కోనసీమ కథలు: శిరోముండనం

అమ్మకి సీరియస్‌గా ఉందని ఫోన్ రావడంతో హుటాహుటిన ఇండియాకి బయల్దేరాను. అమ్మ నన్ను కలవరిస్తోందని మా చెల్లెలు కాచి చెప్పింది. మూణ్ణెల్ల క్రితమే కుటుంబసమేతంగా అనాతవరం వెళ్ళి రావడంతో ఒక్కణ్ణే బయల్దేరాను.

“ఏజ్ కదా! డాక్టర్లు వారం కంటే బ్రతకడం కష్టం అంటున్నారు. నువ్వు వస్తే పొలాల పేపర్లమీద సంతకాలు పెట్టే పని కూడా వుంది,” అని అన్నయ్య చెప్పాడు.

క్రితం సారి వెళ్ళినప్పుడు పొలాల లావాదేవీల మధ్య మా ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. మా అమ్మ పేరునున్న పొలం మా చెల్లెలు కాచి పేరున రాయిద్దామని అమ్మ కోరిక. అన్నయ్యకి మాత్రం సుతరామూ ఇష్టం లేదు. డబ్బు అవసరం నాకు అంతగా లేదు కాబట్టి అమ్మ ఇష్టం అని చెప్పాను. కాచి పేరునున్న ఆ అయిదెకరాలూ తనకే చెందాలన్నది అన్నయ్య వాదన.

నిజానికి అది అమ్మ పుట్టింటి ఆస్తి. మా అమ్మమ్మ పేర ఆ పొలాలున్నాయి. ఆవిడ పోతూ పోతూ ఎవరికీ తెలియకుండా అమ్మ పేర రాయించింది. అప్పట్లో మా నాన్నకది కంటగింపుగా ఉండేది. బ్రతికున్నన్నాళ్ళూ ఆ పొలం అమ్మేయాలని నాన్న చాలా ప్రయత్నాలు చేశాడు. అమ్మ మొండిగా ఇవ్వలేదు. హఠాత్తుగా నాన్న పోవడంతో ఆ పొలాల గురించి గొడవలు పోయాయి. ఏటా వచ్చే శిస్తుతో రోజులు సాఫీగానే పోతున్నాయి.

అన్నయ్య పేరున అనాతవరంలో పెద్దిల్లు, నాన్న సంపాదించిన ఏడెకరాల కొబ్బరితోట రాస్తానంది. నాకయితే చిల్లి గవ్వ కూడా అవసరం లేదన్నాను. అమ్మమ్మ పేరింటిదని ఆ పొలం కాచికే చెందాలని అమ్మకి బలంగా వుంది. మా అమ్మమ్మ పేరు కామేశ్వరి. అదే పేరు మా చెల్లెలికి పెట్టారు. ఇంట్లో అందరమూ కాచి అనే పిలుస్తాం. అమ్మమ్మ పోయి పాతికేళ్ళు దాటినా మా ఇంట్లో ఆవిడ పేరు నిత్యమూ ఏదో రకంగా మాటల్లో వస్తూనే ఉంటుంది. మా అమ్మమ్మకి అతి శుభ్రం. దానికితోడు చచ్చేటంత చాదస్తం. ఈ రెంటితో ఆవిడ అందర్నీ చంపుకుతినేది.

మా చెల్లెలు కాచికయితే అమ్మమ్మ పేరంటనే చికాకు. అది ఏం చేసినా, మాట్లాడినా – ‘పేరు పెట్టినందుకు అమ్మమ్మ పోలికలు బానే వచ్చాయని,’ అందరూ వేళాకోళం చెయ్యడంతో మరింత ఉడుక్కునేది. మా అమ్మమ్మకి కొడుకులు లేరు. ఇద్దరు కూతుళ్ళలో మా అమ్మ చిన్నది. అమ్మ పెళ్ళవగానే మా తాత పోవడంతో మా పంచన చేరింది. పెద్ద కూతురు ఢిల్లీలో ఉండేది. ఆవిడ అంతగా పట్టించుకోలేదు. మా అమ్మమ్మ పేరున్న పొలం మా అమ్మ పేరున రాయడంతో వాళ్ళకి కోపాలొచ్చి రాకపోకలు పూర్తిగా పోయాయి.

