నాకు నచ్చిన పద్యం: ఒక పరిణతమైన ఆశుధార

ఉ.
క్రొన్ననఁ గోయఁ గోయనుచుఁ గోయిల కన్నెఱఁ జేయఁ, జేయటుల్
కిన్నెఱఁ బాయఁ బాయసము కీల్కొని పొంగిన చాయ చాయలన్
వెన్నెలఁ గాయఁ గాయజుడు వేమఱుమై విరిగోల లేయ, లే
యన్నువ తాళఁజాల కహహా యనె మై మరుమాయ మాయఁగన్

ఉదాత్తభావనామయమైన కవితాప్రపంచంలో ఒక పృచ్ఛకుడు సమస్యనివ్వడం, దాన్ని కవి పూరించడం అనేది కేవలం బుద్ధిక్రీడ కానవసరం లేదని నా ఊహ. మెదడుకి పదును పెట్టి, చరమపాదాన్ని ఔచిత్యంతో సాధించే ఆలోచనలను రేకెత్తించే విధంగా ఒక సమస్య ఉండడమన్నది దాని ద్వితీయోపయోగమే. సమస్య ఒక విప్పవలసిన గణితసమస్య వంటి ముడి కాదు. అది ఒక కవితను పుట్టించడం కోసమని ముందుగా పుట్టిన వస్తువు. ఒక సమస్య బుద్ధికంటే హృదయాన్ని మేల్కొల్పినప్పుడు, దాన్ని సాధన చేసినవాడి మెదడు కన్నా కూడా, అతని హృదయం పరివ్యక్తమైనపుడూ ఆ సమస్య గొప్ప సమస్య అవుతుంది. ఆ పూరణ ఉదాత్తమైనదవుతుంది. అప్పుడు ఒక సమస్యను ఇవ్వడమూ, ఒక కావ్యం వ్రాయమని ఒక కవిని అడగడమూ — ఈ రెండూ ఒకటే అవుతాయి. కావ్యానికి నిడివితో పనిలేదు. మనసును పూయించేది ఎంత చిన్నదైనా, పెద్దదైనా కావ్యమే.

శ్రీకృష్ణదేవరాయలు, రఘునాథరాయలు తరువాత భౌతికసామ్రాజ్యాన్ని, కవితాసామ్రాజ్యాన్నీ రెంటినీ ఒకేసారి ఏలిన రాజు ఆనందగజపతి ఒక్కడే. ఆ అపరసాహితీచక్రవర్తి విజయనగర సంస్థానాన్ని ఏలుతున్న రోజులలో అభినవాంధ్ర కవితాపితామహుడైన మండపాక పార్వతీశ్వరశాస్త్రిగారు ఆ సంస్థానానికి వెళ్ళారు. అది ప్రభవనామ సంవత్సరమని (1867) ఆయన తన స్వీయచరిత్రలో చెప్పుకున్నారు.

కవితాచమత్కార గౌరవలాభంబు
జెంది, సంవత్సరంబందె యుండి

అని వారు వ్రాసుకున్న దాన్ని బట్టి, ఒక ఏడాదిపాటు అదే సంస్థానంలో వారుండటము, తమ విద్వత్పత్రిభతో ఆనందగజపతికి వినోదాన్ని కలిగించడము, కవితాచమత్కారాలతో గౌరవభోగాన్ని అనుభవించడమూ జరిగాయి. కానీ, మండపాకవారికి ఆ అస్థానకవి పదవిని అధిష్ఠించే యోగం పట్టలేదు. వారికి ఆ ప్రాప్తి బొబ్బిలిసంస్థానంలో వ్రాసిపెట్టి ఉంది. అక్కడే మండపాకవారు 1876 నుండి 1897 వరకూ ఆస్థానకవిగా ఉన్నారు.

పార్వతీశ్వరకవి విజయనగరాస్థానంలో ఉండి, రాజును ఆనందభరితుడ్ని చేస్తున్న ఆ రోజులలో ఒకరోజు ఆనందగజపతి పండితసభలో ఈ సమస్యనిచ్చారట.

…విరిగోలలేయ, లే
యన్నువ తాళఁజాల కహహా యని తల్లడమందె నెంతయున్
.

ఈ సమస్యను వినగానే, అక్కడి ఆస్థానవిద్వత్కవులలో అగ్రేసరులు, భగవత్కవి బిరుదాంకితులైన ముడుంబ నరసింహాచార్యులుగారు-

వెన్నెల గాయఁ, గాయజుడు వేమఱుమై విరిగోలలేయ, లే
యన్నువ తాళఁజాల కహహా యని తల్లడమందె నెంతయున్.

అని అసంపూర్తిగా పూరించి, తనకు అంతవరకే తోచిందని, మిగిలినదానిని పూరించవలసిందనీ పార్వతీశ్వరకవిని కోరారట. అప్పుడు వెనువెంటనే, కల్పనావైభవమన్న వస్తువును ఆనాటి ఆస్థానంలో అవతరింపజేస్తూ, కవితామల్లికాపరీమళాలను ఆ సభ కోటగోడల అంచులవరకూ వ్యాపింపజేస్తూ పార్వతీశ్వరకవి ఆశువుగా చెప్పిన పద్యమే పై పద్యం.

