ఆగస్ట్ 2023

రాముణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఉపక్రమించి ఓ భక్తుడు ‘రామా! నీలమేఘశ్యామా’ అని మొదలెట్టాట్ట. ‘సర్లేవయ్యా! ఓ చాయ తగ్గినంత మాత్రాన దాని ప్రస్తావనే తేవాలా?’ అని చిన్నబుచ్చుకున్నాడట రామయ్య. ‘చెట్టు చాటు నుండి వాలిని చంపిన వీరాధివీరా, శబరి ఎంగిలి మింగిన ఇనకులతిలకా!’ అని భక్తుడు స్తోత్రపాఠం అందుకోగానే ‘అన్ని కాండల రామాయణంలో మేము చేసిన మహత్, చమత్, బృహత్ కార్యములు అనేకములు ఉండగా నీకు ఇవే తట్టాయా?’ అని నోరు చేసుకుని వరాలేవీ ఇవ్వకుండానే మాయమయ్యాట్ట ఆ పురుషోత్తముడు — ఇది రాసింది రమణ అంటే ముళ్ళపూడి రమణ అనుకునే తెలుగువారు ఈ రోజుకీ తెలుగునాట ఉన్నారు. మల్లెపూవులా జీవించి మొల్లపూవులా వెళ్ళిపోయిన ముళ్ళపూడి పేరు మీద తనను గుర్తు చేసుకుంటే శ్రీరమణా నొచ్చుకోకపోవచ్చు. అయినా చాలామంది మిథునం రాసిన రమణ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. శ్రీరమణ అంటే బాపు దస్తూరీలోని తెలుగు కథ. బంగారు మురుగు, షోడానాయుడు, ధనలక్ష్మి, మిథునం, నాలుగో ఎకరం ఇలా ఆయన రాసిన అన్ని కథల్లోనూ మానవ సంబంధాల మీద అనితర సాధ్యమైన ఒక వ్యాఖ్య ఉంటుంది. చాలా కథల్లో మనుషులందరూ అనివార్యంగా పోగొట్టుకున్న ఒకానొక కాలం మీద దృష్టి పెట్టారాయన. ఆ రోజుల సున్నితత్వమూ నమ్మకమూ మరిక ఎన్నటికీ తిరిగి రాలేవని గుర్తు చెయ్యడంలోని విషాదం ఆయన కథల్లో అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. మనిషిలోని పెద్దరికమూ పసితనమూ పంతాలు పడే కథా వస్తువులేవో ఆయన కలానికి లోబడిపోయాయి. అందమైన అలతి మాటలు, వ్యంగ్యంతో మిళితమైన సున్నితమైన హాస్యం రమణ రచనల తాలూకు కొండగుర్తులు. వడిసెల తిప్పినట్టు జడ విసిరితే కుప్పెలు ఛెళ్ళున తగిలి కష్టసుఖాలు ఒకేసారి అనుభవంలోకి వచ్చేవిట వరహాల బావి ఊరి కుర్రాళ్ళకి. ధనలక్ష్మి, మేల్ ఇగో పోరు పడలేని ఎందరెందరో ఆడవాళ్ళకి ఒక ఆశాదీపం. ఎర్ర రాళ్ళ నెక్లెసుతో కంటినిండా కాటుకతో ‘ఇదిగో రామాంజనేయులూ, నాకు పెన్సిలు కావాలి’ అని ఘల్లుఘల్లున గజ్జెల చప్పుడుతో వచ్చి క్లాసు బయట నిలబడి అరిచిన ఎనిమిదేళ్ళ ధనలక్ష్మి, ‘లక్క బంగారం అంటుకుని ఉంటేనే తాళిబొట్టు నిండుగా ఉండేది’ అని ఆరిందాసూత్రాలు పొడుపుకథల్లా చెప్పేంతదవుతుంది. పసితనపు నీలంగోళీ కలని నిక్కరు జేబులో మోసుకొచ్చి, ఇవ్వడానికి మోమాటపడిన సిద్ధుడు – షోడానాయుడు కథలో – కళ్ళ నీళ్ళు పెట్టిస్తాడు. ‘చెంగనాలు వేస్తున్న తువ్వాయి మెడలో పట్టెడ తెగిపోయి మువ్వలు చెదిరిన విధాన, మబ్బు తునకలు తునకలై గడగడా వడగళ్ళు రాలిన చందాన, నేరేడుపళ్ళు దోసిలితో గుమ్మరించిన తీరున షోడాగోళీలు నా గది గచ్చు మీద పడి దొర్లుతున్నాయి’ అని చదువుతుంటే, గుండె గొంతుకలోన కొట్టాడనుందని తెలిసిపోతుంది. ఏళ్ళకేళ్ళ జీవితాలని ఎంతో వైనంగా కుదించి చెప్పగల నేర్పు శ్రీరమణది. అందుకే బోలెడంత మందికి బోలెడు కలలిచ్చి పోయారు. ముగ్గులేసే బామ్మ వీపు మీద బల్లిలా కరుచుకు పడుకుని కునుకు తీయగల బాల్యం, నాలుక్కాసులు ఒక్క ముద్దుకి చెల్లురా అని మనవడిని ఒప్పించి పిల్లని కుదిర్చే బామ్మ -ఎన్నేళ్ళ కాలమూ కరిగించలేని బంగారు మురుగంత అపురూపం. దాంపత్యంలో ఇంత స్నేహం, ఇంత తత్వం ఉంటే అదే మిథునం. పేరడీలు, ఛలోక్తులు, ఎప్పటెప్పటివో అనుభవాలూ జ్ఞాపకాలే ఆయన రచనలు. నవ్వులో శివుడున్నాడురా అని ఆయన చెప్పిన కబుర్లు హాయిగా మళ్ళీ మళ్ళీ చదువుకోదగ్గవి. అందమైన ఆడపిల్లను చూసి ‘ఎవడో మీగడ తోడెట్టాడురోయ్’ అన్న మల్లాది మాట తనకెంతో ఇష్టమని చెప్పుకునే శ్రీరమణ అంతకంతా అందమైన వాక్యాలతో పాఠకులను అలరించారు. పొగడ్త కూడా ఎలా ఒక కళో, నేమ్ డ్రాపింగ్ ఎలా చేస్తే రక్తి కడుతుందో బోలెడు చమక్కులతో చెప్పి పోయిన నిక్కమైన మంచి నీలంపురాశి శ్రీరమణని, ఆయన సాహితీ సంపదలో నుండి ఏ మాటలతో పొగిడినా అనౌచిత్యం ఉండబోదు.