అమృతం గమయ

కావలించుకునే
ముందర
కాస్తంత దూరంగా ఉండడం
మంచిది
వాడికి ఒక కన్ను ఎక్కువ!

గుంపులు తిరిగేవేళ
భంగుతాగి
చిందులు వెయ్యకు

బుడబుడక్కులవాడి చప్పుళ్ళు
తిరిపమెత్తే పాట
అంతా శబ్దరత్నాకరమే

పెణక మీదకి పాకిన
ఆనప తీగ
ముచిక ఊడి
జరజరా
మేక అరుపు
వినబడుతోందా?

పానవట్టం మీద
కిందనుంచి పైకి
పైనుంచి కిందికి
నీటి ఉత్థానపతనం

ప్రేమించడానికి పువ్వులెందుకు?
ఒంటినిండా దండలెందుకు?

గాలికి చెదిరిన బట్టలు
గగుర్పొడిచే దేహం
పెళ్ళగించిన నేల
ఉమ్మగిల్లిన చాన

కట్టె ఎంత కాలినా
చల్లబడుతుంది బూడిద
ఒంటినిండా రాసుకో
మృత్యువెక్కడో లేదు,

మృత్యువెక్కడ లేదు?