విమర్శకుడు

“ఆ తెల్ల గుడ్లగూబను అలా కూరిందెవరు?”
ఆ దుకాణంలో ఎవరూ మాట్లాడలేదు,
క్షురకుడికి తీరిక లేదు, పని కూడా ఆపలేదు;
క్షౌరం కోసం వచ్చిన వాళ్ళంతా వంతుల కోసం వేచిచూస్తూ
దినపత్రికలు చదువుకుంటున్నారు
మొరటుగా అలా అడిగిన ఆ కుర్రాడిని వినిపించుకోలేదు
ఎవరూ తలెత్తలేదు, సలహానూ ఇవ్వలేదు;
క్షురకుడు క్షవరం చేస్తూనే వున్నాడు.

“కనిపించట్లేదా బ్రౌన్?” అసహనంతో అరిచాడా యువకుడు.
“మొత్తం ఎంత ఛండాలంగా వుంది
ఒకో రెక్కా ఎంత వికారంగా వుంది
ఆ తల చూడు ఎంత చదునుగా ఉంది,మెడ క్రిందెంత కిక్కిరిసి ఉంది!
చెప్పాలంటే మొత్తం గుడ్లగూబంతా, ఎంత అసహ్యంగా ఉంది!
ఉన్నమాటే అంటున్నాను; నేను గూబశాస్త్రం చదివినవాణ్ణి.”

“రాత్రింబవళ్ళు ఎన్నో వందల పక్షుల శరీరాలను
కూర్చడం చూస్తూ గడిపాను. తల నుంచి తోక దాకా
సరిగా పక్షిని కూర్చలేని చేతగానితనం
నా దృష్టిని మరల్చలేదు.
మిస్టర్ బ్రౌన్, మిస్టర్ బ్రౌన్!
దయచేసి దాన్ని అక్కడనుండి తీసేయండి.
లేదంటే వూరు వూరంతా మిమ్మల్ని చూసి నవ్విపోతుంది!”
క్షురకుడు పట్టించుకోకుండా తన పని చేసుకుంటూనే ఉన్నాడు.

“నేను గూబలనీ ఇతర రాత్రి పక్షులనీ
అధ్యయనం చేశాను
నాకు తెలిసిందంతా నిజమని మళ్ళీ నీకు చెప్తున్నా
అలా బిగుతుగా కట్టేసిన కాళ్ళతో
ఏ గూబా ఈ ప్రపంచంలో ఎక్కడా వాలలేదు.
ఏ గూబకూ గోళ్ళు అంత వంకరగా ఉండవు
కాళ్ళలా ఏటవాలుగా ఉండవు
ముక్కు అలా పక్కకు ఉండదు
మెడ అలా మెలి తిరిగి ఉండదు
ఆ గూబను కూర్చిన వాడలా చేయకూడదు
ఎందుకంటే పక్షి శాస్త్రం ఒప్పుకోదు.”

“గుడ్లగూబకో బొటనవేలు ఉంటుందనీ
ఐతే అదలా తిరిగి ఉండదని
శరీర శాస్త్రం చెప్తుంది.
పక్షిశాస్త్రం బోధిస్తుంది!
ఎన్నో ఏళ్ళు తెల్ల గుడ్లగూబని అధ్యయనం చేశాను
ఈ డొల్ల పనితనాన్ని చూసి బాధ పడుతున్నాను.

“మిస్టర్ బ్రౌన్, ఇలాటి స్థితిలో ఉన్న పక్షినలా ఉంచడం చూస్తే
నీకు పిచ్చి పట్టిందేమో అని ఆశ్చర్యమేస్తోంది!
ఆ గూబని చూస్తుంటే తలతిరిగి పోతోంది
అలా కూరినవాడికి అసలు కూరడంలో ఓనమాలు వచ్చా అనిపిస్తోంది.”
క్షురకుడు క్షవరం చేస్తూనే ఉన్నాడు.

“ఆ కళ్ళను పరికించి చూడు
ఆశ్చర్యం వేస్తోంది
ఇలా వీటిని తయారుచేసే వారు
ఆ కళ లేని గాజు కళ్ళను చీదరించుకుంటారు
ఆడుబాన్ వాళ్ళు హాహాకారాలు చేస్తారు
జాన్ బరోస్ ఈ చెత్తను చూసి నవ్విపోతాడు
ఆ పక్షిని తీసెయ్ బ్రౌన్
మళ్ళీ ఆ బొమ్మను తిరిగి కూర్పించు!”
క్షురకుడు క్షవరం చేస్తూనే ఉన్నాడు.

“కొంచెం రంపపు పొట్టూ బెరడూ దొరికితే
దీనికన్నా మంచి గూబను నేను చేయగలను
కళ్ళు మూసుకొని కూడా, తెలుసా?
నీలుక్కుపోయున్న ఆ తోలు కన్నా
ఒక పాతటోపీని కూడా
మంచి గూబలా అగుపించేలా చేయగలను,
చూడు, నిజానికి దాని ఒక్క ఈకైనా సహజంగా అనిపిస్తోందా?”

సరిగ్గా అప్పుడే, కనుగుడ్డు కదిపి, తన సహజమైన కదలికతో
చాలా గంభీరంగా తానున్న చోటి నుంచి నడిచి దిగి వచ్చి
తానొక కూర్చిన పక్షి కళేబరమనుకొని
తప్పులు వెదుకుతున్న విమర్శకుడిని
విశ్లేషణాత్మకంగా ఓ చూపు చూసి
తానేదో చెప్తున్నట్లు ఓ ఊళ వేసి ఆ గుడ్లగూబ ఇలా అంది:

“నీ పాండిత్యం ఈ సారి బోర్లా పడింది;
దాన్ని బతికివున్న పక్షుల మీద ప్రయోగించి భంగపడకు,
నేను చెప్తున్నా, నేనొక నిజమైన గుడ్లగూబను, నీవూ ఒక గూబవే.
విమర్శక శిఖామణీ, తమరు దయచేయండి!”
క్షురకుడు క్షవరం చేస్తూనే ఉన్నాడు.

(మూలం: జేమ్స్ థామస్ ఫీల్డ్స్ రాసిన ద ఔల్ క్రిటిక్.)

విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ...