స్వప్నగానం

రెప్పలు మూత పడగానే
మంత్ర నగరి తెరుచుకుంటుంది
అప్పటివరకు అణచిపెట్టిన కోరికల సర్పాలు
బుసలు కొడుతూ లేస్తాయి
ఏ నాగస్వరమూ లేకపోయినా
తోక మీద నిలబడి నాట్యం చేస్తాయి

చూడాలనుకొని చూడలేకపోయినవి
కళ్ళ ముందే కదలాడతాయి
పొందాలనుకొని పొందలేకపోయినవి
సొంతమైపోతాయి

అంతలోనే
తొడుగులన్నీ తొలగిపోయిన ముఖాలు
వెంటాడి భయపెట్టే నీడలు
తరిమే పెద్ద పులులు
అందకుండా తీసే పరుగులు
పాతాళంలోకి పడిపోతూ పెట్టే కేకలు

శకలాలు శకలాలుగా
కదిలిపోయే దృశ్యాల మధ్య
పరిగెత్తలేక కూలబడ్డాక
సప్తవర్ణాల ఇంద్రధనుస్సులో
తెలుపురంగు మాత్రమే మిగులుతుందని
తెల్లవారినా తెరిపిడి పడని కళ్ళు

ఆరోహణల అవరోహణల సంగీతం
కలలోనుండి ఇలలోకి
ఇలలో నుండి కలలోకి
ప్రవహిస్తూనే ఉంటుంది
నాట్యం కొనసాగుతూనే ఉంటుంది