా అన్న ప్రాంతం పశువులు మేయడానికి అనువైన మైదాన ప్రాంతం – కౌబాయ్ కంట్రీ అన్నమాట. దారిలో బ్రసాస్ డెల్ లానో అన్న రెస్టరెంట్లో భోజనానికి ఆగాం. అచ్చమైన కౌబాయ్ రెస్టరెంటది. విశాలమైన ప్రాంగణం – స్థల ఔచిత్యానికి తగ్గట్లు పశుపాలనకు చెందిన ఉపకరణాలతో అలంకరించారా రెస్టరెంటును.

నేనొక సొంకొచొ సూప్ ఆర్డర్ చేశాను. సూపంటున్నారే కానీ అది పూర్తి భోజనం. ఒక గిన్నెలో మొక్కజొన్న గింజలు–చికెన్ తునకలు కలగలసిన బంగాళాదుంప సూపు; మరో గిన్నెలో చిన్న అన్నం ముద్ద, కోడి పొట్టభాగం, కర్ర పెండలం ముక్క; వెరసి పరిపూర్ణ భోజనం. ఖరీదు నలభై వేల పెసోలు. అంటే తొమ్మిది డాలర్లన్నమాట. పర్లేదనిపించింది. కానీ లులొ (Lulo) అన్న పళ్ళరసం మాత్రం ముప్ఫై ఐదువేల పెసోలు! అది ఆ ప్రాంతానికే చెందిన విశిష్ట ఫలమట. మధ్య అమెరికాలో దాని పేరు నారాన్హీయా (Naranjilla). రుచిలో కివీ, నిమ్మ, పైనాపిల్ కలగలసినట్లు అనిపిస్తుంది. చూడగానే మన నారింజ గుర్తుకొచ్చింది.

ఉప్పు స్ఫటికాలలో తొలిచిన సిపాకీరా కథెడ్రల్ కొలంబియా దేశపు వింతల్లో ఒకటి. ఆ రాతి ఉప్పు గనుల్లో మొట్టమొదట పనిచేసినవాళ్ళు అక్కడి సొరంగాలలో ప్రార్థనా మందిరాన్ని తొలిచి దానిని సెయింట్ రొసారియోకు అంకితం చేశారు. ఈ రొసారియో అన్న సెయింటు గనికార్మికుల రక్షక దూత. ఈ మధ్య 1990లో ఆ భూగర్భగనుల్లో ఒక కథెడ్రల్ కూడా ‘నిర్మించారు’. ఆ కథెడ్రల్‌కు తీసుకు వెళ్ళి గంటసేపు వివరించే గైడెడ్ టూర్లో చేరాను. కథెడ్రల్ ముఖ్యబిందువు చేరుకొనేలోగా మేమంతా పధ్నాలుగు వెలుగు నిండిన చిరు ఆవరణలు చూసుకుంటూ వెళ్ళాం. సిలువను మోస్తూ వెళ్ళి చివరన ఏసుక్రీస్తు సిలువ ఎక్కిన ప్రక్రియలో పధ్నాలుగు ముఖ్యఘట్టాలున్నాయట. ఈ రాతి ఉప్పుగనిలోని కథెడ్రల్ ఆ పధ్నాలుగు ఘట్టాల ప్రతీకలుగా ఆ ఆవరణలను పొందుపరచుకొందన్నమాట. భూతలానికి నూట ఎనభై మీటర్ల దిగువన అంత చక్కని కథెడ్రల్ నిర్మింపబడటం మనకు అబ్బురం కలిగిస్తుంది. సహజంగానే ఆ నిర్మాణపు గోడలన్నీ అర్ధపారదర్శకత కలిగిన ఉప్పు గోడలు.

ఆ కథెడ్రల్‌ను చూసినప్పుడు నాకు గతంలో పోలెండ్ లోని వియెలీజ్కా (Wieliczka) ఉప్పు గనుల్లో చూసిన కథెడ్రల్ గుర్తొచ్చింది. మా గైడ్ కూడా ప్రపంచంలో ఇలాంటి మరి ఒక గని–కథెడ్రల్ ఉన్నది పోలెండ్ లోనే అని చెప్పనే చెప్పాడు. అలాగే నేను పాకిస్తాన్ దేశంలోని పంజాబు రాష్ట్రపు ఖెర్వా పట్టణంలోని ఉప్పుగనుల్లోకి వెళ్ళి చూసిన జ్ఞాపకాలూ ముసురుకున్నాయి. లక్షలాది సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాలన్నీ సముద్రగర్భాలట. నేను చూసిన మూడు గనుల్లోనూ చక్కటి కళాకృతులున్నాయి. రాతి ఉప్పు శిల్పాలు మలచడానికి ఎంతో అనువైన పదార్థమట.


బొగొతా వెళ్ళి మొన్సెర్రాతె (Monserrate) పర్వతం చూడకుండా వచ్చినట్టయితే ఆ యాత్ర యాత్రే కాదు అన్నది అక్కడ బాగా ప్రచారంలో ఉన్న మాట. మర్నాడు ఉదయం ఆ 3170 మీటర్ల పర్వతం చూసి రావడానికి బయల్దేరాను. అది బొగొతా నగరపు శివార్లలోనే ఉంది – పధ్నాలుగు కిలోమీటర్లు. కేబుల్ కారు, పైనుంచి పట్టాల మీదుగా లాగబడే ఫనిక్యులర్, కాలిబాట – ఇవీ కొండపైకి చేరడానికి ఉన్న మూడు మార్గాలు. నేను ఆ మూడు కిలోమీటర్ల నడకకే ఓటు వేశాను. ఎత్తు ఎక్కాలి గదా – గంటంబావు పట్టింది. ఆ ఉదయమే కాస్తంత వాన పడింది. అంచేత పరిసరాలు పచ్చపచ్చగా, తాజాతాజాగా ఉన్నాయి. ఆహ్లాదం కలిగించాయి. దారిలో ఎన్నో విస్టా పాయింట్లు ఉన్నాయి. దిగువనున్న దృశ్యాలను చక్కగా చూసుకుంటూ వెళ్ళాను.

అలా వెళుతున్నప్పుడు దారిలో ఆంథోనీ నీతో అనే గాయకుని కుటుంబం తటస్థపడింది. వాళ్ళ పన్నెండేళ్ళ అమ్మాయి లతీసియాతో ముందు మాట కలిసింది. ఆ పాపకు ఇంగ్లీషు తెలుసు. మా అందరి మధ్య సంభాషణ సులువుగా సాగడానికి అది సాయపడింది. ఈ ఆంథోనీ స్థానికంగా కాస్తంత పేరున్న గాయకుడిలా కనిపించాడు. తనకో బృందం ఉందట. కచేరీలు చేస్తాడట. ఫంక్షన్లలో పాడతాడట. తన కార్డు నాకిచ్చి యూట్యూబులో పాటలు వినమన్నాడు.

లతీసియాకు నాతో మాట్లాడటం ద్వారా తన ఇంగ్లీషును సాధన చేసుకోవాలని ఉంది. నేను సంతోషంగా అంగీకరించాను. నాతో మాట్లాడటమే కాకుండా నాకూ తన తలిదండ్రులకూ మధ్య దుబాసీగా వ్యవహరించింది లతీసియా. అలా వాళ్ళతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళడంవల్ల నాకు శ్రమ తెలియలేదు.

చివరికి శిఖరం చేరాం. దిగువన విశాలంగా పరచుకొన్న బొగొతా నగర సుందరరూపం కన్నార్పకుండా చూశాం. పక్కన ఉన్న మరో కొండమీద చేతులు చాచి నిలచిన ఏసుక్రీస్తు విగ్రహం… శిఖరం మీదనుంచి దిగేటపుడు కేబుల్ కారు తీసుకున్నాను. ఈ లోగా వర్షం పడి వాతావరణాన్ని మరికాస్త సుఖవంతం చేసింది.

