గుళిక వేదాంతం

సాధారణ శకం 1900 వరకు న్యూటన్ (Newton), మాక్స్‌వెల్ (Maxwell) ప్రభృతులు లేవనెత్తిన సనాతన భౌతికశాస్త్రపు సూత్రాలు సవాలు లేకుండా రాజ్యం ఏలేయి. తరువాత 1905లో ఐన్‌స్టయిన్ ప్రతిపాదించిన సాపేక్షవాదం న్యూటన్ గమన సూత్రాలకి సవరణలు ప్రతిపాదించినా స్థూలంగా, భౌతిక ప్రపంచపు పోకడ యెడల మన అవగాహన పెద్దగా మారలేదు. భౌతిక ప్రపంచంపై మన అవగాహన పరిపూర్ణం అయినట్లే అని పెక్కురు పెద్దలు అభిప్రాయం వెలిబుచ్చేరు.

కానీ, ఎలక్ట్రాన్ వంటి పరమాణు రేణువుల వింత ప్రవర్తన న్యూటన్, మాక్స్‌వెల్ ప్రభృతులు లేవనెత్తిన సనాతన భౌతికశాస్త్రానికి పెద్ద చిక్కులనే తెచ్చిపెట్టింది. ఈ చిక్కులని ఎదుర్కోడానికి బోర్ (Neils Bohr), ఐన్‌స్టయిన్ (Einstein), ష్రోడింగర్ (Schrodinger), హైజెన్‌బర్గ్ (Heisenberg) ప్రభృతులు గుళిక వాదం (quantum theory) అనే కొత్త మార్గానికి బాటలు వేసేరు. ఈ కొత్త మార్గం గుండా ప్రయాణం చేస్తే ఎలక్ట్రాన్ వంటి పరమాణు రేణువుల వింత ప్రవర్తన అర్థం చేసుకోవడం కొంతవరకు సుగమం అయింది.

కానీ ఈ కొత్త మార్గం కొత్త సమస్యలని తీసుకొని రావడంతో కొన్ని కొరుకుడు పడని సాంకేతిక సమస్యలని పరిష్కరించవలసి వచ్చింది. మచ్చుకి: ఈ కొత్త వాదం ప్రకారం ఎలక్ట్రానులు గోడలవంటి అడ్డంకులని తొలుచుకుని ఇటు నుండి అటు వెళ్ళిపోగలవు! పరమాణు రేణువులు ఒకే సమయంలో రెండు ప్రదేశాలలో కనబడగలవు! అత్యంత దూరంలో ఉన్న ఇద్దరు పరిశీలకుల (observers) మధ్య వార్తలు క్షణికంగా (instantaneous – అనగా, కాంతి వేగాన్ని మించి) ప్రసారం చెయ్యవచ్చు!

మరొక ఉదాహరణ! కాంతి నిజస్వరూపం ఏమిటి? కాంతి తరంగాల రూపంలో ప్రసరిస్తుందని 1865లో మాక్స్‌వెల్ బల్లగుద్ది చెప్పేడు. కానీ 1905లో ఐన్‌స్టయిన్ వచ్చి కాంతి రేణువుల రూపంలో కూడా ప్రసరిస్తుందని ఉద్ఘాటించగా ఆ రేణువులకి తేజాణువులు (photons) అని పేరు పెట్టేరు. తరువాత డి బ్రోల్యీ (De Broglie) వచ్చి పదార్థం రేణువుల రూపంలోనే కాకుండా తరంగాల రూపంలో కూడా ఉంటుందని, పదార్థం యొక్క ద్వంద్వ తత్త్వాన్ని రుజువు చేసేడు. కాంతి కానీ పదార్థం కానీ నిజానికి ఎలా ఉంటుంది? ప్రయోగం చేసి చూసేరు. మనం అంతా రేణువులలా ఊహించుకుంటున్న ఎలక్ట్రానులు మనం వాటిని పరీక్షించకుండా (వాటి వైపు ‘చూడకుండా’) ఉన్నంతసేపూ (as long as we do not observe them) తరంగాలలా ప్రవర్తిస్తాయి. మనం వాటిని చూసేమో అవి రేణువులలా ప్రవర్తిస్తాయి. మనం వాటిని పరీక్షిస్తున్నామో లేదో వాటికి ఎలా తెలుసు? ఈ ప్రశ్నకి సమాధానం మనకి తెలియదు. కానీ ఎలక్ట్రానులు వాటికి తెలిసినట్లే ప్రవర్తిస్తాయి!

