అది ఖుదాగవా పాటల కెసెట్టా లేదా ముఖేష్ వాల్యూమ్ వన్ కెసెట్టా అని నాకు ఇప్పటికీ అనుమానమే. అనగా నేను నా స్వహస్తాలతో నా జేబులోని డబ్బులతో కొనుక్కున్న మొదటి ఆడియో కెసెట్ గురించి చెబుతున్నానన్నమాట. మా నంద్యాల ఖలీల్ టాకీస్ కాంపౌండ్ కాంప్లెక్స్ అవుట్‌సైడ్‌లో రెండు షాపులు ఉండేవి. అందున ఒకటి ఆడియో కెసెట్స్‌ది. అక్కడ కొన్న నా మొదటి కెసెట్ ముఖేష్‌ది. పాట వెనుక పాటగా ఒకే వరుసన పదకొండు ముఖేష్ పాటలు వినడం కూడా అదే మొదటిసారి. నా అభిమాన గాయకులు ముఖేష్‌గారి బొమ్మ చూడటం కూడా అక్కడే. ఆ కెసెట్ కవరుపై రంగుల్లో అచ్చయిన ఆయన బొమ్మ. కెసెట్ ప్లే చేస్తే పాటకూ పాటకూ మధ్య అమీన్ సయాని కామెంటరీ.
ట్రాజెడీ ఏమిటంటే ముఖేష్‌ని పలవరించి, పరితపించి డబ్బు కూడపెట్టుకుని మరీ కొనుక్కున ఆ పాటల కేసెట్ ముఖేష్‌ది కానే కాదు మరి. పత్రికా ప్రకటనల్లోని షరతులు వర్తిస్తాయి అనే నక్షత్రం పక్కన చీమతలకాయలంత అక్షరాల మాదిరిని కెసెట్ అడుగున సింగర్: బన్సీ తివారి అని ఉంది. చదువూ అదీ సరిగ్గా అబ్బకపోవడం వలన కెసెట్ కవర్ మీద సాహిత్యం అంతా చదవకుండా పెద్దక్షరాల ముఖేష్ అనే పేరు, ఆయన ఫోటో చూసి, ప్రేమించి కొన్న కెసెట్ అది. తీరా టేప్ రికార్డర్ పెట్టి ప్లే నొక్కగానే ‘బెహనో ఔర్ భాయియో! ముఖేష్ కో ఐసే చాహ్నేవాలే బన్సీ తివారికే ఆవాజ్ మే సయ్యద్ అలీ కే మ్యూజిక్ అరెంజ్మెంట్ మే సునియే, ఓ జానే వాలే హో సఖేతో…’ అని మతిపోయేట్లుగా మాట్లాడుతున్న అమీన్ సయాని. అలా అని మరీ మతిపోయేంత పనేమీ జరగనే జరగలేదనుకో. లాభాలు నష్టాలు లెక్కలేసుకోవలసినంత అవసరం లేని పజ్జెనిమిదేళ్ల వయసు నాది. నరుడా ఏమి నీ కోరిక అని పాతాళభైరవి అడిగీ అడగక ముందే కాసిన్ని పుస్తకాలు, మూడు పొద్దుల రొట్టెముక్కలు ముఖేష్ పాటలతోడు చాలు అని కోరుదామనుకునే ఆశ తక్కువ ప్రాయం కూడా. ఏమో ఆరోజుల్లో అదే దురాశేమో! అందుకే పాతాళభైరవి పలకలేదేమో!
నేను చదువుకున్న బడి మిట్టలు అనే ప్రాంతంలో ఉంటుంది. బడికి సూటిగా అలా ముందుకు నడిస్తే వచ్చేదీ ఎన్జీవోస్ కాలనీ. కాలనీలోకి అడుగుపెట్టగానే ఎడమవైపు ఒక పోస్ట్ డబ్బా కనపడుతుంది. ఆ పోస్ట్ డబ్బాని ఆనుకున్న ఇంటిలో నా క్లాస్మేట్ విజయరాజ్, వాడి పక్కింటిలో కవిత అని ఇంకో క్లాస్మేట్ ఉండేవారు. పోస్ట్ డబ్బాకు ఎదురు వీధిలో అడుగుపెట్టి కాస్త నడిస్తే కుడివైపు రోడ్డులో ఉండేది నేను మససుపడ్డ ఒక ఇల్లు. మా ఫ్రెండ్ వీరేష్ ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇంటి మీదుగానే వెళ్ళాలి. (వీరేష్ అంటే నా చిన్ననాటి ఫ్రెండ్. హైస్కూల్ రోజుల్లోనే ఎనిమిదో తరగతి వయసు వచ్చేసరికే వాడు చనిపోయాడు. ‘నా’ అనుకునే స్నేహితులలో వాడిదే మొదటి మరణం. మా ఇంటికి ఆనుకుని ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్‌లో ఎర్రగాజుల వీరమ్మ అనే విప్లవ పుస్తకం చదివి, వాడిని ఎర్రగాజుల వీరమ్మ అని అడ్డపేరు పెట్టి పిలిచినా ఏమీ అనేవాడు కాదు.) ఆ దారిలోనే మూలమఠం, చెరువుకట్ట, ఎస్‌బిఐ కాలనీకి వెళ్ళే దారి ఇవన్నీ అటే తగిలేవి. మా చిన్నప్పుడు ఆ రోడ్లన్నీ ఖాళీగా చల్లగా గాలిగా ఆకాశం అంత బయలుగా ఉండేవి. ఇప్పుడు ఎన్జీవోస్ కాలని అంతా రొంప రొంపగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. హాయిగా చల్లబడ్డ పూరీలోకి ఉర్లగడ్డ, ఉల్లిపాయ కూర తిన్న తడికల హోటల్ జాడలు ఎక్కడా లేవు. అంతా చైనీస్ ఫాస్ట్‌పుడ్ వాసన. నూనెపల్లి నిండా ఇప్పుడు వెగటు వాసన. ఎక్కడెక్కడి మాండలికపు మనుషులంతా వచ్చి ఊరంతా నానా జిడ్డుగా అయిజేశారు. ‘బొత్తిగా ఆరోగ్యం బావుండటం లేదు బ్రో’ అనే సంకరమాటలు ఊరి చెవులను ఆక్రమించేశాయి. ‘పేణం బాలేదు రా నారపరెడ్డి’ అనే పలుకులు చచ్చిపోయినాయి.
ఆ నా పాతరోజుల్లో ఆ కాలనీలో నేను మనసు పడ్డ ఇల్లు ఒకటి ఉండేదని చెప్పాగా. అది సున్నపు రంగుది. ఊదా రంగులో కాసింత ముసురు ఆకాశపు రంగు కలిపి తెచ్చిన వర్ణంతో వేసిన కిటికీలు, ద్వారబంధాలు, అదే రంగు కటాంజనం పూవులు పూవులుగా తీగలుగా నిలిపి ఉండేది. ఇంటి ముందు చక్కని ఇంత మాత్రం స్థలంలో చిన్న చిన్న పచ్చని మొక్కలు గాలికి తలాడిస్తూ ఉండేవి. రోడ్డు మీద నిలబడి ఆ ఇంటి వైపు చూస్తే దాని ముందు గది స్పష్టంగా కనబడేది. ఆ గదిలో దీవాన్ వంటి దాని మీద తెల్లని పరుపు, పరుపుపై తెల్ల దిండు. పక్కన ఒక వార్నీష్డ్ చెక్కబల్ల, దానిమీద ఒక ఎర్రని పానాసోనిక్ టేప్ రికార్డర్ కమ్ రేడియో. ఆ ఇంట్లో మనుషులు ఎవరూ కనబడేవారు కాదు. ఆ ఇంటిముందు నిలబడి నేను ఆ టేప్ రికార్డర్ కేసి ఇష్టంగా చూసేవాణ్ణి. మా ఇంట్లో ఉన్నది మర్ఫీ టేప్ రికార్డర్. పానాసోనిక్ అనే కంపెనీ మా మర్ఫీ అంత గొప్పది అవునో కాదో అప్పుడు తెలీదు. పానాసోనిక్‌తో పోల్చుకుంటే మర్ఫీ పెద్దగా మొరటుగా అనిపించేది. అదే పానాసోనిక్ మోడల్ టేప్ రికార్దర్ చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ నంద్యాల పెద్దబజారులో ఒక షాపులో అద్దాల వెనుక కనిపించింది. అయితే ఇది ఎర్రని రంగు కాదు. పిల్ల పెసర లేత రంగు. ముఖ్యంగా అన్నిటి కన్నా నాకు భలే నచ్చేది దాని చౌకం షేప్. నాకు అంత చిన్నప్పటి నుండి కూడా చౌకం ఆకారం అంటే భలే భ్రమత. ఇప్పటికీ నా బొమ్మల్లో చౌకం కాంపొజిషన్ వద్దన్నా తన్నుకు వస్తూనే ఉంటుంది. అటువంటి పాటల పెట్టె ఒకటి అచ్చంగా నాకంటూ కొనుక్కుని ఆ ఎన్జీఓస్ కాలనీ లోని ఇల్లు వంటి ఇల్లు సంపాదించుకుని ఆ ముందు గదిలో ఆ తెల్ల పరుపు మీద పడుకుని పుస్తకాలు చదువుకుంటూ ముఖేష్ పాటలే పాటలు వింటూ ఉండాలని నా కోరిక. వినడానికి గొప్పగా అనిపించని కోరికలు కూడా తీరడానికి జీవితాలు పడతాయని అందుకే మనిషి ఆ కోరికలు తీర్చుకోడానికి మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతాడని నాకపుడు తెలియదు. ఇప్పుడు ఆ విషయం తెలిశాక నా మరుజన్మలో ముఖేష్ కూడా పుడతాడా పుట్టడా అని ఇప్పటి బెంగ.