దిగాక ఊబర్ తీసుకుని సాన్తాన్దేర్ (Santander) కూడలి చేరుకున్నాను. అక్కడ ఉన్న ఎమరాల్డ్ మ్యూజియమ్ – పచ్చల ప్రదర్శనశాల – చూడాలన్నది నా కోరిక. అది చిన్న మ్యూజియమే అయినా గనులలోంచి పచ్చలను వెలికి తీయడం, తీశాక వాటిని శుభ్రపరచి మెరుగుపెట్టడం అన్న విషయాలమీద స్పష్టమైన అవగాహన కలిగించింది. గనులలోని వాతావరణాన్ని తలపించే ప్రతికృతులను ఆ ప్రదర్శనశాలలో నిలిపారు. గనుల్లో సహజంగా దొరికే రాళ్ళను, ఆ రాళ్ళ మధ్య నరాలలాగా సాగే పచ్చల పోగులనూ కూడా పొందుపరచారు. ఈ పోగులలోనే పచ్చలూ, క్వార్జ్ స్ఫటికాలూ ‘దాగి’ ఉంటాయట.

అక్కడి రెనాతో అన్న గైడు నాకు మ్యూజియమంతా తిప్పి చూపించాడు. నిజానికి అది ఇరవై నిముషాలపాటు ఇంగ్లీషులో సాగే గైడెడ్ గ్రూప్ టూరు. కానీ ఆ సమయంలో నేను తప్ప మరో విజిటరు లేడు. అంచేత అతనూ నేనూ ఇద్దరమే కలసి తిరిగాం. పచ్చల తవ్వకం భారతదేశంతో సహా ఎన్నో దేశాలలో సాగుతోన్న ప్రక్రియ అయినా కొలంబియాలో దొరికే పచ్చలు అత్యంత నాణ్యమైనవి అని వివరించాడు రెనాతో. అలాగే పచ్చల తవ్వకానికి చెందిన వివరాలూ అందించాడాయన. కొలంబియా భూగర్భంలోని ప్రత్యేక పరిస్థితులవల్ల అక్కడ దొరికే పచ్చల నాణ్యత ఉన్నత స్థాయికి చెందినది అన్నాడు. పచ్చల నాణ్యతను అంచనా వేసే ప్రాథమిక సూత్రాలూ చెప్పాడు రెనాతో. స్వచ్ఛమైన పచ్చలు అంటూ ఉండవని, వాటిలో ఏవో కొన్ని మలినాలు కలసి ఉంటాయనీ, నాణ్యత విషయంలో వాటి రంగూ పారదర్శకతా ముఖ్యమైన పాత్ర వహిస్తాయనీ వివరించాడు.

నా మ్యూజియమ్ టూరు అక్కడి పచ్చల దుకాణం దగ్గర ముగిసింది. నా కంటికి నదురుగా కనిపించిన ఓ పచ్చల నెక్లెసూ చెవి రింగులకేసి చూపించి వాటి ధర అడిగాను. ఇరవై ఆరు కోట్ల పెసోలు అని చెప్పింది అక్కడి మహిళ. డాలర్లలో ఎంతా అని అడిగితే ‘అరవై వేలు, ఇరవై శాతం డిస్కౌంటు, వెరసి నలభై ఎనిమిదివేలు… మీరు తీసుకుంటానంటే నలభై ఐదుకే ఇవ్వగలను’ అన్న చల్లని మాట చెప్పిందావిడ. అది విన్నాక ఆ బేరానికీ ఆ పచ్చల ప్రదర్శనశాలకూ గుడ్ బై చెప్పే సమయం వచ్చింది అని నాకు స్పష్టమయింది.

