ఇంటికి వచ్చినట్లే ఉంది
ఏళ్ళ కొద్దీ పూసిన వూసులన్నీ ఎత్తి పోసుకున్నట్లే వుంది
ఏడ్పులూ ఏమార్పులూ గాడ్పులూ ఓదార్పులూ
ఎన్నెన్నో కలగలిపి పూసుకున్నట్లే వుంది.
నువ్వూ ఒప్పుకుంటావు
చిన్న చిన్న తలుపులు కొన్ని శాశ్వతంగా
కలివిడిగానే మూసేసుకున్నామని
నిన్నమొన్నటి పేజీలని విడివిడి గడుల్లోనే పాతేసుకున్నామనీ.
నువ్వూ ఒప్పుకోవు
కొన్ని పొలంగట్ల మీది జారుడు వైనాల్ని
కన్నీళ్ళ సెలయేళ్ళ గలగల చప్పుళ్ళని
కొన్ని మండే పచ్చబొట్లనీ.
ఎక్కడా చెప్పుకోనని చెప్పకనే చెప్తుంటావు
అక్షరాలు చెరిపేసీ కలం మూసేసీ
గాలికి ఎగరేసేస్తుంటావు.
కాగితాలు చింపేసీ కొవ్వొత్తులూదేసీ
దుప్పటీ కప్పి ఆర్పేస్తుంటావు.
ఏళ్ళు గడిస్తేనేం స్నేహానికి వయసెక్కడొస్తుందీ
జుట్టు తెల్లబడితే మాత్రం ఆపేక్షకి వార్ధక్యమెందుకొస్తుందీ?
ఎన్ని గోడలు కట్టుకున్నా
ఎదకి చెద ఎందుకు పడుతుందీ?
కట్ గ్లాసుల కళ్ళూ నోళ్ళూ తెరుచుకొనే
కనరెక్కని రుచులింకా ఆవురావురంటూనే
పొడిబారని పూరెమ్మలు బాటల్లో పూస్తూనే
మిణుగురు గుర్తులు రాత్రులని వెలిగిస్తూనే
మెత్తని వాసనలు మనసుకి సోకుతూనే ఇంకుతూనే…
ఎన్ననుకున్నా ఎన్నో వున్నట్లే వుంది
ఎన్ని లేకున్నా మిగిల్చి రగుల్చుకోడానికి
కొన్ని కొన్నింకా పేర్చుకుంటున్నట్లే వుంది.