ఈ సరికొత్త గుళిక వాదం భౌతికశాస్త్రం అనే మహావృక్షాన్ని కూకటివేళ్ళతో సహా కదలించింది. అప్పటివరకు మన అవగాహనలో ఉన్న ప్రకృతి యొక్క స్వరూపం నిజమైనదేనా అనే అనుమానం శాస్త్రవేత్తలని పెనుభూతంలా ఆవహించింది. ఈ పరిస్థితి ‘ఏది వాస్తవం?’ (What is Reality?) అనే తాత్త్వికమైన ప్రశ్నని లేవనెత్తింది.

అంతవరకు సనాతన భౌతికశాస్త్రం ప్రకారం పదార్థం (matter) అనేదానిని అతి చిన్న రేణువులలా ఊహించుకునేవారు. ఇప్పుడు గుళిక వాదం వచ్చి పదార్థం రేణువులుగా ఉండొచ్చు, కెరటాలు గానూ ఉండొచ్చు అని వాదిస్తోంది. అలాంటప్పుడు పదార్థం యొక్క నిజస్వరూపం ఏది? రేణువులా? కెరటాలా? పదార్థం రేణువుల లానే ఉంటుందని తరతరాల అనుభవంతో సమకూడిన అంతర్బుద్ధి (intuition) ఒక పక్క చెబుతూ ఉంది; కానీ ప్రయోగం చేసి చూస్తే గుళిక వాదానికే మద్దతు కనిపిస్తోంది. ఇందులో ఏది వాస్తవం?

గుళిక వాదంలో కోపెన్‌హాగెన్ వ్యాఖ్యానం (Copenhagen interpretation) అనే అంశం ఒకటి ఉంది. ఇది కోపెన్‌హాగెన్ నగరంలో బోర్ ప్రభృతులు చేసిన వ్యాఖ్యానం. ఈ కోపెన్‌హాగెన్ వ్యాఖ్యానం ప్రకారం పరిశీలకుడు పరీక్షించకుండా ఉన్నంతసేపూ సూక్ష్మ ప్రపంచపు వ్యవస్థ గుళిక వాదానికి కట్టుబడే ఉంటుంది; కానీ పరిశీలకుడు (ఇది ఒక వ్యక్తి కావచ్చు, ఒక పరికరం కావచ్చు) ఆ వ్యవస్థని పరిశీలించాడో, ఆ వ్యవస్థ ఠకీమని సనాతన వాదానికి తల ఒగ్గుతుంది. అంటే, తన ద్వంద్వ తత్త్వానికి స్వస్తి చెప్పి రేణువులా ప్రవర్తిస్తుంది. అలాంటప్పుడు ఎలక్ట్రాన్ నిజస్వరూపం ఏమిటి? రేణువా? తరంగమా? చూస్తే రేణువు, చూడకపోతే తరంగం! అంటే వీక్షకుడు చూసేది నిజస్వరూపం కాదు; అది వీక్షకుడు తన మనస్సులో కల్పించుకున్న ఒక భ్రాంతి. ఈ వితండవాదం నచ్చక ‘చంద్రుడిని చూస్తేనే అక్కడ ఉన్నాడా? చూడకపోతే లేడా?’ అని ఐన్‌స్టయిన్ అడిగేడు! ‘అడవిలో చెట్టు పడిపోయినప్పుడు చప్పుడు అయిందా?’ అని అడిగితే ‘వినేవాడే లేకపోతే చప్పుడన్న ప్రశ్నే లేదు’ అంటుంది గుళిక వాదం.