నగరపు కేంద్రబిందువయిన బొలీవార్ ప్లాజా ఉన్న కాన్దెలారియా ప్రాంతం బొగొతా నగరానికి జీవనాడి అని చెప్పవచ్చు. జీవనాడి అన్న తర్వాత మ్యూరల్స్ ఉంటాయి కదా – వీధులన్నీ వర్ణచిత్రాల మయం. కొన్ని విప్పి చెబితే తప్ప అర్థంగాని అధివాస్తవిక చిత్రాలు. అలాంటి వీధి చిత్రాలంటే ఆసక్తి ఉన్న వారి కోసం ప్రత్యేకంగా గ్రఫీటీ టూర్స్ నిర్వహిస్తారని తెలిసింది.

బొలీవార్ ప్లాజాలో ఉన్న ల పుఎర్త దె ల కథెడ్రాల్ అన్న రెస్టరెంటు చక్కటి భోజనానికి ప్రసిద్ధి అని తెలిసింది. మధ్యాహ్నం నేను భోజనం చేసిన ల పుఎర్త ఫల్సా రెస్టరెంటుకు బాగా దగ్గరలోనే ఉంది ఈ కథెడ్రల్ రెస్టరెంటు. వంటకాలు కూడా అక్కడి బాణీవే. మధ్యాహ్నం ల ఫల్సాలో తెప్పించినట్టే డిన్నరుకు కూడా తమాలె, చొక్లాతే కోన్ కేసో ఆర్డర్ చేసాను. దక్షిణ అమెరికాలో అదే నా చిట్టచివరి భోజనమన్నమాట.

పక్క టేబులు దగ్గర కొలంబియన్ టోపీలు పెట్టుకుని కోలాహలం చేస్తోన్న భారతీయుల బృందం కనిపించింది. వాళ్ళు మాట్లాడుతోన్న భాష తెలిసినట్టు ఉందే అనిపించి అటు ఒక చెవి వేశాను. తెలిసినట్టే ఏవిటీ – అది తెలుగు భాషే! భోజనం ముగించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించాను. వాళ్ళంతా తెలుగు రాష్ట్రాలనుంచి వచ్చి ప్రస్తుతం వాషింగ్టన్ డి.సి.లో స్థిరపడ్డారట. కొలంబియా లాంటి దూరదేశంలో కాసేపు గలగలా తెలుగు మాట్లాడగలగడం సంతోషం కలిగించింది. మధ్యాహ్నం వెంకట్రావు – భానుమతి దంపతులు, ఇపుడు ఈ వాషింగ్టన్ బృందం…
కొలంబియాకు గుడ్‌బై చెప్పే సమయం వచ్చేసింది.


బొగొతా నుంచి లండన్‌కు నాది అర్ధరాత్రి ఫ్లైటు. విమానం ఎక్కాక నిద్రపోదామని ప్రయత్నించానుగానీ పడలేదు. గత పదహారురోజులు ఎంత త్వరగా గడిచిపోయాయా అనిపించింది. ఎక్వదోర్ కొలంబియా దేశాలలో ఆ చివరినుంచి ఈ చివరిదాకా తిరిగాను; నిర్విరామంగా తిరిగాను; మనుషులు, ప్రదేశాలు, ప్రాంతాలు, నగరాలు, అనేకానేక అనుభవాలు… అవన్నీ మనసులో ఏదో సినిమా రీళ్ళలా తిరగసాగాయి. కీతోనుంచి బొగొతా దాకా ఎన్నెన్ని జ్ఞాపకాలు… వలసకాలపు వాస్తురీతితో కూడిన కీతో, క్వెన్క, గుయాకీల్, కార్తహేన, మెదెయీన్, బొగొతా; భూమధ్యరేఖలాంటి భౌగోళిక విశేషాలు; ఒకప్పటి విపణి వీధులను కళ్ళకు కట్టిన ఒతావలో పట్టణం; వాతాపె, గ్వాతెపె లాంటి మారుమూల పట్టణాలలో స్థానికుల సంపర్కం; జ్వాలాముఖుల తోరణమాల; కొతోపాక్సీ నేషనల్ పార్క్ పర్యటన; పిచించా అగ్నిపర్వతానికి ట్రెక్కింగు; గ్వాతవీత, కుయికొచ సరోవరాలు; మనుషులకు భయపడాలనే తెలియని గలాపగోస్ జీవజాలం; మనిషి అడుగుపడని స్వచ్ఛమైన ప్రకృతి; మానవ భస్మాసుర పాదాల క్రింద నలిగిన ఆధునిక నగరాలు – ఎన్ని అనుభవాలు!

ఈ రెండు దక్షిణ అమెరికా దేశాలలోనూ మరికొన్ని పొరుగుదేశాలలోనూ ఈనాటికీ ఆరాధించే సిమోన్ బొలీవార్ గురించి బాగా తెలుసుకోగలిగాను. అప్పటిదాకా పుస్తకాలూ టీవీల ద్వారా మాత్రమే తెలిసిన ఫాన్ హమ్‌బోల్ట్ కార్యక్షేత్రంలో తిరుగాడగలిగాను. టీనేజి దశలో పరిచయమై ప్రభావితం చేసిన ఛాల్స్ డార్విన్ నడిచిన భూమిని ముద్దాడగలిగాను. అలాగే అప్పటిదాకా నాకు తెలిసీ తెలియని సమకాలీన శిల్పి-చిత్రకారుడు ఫెర్నాండో బొతేరే పరిచయమయ్యాడు. మానవతావాది సాన్ పెద్రో క్లెవేర్ నల్ల బానిసల శ్రేయస్సు కోసం చేసిన కృషి గురించి తెలుసుకోగలిగాను. ఇన్కా సామ్రాజ్యపు అధినేతలు వాయ్ న కపాక్, అతవాల్ప ఈ యాత్ర వల్ల నాకు దగ్గర అయ్యారు.

ప్రయాణాలంటే మనుషులే అని నేను బలంగా నమ్ముతాను. నేనెరుగని నాలాంటి మనుషుల కోసం నా మనసు నాకు తెలియకుండానే ప్రపంచమంతటా వెతుకుతూ ఉంటుంది. అందుకు తగ్గట్టే అపురూప మానవ సంపర్కాలు తరచూ నాకు కలుగుతూ ఉంటాయి. అందుకు ఈ దక్షిణ అమెరికా దేశాలూ మినహాయింపు కాదు. ప్రముఖులూ చారిత్రక పురుషుల గురించి తెలుసుకోవడం, వాళ్ళు తిరుగాడిన నేల మీద తిరగడం – ఇదే గాకుండా ఈ ప్రయాణంలో నాకు తటస్థపడి నా జ్ఞాపకాలలో నిలచిపోయిన సాధారణ వ్యక్తులు ఎంతమందో ఉన్నారు. వారి స్నేహం, సౌభ్రాతృత్వం, అవసరమయినపుడు అందించిన చేయూత – ఇవి తలచుకున్నప్పుడల్లా నన్ను సంతోషపరుస్తాయి.