విమానం బొంబాయిలో దిగింది.

కస్టమ్స్ నుండి బయటకొస్తూండగా — “ఏయ్! రామం!” అంటూ ఎవరో పిలవడంతో వెనక్కి తిరిగి చూశాను. ఒకావిడ నాదగ్గరకొచ్చి, “నువ్వు కామేశ్వరిగారి మనవడు రామానివి కదూ? మీది అనాతవరం…” అంటూ ఆవిడ నా మొహంలోకి చూస్తూ అంటే చప్పున ఆవిణ్ణి గుర్తుపట్టాను. “మీరు చంద్రమతి కదూ?”

ఆవిడ నవ్వుతూ – “ఎన్నాళ్ళయ్యిందో మిమ్మల్ని చూసి. నువ్వు రామానివా, కాదా అన్న అనుమానం వచ్చింది. సరేలే కనుక్కుంటే పోలా అని కేకేశాను. నా ఊహ కరక్టే అయ్యింది. నువ్వు చిన్నప్పుడెలా వున్నావో అచ్చం అలాగే ఉన్నావు. ఏ మాత్రం మార్పు లేదు…” అంటూ నన్నొక్క మాటా మాట్లడనివ్వకుండా చెప్పుకుపోతోంది.

చంద్రమతిని చూసి పాతికేళ్ళు పైనే అయ్యింది. నాకంటే పదేళ్ళు పెద్ద. అప్పట్లో వాళ్ళు అనాతవరంలో మా ఇంట్లో అద్దెకుండేవారు. చంద్రమతి నాన్న అమలాపురం కోర్టులో ప్లీడరు గుమాస్తాగా పని చేసేవాడు. అప్పట్లో మా వూరు చుట్టుపక్కల చంద్రమతి గురించి తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే అమలాపురంలో ఉండే ఒక మెడికల్ రిప్రజెంటేటివుతో లేచిపోయింది. చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో ఇలాంటి సంఘటనలు అరుదుగా జరిగేవి. ఎంతో నెమ్మదిగా నోరు మెదపలేని చంద్రమతి అలా చేసిందన్నది అందరికీ ఆశ్చర్యమే! కొంతమంది ఆత్మహత్య చేసుకు చచ్చిపోయిందనీ, అది పైకి చెప్పడం ఇష్టంలేక లేచిపోయిందనే పుకారు లేవదీశారని అనుకునే వారు. చంద్రమతి ఇన్నాళ్ళూ ఏమయ్యిందని అడుగుదామనుకొని ఆగిపోయాను.

చంద్రమతి మా కుటుంబం గురించి పేరుపేరునా అడిగింది. చెప్పాను. అమ్మకి బావోలేదన్న విషయం కూడా చెప్పాను.

“ఇప్పుడెక్కడుంటున్నావు? ఎంతమంది పిల్లలు?” అని అడిగింది.

“నేనా, బెహ్రైన్ ఆయిల్ కంపెనీలో ప్రోజెక్ట్ మేనేజర్ని. ఇద్దరబ్బాయిలు. గత పదేళ్ళుగా అక్కడే ఉంటున్నాం. ఏటా వచ్చి పోతూంటాం,” అని చెప్పి, తన గురించీ అడిగాను. చంద్రమతి ప్రస్తుతం బొంబాయిలో ఉంటున్నానని చెప్పి, అడ్రసిచ్చింది.