గుళిక వాదానికి నారు పోసినవారిలో ఒకడైన ష్రోడింగర్ ఈ సంకట పరిస్థితిని ఎదుర్కున్నప్పుడు జెర్మనీ దేశపు తత్త్వవేత్త ఆర్థర్ షోపెన్‌హావర్ (Arthur Schopenhauer) వల్ల ప్రభావితుడయ్యాడు. ఈ షోపెన్‌హావర్ ఉపనిషత్తుల వల్ల ప్రభావితుడయి, ‘ఉపనిషత్తులని మించిన విద్య మరొకటి లేదు. జీవితంలో సాంత్వన కలిగించే విద్య మరొకటి లేదు. మరణంలో కూడ ఊరట ఇచ్చే విద్య మరొకటి లేదు’ అని అభినందించేడు.

ఉపనిషత్తుల సారాంశం ఏమిటి? ఉపనిషత్తుల సారాంశాన్ని నాలుగు మహావాక్యాలలో చెప్పవచ్చు: తత్త్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ.

తత్త్వమసి: తత్ త్వం అసి. అనగా ఆత్మ, బ్రహ్మము ఒక్కటే! జీవాత్మ, పరమాత్మ ఒక్కటే! విశ్వవ్యాప్తంగా ఉన్న పరమాత్మలో మనం అంతా ఒక భాగమే!

అహం బ్రహ్మాస్మి: అంటే నేనే బ్రహ్మమును.

ప్రజ్ఞానం బ్రహ్మ: అంటే మన చేతస్సే బ్రహ్మము.

అయమాత్మా బ్రహ్మ: ఈ ఆత్మే బ్రహ్మము.

మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని జ్ఞానేంద్రియాలతో సృజించినప్పుడు మనం అనుభవించేది వాస్తవం (Reality) కాదు; అది కేవలం ఒక మాయ. అనగా, బ్రహ్మము యొక్క నిజస్వరూపాన్ని మన చేతస్సు (లేదా consciousness) మీదకి ప్రక్షేపము (project) చెయ్యగా అది మన అనుభవ పరిధిలోకి వస్తుంది.

ఈ ఆలోచన ష్రోడింగర్ మీద బాగా ప్రభావం చూపింది. ఉన్నది ఒక్కటే! అదే మాయ ప్రభావం వల్ల – అద్దాల వ్యూహంలో కనిపించినట్లు – మనకి వివిధ రూపాలలో సాక్షాత్కరిస్తూ ఉంది. ఈ దృక్కోణానికి ష్రోడింగర్ ప్రభావితుడవడానికి కారణం లేకపోలేదు. గుళిక వాదం ప్రకారం వాస్తవం యొక్క నిజస్వరూపం తరంగాలు. తరంగాలా-రేణువులా అనే సందిగ్ధత ప్రపంచాన్ని మన పరికరాలతో (జ్ఞానేంద్రియాలతో) సృజించినప్పుడు (measure చేసినప్పుడు) వస్తోంది. వాస్తవం యొక్క పరిపూర్ణమైన నిజస్వరూపాన్ని మనం గ్రహించలేకపోతున్నాము కాబట్టి మన పరికరాలు కానీ మన జ్ఞానేంద్రియాలు కానీ ఏమి చెబితే అదే వాస్తవం అనుకుంటున్నాం. అనగా వాస్తవం గురించి మనకి తెలిసినది అసంపూర్ణం. ఇలా ‘కూలిపోయిన’ వాస్తవాన్ని గుళిక శాస్త్రంలో collapse of the wave function అంటారు. మనం మాయ అంటున్నాం! అందుకనే ఎక్కడ ప్రసంగించినా ‘ఆత్మ = బ్రహ్మ’ అనేది ష్రోడింగర్ రెండవ సమీకరణం అని ష్రోడింగర్ చమత్కరించేవాడుట.

Quantum physics eliminates the gap between the observer and the observed. The Upanishads say that the observer and the observed are the same things. In his 1944 book What is Life?, Schrödinger took on a peculiar line of thought. If the world is indeed created by our act of observation, there should be billions of such worlds, one for each of us. How come your world and my world are the same? If something happens in my world, does it happen in your world, too? What causes all these worlds to synchronize with each other?

He found his answer, again, in the Upanishads. “There is obviously only one alternative,” he wrote, “namely the unification of minds or consciousnesses. Their multiplicity is only apparent, in truth there is only one mind. This is the doctrine of the Upanishads.”