దక్షిణ అమెరికా ప్రయాణం మొదలెట్టినపుడు బొగొతా విమానంలో కలసిన, షామనిజాన్ని అనుసరించే గుస్తావొ; ఒతవాలో అన్న విపణి నగరంలో తటస్థ పడిన ఫ్రాన్సిస్కో; పిచించా అగ్నిపర్వతం ట్రెక్కులో అపురూపమైన సాహచర్యం చవిచూపిన హోసె, మాజోలు; కొతోపాక్సీ నేషనల్ పార్కులో మాకు గైడుగా వ్యవహరించిన ఆంద్రియా; నా గుయాకీల్ జ్ఞాపకాలలో ప్రముఖంగా నిలచిపోయిన వాకీన్, స్తెఫానియా అన్న యువ జంట; గలాపగోస్ ద్వీపాల యాత్రను ఫలవంతం చేసిన మిగేల్, ఆన్హేలో, దియానాలు; కార్తహేన నగరపు మొరీసియో; మెదెయీన్లో కలసిన కార్మెన్, కార్లోస్‌లు; వాతాపెలో స్నేహం అందించిన ఎస్టెఫాని; గ్వాతవీతలో అనుకోకుండా కనిపించి పలకరించిన వెంకట్రావు – భానుమతి దంపతులు; బొగొతా నగరపు పాబ్లో ఫ్లొరేస్, లతీసియా, ఆంథోనీలు – వీరంతా లేకపోతే అసలు యాత్రే లేదు. మళ్ళా వీళ్ళెవర్నీ నేను కలుసుకోకపోవచ్చు – కానీ వాళ్ళ జ్ఞాపకాలు మనసులో పదిలంగా పది కాలాలు నిలుస్తాయి. వీళ్ళూ, వీళ్ళతోపాటు నేను కలసిన ఇంకా ఎంతోమంది వ్యక్తులు – వీరంతా సాధారణమైన మనుషులే కావచ్చు. తమ తమ నిత్య జీవితాలలో కోట్లాదిమంది మనుషుల్లా తలమునకలవుతున్నవారే కావచ్చు. కానీ వీరితో నాకు సారూప్యముంది. వాళ్ళూ నేనూ వేరు కాదన్న భావన నాకుంది. అంచేత వాళ్ళందరినీ పలకరించడం, పలకరించి మాట్లాడడం నాకు ఎంతో సహజంగా జరిగిపోతాయి. భాష, జాతి, సంస్కృతిలాంటివి ఏవీ అందుకు అడ్డం రావు. తెలుసుకోగలగాలేగానీ ప్రతి మనిషీ ఒక నడిచే పుస్తకం. ఎన్నో కథలూ గాథలూ నిండి ఉన్న పుస్తకం. వినగలిగితే అవన్నీ మనకు చేరతాయి. మళ్ళా ఆ కథలేమీ అద్భుతాలతో నిండినవిగాకపోవచ్చు. అతి సామాన్యమైన దైనందిన గాథలు కావచ్చు. కానీ అవి ‘మనిషి’ చెప్పే కథలు. పుట్టుకథలు. కల్పించి చెప్పే కట్టుకథలు కావు.

మధ్య అమెరికాలోనూ, దక్షిణ అమెరికాలోనూ అంతా కలసి ఐదు వారాలు గడపడంవల్ల స్థానిక చరిత్రతో కాస్తంత పరిచయం ఏర్పడింది. మూలవాసులు, వలసవాసులు, ఆక్రమణదారులు, బానిసలుగా తీసుకురాబడినవారు క్రమపరిణామాలకు గురియై ఆ ప్రాంతాలకే ప్రత్యేకమైన మిశ్రమ సంస్కృతిని రూపొందించుకొన్న విధానాన్ని గమనించాను. ఆయా ప్రదేశాల భౌగోళిక పరిస్థితులు అక్కడి వారిమీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయో, ప్రజాజీవితాన్ని ఎలా మలచుతున్నాయో తెలుసుకోగలిగాను. లాటిన్ అమెరికా దేశాలకు వెళ్ళాలి అన్న ఆలోచన వెనుక నాకు ఉన్న ముఖ్యకారణం అక్కడ మధ్య యుగాలలో యూరోపియన్లు ఆక్రమించకముందు వికసించి విలసిల్లిన మాయన్, ఇన్కా లాంటి నాగరికతలతో కాస్తంత పరిచయం చేసుకోవడం. 2011లో మెహికొ దేశపు యుకతాన్ (Yucatan) ద్వీపకల్పంలోని మాయన్ నాగరికతా అవశేషాలు చూసినపుడు ఆ కోరిక నాలో బీజంగా మొలకెత్తింది. అప్పటి ఆ కోరిక తీరడానికి పదీ పన్నెండేళ్ళు పట్టింది. ఈ ప్రయాణం నేను ఇన్కా సామ్రాజ్యపు లోలోపలికి వెళ్ళే అవకాశం ఇచ్చింది. ఇన్కా నాగరికతకన్నా ముందటి రోజులలోకీ ఒక చూపు చూసే అవకాశమూ నాకు కలిగింది. ఈ ప్రయాణం తర్వాత నా ఇన్కా అన్వేషణను ఇంకా కొనసాగించాలని, ఆ నాగరికత ఛాయలు ప్రస్ఫుటంగా కనిపించే పెరు, బొలీవియా, దేశాలు కూడా వెళ్ళి రావాలనీ బలంగా అనిపిస్తోంది. తప్పకుండా ఆ పని చేస్తాను. అలాగే లాటిన్ అమెరికా దేశాలలో మాయన్, ఇన్కా లాంటి బలమైన ప్రీ కొలంబియన్ నాగరికతలే కాకుండా ముయిస్కాలాంటి అంతగా అట్టహాసాలు లేని స్థానిక సంస్కృతులు, నాగరికతలూ కూడా ఉండేవన్న స్పృహ ఈ యాత్ర నాకు కలిగించింది.