“చంద్రా, నువ్వు ఈ మధ్యలో అనాతవరం వెళ్ళేవా?” ఉండబట్టలేక అడిగాను. లేదన్నట్లు తలూపింది. అమ్మా నాన్నా పోయి చాలా కాలమయ్యిందని మాత్రం చెప్పింది. నేను వివరాల కోసం రెట్టించలేదు.

“అవును. మీ చెల్లెలు కాచి ఎక్కడుంది? చిన్నప్పుడు భలే ముద్దుగా ఉండేది!”

“పెళ్ళయిన అయిదేళ్ళకే భర్త పోవడంతో అనాతవరంలోనే ప్రస్తుతం అమ్మ దగ్గర ఉంటోంది, చిన్న బిడ్డతో,” అని కాచి గురించి చెప్పాను.

“అయ్యో! అంత చిన్న వయసులో భర్త పోవడం అన్యాయం. మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు కదా?”

“మా అమ్మకీ దాని గురించే బెంగ. పెళ్ళి చేసుకోమని అందరమూ పదే పదే పోరుతున్నాం. నాకు తెలుసున్న ఒకాయన చేసుకోవడానికి రెడీ. మా చెల్లెలొక మూర్ఖురాలు. మాట వినదు. పేరు పెట్టినందుకు అంతా మా అమ్మమ్మ పోలికలే!”

“తప్పు రామం. పోయినవాళ్ళని నిందించడం మంచిది కాదు. నువ్వే మీ చెల్లికి నచ్చ చెప్పి చూడు,” అన్నది చంద్రమతి. మేము గత పదేళ్ళుగా కాచిని రెండో పెళ్ళి విషయమై ఎంత పోరుతున్నామో చెప్పాను.

నా హైదరాబాదు ఫ్లయిటుకి ఇంకా రెండు గంటలుంది. ఇద్దరం పాత జ్ఞాపకాలు బాగానే నెమరువేసుకున్నాం. చంద్రమతికి ఇద్దరు పిల్లలనీ, భర్త ఒక చిన్న ఫార్మాసూటికల్ కంపెనీ నడుపుతున్నాడనీ చెప్పింది. నేను చంద్రమతి గతం గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉన్నా, ప్రశ్నించలేదు. నా ఫోన్ నంబరూ, అడ్రసూ తీసుకుంది. తిరిగెళ్ళేటప్పుడు వాళ్ళింటికి రమ్మనమని పిలిచింది. తప్పకుండా వస్తానని చెప్పాను. చంద్రమతి మద్రాసు ఫ్లయిటుకి టయిమవ్వడంతో బయల్దేరడానికి లేచింది.

“వస్తా రామం. నిన్ను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. మీ వాళ్ళని అడిగానని చెప్పు,” అంటూండగా ఆమె కళ్ళల్లో సన్నటి నీటిపొర స్పష్టంగా కనిపించింది. వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి వచ్చింది.

“రామం! నిన్నొకటి అడగచ్చా?” తటపటాయిస్తూ అంది.

“ఏవిటి? చెప్పు చంద్రమతీ!”

“నాకు మీ అమ్మమ్మగారి ఫోటో ఉంటే ఇవ్వగలవా? ప్రతీరోజూ సంగీత సాధన చేసేటప్పుడు ఆవిణ్ణే తలచుకుంటాను,” అంటూంటే ఆమె కళ్ళనుండి నీళ్ళు జలజలా రాలాయి.

“తప్పకుండా!” అని చెప్పి శలవు తీసుకున్నాను.

చంద్రమతి మా అమ్మమ్మ దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చేది. మా అమ్మమ్మకి సంగీతం బాగా వచ్చు. చాలా బాగా పాడేది. కాచికి అంతా అమ్మమ్మ పోలికలే, రూపం, తీరూ, మాటతో సహా. ఈ ఒక్క సంగీతం తప్ప.