ఉపనిషత్తుల వల్ల ప్రభావితుడైనది ష్రోడింగర్ ఒక్కడే కాదు. అలనాటి భౌతిక శాస్త్రవేత్తలు ఎందరో ఈ కోవకి చెందినవారు ఉన్నారు. నీల్స్ బోర్, హైజెన్‌బర్గ్, ఆపెన్‌హైమర్ మొదలైనవారు ఉన్నారు. ఆమాటకొస్తే హైజెన్‌బర్గ్ ప్రవచించిన అనిర్ధారిత సూత్రం చెప్పేది కూడా ఇదే. వాస్తవం యొక్క నిజస్వరూపాన్ని కొంత మేరకే మనం పరికరాలతో కొలవగలం. అటుపైన వాస్తవం అజ్ఞేయం (unknowable).

అలాగని పాశ్చాత్య భౌతిక శాస్త్రవేత్తలు ‘ఉపనిషత్తులలోనే అన్నీ ఉన్నాయి’ అని కాని, ‘ఉపనిషత్తులలో ఉన్నవన్నీ శాస్త్రీయమైనవి’ అని కానీ అంటున్నారనుకుంటే అది మన పొరపాటే అవుతుంది. వేదాలలోను, ఉపనిషత్తులలోనూ ఉన్న ఎన్నో అంశాలని వారు ఆక్షేపించారు. మన ప్రాచీన పురాణ, వేద సారస్వతాలలో ఋజువులు లేని, ఋజువులు కాని నమ్మకాలు ఎన్నో ఉన్నాయి; అది వజ్రాలు, గులకరాళ్ళు కలగలుపుగా ఉన్న సాహిత్యం. క్షీరనీర న్యాయంలా దానిలో శాస్త్రీయమైనది, సహేతుకమైనది మాత్రమే మనం గ్రహించి గర్వపడొచ్చు!


గుళిక వాదానికీ వేదాంత తత్త్వానికీ మధ్య ఉన్న లంకె మరి కొంత లోతుగా అర్థం కావాలంటే ముందుగా తత్త్వం గురించి కొంత, గుళిక వాదం గురించి కొంతా కనీస అవగాహన ఉండాలి. భౌతికశాస్త్రం (Physics) అంటే కేవలం భౌతిక విజ్ఞానం. కాని ఆధిభౌతిక శాస్త్రం (Metaphysics) అనేది వాస్తవం (reality) అంటే ఏమిటి? మూర్తవస్తువుకి (matter), మనస్సుకి (mind) మధ్య లంకె ఏమిటి? వాస్తవానికి, సాధ్యతకీ (potentiality) మధ్య లంకె ఏమిటి? వగైరా ప్రశ్నలకి సమాధానం వెతుకుతుంది. ఈ ఆధిభౌతికశాస్త్రం తత్త్వశాస్త్రంలో (philosophy) ఒక భాగం.

తత్త్వశాస్త్రంలో ప్రచారంలో ఉన్న రెండు మాటలకి అర్థాలు విచారిద్దాం. మొదటిది వాస్తవవాదం (realism).

Realism is the view that a ‘reality’ of material objects, and possibly of abstract concepts, exists in an external world independently of our minds and perceptions. అనగా, స్థావరజంగమాత్మకమైన భౌతిక ప్రపంచం యొక్క ఉనికికి పరిశీలకుడితో (observer) నిమిత్తం లేదు. అనగా, బల్ల మీద పెట్టిన పండు మనం చూసినా, చూడకపోయినా అక్కడ బల్ల మీదనే ఉంటుంది. అడవిలో చెట్టు కూలినప్పుడు అక్కడ వినడానికి ఒక జీవి ఉన్నా, లేకపోయినా పడుతూన్న చెట్టు చప్పుడు చేస్తుంది.