సంగీతం అంటే, సాహిత్యం అంటే, రాగం అంటే, ముఖేష్ అంటే… ఇవన్నీ తెలీకపోయినా ముఖేష్ అంటే ఎంతో ఇష్టంగా ఉండేది. ఎంత ఇష్టం అంటే నా కొడుక్కి మోహన్ చంద్ర మాధుర్ అని పేరు పెట్టుకోవాలి అనేంతగా ఇష్టం. ఇప్పుడు టేప్ రికార్డర్ అనేది, వాక్‌మన్ అనేది చేతికి చిక్కని జమానా అయిపోయింది. మనుషుల మనసులు ఎంత చిన్నగా అయిపోతున్నాయో మనసుని రంజింప చేసే సాధనాలు అంత చిన్నగా ఉండి తీరాలనే ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాము. ఈ రోజు మొబైల్ ఫోన్‌లో యూట్యూబ్ మ్యూజిక్, సౌండ్ క్లౌడ్, ఆపిల్ మ్యూజిక్ – పేరేమైనా ఏమిలే ముఖేష్ పాటలు వింటుంటే లేని కిక్కు ఒకటి నా పాత కేసెట్‌లలో ఉండేది. ఒక పక్క టేప్ రికార్డర్‌లో పాటలు వస్తూ ఉంటే ఆ పాట అంతా నాలుక మీద ఆడుతూనే ఉండేది. అంతే కాదు పాట ముగిసీ ముగియక మునుపే తదుపరి పాట కూడా పెదాల నుండి బయటకు రావడానికి సిద్దంగా ఉండేది. ఒక్క ముఖేష్ మాత్రమే కాదు. రఫీ, కిషోర్, మన్నాదా, హేమంత్, తలత్ ఇంకా బన్సీ తివారిలవి కూడాను. ఈ నాలుక మీద పాట పలికించే విద్య అలవాటు మప్పిన ఘనత కెసెట్‌లది మాత్రమే. నయా దౌర్ సినిమాలో మాదిరి దూసుకు వచ్చిన నాలుగు చక్రాల వేగము మాదిరి డిజిటల్‌లో చెక్కిన స్వరం ఎందుకో మనసున ఊయలలూగనంటుంది.
మనసు పడి కొనుక్కున పాటల కెసెట్లు గుట్టలుగా పెట్టెలుగా అనాథలుగా అలా పడి ఉంటాయి సైగల్ దగ్గరి నుండి కైలాష్ ఖేర్ వరకు. బన్సీ తివారి దగ్గరి నుండి బబ్లా మెహతా వరకు. అపాచీ ఇండియన్ దగ్గరి నుండి బాబా సెహగల్ వరకు. అలీషా చినాయ్ దగ్గరి నుండి సునీతా రావ్ వరకు. ఇవన్నీ ఏం చేస్తాం? పడేద్దాం అనుకుంటే ముఖేష్ పేరు పెట్టుకోవడం తప్పిపోయిన నా పిల్లవాడు మోహన్ దానికి ఏ మాత్రం ఒప్పుకోడు. ఏదీ పడేయడానికి వీలు లేదంటాడు. పాత కెసెట్ దగ్గరి నుండి నా చిత్తు బొమ్మ వరకు అన్ని వాడివే అంటాడు. వాటిని వాడకపోయినా పర్లా, ఇంట్లో అవి ఉంటే లైఫ్ ఎంత క్లాసిక్కో తెలుస్తుందబ్బా అంటాడు. గత సంవత్సరం ముఖేష్ చంద్ర మాధుర్ శతజయంతి సంవత్సరం. నాకు ఆయనంటే ఎంత ప్రేమ ఉన్నా ఆయన మీద ఏం రాయాలో, రాసుకోవాలో తోచలేదు. ఆయన పాటల గురించి ఏమని రాస్తాను తలకు ఇరుపక్కల ఉన్న డొప్పలతో విన్నదానిని రాస్తాను కానీ, హృదయాన్ని వచ్చి కావలించుకున్న గొంతు గురించి ఏమి రాస్తాను ‘హమ్ ఆజ్ కహీ దిల్ ఖో బైఠే, యూఁ సమ్‌ఝో కిసీకో హో బైఠే’ అని పాటని నేను పాడింది ముఖేశ్ కోసమేనని గొంతు చించుకుని రాద్దామనుకున్నా ఎవరికి అర్థం అవుతుందిలే అనుకుని రాయలా. ఇప్పుడు రాసింది కూడా ముఖేష్ గురించి కాదు మా వీరేష్ గురించి, మా బడికి దగ్గరలో ఉన్న కాలనీ గురించి, అక్కడ నిలబడి కన్న ఒక కల గురించి మాత్రమే. ఇది ఇలా రాస్తున్న రోజు అనుకోకుండా ఆగస్టు ఇరవై ఏడు అయి ఉన్నది. అది ముఖేష్‌గారి వర్ధంతి అయి ఉన్నది.