చంద్రమతిని కలిశాక హైదరాబాదు ఫ్లయిటులో అనాలోచితంగా నా ఆలోచనలన్నీ మా అమ్మమ్మ చుట్టూనే తిరిగాయి. నేను తొమ్మిదో తరగతిలో ఉండగా అమ్మమ్మ పోయింది. మా అమ్మమ్మకీ, నాకు అంతగా పడేది కాదు. మా ఇంట్లో ఒక చెక్క బీరువా ఉండేది. అందులో పైన రెండు అరలూ అమ్మమ్మవి. క్రింద రెండరల్లో నా బట్టలుండేవి. ఆవిడ అరలో తెల్ల బట్టలూ, కాసిని సామాన్లూ ఉండేవి. నేనేదో ఆవిడ వస్తువులు కెలికేస్తానని ఆవిడకి చచ్చేటంత అనుమానం. చిన్న గుడ్డసంచీలో డబ్బు దాచుకునేది. అది ఎప్పుడూ నడుం దగ్గర దోపుకునేది. ఆవిడకి అతి శుభ్రం. నేనొక ఎడ్డి మనిషిలా ఉండేవాణ్ణి. ఇద్దరం చచ్చేట్టు కొట్టుకునేవాళ్ళం. ఆవిణ్ణి తిట్టాల్సి వస్తే కాచి పేరు వంకపెట్టి చెల్లెల్ని తిట్టేవాణ్ణి. ఎన్ని విసుక్కున్నా ఎంతైనా మనవణ్ణి కదా, ఆవిడే సద్దుకునేది. మిగతా విషయాల్లో ఎలా వున్నా రెణ్ణెల్లకోసారి మంగలాడ్ని పిలిచే సమయానికి మాత్రం బాగానే కాకా పట్టేది.

అమ్మమ్మకి మొగుడు పోయాక శిరోముండనం చేయించారు. అందువల్ల నెత్తి మీద ముసుగేసుకొనేది. చూడ్డానికి పచ్చగా దబ్బపండులా ఉన్న అమ్మమ్మ మొహమ్మీద తెల్ల ముసుగు మాత్రం ఆవిడ జీవితంలో నల్లమచ్చే! మొగుడు పోయాక ఆడపడుచూ, అత్తగారూ దగ్గరుండి శిరోముండనం చేయించారని వాళ్ళని రోజూ తెగ తిట్టుకునేది. మగపిల్లలు లేకపోవడం వల్ల కూతురు పంచన చేరానన్న అసంతృప్తి ఆవిడ మాటల్లో కనిపించేది. దానికి తోడు మా నాన్నకి అమ్మమ్మంటే గిట్టేది కాదు. మొగుడు పోయాక ఆవిడ ఆస్తిని తన పేర రాయమని నాన్న అడిగితే రాయను పొమ్మంది. నాన్న గయ్యిమని లేచాడు. అమ్మ మాట కాదనలేక ఆవిణ్ణి చూడక తప్పలేదు. నాన్న మాత్రం ఆవిణ్ణి చాలా విసుక్కునేవాడు. లోపల ఏం బాధపడిందో తెలీదు, ఎప్పుడూ నాన్నని ఒక్క మాటనేది కాదు.

మా బాబయ్యకి పిల్లలు లేకపోతే నన్ను దత్తత తీసుకుందామని మాటలొచ్చాయి. మా నాన్న సరేనన్నాడు. అమ్మకిష్టం లేదు. ఆ విషయమై అమ్మని ఒప్పించడానికి మా ఇంటికొచ్చినప్పుడు మా బాబయ్యని దులిప్పడేసింది మా అమ్మమ్మ.

“నిజంగా పిల్లలంటే మమకారం ఉంటే బీదవాళ్ళ పిల్లల్ని పెంచుకో! అయినా రామం గాడే కావాలా? కాచిని ఎందుకు దత్తు తీసుకోవు? ఏం? ఆడపిల్ల పనికిరాదా?” అంటూ బాబయ్యని చీల్చి చండాడేసరికి బాబయ్య మరలా మా గుమ్మం తొక్కితే ఓట్టు.