రెండవది ఆధ్యాత్మికవాదం (idealism) లేదా ‘స్వీయానుభవ ఆధ్యాత్మిక వాదం’. వాస్తవికత అనేది ఏదో విధంగా మనస్సు (consciousness) మీదనే ఆధారపడి ఉంటుందని, తన అనుభవంతో మేళవించినదే ప్రపంచం (సృష్టి) అని చెప్పేది. అనగా, స్థూల ప్రపంచం కల్ల, ఒక మాయ అని చెప్పేది. బల్ల మీద పండు అక్కడ ఉందా, లేదా అనేది చూసేవాడి మీద ఆధారపడి ఉంటుంది. చెట్టు కూలినప్పుడు పుట్టిన శబ్దతరంగాలు ఒక చెవిలోని కర్ణభేరికి తగిలి అది ప్రకంపించి ఆ ప్రకంపనలు ఆ మెదడులోని శ్రవణ నాడీకేంద్రాలని ఉత్తేజపరచినప్పుడు ఆ మెదడు చెప్పిన భాష్యమే శబ్దం. అనగా మెదడులోని చేతన (consciousness) ఏది చెబితే అదే మనకి ద్యోతకమవుతుంది కాని నిజంగా ప్రపంచం ఎలా ఉందో అన్నది ‘అజ్ఞేయం’ (unknowable).

గుళిక వాదానికీ వేదాంత తత్త్వానికీ మధ్య పోలికలు ఉన్నాయన్నప్పుడు పైన చెప్పిన రెండు అంశాలని దృష్టిలో పెట్టుకోవాలి.

గుళిక వాదం తెచ్చిపెట్టిన ఇబ్బందులు

ఇప్పుడు గుళిక వాదం గురించి కాస్త తెలుసుకుండాం. గుళిక వాదం అత్యంత సూక్ష్మ ప్రపంచాన్ని వర్ణించి చెప్పే శాస్త్రం. అనగా, గుళిక వాదంలో ఎలక్ట్రానులు, ప్రోటానులు, న్యూట్రానులు, ఫోటానులు, అణువులు (atoms), బణువులు (molecules) వగైరా సూక్ష్మ శాల్తీలని అధ్యయనం చేస్తాం. ఈ సూక్ష్మ శాల్తీలు రేణువుల రూపంలో కాకుండా ఒక మేఘం రూపంలో అలుముకుపోయి ఉన్నట్లు ఊహించుకుంటాం. అనగా ఈ నమూనాలో ఎలక్ట్రాను ఫలానా చోట ఉంది అని చెప్పలేము; ఆ మేఘం ఉన్న మేర అంతా ఉంది అని చెబుతాము. ‘ఎలక్ట్రాను ఫలానా చోట కనిపిస్తుందా?’ అని అడిగితే ఖరాఖండిగా సమాధానం చెప్పలేము; ఫలానా చోట కనబడడానికి సంభావ్యత (Probability) ఇంత అని మాత్రం చెప్పగలం! ఇలా అధ్యయనం చేసినప్పుడు ఆ సూక్ష్మ పదార్థపు స్థితిని (state) వర్ణించడానికి, తరంగ ప్రమేయం (wave function) అనే గణిత భావం వాడతాం.

ఇక్కడ చిన్న ఉపమానం చెబుతాను. విష్ణుమూర్తిని వర్ణించమని అడిగితే ఏమి చేస్తాం? నాలుగు చేతులవాడు, చేతులలో శంఖం, చక్రం, వగైరాలు ఉన్నవాడు, పాల సముద్రంలో పాము మీద పవళించినవాడు, పద్మనయనములవాడు, ఇలాంటివాడు, అలాంటివాడు – అంటూ వర్ణిస్తాము కదా. అలాగే ఎలక్ట్రాను వంటి అతి సూక్ష్మమైన పదార్థాన్ని వర్ణించినప్పుడు – నీ గరిమ ఇంత, నీ భారవేగం ఇంత, నీ భ్రమణం ఇంత, అనుకుంటూ వర్ణించవచ్చు కదా! ఈ ‘సహస్రనామాల’ సమాహారాన్నే సాంకేతిక పరిభాషలో తరంగ ప్రమేయం (wave function) అంటారు.

విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ఇందుగలడందులేడని సందేహము వలదు అన్నట్లు విశ్వవ్యాప్తంగా ఉన్నాడు. ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాడు. అలాగని ఎక్కడని చూడడం? అందుకని మనవాళ్ళు ఆ విష్ణువుకి ఒక ఆకారం కల్పించి ఒక చోట ప్రతిష్ఠాపన చేసి, ‘ఈ దేవాలయంలో ఉన్నాడు’ అని చెప్పేరు. అలాగే ఎలక్ట్రాను ఎక్కడ ఉంది? అని అడిగితే ‘విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉంది’ అని తరంగ ప్రమేయం చెబుతుంది. మన కళ్ళు, మన పరికరాలు విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న శాల్తీలని ఎలా చూడగలవు? ఎక్కడో ఒక చోట చూడగలవు. అలా మనం ఎక్కడ చూస్తే అక్కడ దేవుడు వెలిసినట్లు, ఎలక్ట్రానుని ఎక్కడ చూస్తే అక్కడ కనబడుతుంది. అనగా, మనం చూసిన చోటే కనబడుతుంది – మరెక్కడా కాదు. ఈ రకం ప్రవర్తనని ‘తరంగ ప్రమేయం మనం ఎక్కడ చూస్తున్నామో అక్కడే కూలబడి పోతుంది (లేదా collapse అయిపోతుంది)’ అంటారు. మనం చూడనంతసేపు ఆ తరంగ ప్రమేయం విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉంటుంది. అనగా తరంగ ప్రమేయం ఒక ఉపరిస్థాపక స్థితిలో (a state of superposition) ఉంటుంది. ఈ వింత ప్రవర్తనని ఇంగ్లీషులో కొలత సమస్య (measurement problem) అంటారు. నిజానికి దీనిని పరిశీలన సమస్య (observation problem) అనడం ఎక్కువ అర్థవంతంగా ఉంటుంది. (ఈ సమస్యనే ష్రోడింగర్ పిల్లి (Schrodinger’s cat) అన్న మేధో ప్రయోగం ద్వారా కూడా వ్యాఖ్యానిస్తారు!)

పైన చెప్పినది అలంకారం కాదు. నిజంగా జంట కంతల ప్రయోగంతో (double slit experiment) నిరూపించబడ్డ సత్యం. ఈ ప్రయోగాన్ని కూలంకషంగా వర్ణించి చెప్పడానికి సమయం పడుతుంది; టూకీగా చెబుతాను.

జంట కంతల ప్రయోగాలు

ఒక అట్ట ముక్కకి దగ్గర దగ్గరగా రెండు కంతలు (slits) పెడదాం. ఈ పరికరంతో కొన్ని ప్రయోగాలు చేద్దాం.


బొమ్మ 1. రేణువులు బంతులు వలె ఉన్నాయని ఊహించుకుంటే తెర మీద బంతులు పడ్డ చోట్ల మధ్య చిత్రంలో చూపినట్లు రెండు చారలు కనబడాలి. కాని అట్టడుగు చిత్రంలో చూపినట్లు ఎన్నో చారలతో కనబడ్డాయి.

మొదటి ప్రయోగం: ఈ రెండు కంతల వైపు ఒక పక్క నుండి కాంతి కెరటాలని పంపుదాం. ఈ కెరటాలు కంతల గుండా ప్రవహించి, రెండుగా చీలి, అవతల పక్క ఒకదానితో మరొకటి ఢీకొని ఒక రకమైన జోక్యపు చారల బొమ్మను (interference pattern) గోడ మీద ప్రక్షేపిస్తాయి. (బొమ్మ-1లో మొదటి చిత్రం చూడండి). ఇలా రెండు కెరటాలు ఢీకొన్నప్పుడు జోక్యపు చారలు (interference pattern) కనబడతాయన్న విషయం భౌతిక శాస్త్రం చదివిన వారికి కరతలామలకం! (ఇది కొరుకుడు పడకపోతే, మింగేయండి!)