ఈ సమస్య ఎంతవరకూ ఇవ్వబడింది, పూరణ ఎంతవరకూ జరిగిందీ అన్న సంగతిపై కొద్ది అభిప్రాయభేదాలు కనపడుతున్నాయి. భారతిలో ప్రచురితమైన ‘అభినవాంధ్రకవితాపితామహుని కవితావినోదములు’ అన్న వ్యాసంలో ఈ సమస్య …విరిగోలలేయ నుండి ప్రారంభమైనట్లుగా ఉంది. మధునాపంతుల సత్యనారాయణశాస్త్రిగారి ఆంధ్రరచయితలు గ్రంథంలో కేవలచరమపాదమే సమస్యగా ఇవ్వబడిందని, అది కూడా ఇచ్చింది ముడుంబవారని, తాను ఒక పాదాన్ని పూరించి తతిమ్మా పాదాలను శాస్త్రిగారిని పూరించమన్నారనీ ఉంది. ఆనందగజపతి మహారాజు యొక్క సాహితీమూర్తిమత్వం జగద్విఖ్యాతమే కనుక వారు సమస్యనిచ్చి ఉంటారన్నది ఒప్పుకోదగిన సంగతే. ముడుంబవారి అసంపూర్ణపూరణ ఎలాగూ నిర్వివాదాంశమే.

మొట్టమొదట ఇవ్వబడిన సమస్య ‘రాముఁడు సల్లాపమాడె లక్ష్మీసతితోన్’ వంటి సమర్థించి నిజం చేయవలసిన సమస్య కాదు. ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల’ వంటి ఒక ఆశ్చర్యజమైన ప్రశ్న కూడా కాదు. ‘అన్నువ తాళఁజాల కహహా యని తల్లడమందె నెంతయున్’ — ఒక చిక్కిన చక్కని స్త్రీ తాళలేక అహహా అని బాధతో చలించింది అని అనడం అటువంటి ఒక సమస్య కాదు. పూరించేటపుడు మొదటి అక్షరానికి వేరొక అక్షరంతో సంధి చేయడమో, క్రమాలంకారం వాడడమో ఇత్యాది ఉపాయాలను చేయవలసిన అవసరం లేదు. ఈ ప్రశ్న ద్వారా ప్రాశ్నికుడు అడుగుతోంది అది కాదు. ఒక సన్నివేశాన్ని ఇచ్చి, ఒక అందమైన వర్ణన చేయమనడమే ఇందులో ఉద్దేశం. ఆ వర్ణన ఎంత హృదయంగమంగా తయారవుతుందీ అన్నది కేవలం కవిమీదనే ఆధారితమైన అంశం.

శాస్త్రిగారు పూరించాక ఈ పద్యం శబ్దసమ్మోహనత్వమూ భావలాలిత్యమూ కలగలిసిన సొగసుతో రూపుదిద్దుకుంది. ముడుంబవారి పూరణలోని ముక్తపదగ్రస్తాన్ని పద్యమంతా పాటించడమూ, అహహా యని తల్లడమందెనెంతయున్ అన్న భాగాన్ని అదే ముక్తపదగ్రస్తాలంకాన్ని అనుసరిస్తూ అహహా యనె మై మరుమాయ మాయగన్ అని మార్చడమూ శాస్త్రిగారి కవితాశక్తికి, స్వతస్సిద్ధరచనాపటిమకూ నిలువుటద్దం.

పూరణను చూడండి: ఒక స్త్రీ ఉందట. ఆమె రాత్రి సమయంలో, క్రొన్నన గోయ – అప్పుడే పుట్టిన మొగ్గను కోసిందట. వెంటనే కో అని కూస్తూ, ఒక కోయిల కన్నెర్ర జేసిందట. ఎంత మధురమైన ప్రయోగం ఇది! కోయిల కళ్ళు ఎర్రగా ఉంటాయన్నది విదితమే. ఆ కోయిల కూత ఎంత సొగసుగా ఉన్నదంటే, కిన్నెఱఁ బాయఁ – చేయి కిన్నెర వాయిద్యాన్ని విడిచిపెట్టిందట. తరువాత అక్కడ పాయసము కీల్కొని పొంగిన చాయ – పాయసమేదో పొంగిపోయిన విధంగా, చాయలన్ వెన్నెలఁ గాయఁ – తెల్లని కాంతులతో వెన్నెల కాసిందట. కాయజుడు వేమఱుమై విరిగోల లేయ – కాయజుడంటే శరీరాలలో పుట్టేవాడు, మన్మథుడు. ఆ వెన్నెలవేళలో మాటిమాటికీ ఆమెపై పూలబాణాలను వేశాడట. ఆ బాధకు తాళలేని లే యన్నువ – లేత తరుణి, అహహా అన్నదట!

ఆనాటి సభలో ఈ పద్యాన్ని ఆలకించి, మహారాజుతో సహా ప్రతీఒక్కరి మనస్సులూ ఆనందంతో విప్పారగా హర్షధ్వానాలతో ఆ సభ ప్రతిధ్వనులనీనిందని నేను మీకు మనవి చేయనవసరం లేదనుకుంటాను.