ఐదు వారాలపాటు ఒకదాని తర్వాత ఒకటి మనసులో చేరి పోగుబడిపోయిన అనుభవాలను ఒక్కసారిగా జీర్ణించుకోలేం కదా – వాటిని ఇంకించుకుని అక్షరరూపం ఇవ్వడానికి సమయం పట్టింది. 2022 నాటి మధ్య అమెరికా అనుభవాలగురించి 2023లో రాశాను. 2023 ఫిబ్రవరిలో చేసిన దక్షిణ అమెరికా యాత్ర గురించి 2024లో రాశాను. ఆయా యాత్రలు చేసే సమయంలో ప్రతిరోజూ ముఖ్యమైన విషయాలు నోట్సు రాసుకున్నాను. ఫోటోలు తీయడం సరేసరి. ఇవన్నీ నేను యాత్ర గురించి రాయడానికి కూర్చున్నప్పుడు బాగా ఉపయోగపడ్డాయి.

కొంతమంది స్నేహితులు అడుగుతూ ఉంటారు: మరో మనిషి తోడు లేకుండా అంతటి దూరాలు, అన్నన్ని దేశాలు – అందులోనూ ప్రమాదకరమైనవిగా పేరు పడ్డ దేశాలు, ఎలా వెళ్లగలుగుతున్నావూ? ఎలా సాధ్యమవుతుందీ? ఇవి నేను తరచూ ఎదుర్కొనే ప్రశ్నలు. నా వరకూ నాకు తోడు లేకపోవడం అన్నది సమస్యే గాదు. ఏయే దేశాలలో ఏయే ప్రదేశాలలో నేను ఎవరెవరిని కలుస్తానో వారే నాకు తోడు. వారే నాకు నీడ. ఈ మాట నా విషయంలో ఎన్నోసార్లు ఋజువయింది. మన మిథ్యావిలువలను, సంకుచిత సంస్కారాలను, ఎగసిపడే అహంకారాలనూ జీర్ణవస్త్రాల్లాగా విడిచిపెట్టగలిగితే ఈ ప్రపంచమంతా మనదే. వసుధైక కుటుంబకం అన్నది మిథ్యానినాదం కానేకాదు.

దక్షిణ అమెరికాలో తిరిగిన పదహారు రోజులూ నా వృత్తి వ్యాపకాల గురించి ఆలోచించలేదు. ఉద్యోగం, కుటుంబం, బాధ్యతలు, ఆ బరువులు – ఆ ఆలోచనలను దగ్గరికి రానివ్వలేదు. ప్రయాణాల విషయంలో నా అవసరాలను గుర్తెరిగి సహకరించే కుటుంబం ఉండటం నాకు దక్కిన వరం. ప్రతిరోజూ ఇంటికి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నదీ ఎలా ఉన్నదీ చెప్పడం నాకు అలవాటు. ఉద్యోగం, వృత్తి విషయాల్లో వాటికీ నా ప్రయాణాలకు మధ్యన ఘర్షణ లేకుండా చూసుకునే నేర్పు నాకు కాలక్రమేణా అబ్బింది. అంచేత ఆ ఇబ్బంది లేదు.

