పన్నీటిచుక్కలు

చిన్నప్పటి అద్దె ఇంట్లో
డాబాపై పడుకుని
నింగికి తెలియకుండా
కొన్ని నక్షత్రాలను
తలగడ కింద దాచేదాన్ని
జాబిలి చూడకుండా
గుప్పెట నిండా
వెన్నెలను నింపుకుని
రుమాలులో మూటగట్టేదాన్ని

పసిదనపు అమాయకత్వాన్ని ఈదుతూ
పెరట్లోని పరిమళాలను
పూల రంగులను
లోపల ఎక్కడ తాళం వేశానో చెప్పను

ముగ్ధరూపపు
ముత్యాల పల్లకిలో కూర్చుని
వాకిట్లో చుక్కలు కలుపుతూ
భవిష్యత్తుకై ముగ్గులు వేశానో
కలలను చిత్రించానో
గుర్తు లేదు

ఇప్పటి వాక్యాల్లో
అప్పటి నక్షత్ర కాంతులు
పూల సుగంధాలు
వెన్నెల మరకలు
కనబడుతున్నాయో లేదో తెలియదు

కానీ
జ్ఞాపకాల పందిరిని కాస్త కదిపినా
ఆనాటి పన్నీటిచుక్కలు
అక్కడక్కడ కాగితంపై
చిందుతాయని మాత్రం చెప్పగలను
ష్…
ఈ రహస్యపు పొట్లాన్ని
ఎవరి దగ్గరా విప్పకండి