రెండవ ప్రయోగం: ఇప్పుడు ఒక పక్క నుండి సూక్ష్మ రేణువులని (అణువులు కాని, ఎలక్ట్రానులు కాని అనుకొండి) ఒకటీ, ఒకటీ చొప్పున ఈ కంతల వైపు విడుదల చేద్దాం. ఈ రేణువులని బంతులలా ఊహించుకుంటే ఆ బంతులు పైనున్న కంత లోంచి వెళ్ళినవి అవతల పక్క ఉన్న తెర మీద పైవరసలో పడతాయి. అలాగే కింద కంత లోంచి వెళ్ళినవి తెర మీద కింది వరసలో పడతాయి. అప్పుడు మనకి తెర మీద రెండు చారలు (బొమ్మ-1లో మధ్య చిత్రంలో చూపినట్లు) కనబడాలి. అవునా? కాని ప్రయోగం చేసి చూస్తే రెండు చారలకి బదులు ఎన్నో చారలు (బొమ్మ-1లో అట్టడుగు చిత్రంలో చూపినట్లు) కనబడతాయి. అనగా ఒక జోక్యపు చారల బొమ్మ కనబడుతుంది.

ఇలా ఎన్నో జోక్యపు చారలు కనబడడానికి కారణం కంతల మీద పతనం అవుతున్న రేణువులు బంతులలా ప్రవర్తించకుండా కెరటాలలా ప్రవర్తిస్తున్నాయన్నమాట! కనుక మన ప్రయోగం చెప్పినది ఏమిటంటే ‘సూక్ష్మ రేణువులు బంతులలా ప్రవర్తించవు, తరంగాలలా ప్రవర్తిస్తాయి’ అని.


బొమ్మ 2. కంతల పక్కని పరిశీలక పరికరాన్ని నియమిస్తే రేణువులు తిరిగి బంతులలా ప్రవర్తించడం మొదలుపెడతాయి.

మూడవ ప్రయోగం: ఇంతకీ సూక్ష్మ రేణువులు బంతులలా ప్రవర్తిస్తాయా? తరంగాలలా ప్రవర్తిస్తాయా? ఈ విషయం తాడో, పేడో తేల్చుకుందామని ఆ కంతల పక్కని ఒక కెమేరాని పెట్టి వీడియో తియ్యడానికి ప్రయత్నం చేసేరు (బొమ్మ-2లో చూపినట్లు). తమాషా ఏమిటంటే కెమేరాని ఆన్ చెయ్యగానే తెర మీద రెండే చారలు కనిపించేయి. కెమేరాని ఆఫ్ చెయ్యగానే తెరమీద ఎన్నో చారలు కనిపించేయి. అంటే ఏమిటన్నమాట? కంతల దగ్గర ఏమి జరుగుతోందో చూడడానికి (లేదా పరిశీలించడానికి) ప్రయత్నిస్తే రేణువులు బంతులలా ప్రవర్తిస్తాయి; చూడకపోతే అవి కెరటాలలా ప్రవర్తిస్తాయి. ‘బంతి’ అంటే ఒక చోట ప్రతిష్ఠించబడ్డ శక్తి అనిన్నీ, కెరటం అంటే విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న శక్తి అనిన్నీ మనం భాష్యం చెప్పుకుంటే ఎవ్వరూ పరిశీలించకుండా ఉన్నంతసేపూ రేణువులు విశ్వవ్యాప్తమైన తరంగాలలా ఉంటాయి, ఎవ్వరైనా వాటిని పరిశీలించడానికి ప్రయత్నం చేసేరో అవి రేణువులలా ఒక చోట స్థిరపడిపోయి కనిపిస్తాయి.

దీని అర్థం ఏమిటి? వాస్తవం (reality) పరిశీలకుడి (observer) మీద ఆధారపడి ఉంటుందా? పరిశీలించే శాల్తీ లేకపోతే ‘అక్కడ’ ఏమి జరుగుతోందో ఎలా తెలుస్తుంది? ఇటువంటి ప్రశ్నలని లేవదీసి సమాధానం కోసం దరిదాపు వంద సంవత్సరాలబట్టి కుస్తీలు పడుతున్నారు. ఇప్పటికి ఎక్కువ ఆదరణలో ఉన్న వాదం ప్రకారం ‘సృష్టి యొక్క నిజస్వరూపం అజ్ఞేయం (unknowable)’. మనం చెయ్యగలిగేదల్లా మన అనుభవానికి అందుబాటులో ఉన్న నమూనాలు (గణిత సమీకరణాలు) ‘నిజస్వరూపం’ ఏదంటే దానిని నమ్మడమే!

వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...