ఇంత స్పష్టత ఉన్నా ఒకోసారి నా మనసే రెండు వర్గాలుగా చీలిపోయి, నన్ను నిలదీస్తుంది. ఉద్యోగ బాధ్యతలూ కుటుంబ అవసరాలనుంచి వారాల తరబడి దూరంగా వెళ్ళడం ఎంతవరకూ సమంజసం అని ఒక వర్గం ప్రశ్నిస్తుంది. అసలు యాత్రాపిపాసలాంటి వాటిని పెంచి పోషించుకోకపోతే నవయుగపు దైనందిన జీవితం మనిషిని పిచ్చివాడ్ని చేస్తుంది. జీవితం సరళంగా సంతృప్తికరంగా సాగాలంటే ఇలాంటి ఆసక్తులూ పిపాసలూ ఎంతో అవసరం అంటుంది రెండో వర్గం. ఏదేమైనా ప్రయాణాలు లేకుండా నేను బ్రతకలేను. అవి నన్ను ఉత్సాహపరుస్తాయి. తృప్తి కలిగిస్తాయి. లోకజ్ఞానంతోపాటు ఆత్మజ్ఞానమూ కలిగిస్తాయి. ఇంకా చెప్పాలంటే పరిసర ప్రపంచంలోకి, నాలోకీ నేను చేసే తీర్థయాత్రలే నా ప్రయాణాలు.

సోలో ప్రయాణం గురించి మరి రెండు మాటలు. శ్రమపరంగా ఏకాంత ప్రయాణాలు కఠోరం. కొంతమంది అంటుంటారు కదా, నేను రోజుకు పద్ధెనిమిది గంటలు పని చేస్తాను అని… ఏకాంత యాత్రల్లో నేను చేసేదీ అదే పని – రోజుకు 18 గంటలు. అన్నన్ని గంటలు ‘పని’ చేసినా నేను అలసిపోను. ఆ పనిలోనే విశ్రాంతి పొందుతాను. ఏకాంతం అనుభవిస్తాను. నాలోకి నేను తొంగి చూసుకుంటాను. నాలోని బలాబలాలను అంచనా వేసుకోగలుగుతాను. బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తాను. వెరసి సోలో యాత్రలు నన్ను మరికాస్త మెరుగైన, ఆరోగ్యవంతమైన, సంతృప్తి నిండిన మనిషిగా మలుస్తోన్న సంగతి నేను గమనించాను; నిజజీవితం లోని బాధ్యతలు, సవాళ్ళను ఎదుర్కొనే శక్తిని ఈ సోలో యాత్రలు అందించడం నాకు తెలిసి వచ్చింది.

మనసు తరచూ మరో ప్రశ్న వేస్తుంది. నీ యాత్రల కోసం వెచ్చించే సమయం, ధనం సంగతేమిటి? అది సరి అయిన ఖర్చేనా? ఈ ప్రశ్నకు నాలోని అనుభూతి కేంద్రితమైన మనసిచ్చే జవాబు – ఖర్చులూ ఫలితాల సంగతి నాకు అనవసరం. చెప్పాలంటే అది అర్థవంతమైన జీవితం కోసం నేను పెడుతోన్న పెట్టుబడి. ఏదో సాధించాలని నేను ప్రయాణం చెయ్యడం లేదు. ప్రయాణమే నా జీవితం కాబట్టి ప్రయాణాలు చేస్తున్నాను. జీవించడానికి నాకు తెలిసిన ఒకే ఒక మార్గం ప్రయాణం…

(సమాప్తం)